Menu Close
Galpika-pagetitle
గల్పికావని-శుక్రవార ధుని-30 -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ప్రియమైన చింటూకి,

సకల విద్యాబల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.

మా ఆఫీసులో నువ్వంటే అందరికీ ఇష్టం. ఆ ఇష్టానికి కారణం మీ నాన్నగారు నీ గురించి మంచిగా చెప్పడం. అలా చెప్పడం వల్లే నేను నీ గురించి కథ రాశాను.

నిజానికి మంచి పిల్లాడు ఎవరితోనూ వాదించడు. గొడవపడడు. మొండిగా ప్రవర్తించడు. అల్లరి చెయ్యడు. అతి తెలివితో మాట్లాడడు. మరీ ముఖ్యంగా రూమ్ మేట్స్ గురించి పోలీస్ కంప్లైంట్లివ్వడు. అలా కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళని ఎవరూ ఇష్టపడరు.

అందుకే నిన్ను చూడాలని ఉన్నా రావడం లేదు.

నీ గురించి నేనూ మీ నాన్నా మాట్లాడుకున్న ప్రతి సారీ నేను మీ నాన్నగారినే తప్పు పడతాను. ఆయన చేస్తున్న తప్పు ఒక్కటే, నీ తప్పుల్ని వెనకేసుకురావడం. అందువల్లనే నీ గురించి నాలాంటి బైటి వాళ్ళముందు మీ నాన్నగారు తల దించుకోవలసి వస్తోంది. తండ్రికి ఈ పరిస్థితి తీసుకురావడం ఒక మంచి కొడుకు చెయ్యవలసిన పని కాదు. అందులోనూ నీ కోసం ప్రాణం పెట్టే మీ నాన్నగారికి ఈ పరిస్థితిని తీసుకురావడం నీకు తగదు.

నీ చదువుకి మీ నాన్న పెడుతున్న ఖర్చుతో ఓ కుటుంబం సంవత్సరమంతా సంతోషంగా బతకచ్చు. అలాంటి తండ్రిని కేవలం నీ ప్రవర్తన ద్వారా ఇలా స్నేహితుల ముందు తలదించుకునేలా చెయ్యవచ్చా? ఆలోచించు. నువ్వు ఇన్నిసార్లు స్కూళ్ళు ఎందుకు మారాల్సి వస్తోంది? అవి స్కూళ్ళు కాదా? ఆ మేస్టార్లకి పాఠం చెప్పడం రాదా? లేక నువ్వు మేస్టర్ల పాఠాలు వినాల్సిన అవసరం లేనంత మహానుభావుడివా?

నాలాంటివాడు,"నీకు చదువు చెప్పగల స్కూలు ఇంతవరకూ ఎవరూ పెట్టలేదా?" అని అడక్కముందే "నేనే ఇంతకంటే మంచి స్కూలు పెడతానంకుల్" అని చెప్పేంత అతి తెలివి నీది. అందుకే నీమీద ఇన్ని కంప్లైంట్లు. ఎన్ని కంప్లైంట్లు వచ్చినా మీ నాన్నగారు నిన్నేమీ అనరు. అదే నీ ధైర్యం. ఆయన్ని చూసుకునే ఇంత అతిగా ప్రవర్తిస్తున్నావు.

ఒకవేళ నాలాగే ఆయనక్కూడా మనసు విరిగి పోయిందనుకో. ఏం చేస్తారు? నిన్ను పట్టించుకోవడం మానేస్తారు. అప్పుడు నీ పరిస్థితేమిటి?

నువ్వెప్పుడూ పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉంటావు. అవన్నీ నీ వయసుకీ అనుభవానికీ మించిన మాటలు. నిజానికి నువ్వు అనుకుంటున్నదానికంటే వందరెట్లు ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ నీలో ఉంది. కానీ నువ్వు దానిని కేవలం నెగెటివ్ థింకింగ్ పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నావు.

ఉదాహరణకి, నీ దగ్గర నొప్పి తగ్గించే మందు ఉందనుకో. అది నెప్పి తగ్గిస్తుందని మీ ఫ్రెండ్స్ కి కూడా తెలిసేలా చెయ్యాలనుకుంటావు. అది తెలియాలంటే వాళ్ళకి నొప్పి కలగాలి. అది కలిగించడం కొసం నువ్వు వాళ్ళని గిల్లుతావు. అప్పుడు వాళ్ళకి నొప్పెడుతుంది. తరవాత మందు వేస్తావు. వాళ్ళకి నొప్పి తగ్గుతుంది. ఇలా నొప్పి తగ్గించడం కోసం కనిపించిన ఆందర్నీ గిల్లడాన్ని "అబ్ నార్మల్ బిహేవియర్"అంటారు. ఈ విషయం ఎవరైనా నీకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళని నొప్పించకుండా ఒప్పించడం ఎలా అని ఆలోచిస్తావు. ఫలితంగా ముక్కులో కెలుక్కుని రక్తం తెప్పిస్తావు. వేళ్ళనో గోళ్ళనో విరగ్గొట్టుకుని రక్తం కారుస్తావు. వాళ్ళని నీ పట్ల ఆకర్షితులయ్యేలా చేసుకుంటావు. ఇలాంటి బిహేవియర్ "సైకలాజికల్ డిజార్డర్స్" కి దారి తీస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడం పిల్లల పెరుగుదలకి మంచిది కాదు.

నీ కోసం ప్రాణాలైనా ఇచ్చే తండ్రి మాత్రమే నీకు తెలుసు. అందుకే నీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూలుకి వచ్చి ఎక్స్ ప్లనేషన్స్ ఇచ్చుకునే పరిస్థితి మళ్ళీమళ్ళీ కల్పిస్తున్నావు. దానివల్ల మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియదు. నాకు మాత్రమే తెలుసు. నీమీద స్కూల్లో వచ్చే కంప్లైంట్స్ వల్ల ఆయనకి తిండి సహించడం లేదు. నిద్ర పట్టడం లేదు. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూంటారు. ఆయనకి ఎన్ని సమస్యలున్నాయో నీకు తెలుసు. వాటి గురించి తెలిసి కూడా నువ్వే ఇంకో పెద్ద సమస్యగా మారడం మంచి పనా?

నువ్వు మీ స్కూల్లో బుద్ధిమంతుడనే పేరు తెచ్చుకో. ఆ పేరు తెచ్చుకునేంతవరకూ మీ నాన్నగారి ముందుకు రాకూడదని నిర్ణయించుకో. బాగా చదువు. చెప్పిన పని చెయ్యి. పెద్దల్ని గౌరవించు. వినయంతో ప్రవర్తించు. అవన్నీ ఉంటే తప్ప మీ నాన్నగారికి కొడుకనిపించుకునే కనీస అర్హత నీకు రాదు. ఆ అర్హత సంపాదించుకోవడం కోసం నువ్వు భగవద్గీత చదవక్కరలేదు. ఈ ఉత్తరాన్నే భగవద్గీతలా రోజూ చదువుకో. ఏం చెయ్యాలో అర్థం చేసుకో. దానికి తగినట్లు ప్రవర్తించు. అప్పుడు మీ టీచర్లే నిన్ను మెచ్చుకుంటారు.

అలాగని మీ టీచర్లని మెప్పించడానికి ఏం చెయ్యాలా అనేదాని గురించి మాత్రం ఆలోచించద్దు. మంచివాడనే పేరు తెచ్చుకుంటే నీ గురించి ఒక నవలే రాస్తాను. విష్ యు ఆల్ ది బెస్ట్.

రాఖీ..కానుకలు -- డా. శ్రీదేవి శ్రీకాంత్

కంచిపట్టు చీర, చీర పైకి డిజైన్ జాకెట్టు...

చీర కు కలిసే బ్లూ రాళ్ళ  గొలుసు...రాళ్ళ గాజులు,

హ్యాండ్ బ్యాగ్, బ్యూటీ పార్లర్...ముత్యపు ఫేషియల్ కిట్, ఇంకా....ఏమికొనాలి?అని ఆలోచిస్తూ వుంది సమత. వాట్సప్లో...రాఖీ బ్రదర్స్ అనే గ్రూప్ పెట్టింది...అవును హుస్సేన్ తమ్ముడి ఫోన్ నంబర్ చేర్చు కోలేదు. ఒక్కసారి కాంటాక్ట్స్ లో చూసి యాడ్  చెయ్యాలి..డానియల్ అన్నయ్య గారు, క్రిందటి సారి రాఖీ కిఎంత చక్కని కానుక ఇచ్చారు. ఈసారి కూడా మర్చిపోకుండా రాఖీ కట్టాలి. రాఖీలు ఆన్లైన్లో ఎంత చవకగా వచ్చాయో...బయటికి వెళ్ళి కొనకుండా సమయం కలిసి వచ్చింది. స్వీట్స్ కూడా ఆర్డరు చేస్తే ఇంటికి తెస్తారుగా...దూద్ ఫేడా లయితే చవక. బోలెడు వస్తాయి. అవి కొనడమే నయం...అనే ఆలోచనలో వుండగా... ఇంతలో,

సమతా సమతా,. ఎక్కడున్నావు? అన్న భర్త పిలుపుతో...

లిస్ట్ రాసిన కాగితంతో ..ఆ ..వస్తున్నాను అంటూ హాలులోకి వెళ్ళింది..

"నేను ఆఫీస్ నుండి వచ్చి ఎంత సేపయ్యిందో తెలుసా" విసుగ్గా అన్నాడు భర్త.

"అదేమిటండి, లిల్లీ మొరగడం వినలేదే?" అంది, లిల్లీ మొరిగితేనే తెలుసుకుంటున్నట్లు, పైగా లిల్లీ తప్పైనట్లు..

"లిల్లీ ఎటు పోయింది?" చటుక్కున స్వరం కలిపింది...

"నన్నడుగుతా వేమిటి? ఏవీ పట్టించుకోవు.

పేరుకు మన పెంపుడు కుక్క. ఎప్పుడూ వుండేది పక్కింట్లో! "

"ఈరోజు, ఏమిటీ వింత ...టీవీ ముందు కూర్చోలేదు..."

"నెట్ పోయిందండి, మీరు ఎప్పుడు వచ్చి చూస్తారా అని ఎదురు చూస్తున్నాను."

"ఓహో... అదా సంగతి.

ముందు టీ తీసుకురా! కాస్త తింటానికి కూడా ఏదైనా పట్రా,

ఆకలిగా వుంది"

"ఈ లిస్ట్....ఏమిటి? ఇన్నివ్రాసావు"

టీ  అందిస్తున్న సమత ఆ మాటలకి "...ఆ లిస్టా....

ఒక్క సారి ఇలా ఇవ్వండి చెబుతాను, ఆ లిస్ట్ లో పాటెక్ ఫిలిప్పీ... బ్రాండెడ్ వాచ్... చేర్చటం మరిచాను...

రాఖీ పండగ తరువాత కొనాల్సిన వస్తువులు లిస్టు రాశాను.

మిమ్మల్ని డబ్బు ఏమి అడగనులే. మీకేమి ఖర్చు వుండదు...రాఖీ కదా...మా అన్నయ్య, తమ్ముడు, పెద్దమ్మ కొడుకులు, బాబాయి కొడుకులు, వాళ్ళే కాకుండా, అన్నయ్య గారు అని పిలిచే మీ స్నేహితులు, చిన్ననాటి నుండి అన్నయ్య, తమ్ముడు అని పిలిచే వాళ్ళు- రాఖీ కడితే డబ్బు ఇస్తున్నారుగా ప్రతిసారీ...ఆ వచ్చేడబ్బు పెట్టీ  ఈ సారి కొనే వస్తువుల లిస్ట్ రాస్తున్నాను...." చక్రాల్లా కళ్ళు తిప్పుతూ గబగబా చెప్పేసింది...

"నీలాంటి వాడే వెనకటికి... ఏదో సామెత చెప్పినట్టు...

ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూసి, క్రింద మషాలాలు నూరాడట." పరిహాసంగా అన్నాడు భర్త.

"అదేవిటండి అలా అనేశారు. ప్రతిసారీ నాకు రాఖీకి డబ్బు వస్తున్న మాట నిజమేగా?" ఎంతో కష్ట పడి డబ్బు సంపాదించే దానిలా అంది..

"ఏమండీ, అది సరే గానీ, మీరు మన సైట్ చూడ్డానికి నెల్లూరు వెళతా నన్నారు, ... రేపు వెళతారా? సెలవేగా? ఆఫీస్ లేదుగా?"

అవును. కానీ, స్వాతంత్ర దినోత్సవం నాడెందుకు. .. సరదాగా కాస్త TV చూస్తూ కాలక్షేపం చేస్తే పోలా, ఆదివారం వెళదాం" మాటెందుకు మార్చిందో తెలియక అన్నాడు.

"ఆ ఎందుకంటారేమిటి? రేపే రాఖీ పండగ కూడా వచ్చిందండి."

"అయితే, ఏమిటే?"

"ఏమిటంటారేమిటి?

ఆ ఉమ, అన్నయ్యా అంటూ, వెండికి బంగారు పూత పూసిన రాఖీ తెచ్చి...10వేలు పైనే ఇస్తే గాని తృప్తి పడదు.

పైగా, ప్రతి సారి, అన్నయ్య గారు, మీకు వచ్చే సంవత్సరం బంగారు రాఖీకొంటానని, మెహర్బానీ మాటొకటి. మొదటామాట నిజమే ననుకుని, ఆ బంగారు రాఖీని మన అమ్మాయికి పాపిడి బిళ్ళ లా చేస్తే బాగుంటుందని మురిసి పోయేదాన్ని.

మీ చిన్న చెల్లి మాత్రం ప్రతి సంవత్సరం, మీరిచ్చే కానుకకు తృప్తి చెందక అలుగు తుంది. మీ అమ్మగారు వూరుకుంటారా, అరే అబ్బాయ్, ఒక్కగానొక్క చెల్లిరా దానికిష్టమైనదేదో కొన లేవేరా అంటూంటారు....  మీ చెల్లి, క్రిందటి సంవత్సరం ఏమందో గుర్తుందా!....

"అన్నయ్యా నాకు వచ్చే సంవత్సరం రాఖీ బహుమానంగా బంగారు వాచి..అందులో  వజ్రాలు వున్నది కొను" అని చెప్పింది...

ఇక, మీ పెద్దమ్మ కూతురు బేబీకి, ఏమిచ్చినా తృప్తి వుండదు...అందుకే రేపు ప్రొద్దుటే నిద్రలేచి ఉపవీతం మార్చు కున్నాక మీరు వూరు వెళ్ళండి... ఎంతో ఖర్చు మిగులుతుంది" అంటుండగా ...

రయ్ మంటూ

'అమ్మా, అమ్మా రేపు స్కూల్లో నేను రాఖీ పౌర్ణమి గురించి మాట్లాడాలి ..కాస్త చెప్పవూ రాసు కుంటాను' అంటూ కూతురు ఇషిత వచ్చేసింది.

"నువ్వు తెలుగు రాస్తే పుష్కరం దాటు తుందిగాని, నేను రాసిస్తాను. కార్తీక దీపం వచ్చే టైమ్ అవుతుంది. ఆ పుస్తకం ఇలా ఇవ్వు...ఇదుగో నేను రాసింది పది సార్లు చదువుకో.. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు అని మొదలు పెట్టు...అంతా చెప్పాక చివరిలో, రాఖీ కట్టే ప్పుడు...

"యేన బద్దో బలీ రాజా దాన వేంద్రో మహా బలః
తేనత్వా మభి బధ్నామి రక్షే మా చల మా చల"

అంటూ కట్టాలని తడుముకోకుండా చెప్పు.

చివరిలో రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ బంధాలను పెంచే పండగ, అన్నా చెల్లెళ్ల నిస్వార్థ ప్రేమను చాటే పండుగ అని, ఆ మాటను కాస్త గట్టిగా చెప్పు.." అంటూ ఎంత గట్టిగా చెప్పాలో, అడక్కుండానే చెప్పేసి, ఆయనకేసి అదోలా చూసి, వంటింటికేసి వెళ్ళింది, సమత..

ఇంతకీ 'ఆయన' పేరేమిటీ అని అడుగుతున్నారా?

ఎందుకులెండి, ఏ పేరైనా, పాపం, ఆయనేగా!...

నేర్పరితనమా? నేర్వనితనమా? -- డా. వాసిలి వసంతకుమార్

(వినదగు)

‘ఏవండీ.. వింటున్నారా?’ అని అమ్మలు అంటుంటే - ‘ఆ.. వింటున్నానే’ అంటూ జవాబును పెదాలకు అప్పజెప్పి తన ఆలోచనల్లో మునిగిపోతున్న నాన్నలను మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇది మన ముందరి తరం తీరు.

ఈ తరంలో అయితే- పేరు పెట్టి పిలిచి ‘లిజన్’ అని బెటర్ హాఫ్ అంటుంటే ఆ లిజన్‌ని ఆర్డర్‌గా పరిగణించి పక్కనే చేరి వినటానికి రెడీ అయిపోవటం అదర్ హాఫ్ విజన్ అయిపోతోంది.

విన్నా వినకపోయినా ఆ తరంలో ఎడబాటు ఉండేది కాదు. పొరపాట్లు ఉన్నా వాటిని తడబాట్లుగానే కొట్టిపారేసేవారు. ఏదీ యూనివర్సల్ ప్రాబ్లమ్ అనిపించేది కాదు.

ఇప్పుడు కూడా ఎడబాట్లు లేవు.. తడబాట్లు లేవు. పొరపాట్లు లేవు.. అన్నట్టుగానే ఉంటోంది. ఏ క్షణాన చూసినా అన్యోన్య దాంపత్యమే అనిపిస్తోంది.. కనిపిస్తోంది. అయినా ఆలుమగల మధ్య లేని దూరం ఆ మనసులలో పెరిగిపోతోంది. చిరు విముఖతా శాశ్వత సమస్య అయిపోతోంది. మూడు ముళ్ల బంధంలో మూడడుగులు వేసిన పురాణ పురుషుడు దర్శనమిస్తున్నాడు.

‘వినదగు నెవ్వరు చెప్పిన’ అని అనిపిస్తున్నా ‘వినదగు నెవర్ చెప్పిన’ అన్న భావం బలమై కూర్చుంటోంది.

అసలు మనం ‘ఎవర్’ అనీ ‘నెవర్’ అనీ విరుద్ధ ఆలోచనలను పెంచుకుంటున్నామా? లేక పంచుకుంటున్నామా అన్నది ప్రశ్న.

* * *

ఈ మధ్య - ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన స్నేహితురాల్ని కలవటానికి వెళ్లి మాట్లాడుకుంటూ అన్ని వార్డులను కలియ తిరుగుతుండగా మూడు పదుల డాక్టర్ స్టెతస్కోప్‌తో తలవంచుకుని వడివడిగా ఔట్ పేషెంట్ వార్డు వైపు వెళ్తుంటే-

‘బాబూ! ఒక్క మాట’ అంటూ ఆపి ఆ డాక్టర్‌ని పరిచయం చేసింది మిత్రురాలు. ఇంతకీ ఆ డాక్టర్ ఆ స్నేహితురాలి పుత్రరత్నమే. పరిచయాలయిన తర్వాత ‘అయినా, తెలీక అడుగుతాను.. ఈ డాక్టర్లు అంతమంది పేషెంట్లు ఎదురుచూస్తూ, కళ్లప్పగించి చూస్తుంటే అలా తలవంచుకు వెళ్లిపోతారేమిటి?’ అన్నాను.

‘తలవంచుకోకపోతే - అందరూ తెలిసిన పేషెంట్లే అయి ఉంటారు - ఎందరినని విష్ చేయాలి? ఎందరికని ప్రిఫరెన్స్ ఇవ్వాలి?’ అంది.

డాక్టర్లు చూసీచూడనట్టు - ప్రొఫెషనలిజమ్‌లో ఎవరూ నా వారు కాదన్నట్టు - రయ్‌మని దూసుకుపోవటంలోని సైకాలజీ ఇదన్నమాట!

ఈ ఆలోచనతో కృష్ణుడు, అర్జునుడు, గీతోపదేశ ఘట్టం కళ్ల ముందు మెదిలింది. దాదాపుగా అర్జునుడి పరిస్థితీ ఈ డాక్టర్ వంటిదే అనిపించింది.

* * *

బాణాన్ని ఎక్కుపెట్టటమే తరువాయి అనుకుని మురిసిపోతున్న కృష్ణుల వారు ఇంకా అర్జునుడు బాణాన్ని సంధించక పోతుండటంతో సందేహిస్తూ వెనుతిరిగి చూస్తే బిక్కమొహంతో పార్థుడు-

అదిలించాల్సింది రథాశ్వాలను కాదు - కదిలించాల్సింది అర్జునుడి భావోద్వేగాలను అని ఇట్టే తెలిసిపోయింది ఆ పురుషోత్తముడికి. ‘వినదగు ఎవ్వరు చెప్పిన’ అన్న రీతిలో చెబితే ఫల్గుణుడు ‘నెవర్’ అంటాడేమోనన్న శంకతో ‘నీ’ ‘నా’ తత్వసారాన్ని వీనుల విందయ్యేటట్లు, మనసును వశీకరణం చేసుకునేటట్లు చెప్పాడు. ఆ బోధతో విజయుడికి విశ్వదర్శనమైంది. ఆ ఉపదేశమే ‘శ్రీ మద్భగవద్గీత’గా నిత్యం పఠనీయమైంది తరతరాలకు.

మొత్తానికి సకల ధర్మాల సారంగా గీత మిగిలిపోయింది. అయినా తలకెక్కించుకుని మన గీతల్ని మనం చెరిపేసుకోలేక పోతున్నాం. గీతలో ఒక ఫిలాసఫీ ఉంది.. ఒక సైకాలజీ ఉంది.. ఒక ఆంత్రపాలజీ ఉంది. మన తత్వాలను, వ్యక్తిత్వాలను, మనస్తత్వాలను, మానవ పరిణామాన్ని, చరిత్ర గతిని మార్చగల రహస్యాలున్నాయి.. జీవ సూత్రాలున్నాయి.. జీవన ధర్మాలున్నాయి.

* * *

అంతెందుకు మన వేమనా ఇటువంటి పనే చేశాడు - ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్న రీతిలోనే - ‘విశ్వదాభిరామ వినుర వేమా’ అంటూ - భక్తి, రక్తి, ముక్తి, యుక్తులుగా సాగే జీవన చట్రాన్ని మన ముందుంచాడు. ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు’ అంటూ అలతి అలతి పదాలతో సోషియాలజీని, సైకాలజీని కలగలిపాడు. రక్తి- అనురక్తులలో, భవ-్ధన బంధాలలో ఫిలాసఫీని, థియోసఫీని రంగరించాడు. అందుకే వేమన ఒక సామాజిక శాస్తజ్ఞ్రునిలా, ఒక మనో విశే్లషకుడిలా, ఒక కౌన్సిలర్లా అనిపిస్తాడు. పైగా ధర్మాన్ని అల్లంత దూరాన ఉంచక మానవ తత్వానికి ఆభరణం చేశాడు.

* * *

There is a flavor in blood and a sweetness in tears అని ఖలీల్ జిబ్రాన్ అంటాడు. ‘ఫ్లేవర్ ఇన్ బ్లడ్’ అన్న పదం విన్నపుడల్లా చదువు సంధ్యల మధ్య మరుగున పడిపోయిన ‘సీజన్ ఆఫ్ బ్లడ్’ అన్న పదబంధం మనసు పొరల నుండి పలకరిస్తూనే ఉంది. జీవితం రక్తరుతువుతో జీవకళను సంతరించుకుంటున్నట్లనిపిస్తుంటుంది. మనకు తెలిసిన ఆరు రుతువులకు ఈ రక్త రుతువును కలుపుకుంటే ఏడు రుతువులయి జీవితం ఇంద్రచాపమే అవుతుంది.

ఇంతకీ అశ్రువులలో అమృత తత్వాన్ని, అరుణిమలో పసిమిని చూడగల నేర్పరితనం ఈ జీవితానికి ఉందా? నేర్వనితనం జీవితానిదయితే బ్లడ్‌లోని ఫ్లేవర్‌ను, టియర్స్‌లోని స్వీట్‌నెస్‌ను తెలుసుకోవటం ఈ జన్మకు సాధ్యం కాదు కాక కాదు. జీవితాన్ని బంగారు పళ్లెంలో అందిస్తున్నా స్వీకరించగల సత్తా మనకుండాలి కదా! అతిథిలా ఈ పుడమిపైకి వచ్చినప్పటికీ నేల తల్లి ఆతిథ్యాన్ని అందుకోగల సంసిద్ధత మనకుండాలి కదా!

ఉప్పూ కర్పూరమూ ఒక్కలానే ఉంటాయి అన్నట్టుగా దుఃఖాశ్రువులయినా, ఆనందాశ్రువులయినా ఒక్కలానే ఉంటాయి. రెండూ కన్నీళ్లే! కాని అవి కనుకొలకుల నిలవటానికి కారణాలైన భావోద్వేగాలు వేరువేరు.. జలజలమని రాలిన తర్వాత మనిషికి మిగిల్చే స్థితి వేరువేరు. జీవితాన్ని దొర్లించేస్తూంటే ఉప్పగానే ఉంటుంది. జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది. ఉప్పులేని కూర రుచికరం కాదు - అందుకే వంటలో ఉప్పు కరుగుతుంది. కర్పూరం మంటలా ఎగస్తుంది - జీవితమూ కర్పూరంలా రగలాలి.

కేవలం మనిషిగా బ్రతికి తనువును చాలిస్తే సరిపోదు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగి వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వం చేసుకుంటేనే మన అస్తిత్వం ఆదర్శం అయ్యేది.

ఇంతకీ తెల్లగా కనిపించిన కర్పూర కళిక ఎర్రని మంటలా కావటంలో ఫ్లేవర్ ఇన్ బ్లడ్ కనిపించటం లేదూ..! స్వీట్‌నెస్ ఇన్ టియర్స్ తెలియటం లేదూ! కరిగిపోయే జీవితంలో కరగని తత్వం ఒకటుంది - దానిది వ్యక్తిత్వం మనస్తత్వం కలగలిసిన నేపథ్యం.

Published under my column VINADAGU in Aaadivaaram Andhra Bhoomi - 21-07-2013
ఇల్లాలి చిట్కా -- అత్తలూరి విజయలక్ష్మి

“అమ్మాయ్! పద్మా!” పక్క ఫ్లాట్లో ఉండే జాంబవతమ్మగారు గుమ్మంలోకి వచ్చి పిలవడంతో “వస్తున్నా పిన్నిగారూ” అంటూ కట్ చేస్తున్న సొరకాయ అలాగే వదిలేసి, చేత్తో చాకుతో వచ్చింది పద్మ.. బిగించిన కొంగు, దోపిన చీర కుచ్చిళ్ళు, చెదిరిన జుట్టు, అలసిన మొహం, చేతిలో చాకు... ఆమె వాలకం చూడగానే జాంబవతి లోపలికి రాబోయి నాలుగడుగులు వెనక్కి తగ్గి భయంగా, బెదురుగా చూస్తూ

“ఏవిటమ్మా ఆ వాలకం?” అందావిడ.

ఆవిడ మొహం లో భావాలు చూడగానే తను చేసిన తప్పేవిటో అర్ధం అయిన పద్మ “అయ్యో సారీ ఒక్క నిమిషం” అంటూ తిరిగి లోపలికి వెళ్లి చాకు టేబుల్ మీద పెట్టేసి, దోపిన చీర కుచ్చిళ్ళు దింపి చిరునవ్వుతో వచ్చి “చెప్పండి పిన్నిగారూ” అంది.

ఆవిడ చేతిలో ఉన్న షాపింగ్ కవర్ గుమ్మం పక్కన పెడుతూ “ఇందులో మావిచిగురుంది.. రోజూ ఏదో ఒక టైం లో కషాయం చేసి తాగండి... కరోనా రాదుట... నేను చెప్పినవన్నీ చేస్తున్నావా” అడిగింది.

పద్మ వికసించిన మొహంతో ఓ అని తలూపి ఆ కవర్ తీసుకోబోతుండగా గాభరాగా అందావిడ...

“ఆ, ఆ .. ఆగు దానిమీద శానిటైజేర్ చల్లకుండా తీస్తావేంటి”.

పద్మ నాలిక్కరుచుకుని శానిటైజేర్ బాటిల్ తెచ్చి చల్లుతూ “పక్క ఫ్లాట్ నుంచే కదా పిన్నిగారు మీరు వచ్చింది.. ఈ లోగా ఏ వైరస్ వస్తుంది?” అంది.

“అలా అనుకోడానికి లేదమ్మా... శత్రువు ఎక్కడి నుంచి దాడి చేస్తాడో తెలియక రాజులు అష్టదిగ్బంధనం చేసుకున్నట్టు మనం కూడా ఈ కరోనా శత్రువునుంచి అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి. నిన్ననే మా పెద్దాడబడుచు తోడికోడలి అన్నగారి అత్తగారికి” అంటూ ఎవరెవరికి కరోనా వ్యాధి వచ్చిందో చెప్పడం మొదలుపెట్టింది. దాదాపు నాలుగు నెల్ల నుంచి ఆవిడ చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తూ ఆవిడ చెబుతున్న కరోనా కధలు వింటూ నాలుగు గోడలు నలంద విశ్వవిద్యాలయంలా భావిస్తూ వచ్చిన పద్మ ఇప్పుడు వంట హడావుడిలో వినే సమయం లేక “సాయంత్రం కలుస్తాను పిన్నిగారూ” అంది...

"ఆ, ఆ అలాగే పాపం వంటలో ఉన్నట్టున్నావు వస్తానమ్మా జాగ్రత్త కషాయం తాగడం మర్చిపోకు” అంటూ వెళ్ళిపోయింది.

కవర్లోంచి లేత మావిడాకులు తీసి కడుగుతున్న పద్మని అడిగాడు సూర్యం ... “ఏంటి తల్లి...మళ్ళి ఇంకో కషాయమా! చచ్చిపోతున్నాము నేను, పిల్లలు ఈ దిక్కుమాలిన కషాయాలు తాగి, పరగడుపున వేపాకు కషాయం, పదకొండు గంటలకి జామాకుల కషాయం, మధ్యాహ్నం మూడింటికి అల్లం కషాయం, మళ్ళి ఆరింటికి తిప్పతీగ కషాయం.. రాత్రికి ఇంకేదో కషాయం.. మాకు తిండి, తిప్పలు వద్దు... ఈ కషాయాలు ఇచ్చేయ్ సరిపోతుంది.. ఆవిడ ఏదో చెప్పడం ... నువ్వు ఆవిడ చెప్పినవన్నీ తు.చ తప్పకుండా పాటించడం... ఈ బాధకన్నా ఆ కరోనా ....” అతని మాట పూర్తీ కాకుండానే గట్టిగా అరిచింది పద్మ “ఆపుతారా” అంటూ..

“ఎవరికోసం, ఎందుకోసం మన ఆరోగ్యం కోసమేగా పెద్దావిడ అంత శ్రద్ధగా వాచ్ మాన్ని పంపించి ఎక్కడెక్కడి ఆకులు తెప్పించి ఇస్తోంది. ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి.. కరోనా వస్తే డాక్టర్స్ ఇళ్ళు, వాకిళ్ళు అమ్మిస్తున్నారుట పేపర్ లో చదవడంలేదూ! ఖర్చులేని వైద్యం చేస్తూ జాగ్రత్తగా ఉంటున్నాం .. ఆ ఎదురింటి అపార్ట్ మెంట్ లో పదిహేను ఫ్లాట్స్ వాళ్లకి వచ్చింది... దాన్ని కాంటైన్మేంట్ ఏరియా కింద చేసారు.. మన అపార్ట్ మెంట్ లో ఒక్క కేసు కూడా లేదంటే కారణం జాంబవతి గారు...ఒక్కరే కాబట్టి కాలక్షేపానికి youtube చూస్తూ ఎంత విజ్ఞానం పెంచుకున్నారో.. మొత్తం ఆయుర్వేదం వైద్యం వచ్చేసింది ఆవిడకి..”

ఊపిరి తీసుకోకుండా చెప్పేసి “వెళ్లి బుద్ధిగా పని చేసుకోండి.. నేను ఏది పెడితే అది తినండి.. ఏమి ఇస్తే అది తాగండి..” అంటూ గిన్నెలో నీళ్ళు పోసి మావిడాకులు వేసి, స్టవ్ మీద పెట్టింది.

“నేను ఆ కషాయం చస్తే తాగను” కోపంగా అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు సూర్యం. సగం కట్ చేసిన సొరకాయ మళ్ళి తరగడం మొదలు పెట్టిన పద్మ హాల్లో నుంచి సరిగ్గా మూడు నిమిషాల తరవాత వినిపిస్తున్న కోరస్ విని ఉలిక్కిపడింది..” మేము కషాయాలు తాగం .... మాకు కషాయం వద్దు... మాకు బూస్ట్ కావాలి..”. మధ్యలో “నాకు కాఫీ రా” అన్న సూర్యం గొంతు  “డాడీకి కాఫీ కావాలి” అని వెంటనే పిల్లల గొంతు వినిపించింది.

పద్మకి అర్ధం అయింది ఇదంతా సూర్యం చేస్తున్న ధర్నా అని ... ఓకే వీళ్ళు ఇప్పుడు ఈ కషాయం తాగేలా లేరు అనుకుంటూ మావిడాకులు వేసి మరగపెడుతున్న స్టవ్ కట్టేసి గట్టిగా అరిచింది “ఇంక ఆపండి కాకిగోల ... నేనేమి ఇవ్వడం లేదు..” టక్కున ఆగిపోయాయి నినాదాలు.

భోజనాలు అయ్యాక “ఇవాళ బజ్జీలు చేయి పద్మా సాయంత్రం స్నాక్ కి” అన్నాడు సూర్యం. పద్మ తల ఊపింది.

అయిదు అయాక అరటికాయ బజ్జీలు ఆ తరవాత చిక్కటి ఆకుపచ్చ రంగులో ఉన్న ద్రావణం గాజు గ్లాసుల్లో తెచ్చింది. “ఏంటిది?” మొహం చిట్లించి అడిగాడు సూర్యం.

“తాగితే తెలుస్తుంది” ...

“ఏంటో చెప్పు ఇది ఇంకో కషాయమా!”

“ఇక నుంచి రోజుకి ఒకటే ఇస్తాను ఇలాగే స్నాక్స్ అయాక.. మీ బాధ భరించలేకపోతున్నా..దీనిక్కూడా గోలచేస్తే ఊరుకోను తాగండి” అంది కసురుతూ.. సూర్యం పిల్లలకి సైగ చేసాడు తాగండి అన్నట్టు. ముగ్గురూ కొంచెం సిప్ చేసి ఓ సారి పెదాలు చప్పరించి మొహం అదోలా పెట్టి పద్మ మొహంలో కోపం చూసి గుటుక్కున గొంతులో పోసుకుని మింగేశారు. పిల్లలు వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తారు..” ఓ లవంగం ఇవ్వు” అంటూ అరిచాడు సూర్యం మొహం వికారంగా పెట్టి.  పద్మ లవంగం తెచ్చి భర్త చేతికిస్తూ “బాగుందా” అంది.

“నా బొందలా ఉంది ఇదే ఆకు కషాయం” అడిగాడు.

“ఒక్కోసారి ఒక్కో ఆకుతో చేసి ఇస్తే గోల చేస్తున్నారుగా అందుకని అన్ని ఆకులు కలిపి ఒకే కషాయం చేసాను. రోజుకి ఒకేసారి” అంటూ గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది.

Posted in February 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!