Menu Close
Galpika_title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

వాన -- అత్తలూరి విజయలక్ష్మి

విజయవాడ వెళ్ళే అమరావతి బస్ ప్లాట్ ఫారం మీదకు వచ్చింది.

ముచ్చటపడి వారం ముందే రిజర్వ్ చేయించుకున్న ఒకటో నెంబర్ సీటులో కూర్చుని హమ్మయ్య అనుకున్నాను. ముందు సీటులో  హాయిగా కాళ్ళు జాపుకుని కూర్చుని పుస్తకం చదువుకోవచ్చు... కిటికీలోంచి ప్రకృతిని చూడచ్చు... దిగేటప్పుడు అందరికన్నా ముందే దిగేయచ్చు.. ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణం నాకు హాయిగా ఉండాలి.

ఒకొక్కరే ఎక్కుతున్నారు. మరో నిమిషంలో బస్సు బయలుదేరుతుంది అనగా ఎక్కింది ఓ అరవై ఏళ్ల చిన్నది.  రెండో నెంబర్ సీటులో కూర్చుంది. కుర్తీ పైజమా, ఒక వైపు చున్నీ..  బస్ కదిలింది.

“ఎక్కడికి వెళ్తున్నారు” అడిగింది. అబ్బా! మొదలైంది ఆరాలు, కూపీలు... నాకసలు నచ్చని ప్రయాణంలో కలిగే పరిచయాలు. ఈ ప్రశ్నతో ఆగితే బాగుండు. అయిష్టంగా చెప్పాను విజయవాడ.

నేనూ విజయవాడే అంది. బస్సు విజయవాడ బస్ కదా చెప్పడం అవసరమా! కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను.

“మీ పేరేంటి ?” అవసరమా! తప్పదు ..చూపులు తిప్పకుండానే చెప్పాను.

“నాపేరు రోజా “... నేనడగలేదే! సిటీ లోనే ట్రాఫిక్ లో ఉంది బస్.

“మీది విజయవాడనా ...” ఓ గాడ్ ఈవిడ నా ప్రశాంతతని భంగం చేయడానికే వచ్చింది కచ్చితంగా.

సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా...మౌనంగా ట్రాఫిక్ సంకెళ్ళ నుంచి బస్సు పొందే విముక్తి కోసం ఎదురుచూడసాగాను.

“మాది విశాఖపట్నం ... నేను టీచర్ గా చేసి రిటైర్ అయాను. మావారు నేవీలో చేసేవారు..”

చేసేవారు అంటే!  ఆమె వైపు చూసాను.  మామూలుగా  ఉంది ... ఒకప్పుడు అందగత్తె అనిపించేలా.. మెడలో నీలం రంగు పూసల దండ ..

బాగులోంచి బిస్కెట్ పాకెట్ తీసింది .. ఓపెన్ చేసి నా ముందు పెట్టి తీసుకోండి అంది.

వద్దు అన్నాను. తీసుకోండి... మిమ్మల్ని చూడగానే నాకెందుకో మీరు నా ఆత్మీయులు అనిపిస్తోంది  మొహమాటపడకండి బలవంతం చేసింది. ఒకటి తీసుకుని ధాంక్స్ అన్నాను.

“మీరలా థాంక్స్ చెప్పకూడదు... మనం స్నేహితులం కదా.. మనలో మనకి థాంక్స్ లు, సారీలు ఉండకూడదు. నాకు మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం .. మీరు చాలా మంచివాళ్ళు .. బాగున్నారు కూడా... మీకూ నా వయసే ఉంటుందేమో కదా.. కానీ చిన్నగా కనిపిస్తున్నారు.. ఈ వయసులో కూడా మీ ఫిగర్ బాగుంది... ఎలా మెయిన్ టైన్ చేస్తున్నారు..”

నా ప్రశాంతత కొల్లగోట్టడానికే ఈవిడ ఈ బస్ ఎక్కింది.. నా ఖర్మ గాలి నా పక్కకి వచ్చి పడింది. పొతే పోయాయి డబ్బులు ఈ సీటు కూడా నేనే రిజర్వ్  చేయించుకుంటే బాగుండేది..

పొలిమేరలు దాటింది బస్. వడగళ్ళ వాన రేకుల మీద పడుతున్నట్టుగా ఉంది. విజయవాడ చేరిందాకా టి వి యాంకర్ లా వాగుతూనే ఉంది. కిటికీ తెరిచి ఉంటె దూకేసేదాన్ని... బస్ గొల్లపూడి చేరింది. మళ్ళి ట్రాఫిక్ మొదలైంది. ఆవిడ ఫోన్ మోగింది. హమ్మయ్య వాళ్ళెవరో  విజయవాడ వరకూ మాట్లాడితే బాగుండు.. ఆవిడ ఏం మాట్లాడుతోందో నాకు వినిపించడంలేదు.. వినాలన్న ఆసక్తి కూడా నాకులేదు.

సరిగ్గా అయిదు నిమిషాలు ... ఫోన్ బాగులో పెట్టుకుని గబుక్కున నా చేతులు పట్టుకుని “మీరు నా పక్కన లేకపోయి ఉంటే ఏమై పోయే దాన్నో... ఎంత టెన్షన్ గా ఉన్నానో తెలుసా మొన్నటి నుంచి... నా అంతరాత్మ చెప్తూనే ఉంది ఏం కాదు భయపడకు అని...అన్నయ్య కూడా డిల్లీ నుంచి ఫోన్ చేసాడు... చనిపోయిన వాళ్ళల్లో నా కొడుకు పేరు లేదని... కానీ తల్లినికదా! ఎలా బాధపడకుండా ఉంటాను! నలభైమంది జవాన్లని కుక్కలని చంపినట్టు చంపేశారు... పాపం అయినవాళ్ళని, స్వసుఖాలని త్యాగం చేసి ఈ దేశాన్ని నిత్యం కాపలాకాస్తారు కదా! “” ఆమె వైపు అప్పుడు చూసాను కళ్ళు విప్పార్చుకుని.. ఆ కళ్ళల్లో తడి.... నా గుండెల్లో జడివానగా మారింది.

గల్పికావని - శుక్రవారధుని - నడక-నడత -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

నడవండి. నడవండి. ముందుకో వెనక్కో పక్కకో నడవండి. పైకో కిందికో నడుస్తూనే ఉండండి.  మీతో ఎవరొస్తే వాళ్ళతో నడవండి. ఎవరూ రాకపోయినా మిమ్మల్ని వెంబడించడానికి మీ నీడ ఉందని మర్చిపోకుండా నడవండి. అలా నడుస్తూ నడుస్తూ వుంటే ఏదో ఒక సందర్భంలో నడకనేది 'మనం నడవకపోయినా' ముందుకు సాగుతుందని తెలుస్తుంది. అప్పుడు మీరు కూర్చున్నచోట, నుంచున్నచోట పనిలో ఉన్నచోట కూడా నడవగలుగుతారు. చివరికి పడుకుని గాఢనిద్రలో కూడా నడవగలుగుతారు.

ఇవన్నీ జరగాలంటే మన కాళ్ళు నేలమీద ఉండాలి. అప్పుడుగానీ మనిషికీ మట్టికీ సంబంధం ఏమిటో అర్థం కాదు. దాని గురించి తెలియాలంటే ముందు కాళ్ళకి పట్టిన సాక్సునీ వాటికి చుట్టిన బూట్సునీ వదిలెయ్యాలి. ఉట్టికాళ్ళతో మట్టిలో నడవాలి. మట్టితో నడవాలి. చివరికి మట్టయ్యాక కూడా నడుస్తూనే ఉండాలి.

ప్రకృతి ఆశ్రమం గురువుగారు చెప్పుకుపోతున్నారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయిగానీ మట్టిలో నడవాలంటే ఈ నగరంలో అసలు మట్టంటూ ఉంటే కదా. చివరికి నడక తోటల్లో సైతం చెట్లకీ చెట్లకీ మధ్య సిమెంటు పలకల బాటలో రాళ్ళబాటలో ఉంటాయే గానీ మట్టి బాటలుండవు. కాబట్టీ అక్కడా కాలికి మట్టంటదు. ఎలా?

గురువుగారు మట్టిలో నడక గురించి భావుకుడై చెబుతుంటే నా నడక నన్ను బాల్యంలోకి తీసుకెళుతోంది. తాతయ్యగారు మట్టి గురించి చెప్పిన మాటలన్నింటినీ రూపు కట్టిస్తోంది. నాకు తెలియకుండానే నన్ను మట్టి పాత్రగా మారుస్తోంది. నన్ను. వేలు పట్టుకుని మట్టిలోకంలోకి నడిసిస్తోంది.

అదిగో మట్టి పెళ్ళలు ముక్కలు చెక్కలై దంపుడు కళ్ళంలో పొడిపొడిగా మారిన ఇసక. ఆ ఇసక పుంతల్లో నడుస్తూంటే ఎంతబాగుంటుందో. పాదాలకు ఎక్కడా ఇసకంటదు. అలాగని అంటకుండానూ ఉండదు. పాదాలు పౌడర్ రాసుకుంటాయి. ఆ పౌడర్ పరిమళం ఏ సెంటులోనూ ఉండదన్నది సెంట్ పర్సెంట్ సత్యం.

దేవలోకంలోకి వెళ్ళాలంటే మేఘాల మీద నడవాలి. ఆ మేఘాల్ని నేలమీదకి దింపాలంటే ఇసక పుంతల్లో దుమ్మురేగ్గొడుతూ నడవాలి. అప్పుడు ఆకాశం భూమ్మీదకొచ్చి మన కాళ్ళ చుట్టూ మేఘమై మన వెన్నంటి వస్తుంది. కాస్త మొరుంగా ఉన్న ఇసకలో నడుస్తుంటే అది మనల్ని ముందుకు జారుస్తూ నడిపిస్తుంది. ఆ జారుడు నడక ఎంతందంగా ఉంటుందో జారితేగానీ తెలియదు. అక్కడ అందరికీ కాళ్ళు జారతాయేమోగానీ ఎవ్వరూ కాలుజారడం మాత్రం ఉండదు.

అదే ఇంకాస్త మొరుంగా ఉండే గోదారిసకైతే పాదాలకి గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఆ గిలిగింతలముందు రంభాదుల పులకింతలు కూడా బలాదూర్.

రాగిడి మట్టో ఎర్రమట్టో ఉందనుకోండి, అది ఉపరితలాన్ని నున్నగా అలికి ముగ్గెడుతుంది. ఆ అలుకుల అలకల అలివేణి మనకి తెలియకుండానే మన నడకలో రాజసాన్ని నింపుతుంది. ఆ రాజసం నెత్తిన కిరీటమో కాలికి గండ పెండేరమో తగిలించుకున్నంత సులభంగా వచ్చేది కాదు.

వానాకాలంలో రాగిడి మట్టిలో నడవడమంతటి సాహసోపేతమైన స్కేటింగ్ మంచుపర్వతాల్లో కూడా చెయ్యలేం.

ఇంత చెప్పినా కాళ్ళకి షూసూ బూట్లూ లేకుండా నడవడం ఎలా అని సంకోచిస్తున్నారా? అయితే ఓసారి బురదలోకి రండి. అందులో కాసేపు నడిచి చూడండి. ఆ బురదే సాక్సుకంటే బిగుతుగా పట్టుకుంటుంది. ఆ తరవాత కాసేపు గండ్ర ఇసకలో నడవండి. ఆ ఇసకే రంగురంగుల బూట్లని మించి మిలమిలా మెరుస్తుంది. అలా అలా దేవలోకాల్లో విహరిస్తూ గురువుగారి ప్రసంగం ముగించుకుని ఇంటికి వచ్చినాగానీ తాతయ్య జ్ఞాపకాలు నన్ను వదలకుండా మా కోపల్లెకు రారమ్మని పిలుస్తూనే ఉన్నాయి.

ఇంక లాభంలేదు. మట్టిలో నడవాలంటే మళ్ళీ కోపల్లె చేరాల్సిందే. పర్రాలమ్మతల్లి జల్లించిన ఇసక పర్రల్లో నడవాల్సిందే.

%%%

కోపల్లె రాలేదని తూరుపు తెల్లబడటం మానుతుందా? ఆకాశంలోకి వెలుగులు వెల్లువెత్తేలోపే మట్టిలోకి దిగిపోవాలి. చూస్తే ఎడంపక్కన దున్నిన చేను కనిపించింది. దాన్ని చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. వెంటనే కారాపించి కిందకి దిగాను. ఆ వేకువ వెలుగుల్లోకి మట్టితో నడవడానికి అంతకు మించిన ప్రదేశం మళ్ళీ దొరకదు. అందుకే చేలోకి దిగాను. దున్నిన పొలంలోకి అడుగుపెట్టబోతుండగా గుర్తొచ్చాయి చెప్పులు. అవి కాళ్ళకే ఉన్నాయి. వాటిని తీసి చేత్తో పట్టుకున్నాను. బులబులాగ్గా దున్నిన మట్టిలోకి కాళ్ళు మెత్తగా దిగుతున్నాయి. అలాగే నడుస్తున్నాను. ఒక్కో అడుగూ వేస్తుంటే.., ఆ అడుగు మట్టిలోకి దిగుతుంటే.., ఆ కాళ్ళమీదకి మట్టి చేరుతుంటే..,అడుగు తీస్తున్నప్పుడు కాలితోబాటుగా మట్టి కూడా గాల్లోకి లేస్తుంటే.., దాన్ని దులపడానికి కాళ్ళని విదిలిస్తుంటే.., నడకలోకి నాట్యం వచ్చి చేరుతుంటే.., గాలి ఈలలు ఆ నాట్యానికి నేపథ్యవేణుగానాన్ని సమకూరుస్తుంటే.., మనసు ప్రాణప్రదమైన మట్టిలో మురుస్తూ మై మరుస్తూ అలా నడిచి ముందుకు వెళ్తూంటే ఎదురుగా కనిపిందో గట్టు. ఆ గట్టుమీద ఓ పెద్దాయన. ఆ పెద్దాయన ముఖంలో ఏదో తెలియని ఆత్మీయత. ఆయన నా నడకని ఎంత ముచ్చటగా చూస్తున్నాడో నా చేతుల్లోని చెప్పుల్ని కూడా అంతే మురిపెంగా చూస్తున్నాడు.

ఈసారి కొంచెం పరీక్షగా పరికిస్తే ఆయన చూపుల్లో ముచ్చట మురిపాలను మించిన తన్మయ భావమేదో గోచరిస్తోంది. అందుక్కారణం ఏమై ఉంటుందో ఆలోచించే స్థితిలో లేను. అందుకే నడక సంతోషాన్ని ఆస్వాదిస్తూ అడుగులేస్తున్నాను. అంతలోనే ఆ పెద్దాయన కొడుక్కాబోలు బైకు అవతలి గట్టుమీద నిలబెట్టి దున్నిన ఆ పొలంలో నడుస్తూ ఆ పెద్దాయనదగ్గరకి వెళ్ళాడు. అతను దగ్గరకి రాగానే తలమీద మురిపెంగా మొత్తాడా పెద్దాయన. నన్ను తన కొడుక్కు చూపిస్తూ అన్నాడు,"దున్నిన చేనంటే అన్నపూర్ణమ్మతల్లి ఒడిలాంటిదిరా యెదవా. అందులోకి చెప్పులేసుకు రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. అదిగో, ఆయన్ని చూడు. పట్నంబాబైనా పద్దతులు మర్చిపోలేదు. చెప్పులు చేత్తో పట్టుకుని గుళ్ళోకెళ్ళినట్టు ఎంత భక్తిగా నడుస్తున్నాడో"

ఆ మాటలు వినగానే నా మనసులో పొద్దుపొడిచింది.

అది నా జాతి నడక వెనుకనున్న నడత మీద వెలుగులు ప్రసరించింది.

మా నాన్నకు పిచ్చా?! -- శ్రీ శ్రీ

బోట్స్వానా (Botswana, South Africa) లో ఐదు నక్షత్రాల ప్రభుత్వ మానసిక రుగ్మతల (సైకియాట్రిక్) ఆసుపత్రి...ఓపీ (ఔట్ పేషెంట్ విభాగం) ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుంది. ఎంతో సుదూర ప్రాంతాలనుండి రోగులు వస్తూవుంటారు. నేను టైమ్ ను పాటించడం మా అమ్మనుండి పుణికి పుచ్చుకున్నాను. ఎప్పుడూ పదినిముషాలముందే ఓపీ లో ఉంటాను. ఈరోజు చూడాల్సిన ఫైల్స్ తో నర్స్ వచ్చి డుమేల ఇంగక (నమస్తే డాక్టర్) అంది. మొదటి పేషెంట్ ఫైలు అందిస్తూ,... కోర్ట్ ఆర్డర్ తో వచ్చిన పేషెంట్ అని చెప్పింది.

పేరు..స్టాన్లీ మోనహాంగ్...వయస్సు 58 సంవత్సరాలు. శానిటి అస్సెస్మెంట్(మానసిక రుగ్మత నిర్దారణ) కోసం మేజిస్ట్రేట్ పంపగా పోలీసులతో వచ్చాడు. వాళ్ళతో పాటు పేషెంట్ కొడుకు, డింగానే, కూడా వచ్చాడు. వచ్చిన పోలీసులు, మోనహాంగ్ కొడుకు, డింగానే, డుమేలామ్మా (నమస్కారం మేడం) అంటూ విష్ చేశారు. నేను అందరిని చూసి డుమేలాంగ్ బగాయిథ్థ్సో (అందరికి వందనాలు) అన్నాను.

కూర్చోమని చెప్పాను.

పోలీసులు మోనేహాంగ్కి బేడీలు వేసి తీసుకుని వచ్చారు. బేడీలు తియ్యమన్నట్టు కనుసైగ చేశాను. పోలీసులు వెంటనే సంకెళ్లు తీసేశారు.

మోనేహాంగ్ కొడుకు, డింగానే, ... Dr.... మానాన్నకు మానసిక రుగ్మత లేదు. మేజిస్ట్రేట్ ఆయన్ని ఈ మెంటల్ ఆసుపత్రికి అన్యాయంగా పంపించారు.

ఆమాటలు విన్న నేను, నర్స్ వైపు ప్రశ్నార్ధకంగా చూసాను.

అవును డాక్టర్, నేను వేసిన ప్రశ్నలకు అతను చెప్పిన సమాధానాలు విన్న నాకూ ఇతనికి ఎలాంటి మానసిక రుగ్మత ఉన్నట్లు అనిపించడం లేదు. బహుశా డింగానే చెప్పేది నిజమేనేమో? అంది.

మీరంతా వెయిటింగ్ గది లో కూర్చోండి అని పోలీసులకు చెప్పి, నేను మొదట మోనేహాంగ్ కొడుకు డింగానేతో మాట్లాడడం మొదలు పెట్టాను.

ర్రా డింగానే( Mr.డింగానే) అసలు ఏమిటి సంగతి? పోలీసులు ఎందుకు మీ నాన్నను అరెస్టు చేశారు? అన్న నాప్రశ్నకు

డింగానే, చెప్పడం మొదలు పెట్టాడు:

మా అమ్మ చనిపోయి ఐదు సంవత్సరాలైంది. నేను మావూరు, రామోట్స్వా లో ఉద్యోగం చేస్తున్నాను. మా నాన్న రామాత్లభామా లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మ్మ తాండి (Ms. తాండి) అనే ఆమెతో సహజీవనం సాగిస్తున్నట్టు మానాన్న నాతో చెప్పారు.

ఆవిడ ఈమధ్య గర్భం దాల్చిందట. ఆవిడ పనిచేసే ఆఫీసు దగ్గరకు వెళ్లి మా నాన్న ఆమెను ఇంటికి రమ్మని అడిగితే రానుపొమ్మని మానాన్న మీద పోలీసు కేసు పెట్టిందట. పోలీసులు మానాన్నను అరెస్టు చేసి ఇక్కడికి తీసుకు వచ్చారు. ఇదేమన్నా న్యాయమా?

ఎదురుగా కూర్చుని వున్న మోనేహాంగ్ చిరునవ్వుతో నావైపు తిరిగాడు. ఎలావున్నావు అన్న ప్రశ్నకు బాగున్నానని చెప్పాడు. ఉద్యోగం చేస్తున్నావా? లేదు వ్యవసాయం చేస్తున్నానన్నాడు. మొక్కజొన్నలు, క్యాబేజీ పండిస్తున్నాను.

 

నీకు ఎంత మంది పిల్లలు?

మొదటి సహజీవనంలో ఒక అబ్బాయి. పెళ్ళయిందా నీకు?

చేసుకోలేదు డాక్టర్. ముప్పై సంవత్సరాలు కలిసి సహజీవనం చేశాము. ఆమె చనిపోయి ఐదు సంవత్సరాలు అయ్యింది.

ఒక సంవత్సరం గా తాండి తో ఉంటున్నాను. ఇప్పుడు ఆమె గర్భవతి.

ఆమెతో పెళ్ళయిందా?

లేదు డాక్టరు.

ఆమె ఆఫీసుపై రాళ్ళు ఎందుకు వేశావు?

ఈ మధ్య ఇంటికి రావడం మానేసింది. ఆవిడ ఆఫీసు కు వెళ్లి ఇంటికి రమ్మని ఎంతగానో పిలిచాను. నేను తనకు తెలియదని, నన్నెప్పుడూ చూడలేదని చెబుతుంది. ఆమె ఇప్పుడు కడుపుతో ఉన్నది.

పదిరోజులనుండి తను పనిచేసే ఆఫీసుకి వెళ్లి ఇంటికి రమ్మని ఎంత బ్రతిమాలినా రావడంలేదు డాక్టర్. కోపం వచ్చి ఆఫీస్ పై రాళ్లు వేసాను. తప్పా? నాతో జీవనం సాగిస్తూ నన్ను పట్టుకుని, నీవు ఎవరో నాకు తెలీదు, నాకు పెళ్లయింది, వేరే భర్త ఉన్నారు అంటే ఏమగాడికైనా కోపం రాదా? అంతే గాక ఆవిడ గర్భం నాది కాదు, ఆవిడ కడుపులోని బిడ్డ నాది కాదు అంటుంది...నాకు బాగా కోపం వచ్చింది.

మోనేహాంగ్, చివరి సారిగా మీ ఇద్దరు ఎప్పుడు మీ ఇంటిదగ్గర కలుసుకున్నారు? మీ ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళిపోయింది? అసలు మీ కథ ఏంటో క్షుణ్ణంగా చెప్పు, అని అడిగాను.

డాక్టర్, గత కొంతకాలంగా, రాత్రి నేను నిద్రపోయేముందు మూసివున్న తలుపు క్రింద నుండి ముందుగా ఒక దట్టమైన పొగ వస్తుంది, ఆ పొగ ఒక పాము గా మారుతుంది, తరువాత ఆపాము నా గర్ల్ ఫ్రెండ్, తాండిగా మారుతుంది, తాండి నాదుప్పటిలోకి వస్తుంది. రాత్రంతా మేమిద్దరం గడిపేవాళ్ళం. లైంగికంగా కలిసేవాళ్ళం. మళ్ళీ పొద్దునే పామై, తరువాత పొగై తలుపు క్రింది నుండి వెళ్లిపోయేది. ఇలా ఒక ఏడాదిగా జరుగుతుంది... ఇప్పుడు ఆవిడ గర్భిణి...ఇప్పుడు మీరు చెప్పండి. ఆ గర్భం నాదా కాదా?

అన్నీ వింటున్న డింగానే ....తండ్రి మాటలకు తలపట్టుకుని...డాక్టర్, మా నాన్నకు పిచ్చే...అని నోరువెళ్ల పెట్టాడు.

Posted in January 2020, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!