
బడ్డీ ఎన్ క్లేవ్ లో నాలుగో ఫ్లోర్!!
తెలతెలవారుతోంది. ఇల్లంతా నిశ్శబ్దం గా ఉంది. రాహుల్ బాల్కనీ లో కూర్చుని ఆలోచనలో పడ్డాడు. సీత గుర్తొచ్చింది చప్పున. ఎప్పుడూ అంతే! ఏదో కొంపలు మునిగిపోయినట్టు చెవుల్లో ఆ మువ్వల చప్పుడు, కిలకిల నవ్వులు. అమ్మ ఏం చేస్తోందో కదా?
‘దీపాలి’ కేంప్ కి వెళ్ళి పదిరోజులయింది. ఈ రోజు ఫ్రెండ్స్ తో కార్లో వచ్చేస్తున్నానని క్రితం రోజు రాత్రి చెప్పింది.
బాల్కనీ లోనుంచి తొంగి చూశాడు.
లక్ష్మణ్ మొక్కలకి నీళ్ళు పోస్తున్నాడు. మహేంద్ర మొక్కల్లో ఎండుటాకుల్ని ఏరి పారేస్తున్నాడు. వీళ్ళిద్దరికీ ఈ దోస్తీ ఏమిటో? రోజూ పువ్వులేరే ఆ సుందరి పేరేంటో!’ అనుకున్నాడు వాసంతి ని చూస్తూ. ఇంతలో తలుపు ధడాల్ మని తెరుచుకున్న చప్పుడు. డ్రస్ మీద మువ్వలు గిల్ గిల్ చప్పుడు. చమ్కీల అందాలు. గలగల కబుర్లు! దీపాలి అలా ఎంట్రన్స్ ఇచ్చింది. వచ్చీరావడంతోనే-
“రాహుల్! వన్ గుడ్ న్యూస్ యార్! మోహిత్ కి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందట!” అంది. ఆమె కళ్ళు మిలమిల లాడుతున్నాయి.
“చెప్పాను గుర్తుందా? గొప్ప గజల్ గాయకుడు. అతడి గజల్ వింటేనే మనందరం ఫిదా!” అంది.
“నాకు మొదట తెలియదు అతడు మాకు బంధువు అవుతాడని. మన కంపెనీ లోనే అతడు వర్క్ చేసేది. నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఇంతకీ నువ్ నన్ను మిస్ అయ్యావా? లేదా? అడిగింది కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఆ కళ్ళల్లో మెరుపుల్ని చూస్తూ అపార్ధం చేసుకోలేకపోయాడు రాహుల్.
మోహిత్ జాయిన్ అయిన కొద్ది రోజులకి డిన్నర్ కి పిలుద్దాం అంది దీపాలి.
చాలా అందంగా, ప్రత్యేకంగా తయారయింది.
‘ఇంత అందం తన సొంతం!” అనుకున్నాడు రాహుల్.
మోహిత్ ఇంట్లో అడుగుపెట్టగానే ఆదరంగా చేతులు చాస్తూ ఎదురెళ్ళి హగ్ ఇచ్చింది. ఆ హగ్ ని కొన్ని క్షణాల పాటు ఉంచి లోపలికి వచ్చాడు మోహిత్!
ఆమె ఎత్తైన బ్రస్ట్ అతని గుండెల్ని బలంగా తాకింది. ఆ హగ్ చాలా కామన్ గా జరిగినట్టు జరిగినా ఇద్దరూ నటిస్తున్నారనిపించింది రాహుల్ కి. రాహుల్ ని కూడా వెంటనే దగ్గరకు తీసుకుని వదిలాడు మోహిత్. డిన్నర్ చాలా ఆర్భాటంగా ఆర్డర్ చేసింది దీపాలి. బోలెడన్ని అయిటమ్స్. తింటున్నంత సేపూ చిన్న చిన్న గజల్ పల్లవిలతో ఆమెను పొగుడుతూనే ఉన్నాడు మోహిత్. రాత్రి పన్నెండు వరకు ఎడతెగని ప్రశంసల పల్లవులతో గడిపి చివరికి ‘బై’ చెప్పాడు మోహిత్.
‘దీపాలి ఆ రోజు తన ఒంటితో పండగ చేసింది రాహుల్ కి. అనవసరంగా అనుమాన పడ్డానేమో అని బాధపడుతూ ‘దీపాలి‘ ని మరింతగా పెనవేసుకుపోయాడు. ఆ మర్నాడు మోహిత్ స్నేహితుడు ధనరాజ్ ఇచ్చే పార్టీ అంటూ బయిటికి లాక్కుపోయారు రాహుల్, దీపాలి లని. రాహుల్ మొహం లో చిరాకు ని గమనించిన ధనరాజ్-
“అరెయార్! ఇది ఇప్పటి కల్చర్. ఇప్పటి జనరేషన్ కి ‘కేజువల్ డేస్’ అంటూ ఉండవు. అన్నీ పండగ రోజులే. నెమ్మదిగా, కూల్ గా కూర్చోవడం వాళ్ళ వల్ల కాదు. మాటల్తో, పాటల్తో హోరెత్తిపోతూ ఉండాలి.
“ఇంక హగ్ లు, పబ్ లు, క్లబ్ లు కామన్. ఎంజాయ్!” అన్నాడు.
“అయితే నాదో డౌట్!” అన్నాడు రాహుల్.
‘ఈ ధనరాజ్ దగ్గర ఎన్ని డౌట్ లు ఉన్నా క్లియర్ చేసుకోవొచ్చు!’ అన్నాడు దర్పంగా.
“మరేం లేదు మీరు చెప్పే కల్చర్ మన భారత దేశానికి విరుద్దం కదా? ఇది ఉష్ణ దేశం. ఇక్కడ కూడ శరీర రక్షణ కోసం తాగాలంటారా? నేనేం ఉపన్యాసాలు ఇవ్వను గానీ ఇదే నిజంగా మీరు చెప్పే కల్చర్ అంటారా?”
ధనరాజ్ పకపకా నవ్వుతూనే ఉన్నాడు.
“ఎదగాలంటే కొన్ని అనుకరించాలి బాస్.. .అదీగాక ఇదో మజా! ఒక్కసారి మందు కొట్టి చూడు. జీవితం అంతా ఇక దానితోనే. ఎక్కడో పిచ్చోడిలా ఉన్నావే!” అన్నాడు.
ఒక్క మాట కూడా మాట్లాడలేదు రాహుల్. మాట్లాడేందుకు ఏముంది గనక!’ అనుకున్నాడు.
కొద్దిరోజుల్లోనే మళ్ళీ పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు మోహిత్.
లిక్కర్ పార్టీ లో పారడం ఇప్పటి ఫాషన్! ప్రతి వాళ్లు తాగి పేలడం ఇప్పటి కల్చర్!
మొన్న మొన్నటి వరకు దీపాలీ రాహుల్ కి ఇష్టం లేని పనులు చేయడానికి అస్సలు ఇష్టపడేది కాదు.
ఇప్పుడు మోహిత్ కొద్దిపాటి బలవంతం తోనే మొదటి పెగ్ వేసుకుంది. ఇంక ఆమె ఆగలేదు.
రాహుల్ కి ఆ వాసనే కాదు, పొగపీల్చడం కూడా ఇష్టం ఉండకపోగా అసహ్యం కూడా!
అతి కొద్ది రోజుల్లోనే ఇప్పటి అల్ట్రా మోడ్రన్ లేడీస్ లా తాగి డ్యూటి కి వెళ్ళడం, కంట్రోల్ తప్పటమనే ‘గొప్ప’ కి అలవాటు పడింది.
లేడీస్ తో షాపింగ్ కి వెళ్తున్నానని చెప్పి ఎవరో ఒకరింట్లో మందు కొట్టడం, రాహుల్ వెతికి తీసుకురావడం మొదలయింది.
ఒకరోజు ఎక్కడ వెతికినా దొరకలేదు. ఎందుకో చాలా అనుమానం వచ్చి మోహిత్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే మోహిత్ సాదరంగా ఆహ్వానించాడు. ఇంట్లోకి తీసుకువెళ్లి తన బెడ్ మీద పడుకుని ఉన్న దీపాలీ ని తట్టి లేపాడు. ఆమె కళ్ళు తెరిచాక-
“నువ్వే గెలిచావు దీపాలీ.. . ఇవిగో నీ గెలుపు నోట్లు!” అంటూ ఒక బొత్తిని అందించాడు.
“నాకొద్దు గానీ రాహుల్ కి నేనెంత ప్రాణం! నాకోసం వెతుక్కుంటూ వస్తాడని చెప్పానా?” పడీ పడీ అర్ధం లేని నవ్వు అసందర్భంగా నవ్వింది. రాహుల్ తమ రిలేషన్షిప్ గురించి చెప్పాడు క్లుప్తంగా. అందుకే ఆమెని కాపాడడం తన బాధ్యత అని కూడా అన్నాడు.
“ఓ...!” భుజాలెగరేశాడు మోహిత్.
“నేను ఫ్లాట్ షేరింగ్ అనుకున్నాను! గుడ్! వెరీ గుడ్!” అన్నాడు.
“కొన్నిరోజుల్లో పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటున్నాం!” అన్నాడు రాహుల్.
“ఓహ్! అయితే ఇదంతా ఫుల్ స్టాప్!” అన్నాడు మోహిత్.
దీపాలీ తలెత్తి ఇంకో నవ్వు నవ్వింది.
ఆమెను సాయం పట్టి కార్లో పెట్టుకుని ఇంటి దగ్గర లక్ష్మణ్ హెల్ప్ తో ఇంట్లోకి తీసుకొచ్చాడు. దీపాలీ వాగుడు కి లక్ష్మణ్ పొట్ట పట్టుకుని నవ్వాడు.
రాహుల్ మర్నాడు పొద్దున్నే చాలా కచ్చితంగా చెప్పాడు తాగుడు మానేయ్యాలని, త్వరలో తమ పెళ్ళి అని.
“సరే! ఈ విషయం గురించి నేను సీరియస్ గా ఆలోచిస్తా!” అంది. కొంచెం సీరియస్ నెస్ తగ్గగానే యధావిధిగా మోహిత్ వస్తూ, పోతూనే ఉన్నాడు. దీపాలీ కి అంతులేని బహుమతులు కురుస్తూనే ఉన్నాయి. చిరునవ్వుతో అందుకుని... పొంగిపోతూ రాహుల్ వైపు చూస్తోందామె!
ఆమె బట్టలు ఇదివరకటి కంటే ఇంకా చిన్నవయ్యాయి. షార్ట్ నిక్కర్, బ్రస్ట్ దగ్గర నాట్ పెట్టిన కుచ్చిళ్ళు, బొడ్డు దాకా వేళ్ళాడుతుంటే... స్లీవ్ లెస్ పొట్టి టీ షర్ట్ లో ఆమె సెక్సీ గా కనపడుతోంది.
ఒకప్పుడు ఆ అందం తనకే పరిమితం. ఇప్పుడు మోహిత్ కూడా తనివితీరా చూస్తున్నాడు. మోహిత్ తల్లి ఒక సెలెబ్రేటీ కూడ!
దీపాలీ ఫ్లాట్ కి ఒక సెలబ్రటి కొడుకు వస్తున్నాడని తెలిసి వీరాభిమానులు తరచుగా ఏదో ఒక వంకన వచ్చి పోతున్నారు. దీపాలీ, రాహుల్ ల ‘లవ్ అండ్ రిలేషన్ షిప్’ సీక్రెట్ ఏమి కాదు!
ఇప్పుడు దీపాలీ కి కూడా ఫాన్స్, ఫాలోవర్స్ పోటెత్తుతున్నారు. ఆ హడావిడికి, ఆ గోలకి చిరాకెత్తిపోతున్నాడు రాహుల్.
******
దీపాలి ఆ రోజు బాగా తాగి అల్లరి చేసి నిద్రపోయింది. పట్ట పగలు కదా? అపార్ట్మెంట్ అంతా భలే సరదాగా ఎంజాయ్ చేశారు. రాహుల్ చిన్నబోయిన మొహం తో ఆమె వైపే చూస్తుండగా -
సడన్ గా తల్లి గుర్తొచ్చింది.
“కన్నయ్యా! ఏమిటీ గోల?” అనేది తాను తోటి పిల్లల్తో చేసే అల్లరి భరించలేక. రాహుల్ కి తన ఊరు, తన ఇల్లు, తన గది,. స్నేహితులు, కిటికీ దగ్గ చదువుకునే టేబుల్, అక్కడినుంచి కనపడే అందమైన తోట, తోటలో మర్రి చెట్టుకి కట్టిన ఉయ్యాల, ఉయ్యాలలో ఊగుతున్న సీతా, ఆమె నెచ్చెలులు గుర్తొచ్చారు.
“రాహుల్ అంటే ఏంటే?” చెలుల ప్రశ్నల అల్లరి.
“రావణాసురుడు అని అర్ధం!” సీత పెంకి సమాధానం.
“అమ్మో! రాక్షసుడా?” ఆశ్చర్యం, తెచ్చిపెట్టుకున్న భయం.
“కాదు. మానవ పుత్రి మండోదరి మొగుడు!” సీత చిలిపి నవ్వు. అదంతా గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.
దీపాలీ నిద్రలో వెర్రిగా నవ్వుతోంది. ఆమెనలాగే వదిలి, కిందకొచ్చి కారుస్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
లక్ష్మణ్ మహేంద్ర కి ఇదంతా చేరవేశాడు.
దీపాలీ తో మాట్లాడడం మానేశాడు రాహుల్. మౌనంగా ఉంటే తన పద్దతి మార్చుకుంటుందేమోనని.
‘ఈమె కోసమా తను అందర్నీ వదిలేసి వచ్చింది? మొదటిసారిగా అటువంటి ఆలోచన వచ్చింది రాహుల్ కి.
దీపాలీ కి కొంత టైమ్ ఇచ్చి ఫ్రాంక్ గా మాట్లాడుకోవడమే సరి అయినదిగా అనిపించి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|