Menu Close
Galpika-pagetitle
భావుకత (అనే ఓ బావకథ) -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

నేనీ దరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
తిరుపతి యఫ్ యమ్ లో ‘ఆ పాత మధురాలు’ శీర్షికలో పాత పాటలను వినిపిస్తున్నారు. వంటింట్లో వంట చేస్తూ సౌమ్య ఆపాట వింటూ
నేనొక ఊర్లో, నువ్వొక ఊర్లో
కరోనా కలిపింది ఇద్దరినీ అని
ఆశువుగా పాట అల్లేసి పాట జోరుగా మొదలు పెట్టింది. ఇది కరోనా కాలం మరి.

హాల్లో నందనరావు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనే సౌమ్య పాటను ఆస్వాదిస్తున్నాడు. కాని కొద్దిగా గొంతు ఎక్కువ అనిపించింది. "సౌమూ! కొద్దిగా గొంతు తగ్గించవా ప్లీజ్?" అడిగాడు. హాల్లోకి వచ్చి అటు ఇటు వెదికి, "నీ గొంతు రిమోట్ ఇక్కడ ఎక్కడా లేదు నందూ!" అని కిసుక్కున నవ్వింది. ఆ నవ్వంటే నందనరావుకి ఇష్టమే కానీ సౌమ్య తన మీద జోక్ వేసింది మరి. కొద్దిగా తన సీరియస్ నెస్ ఫోన్లో అవతలివాళ్ళకి వినబడకుండా "ఫోన్ లో మాట్లాడుతున్నా సౌమూ!" పళ్ళు బిగపట్టి ప్రేమతో చెబుతున్నట్టు చెప్పాడు.
"అది సరే, ఎవరితో మాట్లాడుతున్నావు నందూ!" అడిగింది.

"శార్వరితో!" చెప్పాడు. "కానీ భాగోతం," అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ వంటింట్లోకి బయల్దేరింది.

సౌమ్య నందన్ కి మేనమామ (అమ్మతమ్ముడి) కూతురు. శార్వరి మేనత్త (నాన్న చెల్లెలి) కూతురు. అందరూ రాజమండ్రిలో ఒకే చోట ఉండేవారు. మేనమామ తెలుగు ఉపాధ్యాయుడు. అక్కకి కొడుకు పుట్టగానే సంవత్సరాల పేర్లలో *నందన్* అని పెట్టించాడు. ఆ నందనుడే ఈ నందనరావు. మేనమామకి కూతురు పుట్టగానే అరవై సంవత్సరాలలో 43వ సంవత్సరం అయిన *సౌమ్య* అని పేరు పెట్టాడు. ఆ తరువాత ఆరు నెలలకు మేనత్తకు కూతురు పుట్టగానే 34వ సంవత్సరం అయిన *శార్వరి* అని పేరు పెట్టించాడు. సౌమ్య, శార్వరి మంచి స్నేహితురాండ్రే. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని తాను పెళ్ళాడాలని అందరి కోరిక. అమ్మ పట్టుమీద తాను రెండేళ్ల క్రితం సౌమ్య ను పెళ్ళి చేసుకున్నాడు. సౌమ్యకి తిరుపతి లో పద్మావతీ మహిళా యూనివర్సిటీ లో ఉద్యోగం వచ్చింది. అప్పుడే తనకు కడపలో వేమన యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. తిరుపతి లో ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు కరోనా గృహనిర్బంధం వల్ల ఇద్దరూ సెలవు లో తిరుపతి ఇంట్లో ఉండిపోయారు. ఇక ప్రస్తుతానికి వస్తే ...

"సౌమ్య ఏం చేస్తోంది బావా?" శార్వరి అడిగింది. "ఆ చంటిది కిచెన్ లో ఉంది కానీ నేనిందాక చెప్తున్నది విను.!" అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.

"శార్వరి! ఓ శార్వరి!
నీకోసమే నా హృదయం పరితపిస్తున్నది.
సెలయేటి గలగలలు నీ మధురహాసాలు.
వనమయూరాల నర్తనం నీ నడకలో హొయలు.
నీ నడుము వంపులు ఆ పర్వతాల మలుపులు.
నీ రూపం లో తళుకులు ఉదయభానుని కిరణాలు.
నీ యౌవనపు సోయగాలు సుమభరితహరితవనాలు."
అంటూ తన్మయత్వంతో చెప్పుకుపోతున్నాడు.

వెనుకనుండి చేతిలో ఉన్న పుస్తకం తో సౌమ్య నందన్ బాదేస్తోంది. "నన్ను "చంటిది" అంటూ నువ్వు శారుతో ప్రణయకలాపాలు సాగిస్తావా? అదేమో కిలకిలా నవ్వుతూ కులుకుతుందా?" అంటూ కోపంతో ఊగిపోతోంది.

"సౌమూ! ఇవి ప్రణయకలాపాలు కావే చంటీ!
ఇది ఈ శార్వరి నామసంవత్సర ఉగాది కవిత. రేపు ఉగాది కదా. పత్రికకి పంపాను. రేపు ప్రచురిస్తామన్నారు. అదే శారూకి వినిపిస్తున్నాను." అన్నాడు. "అయితే ఏ కాగితం లేకుండా చెప్పేస్తున్నావ్?" అడిగింది కోపంగా. ఎంత అనునయించినా ఒప్పుకోలేదు. రేపు ఆ కవిత పత్రికలో వేస్తే నమ్ముతా. లేకపోతే ఇద్దర్నీ ..... హుఁ" అనుకుంటూ బెడ్ రూం లోకి వెళ్ళి పోయింది. వండిన అన్నం వండినట్టే ఉంది. నందనుడు ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళు త్రాగి పక్కమీద వాలాడు. అతని మనస్సు *ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?* అంటూ రాత్రి తెల్లవార్లూ మూలుగుతూనే ఉంది.

అలిగిన అలుగక.... -- గౌరీ కాసాల

ఎక్కడికి అమ్మాయి  బయలుదేరావ్...

"కూరగాయల సంత కి పిన్ని ఆయన రావడం లేట్ అవుతుందిట"
మెడలో తగిలించుకున్న బ్యాగ్ లో ఉన్న పాప ని సరిచూసుకుంటూ అంది వాణి.

"అయితే ఆ దుమ్ము ధూళి లో ఈ చంటిది. ఎందుకు నేను చూసుకుంటాను లే !! నువ్వు వెళ్లిరా! చనువుగా బ్యాగులో ఉన్న పాపని అందుకని లోపలికి వెళ్లిపోయారు పిన్ని గారు.

చిరునవ్వుతో ఆవిడ వైపే చూస్తూ అసంకల్పితంగా గతంలోకి వెళ్ళిపోయింది వాణి.

*        *       *      *

కిటికీ ట్రాన్స్పరెంట్ అద్దం లోంచి లేత సూర్య కిరణాలు నిద్రలేపాయి వాణిని. ఆ ఏర్పాటు చేసింది శేఖర్. అలాంటి మెలకువ ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది అంటాడు.

ఇవాళ శేఖర్ క్యాంపు నుంచి వచ్చేస్తాడు.

ఆ ఊహ రాగానే గబుక్కున  లేచింది వాణి. ఇంతలో భూపాలరాగం లో కాలింగ్ బెల్. ఇదీ  శేఖర్ ఏర్పాటే. పొద్దున్నే ఎవరైనా బెల్లు కొట్టినా విసుక్కోకుండా లేవ గలుగుతాం అంటాడు. మంచి రస హృదయం శేఖర్ ది.

శేఖరేనా... ఒక్కంగలో  వెళ్ళి తలుపు తెరిచింది...

అమ్మాయ్ వాణి ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయా లేకపోతే తెప్పించుకో మందులన్నీ కూడా..

రేపటి నుంచి మూడు వారాలు బందుట జాగ్రత్తపడు... మాట్లాడుతూనే తన ఇంట్లో ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆవిడ.

ఒక్క క్షణం బుర్రంతా బ్లాంక్ అయిపోయింది.

మరి శేఖర్శే.... ఖర్ ఎలా వస్తాడు

గుండెల్లో దడ కళ్ళల్లో నీళ్ళు ఒక్కసారే వచ్చేసేయ్

ఇంతలో శేఖర్ ఫోన్

హలో!!!

శేఖర్ గొంతు వినగానే దుఃఖం పొంగుకొచ్చింది వాణికి.

వాణి...  వాణి బి  బ్రేవ్... నా బుజ్జి కదూ... నువ్వు డల్ గా ఉంటే ఏడిస్తే కడుపులో పాపాయికి  కూడా మంచిది కాదు.... ఏదో మంత్రం విన్నట్టు వాణి దుఃఖం తగ్గిపోయింది. తర్వాత మాట్లాడుకుందాం ముందు నీకు ఏమేం కావాలో అవన్నీ తెప్పించుకో...డియర్.... పళ్ళు డ్రైఫ్రూట్స్ మర్చిపోకు బలమైన ఆహారం తిను...... ప్రాక్టికాలిటీ కూడా శేఖర్ సొంతం.
వాణి కూడా ఆ హడావిడిలో పడిపోయింది.

*   *   *  *

నాలుగైదు రోజులు గడిచిపోయాయి.

అందరిలాగే వాణి కూడా మెల్లమెల్లగా లాక్ డౌన్ కి  అలవాటు పడింది.

శేఖర్ ప్రతి రోజు ఫోన్ చేసి, ఎలాగో ఒకలాగా పర్మిషన్ తీసుకుని కారులో అయినా వచ్చేస్తాను అని చెప్తున్నాడు.

ప్రతి రోజు ఎదురు చూడటం

శేఖర్ రాలేకపోయానని ఫోన్ చేయటం.

లాక్ డౌన్ పొడిగింప బడింది.

ఇప్పుడిప్పుడే ఏదీ సాధ్యం కాదని అర్థం అయిపోయింది వాణి కి.

శేఖర్ రోజు ఫోన్ చేసి వాణి కి ధైర్యం చెప్తూనే  ఉన్నాడు.

నాలుగు రోజులు అయ్యేసరికి అంట్లు తోముకోవడం... ఇల్లు ఇల్లు తుడుచుకోవటం కష్టమైపోయింది వాణికి.

ఒకరోజు మెయింటినెన్స్ కోసం వచ్చిన వాచ్మెన్ వాణి కష్టం చూసి కరిగిపోయాడు.

అబ్బ గారికి సాయం చేసి రా అని  భార్యని పంపాడు. అది ఎదిరింటి ఆవిడ గమనించేసింది.

వాచ్మెన్ భార్య కూడా 24 గంటలు సెల్లార్ లోనే ఉండాలని ఎవరింట్లోనూ పని చేయకూడదని రూల్ ఉంది.

అది పట్టుకుని ఎదురింటి ఆవిడ ఫోన్ లో అసోసియేషన్ వాళ్లందరినీ కాంటాక్ట్ చేసి నానా యాగీ చేసింది.

వాచ్ మెన్ భార్య పైకి సరే అన్నాచాటుగా వచ్చి పని చేసి పోయేది.

దాంతో ఎదురింటి ఆవిడకి ఒళ్ళు మండింది. వాణి కనపడితే మొహం మీదే తలుపు వేసేయడం..పిల్లి మీద ఎలక మీద పెట్టి వాణిని సూటిపోటి మాటలు అనడంతో మనశ్శాంతి లేకుండా పోయింది వాణికి.

శేఖర్ "వాణి ఇవన్నీ పట్టించుకోకు. నీకు పుస్తకాలు చదవటం అలవాటే కదా... నా టేబుల్ మీద ఒక ఫైలు ఉంది చూడు. నా ఫ్రెండ్ వ్రాశాడు. భారతంలో సూక్తులు. వాటిని నిత్యజీవితంలో ఉపయోగించే గలిగితే ఎంత హాయిగా ఉంటుందో అంటూ చిన్ని చిన్ని కథలతో చక్కగా రాశాడు అది చదువు..పాపాయి ఆలోచనలు కూడా చక్కగా తయారవుతాయి.

లాక్ డౌన్ మళ్ళీ పొడిగింప బడింది. పనమ్మాయి పనులు చేసుకుంటూ ఉంటే...పాపాయి ఆరోగ్యం కోసం బలమైన తిండి తినటం, మంచి పుస్తకాలు చదవడం అలవాటు అయిపోయాయి వాణికి.

రోజులు ఒక పద్ధతి ప్రకారం గడిచి పోతున్నాయి.

*   *   *  *

ఒకరోజు పొద్దున్నే అసోసియేషన్ సెక్రెటరీ ఫోన్ చేశాడు
ఎదురింటి ఆంటీ తండ్రిని పొద్దున్నే అంబులెన్స్లో తెచ్చారని.. కరోనా తో  ఆయన్ని ఊరు నుంచి తీసుకొచ్చారని,. అది మంచిది కాదని.. అందులోనూ నేను ఎదురు ఇంట్లోనే ఉంటాను కాబట్టి... నాకు అసలు మంచిది కాదని..అందరము కలిసి ఆయనని  ఊరికో హాస్పిటల్ కో  పంపేయాలని సారాంశం... మధ్యలో లోపాయికారిగా పని మనిషి విషయంలో ఆవిడ నన్ను పెట్టిన బాధలన్నీ ప్రస్తావించాడు.
నేను ప్రెసిడెంట్ ను కాబట్టి ఆర్డర్ పంపించాలని ఆయన అభ్యర్థన. ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ కళ్లుమూసుకు కుంది వాణి.

ఆవిడ తనని పెట్టిన శాపనార్థాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకం వస్తున్నాయి.

ఇన్నాళ్లు  చదివిన మహాత్ముల జీవిత  చరిత్రల సారాంశం..
భారతంలోని సూక్తులు మరోవైపు మానవత్వమ్ లోని మహనీయతను గుర్తు చేస్తున్నాయి.

అమ్మాయ్.. వణుకుతున్న కంఠం...కళ్ళు విప్పి చూసింది వాణి ఎదురింటి ఆవిడ..చెదిరిపోయిన జుట్టు, ఆందోళన అలసట లతో కళ తప్పిన మొహము "నాన్న కి కరోనా పూర్తిగా తగ్గిపోయింధమ్మా... పెద్దవాడు కదా ఒకసారి ఇక్కడ పెద్ద డాక్టర్లకి చూపించండి అని అక్కడి డాక్టర్లు పంపారమ్మా ... ఆయన మా ఇంట్లో ఉండకూడదు అంటే.... దుఃఖం పొంగుకు రావటంతో కొంగు నోట్లో కుక్కుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ.

తన  మీద అరచి యాగీ చేసిన ఆవిడ రూపం ఎందుకో కళ్ళముందు కనిపించింది వాణికి.

మనసుకి బుద్ధి కి సంఘర్షణ.. బుద్ధి గెలిచింది. అసలు ఆవిడ అలా మాటలు  మానేయటం వల్లనే కదా తను మంచి పుస్తకాలు చదివింది. అది ఆచరణలో పెట్టకపోతే ఇంకా చదివి ప్రయోజనమేమిటి.

ఫోన్ తీసి సెక్రెటరీ హలో అనంగానే
"చూడండి సార్.. ఆ పెద్దాయనకి కరోనా తగ్గిపోయింది. లేకపోతే ఊరు  దాటనిస్తారా...వాళ్ళది సొంత ఇల్లే. ముసలాయనకి ఈవిడే దిక్కు... మనం ఆయనని ఇంట్లో ఉండకూడదు... అని ఎత్తులు వేస్తే అందరము జైలుకెళ్లి కూర్చోవాలి".
ఎవరి జాగ్రత్తలో వారు ఉండటమే. ఇంకా ఈ విషయంలో నో మోర్ డిస్కషన్స్ " స్థిరంగా చెప్పేసి ఫోన్ పెట్టేసింది.
చెప్పలేని తృప్తి. ఫోన్ మోగింది.. సెక్రెటరీ గారేమో ఈ సారి గట్టిగా జవాబు చెప్దామని ఫోన్ తీసింది.
"వాణి డార్లింగ్   శేఖర్ కంఠంలో చెప్పలేనంత ఆనందం ఉద్విగ్నత.
"నేను వచ్చేస్తున్నాను బుజ్జి  నిజమే... దారిలో ఉన్నాను. గంటలో నీ ముందు ఉంటాను. వచ్చాక వివరాలు చెప్తాను.
నీళ్ళు నిండిన కళ్ళతో ఎదురుగా గోడ మీద ఉన్న గీతోపదేశం  పటం చూస్తూ ఉండిపోయింది వాణి.

మాస్ – కింగ్ – -- అత్తలూరి విజయలక్ష్మి

“ హలో! ఎక్కడికి పూలరంగడిలా బయలుదేరావు?” నీటుగా తయారై, ఇస్త్రీ బట్టలు వేసుకుని షూ వేసుకుంటున్న సూర్యాన్ని అడిగింది పద్మ.

“ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడక్కూడదు అని తెలుసుగా..” సీరియస్ గా అడిగాడు.

“నాకు తెలుసు... కరోనాకి తెలియదు.. ఆ కాస్త, కాలు బయటపెట్టగానే అబ్బో అందగాడు అని మీద పడితే అప్పుడు తెలుస్తుంది.. ముందు మొహానికి మాస్క్ పెట్టుకో..” కోపంగా అంది.

“అబ్బా! ఇప్పుడే కదా చక్కగా క్రీం రాసుకుని తయారయాను. ఆ మాస్క్ గోలేంటి? నన్ను డీ గ్లమరైస్ చేయడానికి కాకపొతే” చిరాకు పడ్డాడు.

“మాస్క్ గోలకాదు ... మాస్క్ లేకపోతేనే గోల.. అటు పోలీసుల చలాన్ గోల, ఇంటికి రాగానే దగ్గు, తుమ్ముల గోలా ఆ తరవాత క్వారంటైన్ గోల ఇదిగో పెట్టుకో” మాస్క్ తెచ్చి ఇచ్చింది.

“తప్పదా...” నిస్సహాయంగా చూసాడు.

“పెళ్ళికొడుకులా తయారయాను... నాకు ఈ మాస్క్ అడ్డు అనుకోడానికి నీకేం అక్కడ పెళ్లి కూతుళ్ళు రెడీగా లేరు.. పెట్టుకో” గద్దించింది.

“రాక్షసీ..! కుళ్ళుబోతు... కోపంగా ఆమె వైపు చూసి బయలుదేరాడు.

“పని ఏదో చూసుకుని నేరుగా ఇంటికి రా.. చాన్స్ దొరికింది కదా అని, ఉమెన్స్ కాలేజీ దగ్గర బీటు కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్ళకు.”

“నేను వెళ్ళడం ఏంటి నాన్సెన్స్ ... ఉమెన్స్ కాలేజినే నా దగ్గరకు వస్తుంది.” గర్వంగా అన్నాడు..

“ఆ, ఆ వస్తుంది.. పగటికలలు కనకు... అసలే టైం బాగాలేదు..”

“అపశకునపక్షి” కసిగా అంటూ వెళ్ళిపోయాడు.

“ఇట్లా అన్ లాక్ చేయడం ఆలస్యం ఈ మగవాళ్ళు క్షణం ఇంట్లో ఉండరు.. ఏం పెత్తనాలు ఉంటాయో..” సణుగుతూ పనిలో పడింది పద్మ.

సరిగ్గా రెండు గంటల తరవాత వచ్చాడు సూర్యం..” షూస్ విప్పి నేరుగా బాత్రూం లోకి వెళ్ళు” అంది పద్మ..

“ఇంతకీ ఎక్కడికి వెళ్లినట్టు!” అడిగింది అన్నం వడ్డిస్తూ..

“నా గర్ల్ ఫ్రెండ్ నా మీద బెంగ పెట్టుకుంది.. ఓ సారి వెళ్లి కనిపించి వచ్చా” అన్నాడు గట్టిగా రెండు సార్లు దగ్గి ...

“అమ్మో! వచ్చేసింది... లే, లే నీ గదిలోకి వెళ్ళు...లే “ అరిచింది పద్మ..

“ ఏమయింది ఎందుకా అరుపులు... “

“నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను చూడగానే అమాంతం కౌగలించుకుంది... పో ఐసోలేషన్ కి” గాభరా పెట్టేసింది.

“అన్నం పూర్తిగా తిననీ ఆకలేస్తోంది” అన్నాడు విసుగ్గా.

“లోపలికి ఇస్తాను.. అక్కడే తిను... వెళ్ళు త్వరగా” తొందరపెట్టింది.

చేసేది లేక కంచం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు సూర్యం.. గబగబా మొత్తం డెట్టాల్ తో శుభ్రం చేసి, చేతులు ఒకటికి నాలుగుసార్లు సబ్బుతో కడుక్కుని, వేపోరైజేర్ లో నీళ్ళు పోసి, జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు, చిటికెడు పసుపు వేసి సూర్యం ఉన్న గది గుమ్మం ముందు అవన్నీ పెట్టి “ఇదిగో ఈ నీళ్ళతో ఆవిరి పట్టుకో” అని అరిచి వెనక్కి వచ్చేసింది. సూర్యం కొంచెం తలుపు తీసి వేపోరైజేర్ తీసుకుని తలుపు వేసుకున్నాడు. పద్మ గబా,గబా YouTube లో డాక్టర్ బాపూజీ, డాక్టర్ గురవారేడ్డి గారి వీడియో లు వెతికి శ్రద్ధగా చూసి, ఇంట్లో ఉన్న డోలో టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ మంచి నీళ్ళు తీసుకుని వెళ్లి మళ్ళి అరిచింది.. “ఇవిగో ఈ మందులేసుకో... గదిలోంచి బయటకి రాకు.. దగ్గోస్తోందా! ఊపిరి సరిగా పీల్చ గలుగుతున్నావా! తలనొప్పి, ఒళ్లు నెప్పులు ఉన్నాయా! “ తలుపు బయట నుంచే ఊపిరి తీసుకోకుండా గబగబా అడిగింది.

గబుక్కున తలుపు తెరుచుకుని ఖాళీ కంచంతో బయటకి వచ్చాడు. కెవ్వుమంది పద్మ.

“నీకసలు బుద్ధుందా! కాస్త దగ్గగానే నాకేదో మాయరోగం వచ్చిందని గందరగోళం చేస్తావా! అది దగ్గు కాదు.. పొలమారింది నువ్వు చేసిన దోసావకాయ ఘాటుకి... పిచ్చి ముదురుతోంది రాను, రాను...” కంచం సింక్ లో పడేసి వచ్చి “నేను బయటకి వెళ్ళింది కరోనా ని నీ సవతిగా తీసుకురావడానికి కాదు..నా ఫ్రెండ్ హోమియోపతి డాక్టర్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తానంటే వెళ్లాను. ఇదిగో ..” డ్రెసింగ్ టేబుల్ మీద పెట్టిన సీసాలు తీసి చూపించాడు.

గబుక్కున దూరం జరిగి “వాటిమీద శానిటైజేర్ చల్లు” అంది గట్టిగా.

Posted in May 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!