Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

నాలుగో ఫ్లోర్ బాల్కనీ లొ నించున్నాడు రాహుల్. క్రితం రోజు చనువుగా పెళ్లి ప్రసక్తి తీసుకువచ్చాడు.

“ఆలోచిద్దాం!” అంటూనే ఉంది దీపాలీ. ఆమెలో క్రమ క్రమంగా వచ్చే మార్పులు ఒక్కొటొక్కటిగా చూస్తున్నాడు. దీపాలీలో కళాకళలున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేసే ప్రేమ కురిపిస్తుంది. మోహిత్ తో ‘నా రాహుల్’ అంటుంది. అదుపు లేకుండా ఖర్చు చేస్తుంది. ఒకసారి మందలిస్తే-

“నా డబ్బేగా... నేను ఖర్చు చేస్తున్నది. భలే చెప్పావే!” అంది.

“అయినా మనకేం లోటు?” అంది.

‘కూర్చుని తింటే... ఎంతయినా ఖర్చు అయిపోతుందని. అనవసరమైన ఆర్భాటాలకి పోవొద్దని’’ అన్నాడు.

‘నా ఇష్టం! పొమ్మంది!

‘తాగడం తప్పన్నాడు’. చిత్రంగా చూసింది.

చిన్న చిన్న విషయాల్లో వాదనలు పెరుగుతూ ఉంటే ప్రతీదానికీ నెగిటివ్ ఆన్సర్ వస్తుంటే దిగాలు పడ్డాడు రాహుల్.

ప్రతీసారిలాగే దీపాలీ ఆ రోజు రాత్రి కూడా ఇంటికి రాలేదు. కానీ డ్రస్సింగ్ టేబుల్ మీద ఒక లెటర్ పెట్టి  ఉంది.

“తామిద్దరికీ కుదరదనీ, తనకి అన్నీ విధాలా మోహిత్ ‘సరి అయినవాడనీ’ అందులొ సారాంశం. మళ్ళీ మళ్ళీ చదివాడు. చెప్పా పెట్టకుండా ఎలా వెళ్ళిపోయింది? వింతగా ఉంది.

రాహుల్ గట్టి  షాక్ తిన్నాడు.

కర్టెసీకి కూడా ఆమె తనతో చెప్పకపోవడం విభ్రాంతి కి గురి చేస్తోంది. ఇటీవల కాలంలో ఆమె ప్రవర్తన గుర్తొచ్చి నిట్టూర్చాడు. రాహుల్ మనసులో లోలోపల ఎటువంటి బాధా కలగక పోవడం గమనించాడు. ’దీపాలీ‘ అంటే తనకి ‘మోహం’, క్రేజ్ మాత్రమేనా? అంతేనా? అసలేం బాధగా లేదేం? ఎన్నెన్నో ప్రశ్నలు అతడిలో.

ఇక్కడితో ఈ చాప్టర్ ముగిసిందన్నమాట.

‘కొందరంతే! తమకేం కావాలో తమకే తెలియక ఎదుటి మనుషుల జీవితాల్ని కూడా చిందరవందర చేస్తారు. ఇప్పుడు అర్ధమయింది ఆమె స్వభావం. మనుషుల్ని వస్తువుల్లా మార్చడం!

అంతా మంచికే జరిగిందేమో?

మొదట అమ్మ గుర్తొచ్చింది. తన కోసం ఎదురుచూస్తున్నట్టున్న నాన్న కళ్ళముందు కొచ్చాడు. ఊరు గుర్తొచ్చింది.

ఎందుకో తెలియదు కానీ ‘సీత’ ఇంకా బాగా గుర్తొచ్చింది. ఆమె మువ్వల చప్పుడు చెవుల్లో రిథమిక్ గా సంగీతాన్ని వినిపిస్తున్నట్లు తోచింది. రాహుల్ తమ ఊరుకి వెళ్ళాలని అనిపించి రెడీ అయ్యాడు.

******

స్తుతి దిగులు మొహం రాకీని ముల్లు తో గుచ్చుతున్నట్టు గా ఉంది.

“ఏమిటీ ఆడవాళ్ళు? సెంటిమెంట్స్ గుప్పించి ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అదే జీవితమనుకుంటారు.

స్తుతి రాకీ తో ఏమి అనదు. అసలేమీ అడగదు. అన్నీ అమర్చి పెడుతుంది. కానీ మౌనంగా ఉంటుంది.

అదే రాకీ కి అసహనంగా ఉంది. ఏదో కొంప మునిగిపోయినట్టు, జీవితం ఇక్కడే ఆగినట్టు అంజలీదేవి ఫోజు.

ఆ రోజు స్వామినాయుడుకి తాను రూమ్ మేట్ గా వచ్చేస్తున్నానని చెప్పేశాడు. వెళ్ళేముందు-

“స్తుతీ! నా దారి వేరు. నీకూ, నాకూ సరిపడదు. నేను ఆర్ధికంగా బాగా స్థిరపడాలి. అది నీతోనే నేను ఉంటే వర్క్ ఔట్ అయ్యేది కాదు. డబ్బున్న అమ్మాయినే నేను పెళ్ళి చేసుకోవాలన్నది నా కల. నీకు డబ్బుందనే నీకు దగ్గరయ్యాను. ఇప్పుడు నీతో స్నేహాన్ని కూడా కొనసాగించలేను. గుడ్ బై!” అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.

******

నాలుగో అంతస్తులో కుడివైపు ఫ్లాట్!

తలుపు గట్టిగా బాదుతున్న శబ్దం!

మళ్ళీ కాలింగ్ బెల్ మోత!!

చివరిగా బాదుడు!!!

తలుపు తీసిన ధీరజ ఎదురుగా పోలీసుల్ని చూసి స్టన్ అయింది.

“సుభాష్ ఎక్కడ?” ఇన్స్పెక్టర్ అడిగాడు ఇంట్లోకి చొరబడుతూ. పొద్దున్నే కంపెనీకి వెళ్ళిపోయాడని చెప్పింది ధీరజ. కంపెనీ వివరాలు ఇమ్మన్నాడు. ఇచ్చిన వివరాలు చూసి పగలబడి నవ్వారు ఇన్స్పెక్టర్, పోలీసులు.

ఇంతలో లక్ష్మణ్ మహేంద్ర ని తీసుకు వచ్చాడు. మహేంద్ర తనని తాను పరిచయం చేసుకుని వివరాలు అడుగుతూ కొద్దిసేపు మాట్లాడాడు.

“సుభాష్ సైబర్ నేరస్థుడు. చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న క్రిమినల్. వాడే కంపెనీ లో పనిచేయడం లేదు సార్! చదువుకున్నదే చాలా తక్కువ. అయినా ఇలాంటి అమ్మాయిలు ఎలా నమ్మేస్తారో? అన్నాడు ధీరజని వెటకారంగా చూస్తూ.

ధీరజ టక్కున వెనకవైపు చూసింది. అక్కడ బ్లాక్ సూట్కేస్ లేదు. అర్ధమయింది ఆమెకి.

మహేంద్ర ధీరజ తండ్రి రామారావుకి కాల్ చేశాడు. ఆఘమేఘాల మీద వచ్చారు అందరూ.

“ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాను!” అంటూ వివరాలు తీసుకుని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. పోలీసులు వెళ్ళి పోగానే ధీరజ కుప్పకూలిపోయింది. ఎవ్వరివైపు చూసే ధైర్యం చేయలేదు. సిగ్గుతో పాతాళం లోకి కూరుకుపోతున్నట్లు ముడుచుకుపోయింది.

అప్పుడొచ్చాడు ధీరజ భర్త మధు భార్య దగ్గరకువచ్చి ఎంతో అనునయంగా భార్య చెయ్యి మీద చెయ్యి వేశాడు.

ఆ స్పర్శ భర్తదని అర్ధం అయింది ధీరజ కి.

******

సిరీన్ ఇప్పుడు తెలుగు పాటలు పాతవీ. కొత్తవి అన్నీ పాడెయ్యడం మొదలెట్టాడు. ప్రతీ పనిలో పాట అందుకుంటాడు. ఆ గొంతులో తెలుగుదనమంతా ఒదిగి అందంగా, అనంతరాగాల్ని వినిపిస్తోంది. అలవోక గా పాడే ఆ పాటలు మనసుని మైమరపిస్తాయి.

సంజన కిచెన్ లోకి వెళ్తుంటే-

“ఓ పోయే పోయే చినదానా... నీ తియ్యని మనసు నాదేనా?” అంటాడు. హాల్లోకి వస్తూ ఉంటే _

వెన్నెలా! వెన్నెలా... మెల్లగా రావే!  పూల తేనేలే తేవే!” అని పాడతాడు. ఎప్పుడో పరధ్యాసగా చూస్తుంటే-

“కన్నుల్లో నీ బొమ్మ చూడు... నా కన్నుల్లో నీ బొమ్మ చూడు. అది కమ్మని పాటలు పాడు... అంటుంటే అతడి రెండు చేతులూ పట్టుకుని “నీకు నన్ను దూరం చేయకు” అని అడగాలని ఉంటుంది. కానీ  అతడి మొహం చూస్తుంటే ఊసుపోక తనకి తోచిన పాట  అనుకోకుండా పాడుకుంటున్నట్లు ఉంటుంది.

“ఏం పిల్లో... ఎల్ద మోస్తవా? అని బూట్లు వేసుకుంటూ ‘హమ్’ చేస్తే కళ్ళప్పగించి చూస్తుంటే ఫక్కున నవ్వి-

“బాగా పాడానా?” అంటాడు.

******

“నువ్వు మళ్ళీ సంతకం పెట్టాలి!” అన్నాడు రెండు నెలల గడిచాక సంజనతో సీరీన్. ప్రశ్నార్ధకంగా చూసింది.

“నా ఫ్రెండ్ లవ్ మేరేజ్! సాక్షి సంతకం ఎవ్వరైన పెట్టొచ్చు. కానీ నీ చెయ్యిమంచిదని రిక్వెస్ట్!” అన్నాడు. నవ్వింది సంజన.

“పదింటికి రెడీ కావాలి!” చెప్పి వెళ్ళిపోయాడు.

కాసేపటిలో శంకర్ పిల్ల గేంగ్ ని వేసుకుని వచ్చేశాడు. ఇల్లంతా గోలగోల. గొప్ప సందడి.

“ఎవరికి శంకర్ పెళ్లి? నీకు తెలుసా?” అడిగింది.

“గోపి అని కాలనీ లో ఉంటాడు. రాధ అనే వెనకింటి అమ్మాయిని ప్రేమించాడు. మామూలే కదా ఈ పెద్దోళ్ళ గొడవలు. అందుకే సీరీన్ పెళ్ళి చేస్తున్నాడు” అన్నాడు. షర్మిల చాలా హడావిడిగా వచ్చింది. వచ్చిందే తడవుగా –

“సంజనా! వాళ్ళింట్లో ఒప్పుకుని ఉంటే గ్రాండ్ గా పెళ్ళి జరిగి ఉండేది. ఇదేంటి నువ్వీచీర కట్టావు? ఉండు. నేను సెలెక్ట్ చేస్తాను. గ్రాండ్ గా అటెండ్ అవుదాం!” అంది.

చాలా ఉత్సాహంగా తల ఊపింది సంజన. బీరువా అంతా వెతికింది.

ఒకసారి సీరీన్, షర్మిలా సిల్క్ చీరల సేల్ అవుతుంటే వెళ్ళి సంజనకి కూడా ఒక పసుపు ప్యూర్ సిల్క్ చీర ప్రెజెంట్ చేశాడు. మొహమాటంగా తీసుకుని అలాగే ఉంచేసిన ఆ చీరని బయిటికి లాగి కట్టుకోమని ఎంకరేజ్ చేసింది.

“చూడు ఈ రింగ్. ఎలా ఉంది నా సెలక్షన్?” రింగ్ చూపించింది. బావుందంటూ తల ఊపింది సంజన.

సీరీన్ వైట్ కలర్ సూట్ లో ఉన్నాడు. చాలా హంగామా గా జరుగుతున్నట్లు ఉంది. సంజన త్వరగా రెడీ అయి వచ్చింది. సీరీన్ తననే కన్నార్పకుండా చూస్తున్నట్టనిపించింది.

రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాక రాధా, గోపీ రాలేదేమిటని పదేపదే అడిగింది సంజన. పదినిముషాల తర్వాత చాలా సాధారణమైన డ్రస్ ల్లో వచ్చారు వాళ్ళిద్దరూ.

“ఇలా వచ్చారేమిటి? అడిగింది షర్మిల చెవిలో సంజన.

“ఇంట్లో గొడవలు సంజనా!” అంటే సీరీన్ నవ్వాడు. శంకర్ అవునంటూ తల ఊపాడు. ఇద్దర్నీ ‘విష్’ చేసింది. వాళ్ళిద్దరూ రిసీవ్ చేసుకోకుండా ఒకర్ని చూసి ఒకర్ నవ్వుకున్నారు.

పది గంటలు అయింది.

“ఇంకో రెండు నిముషాలు ఉంది ముహూర్తానికి!” అంది షర్మిల.

“కాబోయే దంపతులు ముందుకి రావాలి!” అన్నాడు అక్కడ కౌంటర్ లో ఉన్నాయన.

రిజిష్టార్ సీరీన్ చేత సంతకం పెట్టించాడు. సంజన వేపు చూసి నవ్వుతూ సంతకం చేశాడు.

“ఇప్పుడు పెళ్ళికూతురు ఇక్కడ సైన్ చేయాలి!” అన్నాడు అక్కడి గుమాస్తా.

చేయమని పెన్ అందించాడు సిరీన్. సంజన అర్ధం కానట్టు తత్సారం చేయడంతో –

“పెళ్ళికుమార్తె పేరు సంజన. మీరే కదూ? ఇదుగో ఇక్కడ సంతకం చేయాలి” అన్నాడు అర్ధం చేయిస్తూ. షర్మిలా, సిరీన్ నవ్వుతున్నారు.

“చెయ్యక్కా! ముహూర్తం దాటిపోకుండా!” అని వినిపిస్తే పక్కకి చూసింది.

తమ్ముడు రవి, పక్కన తమ తల్లి, తండ్రి కూడ ఉన్నారు.

ఆశ్చర్యపోతూ చుట్టూ చూసింది. అందరూ ‘హే!’ అని కేరింతలు కొడుతున్నారు.

తడబాటుతో సిగ్గుతో సంతకం చేయగానే సీరీన్ దగ్గరగా తీసుకున్నాడు. సంజనని ఆమె తల్లితండ్రులు అక్కున చేర్చుకుంటుంటే సీరీన్ అందంగా నవ్వాడు. గులాబీల దండలు మార్చేసుకోమని స్నేహితులంతా గొడవ పెట్టేస్తున్నారు.

“ఈ ఉంగరాలు కూడా మార్చేసుకుంటే అందరం హప్పి!” అని వినిపించి అటు చూసారందరూ! సీరీన్ తన తండ్రి రాజరత్నం! ని సంజన కి ఆమె మామగారుగా పరిచయం చేశాడు. సంజన పాదాభివందనం చేసింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఉంగరం తొడిగాక సీరీన్ సంజన ని దగ్గరగా లాక్కున్నాడు. అంత ఏడిపించినందుకు సంజన కొట్టబోయింది. దొరక్కుండా కవ్వించాడు సీరీన్.

“అక్కా! ఆ రోజు నువ్వు సంతకం పెట్టింది ఎవర్నో చదివించడం కోసం కాదు. మేరేజ్ రిజిస్టర్ చేయడానికి అప్లికేషన్!” అన్నాడు శంకర్.

పట్టలేని ఆనందం తో కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచింది. ఆమెనే చూస్తూ _

సీరీన్ సంజన చిటికెన వేలుని తన చిటికెన వేలు తో బంధించాడు. మహేంద్ర పెద్ద పూల బొకే తో వచ్చి అభినందనలు చెప్తుంటే కూడా ఆమె చెయ్యి విడువకుండా ‘థాంక్యూ’ అన్నాడు.

******

రాకీ వెళ్ళిన తర్వాత స్తుతి పూర్తిగా డిస్టర్బ్ అయింది. పరీక్షలకి ప్రిపేర్ కావడం ఎంతో కష్టంగా తోచింది. ఆ అమ్మాయి బాధ రోజు రోజుకి పెరుగుతోంది. రాకీ కూడా స్వామినాయుడు తో సరదాగా ఉండలేకపోయాడు. ఒకప్పుడు స్వామినాయుడు జోక్ వేస్తే చాలు పగలబడి నవ్వుతూ ఈలలు, దరువులు వేసేవాడు. ఇప్పుడు వేటికి మనసు స్పందించడం లేదు. అక్కడ ఉండలేకపోతున్నాడు కూడా! స్తుతి బాగా గుర్తొస్తోంది. ఇంకో పదిహేను రోజులు గడిచాక అతడికో విషయం బాగా అర్ధం అయిపోయింది. తనకి డబ్బు కంటే స్తుతి అంటేనే ‘ప్రేమ!’ అని, స్తుతి ముందు ఏదీ ఎక్కువ కాదు అని!

ఆ ఆదివారం మీటింగ్ లో సీరీన్, సంజన ల పెళ్లి సందర్భంగా స్వీట్లు పంచబడ్డాయి. అప్పుడు స్తుతి మూడ్ ని గమనించిన లావణ్య ఆమె ఫ్లాట్ కి వెళ్ళి సరదాగా ఒక పూట అంతా గడిపింది. మూడ్ బాగా లేనందుకు వచ్చానని... బాగా చదువుకోమని చెప్పి వెళ్ళిపోయింది.

లావణ్య తో తాను నవ్వుతూనే ఉన్నా ఆ నవ్వు నవ్వు కాదనిపించింది. తన నవ్వు రాకీ తో ముడిపడి ఉందని అనిపించి కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఎవరో బెల్ కొట్టారు. ఉన్న చోటునుంచి లేచి తియ్యాలనిపించలేదు. మరో రెండు సార్లు అదే పనిగా మోగితే వెళ్ళి తలుపు తీసింది.

ఎదురుగా సూట్కేస్ లతో రాకీ!!

కన్నీళ్ళతో తన వైపు చూస్తున్న స్తుతిని చూసి ఒక్కసారిగా హత్తుకుపోయాడు. వెక్కివెక్కి ఏడ్చింది స్తుతి.

“మనం సెటిల్ అవగానే పెళ్ళి చేసుకుందాం!” అన్నాడు రాకీ. మౌనంగా మరింత పెనవేసుకుపోయింది.

మాటలకి ఇంక అక్కడ పని లేదు. ప్రశ్నలు ఉదయించవు. ఒకరిలో ఒకరు భాగంగా, ఒకరి చెయ్యి ఒకరి చేతి లో ఉందిప్పుడు.

ప్రేమని తెలుసుకున్నప్పుడు అది వారే కదా!

నెలరోజులు గడిచాయి. కేంపస్ సెలక్షన్స్ కోసం ఎదురుచూపు రాకీ, స్తుతిలది. వాసంతికి విడాకులు మంజూరు అయినందుకు ఆ కుటుంబం ఊపిరి తీసుకుంటోంది. కవితా పరిస్థితి ఏ మాత్రం చక్కబడలేదు. దేని పట్ల ఆసక్తి లేని ఆమెని వేధిస్తున్నది ఒంటరితనం.

ఆ అపార్ట్మెంట్ లో ఒక్కొక్కరూ ఒక్కో అనుభవాన్ని చవి చూస్తున్నారు. ఎక్కడెక్కడి వారో దెబ్బతిని అక్కడికి చేరుతున్నారు. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికితే మరికొన్నిటికి కాలం జవాబు చెప్తుంది.

జీవితం ప్రవాహంలా సాగుతోంది!!!!

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in April 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!