Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

ఇప్పుడు నాలుగో ఫ్లోర్ లో రాకీ, స్తుతి ల ఫ్లాట్!

రాకీ ఈలపాట పాడుకుంటూ డైనింగ్ టేబుల్ మీదకి ఎక్కి కాళ్లతో దరువు వేస్తున్నాడు. ఎలాగో నిక్కుతూ, నీల్గుతూ థర్డ్ ఇయర్ లోకి వచ్చాడు తాను. వీకెండ్ లో ఎక్కడికీ ఎగిరిపోకుండా పరీక్షల గొడవలు. కింద సెల్లార్ లో లక్ష్మణ్ కి రిథమ్ లేని ఆ దరువుకి చిర్రెత్తుకొస్తోంది.

“ఛీ! ఈడినైనా ఎసెయ్యాలి. లేదా నేనైనా గుండు గొరిగించుకోవాలి. ఎదవ. ఏధవనీ! ఏం పాట  అది? దానికో లయ ఏడవద్దూ?” అన్నాడు మహేంద్రతో. నవ్వుకుంటూ కారు ఓపెన్ చేశాడు మహేంద్ర.

స్తుతి చాలా శ్రద్దగా వంట చేసిందారోజు. సువాసనలతో, ఘుమఘుమలతో ఇల్లంతా నిండిపోయింది. పన్నెండున్నర దాటుతుండగా పదార్ధాలన్నీ డైనింగ్ టేబుల్ మీదకి వచ్చాయి. రాకీని క్రీగంట చూసి,

“పోన్లే! వీడికి కూడా పెడదాం!” అనుకుంది. ఒకర్నొకరు చూసుకున్నారు.

‘ఛీ! దొంగవెధవ!’ అనుకుంది స్తుతి. “ధూ! పింజారి మొహం!” అనుకున్నాడు రాకీ. కంచం టంగుమంటూ మోత మోగిస్తూ పెట్టి అన్నం భోజనం వడ్డించింది. గబగబా కలపబోతూ చెయ్యంతా కంచంలో పెట్టి పిసికాడు. పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని నోటినిండా పెట్టుకుని ‘పచక్,పచక్’ మంటూ ఘోరమైన చప్పుడు చేసుకుంటూ నమలడం ప్రారంభించాడు.

“టేబుల్ మానర్స్ ప్లీజ్!” అంది స్తుతి.

“ఎందదీ?” గబ గబా గుటుక్కుమని మింగేసి అడిగాడు. రాకీ కి గొప్ప వేళాకోళంగా అనిపించింది.

“చప్పుడు చేయకుండా తినాలి. మాటి మాటికి చెత్త సౌండ్లు చెయ్యకుండా నిశ్శబ్దంగా నమిలి తినడాన్ని, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉండడాన్ని’టేబుల్ మేనర్స్’ అంటారు గట్టిగా, కసిగా చెప్పింది. నాలుక చివర్ని దవడలోకి తోసి బుగ్గని బూరిలా చేసి తల ఊపాడు. తిన్న వెంటనే ‘బ్రేవ్, బ్రేవ్! మని త్రేన్చాడు.

“సారీ!  త్రేన్పు సౌండ్ బయిటికి రాకుండా ఉండాలంటే ఏదైనా కిటుకుందా?” అని కొంటెగా అడిగాడు.

“నీకు చెప్పాను చూడు. నాదీ బుద్ది తక్కువ!” అంది.

ఆమె పెరుగన్నం లోకి వచ్చాక కిచెన్ లోకి వెళ్ళి ఆమెకిష్టమైన చిప్స్ తెచ్చి ఇచ్చాడు.

స్తుతి చాలా ఆనందంగా తన మీదున్న “కేర్’ కి ఇంప్రెస్ అయింది. చిప్స్ తింటూ చప్పుడయితే రాకీ వైపు చూసింది. అప్పుడే టి.వి పెట్టేసుకుని ఎప్పుడో అయిపోయిన క్రికెట్ మ్యాచ్ ని శ్రద్దగా చూస్తూ కిసుక్కుమన్నాడు. ఉడుక్కుంటూ రాకీ వైపు చూసింది.

ఆ అబ్బాయికి ఆటల పిచ్చి. అసలు మగపిల్లలకే ఆటల పిచ్చి. ఆ ధ్యాసలో సరిగా చదువుకోక ఓ చిన్న ఉద్యోగం తో సద్దుకుంటూ.. . జీవితాంతం బాధపడుతూ...బతికేస్తున్నారు.

అందుకే పెద్దలు అంటారు. చదువుకోవాల్సిన వయసులో దృష్టి చదువు మీదే  పెట్టాలి అని. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయ్. ఈ ఒక్క సంవత్సరం గడిస్తే ‘కేంపస్ సెలెక్షన్స్’ లో తమ తమ జాతకాలు, అదృష్టాలు తమ ముందుంటాయ్!”అనుకుంది స్తుతి.

రాహుల్ సాయంత్రం దాకా గుర్రు పెట్టి నిద్రపోయాడు. అయిదు అవుతుండగా నిద్రమొహంతోనే ‘బేట్’ పట్టుకుని ఊరిమీద కెళ్తుంటే అడ్డుకుని పుస్తకాలు చూపించింది.

‘ఇదెవత్తి నాకు చెప్పడానికి?” అని నిర్లక్ష్యంగా అనుకోబోయి అనుకున్న పర్సెంటేజ్ రాకపోతే అడుక్కు తిన్నాల్సి వస్తుందని ‘బేట్’ ని మూలగా పెట్టి మొహం కడుక్కుని చదవడం మొదలుపెట్టాడు.

చదువులో మునిగాక రాకీకి లోకం తెలియదు. చాలా త్వరగా సబ్జెక్టు అర్ధం అవుతుంది. అయిదున్నరకి స్తుతి రాకీ పక్కన ‘టీ ‘పెట్టి వెళ్ళిపోయింది. ఆ అల్లం టీ తాగుతూ రిలాక్స్ అయి, ఏడయ్యాక లేచి, కిచెన్ లో కూర కట్ చేసి, చపాతీ పిండి కలిపి పెట్టి మళ్ళీ చదువులో మునిగిపోయాడు. ఎనిమిదిన్నర కి కూర్మా, చపాతీలు అందించి తానూ చదువులో మునిగిపోయింది స్తుతి. అలా చదువు వల్ల వాళ్ళిద్దరూ గొడవలు లేకుండా కొంతకాలం గడిపే ఛాన్స్ వచ్చింది.

******

పరీక్షలు అయిపోయాయి. ఇంట్లో ఉన్నంతసేపూ గట్టిగా పాటలు పాడతాడు రాకీ. లక్ష్మణ్ కి చిరాకెత్తిపోతుంటే రాకీకి సరదా! లేటెస్ట్ సినిమా పాటల్ని ఘోరాతిఘోరంగా పాడుతూ మధ్య మధ్యలో ఆహా!ఓహో! దడ దడదడ... జూమ్ జూమ్ జూమ్మూ.. . టకటకటకా అంటూ నోటితో మ్యూజిక్ కొడతాడు.

“ఏం దయ్యో! రాగం మారిపోలా?”అని లక్ష్మణ్ సెల్లార్ నుంచి అరుపు.

“ఛీ! పాడుకోనివ్వడు!” అని అరుస్తూ నేల మీద తంతూ చిందులేస్తాడు రాకీ!

నవ్వొచ్చేస్తోంది స్తుతికి. రాకీ తో కబుర్లు చెప్పుకోవాలనీ, నవ్వుకోవాలనీ ఉంటుంది. ఒకప్పుడు తామిద్దరం ఎంత సరదాగా రోజుల్ని...క్షణాల్లా గడిపేసేవారు. ఇప్పుడెందుకో బాగా మారాడు.

తనకి వచ్చిన ఉత్తరం చదివాడా? అని పక్క సందేహం. అయి ఉండదు.

తన దగ్గర.. . తన పక్కన కూర్చుని మురిపెంగ ముద్దులాడుతూ మాట్లాడే రాకీ కి, ఇప్పుడున్న రాకీకి పొలికే లేదు.

“ఎక్కడికెళ్తున్నావ్?” ఆ సాయంత్రం డ్రస్ చేసుకున్న రాకీని అడిగింది. ఆ అమ్మాయి గొంతులో ఒక అధికారం, హక్కు ధ్వనించాయి. అది కనిపెట్టాడు రాకీ.

“ఎందుకు?” అడిగాడు. తడబడింది ఆన్సర్ చెప్పడానికి.

“నా ఇష్టం. నీకు చెప్పి వెళ్ళాలా?” అన్నాడు బూటు లేసు బిగిస్తూ.

“పొగరు” అంది దురుసుగా.

“ఓయ్! నోరు అదుపులో పెట్టుకో. నాకూ వచ్చు అంతకంటే వరస్ట్ లేంగ్వేజ్!” వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దు:ఖం వచ్చేసింది స్తుతికి.

******

“కాలేజీ మొదలవడానికి ఇంకా నాలుగు రోజులు టైమ్ ఉంది. రాకీ గదిలోకి వెళ్ళింది స్తుతి.

“రాకీ! నీతో మాట్లాడాలి!” అంది. తలెత్తాడు చెప్పమని.

“ఎందుకిలా మారిపోయావ్?”

“నీకొచ్చిన లెటర్స్ చదివాను. సారీ!  అన్నాడు.

“నేనూ నీకొచ్చిన లెటర్స్ చదివాను!” అంది చివ్వున తలెత్తాడు.

“సరే! అర్ధమయిందిగా నా పరిస్థితి?” అడిగాడు.

“రాకీ! ఇక ఇంతేనా?” అంది.

“సరే! ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. నువ్వు కూడా డబ్బున్నవాడిని చేసుకుందామనేగా నాతో స్నేహం చేసింది?” అడిగాడు.

“కానీ.. . సందేహంగా ఆగింది.

“చూడూ! మనిద్దరం పై పై మెరుగులు చూసి ఒకరినొకరు డబ్బున్నవాళ్ళని అనుకున్నాం. ఇప్పుడు కాదని తెలిసాక ఈ ముసుగులు దేనికి?” అడిగాడు సూటిగా.

స్తుతి తల దించుకుని నేల వైపు చూస్తూ –

“రాకీ! నువ్వంటే నాకు చాలా ఇష్టం!” చెప్పింది స్తుతి.

“యా! నువ్వన్నా నాకంతకన్నా ఇష్టం. కానీ మనిద్దరం ఎప్పటికీ గుడ్ ఫ్రెండ్స్ గా ఉందాం కానీ ప్రేమనే సెంటిమెంట్లు మాత్రం నాకొద్దు. ఆకలేస్తే అన్నం తింటామ్. నిద్రొస్తే సౌఖ్యంగా ఉండే పక్క వెతుక్కుంటాం. అలాగే జీవితం లో హాయిగా, దర్జాగా బతకాలంటే ‘డబ్బు’ ఒక్కటే సాధనం!” అన్నాడు.

“రాకీ! కొంచెం ఆలోచించు... మనిద్దరికీ మంచి ఉద్యోగాలే రావచ్చు!”అంది స్తుతి.

“టాస్ లు నాకొద్దు తల్లీ! నాకు ‘డబ్బు’ అంటేనే ప్రేమ, ప్రీతి. క్రేజ్ తో కూడుకున్న ఎట్రాక్షన్! డబ్బు ఉంటే కొండమీద కోతయినా దిగి వస్తుంది. మనం ‘డబ్బనే’ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాలంటే “ప్రేమ” అనే ఇమోషన్ ని తరిమికొట్టి ఎలాగైనా డబ్బున్న వారినే పెళ్ళాడాలి.

చిన్న ఉదాహరణ చెప్తా విను. నువ్వు స్కూటీ పక్కన నుంచో! అది లేకుండా విడిగా ఒక్కదానివి నిలబడి చూడు, వెల వెల బొతావ్! అదే స్కూటీ ఉంటే... నీకు కూడా విలువ వస్తుంది. ఇక మీదట మనిద్దరం జీవితాన్ని అర్ధం చేసుకుంటూ ముందుకి సాగుదాం. నీకిష్టమయితే మనిద్దరం ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేవరకు కలిసి ఉందాం. లేదంటే ఏం చెయ్యాలో ఆలోచించు!” నిష్కర్షగా చెప్పేసి ‘బేట్’ అందుకుని వెళ్ళిపోయాడు.

ఆ మాటలకు స్తుతి మనసు గాయపడింది. పట్టుదలతో చదివి మంచి ఉద్యోగం లభిస్తే రాకీ మారుతాడన్న ఊహతో దీక్షగా పుస్తకాల ముందు కూర్చుంది.

కాలేజీ మొదలయింది. ఇంటి పనుల్లో రాకీ షేర్ చేసుకోకపోయినా పట్టించుకోవడం మానేసింది స్తుతి. అతి త్వరగా పనులు ముగించుకుని ఏకాగ్రతతో చదవడం మొదలెట్టింది. అది చూసి రాకీ కూడా చదువులో పడిపోయాడు. ఒక పక్క ఫైనల్ ఇయర్ పరీక్షలు! ఇంకోపక్క కెంపస్ సెలక్షన్స్!

******

హైదరాబాదు!!

సిగ్నల్ పడితే రఘు వీర్ కారు ’స్లో’ చేసి ఆపాడు. ఆ రోజే ఒక బిజినెస్ మీటింగ్ ఉంటే వైజాగ్ నుంచి హైద్రాబాద్ వచ్చాడు అతను. రఘువీర్ రాక రకాల బిజినెస్ లు చేస్తూ డబ్బు బాగానే వెనకేసుకొచ్చాడు. ఆ రోజు పొద్దున్న పది గంటలకి జరగాల్సిన మీటింగ్ మధ్యాహ్నం రెండు గంటలకి పోస్ట్ పోన్ అవడంతో ఒక బిజినెస్ పార్టనర్ ని కలవడానికి వెళ్తున్నాడు. ఎందుకో యధాలాపంగా కుడి వైపు చూశాడు. ఒక లిక్కర్ షాప్ దగ్గర ఒక పిల్ల గొడవ పడుతోంది. సుమారు ఇరవై ఏళ్ళు ఉండొచ్చు. బ్లూ జీన్స్, స్లీవ్లెస్ శాటీన్ షార్ట్,,బాబ్.

బాగ్ లో నుంచి ఒక బాటిల్ తీసి చూపిస్తూ ఏదో అంటోంది. షాప్ లో కుర్రాడు కూడా ఏదో తీవ్రంగా చెప్తున్నాడు. చేత్తో వాడి వాగ్ధాటిని ఆపి, హాండ్ బాగ్ జిప్ సర్రున లాగి డబ్బు తీసి విసురుగా వాడి చేతిలో పెట్టింది. పక్కనే పార్క్ చేసి ఉన్న టూ వీలర్ ని స్టార్ట్ చేయబోతే అది మొరాయించింది. తలెత్తి చుట్టూ చూస్తున్న ఆ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు రఘువీర్. హేమ! ఖచ్చితంగా హేమే! మైగాడ్! లిక్కర్ షాప్ లో? నో డౌట్! హేమే! పక్కనే ఉన్న మెడికల్ షాప్ లో వారితో మాట్లాడి ఆ షాప్ వారగా తన స్కూటర్ని అవలీలగా లాకొచ్చి పెట్టేసింది. అతనికి కొంత డబ్బు ఇచ్చింది.

కారుని రోడ్డు వారగా పార్క్ చేసి వడి వడి గా ఆమెని సమీపించాడు రఘువీర్.

“హేమూ!” పిలిచాడు. పిలుపు వినిపించిన వైపు చూసి కళ్ళు మరింత పెద్దవి చేసి టక్కున తల తిప్పేసింది.

“నిన్నే!” దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. విదిలించి కొట్టి –

“పోరా!” అంది.

“పోతాగానీ రోడ్డు మీద గొడవచెయ్యకు. ప్లీజ్ నాతో రా!” అన్నాడు.

“రోడ్డు మీద.. . గొడవ? వా! వా! భలే భలే! ఇంతకు ముందెన్నడూ ఎరగనట్టు పోరాపో! నీతో నాకేంటి పని?” అంది.

రఘు వీర్ ఇంక సందేహించదలచుకోలేదు. చెయ్యి పట్టుకుని లాగుతూ వచ్చెయ్యమని బతిమాలాడు. విదిలించి కొడుతోందామె!

ఇదంతా మెడికల్ షాప్ దగ్గర్నుంచి చూస్తున్న మహేంద్ర ముందుకొచ్చి-

“ఏంటండీ? ఏమయింది?” అని గదమాయించి అడిగాడు. మహేంద్ర కూడా ఒక కేంప్ కి వచ్చాడు.

“అద్దీ! అలా పెట్టండి గడ్డి!” అందాపిల్ల. దగ్గర దగ్గర యాభై ఎనిమిది సంవత్సరాలు రఘువీర్ కి. సిగ్గుపడుతున్నట్టు నవ్వి-

“షి ఈజ్ మై డాటర్!” అని తల వంచుకున్నాడు.

“చూసారా! ఎంత సిగ్గో? రోడ్డు మీద గొడవ లొద్దంట. మా అమ్మని నడిరోడ్డు మీద ఒంటి మీద తెలివిలేకుండా పూటుగా తాగి తన్ని, తన్ని తరిమాడు” బాగా డోస్ వేసినట్టుంది.. మాటలు తడబడుతున్నాయ్. పడి పోబోతుంటే టక్కున పట్టుకున్నాడు. రఘువీర్ ని సాయం పట్టమని కారు వెనక సీట్లో పడుకోబెట్టి పట్టుకుని పోనివ్వమన్నాడు. కారు హోటల్ “తాజ్ కృష్ణా“ దగ్గర ఆగింది. రూమ్ లొ హేమని పడుకోబెట్టాక, రాత్రి తప్పక వచ్చి కలుస్తానని, వైజాగ్ నుంచి ఒక మీటింగ్ కోసం వచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు మహేంద్ర.

‘అతనెవరో గానీ సమయానికి తనని ఆదుకున్నాడు!’ అనుకున్నాడు.

రఘువీర్ కూతురి మొహం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏంచేశాడు తను?

ఇంత బాధ్యతా రాహిత్యంగా శశికళ ఉండదే? పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోనంత బిజీనా? కోపంతో అట్టుడికి పోయాడు. దిగులు కమ్మేసింది. తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఇప్పుడేమి చేయడం?

మధ్యాహ్నం ఒంటిగంటకి వచ్చాడు మహేంద్ర. రఘువీర్ చెప్పిన దంతా విన్నాడు. హేమ కొద్దిగా కదిలింది. అటే చూస్తూ

“రఘువీర్ గారూ ఏది ఏమైనా మీ ఇద్దరి వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. చూస్తున్నారుగా హేమ పరిస్థితి. ఇకనైనా మేల్కొండి!” అన్నాడు మహేంద్ర.

“తప్పకుండా. ఇంక మేము నలుగురమూ కలిసి ఉంటాము. పిల్లల క్షేమం కోసం అయినా నా భార్య శశి నన్ను క్షమిస్తుంది!” అని తన నిర్ణయాన్ని చెప్పాడు రఘువీర్.

“అక్కడ శశికళ గారి పరిస్థితి తెలుసా మీకు?” అడిగాడు మహేంద్ర.

“శశి మీకు తెలుసా?” ఆశ్చర్య పోతూ అడిగాడు.

ఆతృతగా మహేంద్ర చెయ్యి పట్టుకున్నాడు రఘువీర్.

“ఒకే ఊళ్ళో ఉంటూ కూడా ఆమె గురించి తెలియదన్నమాట! నిర్ధాక్షిణ్యంగా వదిలి వెయ్యడమే కాకుండా, ఆమె ఏం చేస్తున్నారో... ఎక్కడ ఉన్నారో కూడా మీకు పట్టలేదన్నమాట!” అన్నాడు మహేంద్ర.

తల వంచుకున్నరఘువీర్ జరిగినదంతా తెలుసుకున్నాడు. కొంతసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఆ తరువాత ఒక్కసారిగా పశ్చాత్తాపంతో వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపుకి మెలుకువ వచ్చిన హేమ తండ్రిని చూస్తూ ఉండిపోయింది. సాయంత్రం అందరం కలిసి వెళ్తున్నామని చెప్పాడు మహేంద్ర.

హేమ తాను తల్లి దగ్గరికి చస్తే రానని మొండికేసింది. ఆమె ప్రవర్తన మంచి కాదంది. అంతలోనే- ‘పాపం! అంతకంటే ఏం చేస్తుంది?” అని ఏడ్చింది.

మహేంద్ర ఎన్నో విధాలా నచ్చజెప్పాడు. ‘నో’ అంటూ బాగ్ లోని బాటిల్ తీసి గడగడా తాగేసింది. బాటిల్ లాక్కుని డస్ట్ బిన్ లొ పడేస్తూ –

‘క్షమించరా హేమూ! ఇంకెప్పుడూ ఇలా జరగదు!” అని ఏడ్చేస్తున్న తండ్రిని ఆశ్చర్యంగా చూస్తూ అలాగే వచ్చి కార్లో కూర్చుని కొద్ది నిముషాల్లోనే నిద్రపోయింది. మెడికల్ షాప్ ముందు ఆగిన కారు హేమ చక్కని స్కూటీని సహితం తీసుకుపోతోంది. వెనక సీట్లో రఘువీర్ కూతుర్ని తన భుజం మీద పడుకోబెట్టుకుని చెంపల్ని నిమిరాడు. ముందు కూర్చున్న మహేంద్ర  చిరునవ్వుతో ఉన్నాడు.

*****

శశికళ ఫోన్ మోగుతోంది. రఘు వీర్ గొంతు వినగానే టక్కున సెల్ గొంతు నొక్కి పారేసి లాయర్ కి కాల్ చేసింది. తనెక్కడుందో లాయరే చెప్పి ఉంటుందని తిట్టిపోసింది. మళ్ళీ రింగ్ అయింది ఫోన్. ఈ సారి మహేంద్ర.

“మీరు పరిచయం చేసిన లాయర్ స్వరజిత ఏదో పనుందని వెళ్ళిపోతూ మీరొస్తే ఒక కవర్ ఇమ్మన్నారు, ఎప్పుడొస్తున్నారు మీరు?” అడిగింది.

“శశికళ గారూ! నేను చెప్పేది గాభరా పడకుండా జాగ్రత్తగా వినండి. అంతా మామూలే. మీ హేమ కి ఏక్సిడెంట్ అయింది. ‘కేర్’ హాస్పిటల్ కి వచ్చేయ్యండి. కంగారు పడవద్దు!’ అన్నాడు.

ఒక్కసారిగా మ్రాన్పడిపోయింది శశికళ! అప్పుడే వచ్చిన మనోహర్ ని చూసి బావురుమంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.

హేమ కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్పాడు డాక్టర్. అపస్మారక స్థితిలో అచేతనంగా పడి ఉన్న హేమ ని చూసి శశికళ తల్లడిల్లిపోయింది. ఒక పక్క రఘువీర్ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. రఘువీర్ ఫోన్ చేయగానే అక్కలు, అతని తండ్రి పరుగు పరుగున వచ్చి శశికళ ని అక్కున చేర్చుకోగానే దు:ఖం కట్టలు తెచ్చుకుని పొంగుకు వచ్చింది. తన వారంతా హేమ కోసం రావడం ఆమెకి అండదండగా ఉంది.

మహేంద్ర రఘువీర్ తండ్రికి ఏక్సిడెంట్ ఎలా అయిందో వివరిస్తున్నాడు. విని తట్టుకోలేకపోతున్న శశికళ భోరుమని ఏడుస్తూనే ఉంది.

ఆ సాయంత్రం ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేవరకు రఘువీర్ డాక్టర్ ఏం చెప్తే అది చేశాడు. డబ్బుని మంచి నీటిలా ఖర్చు చేశాడు. ఏం తెమ్మంటే అది పరుగు పరుగున తెచ్చాడు. బ్లడ్ అవసరమైనప్పుడు మనోహర్, మహేంద్ర ముందుకొచ్చినా రఘువీర్ బ్లడ్ మాచ్ అవడంతో ఆనందం తో ఏడుస్తూ ఇచ్చాడతను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు.

హైదరాబాదు లొ తాగుబోతుగా, ఇక్కడ అచేతనంగా పడి ఉన్న కూతుర్ని చూస్తూ సంపాదన మీద వ్యామోహంతో, స్త్రీ పట్ల చులకన భావంతో జరిగిన ఈ నష్టానికి పూర్తిగా తానే బాధ్యుడు. కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని గాలికి వదిలేస్తే ఎలాంటి స్థితి లోకి నెట్ట బడతారో తను కళ్ళారా చూస్తూనే ఉన్నాడు.

అక్కడే ఉన్న ఒక బెంచి మీద కూర్చున్న మనోహర్ ఆలోచనలు, ఇప్పటి పరిస్థితి భరింపరానివిగా ఉన్నాయి. శశి వైపు చూశాడు ఆమె రఘువీర్ అక్కతో ఆప్యాయంగా మాట్లాడుతూ కన్నీళ్ళు తుడుచుకుంటోంది. రఘువీర్ శశికళ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతున్నాడు. మనోహర్ కి మహాలక్ష్మి గుర్తుకి వచ్చింది.

ఎందుకో శశికళ మనోహర్ వైపు చూసింది. ఆమె వైపు ఆప్యాయంగా, ప్రేమగా చూసి వెళ్ళి వస్తానని వీడ్కోలు పలికాడు. అతడి మనసు చదివిన శశికళ కన్నీళ్ళతో కృతజ్జ్ఞతలు తెలిపింది.

తాను చేసిన పొరపాటు బాగా తెలిసివచ్చిందామెకి. ఎదిగి వచ్చిన పిల్లల మీద తన ప్రవర్తన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, పిల్లలు ఎంత అలజడికి గురయి దారి తప్పుతారో తన జీవితమే తనకి గుణ పాఠం!!

హేమ కళ్ళు తెరిచాక తన పక్కనే ఉన్న తల్లి తండ్రుల్ని చూస్తూ చెయ్యిని చాపింది. ఆ చేతి మీద చెయ్యి వేసి ఒక్కసారిగా ఏడ్చేసింది శశికళ. రఘువీర్ ఆమె ముందు తల వంచుకుని నిలబడ్డాడు. తల్లి చెయ్యిని తండ్రి చేతితో కలిపింది హేమ!!

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in March 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!