
కొత్తగా ‘శంకర్’ అనే కొత్త ఫ్రెండ్ తగిలాడు సిరీన్ కి. ఇద్దరూ త్వరత్వరగా జీగ్రీ దోస్తులయిపోవడం, ఒకర్నొకరు వదలకుండా తుమ్మ బంకలా అతుక్కుపోతూ తిరగడం చూసింది సంజన. ఇదంతా సరదాగానే ఉన్నా తనని లక్ష్యపెట్టకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. సంజన ఒంటరిగా ఫీల్ అవడం గమనించిన అతడు ఆమెని కూడా ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకోమని సలహా ఇవ్వడం చిర్రెత్తుకొచ్చింది. ఇంతకు ముందు ఎక్కడికెళ్తున్నాడో, ఎప్పుడొస్తాడో చెప్పేవాడు. ఇప్పుడు తనకోసం రైస్ పెట్టొద్దని మాత్రమే చెప్పి వెళ్తున్నాడు.
ఏది ఏమైనా సరే ఆ వీకెండ్ లో తన మనసులో ఏముందో బయటపెట్టాలని అనుకుంది సంజన. మాట్లాడాలని మెసేజ్ పెట్టింది. అంతే! కంపెనీ లో సీటు దగ్గరకొచ్చేసి ఊదరగొట్టి ఇంటికి లాక్కొచ్చేశాడు. ఎంతో ఉత్సాహంగా మాట్లాడబోతే తనకి ముందుగా ఒక మాట చెప్పే అవకాశం ఇమ్మని అడిగాడు. సరే అని తల ఊపగానే –
“ఏంటంటే ఈ వీకెండ్ కి నేను శంకర్ కి ఒక పని చేసి పెడతానని మాట ఇచ్చాను. నీకభ్యంతరం లేకపోతే నువ్వూ మాతో రావచ్చు. కాకపోతే పదిహేను మంది కోతుల్లాంటి అబ్బాయిలతో. నువ్వు నాకు అమ్మాయిలా అనిపించవు కాబట్టి మాతో రావచ్చు గానీ కొంత డిఫరెంట్ లెంగ్వేజ్ భరించాల్సి ఉంటుంది!” అన్నాడు.
“ఏంటీ!” అంది అసహనం గా.
“నువ్వు నాకు అమ్మాయిలా తోచవు!” అన్నాడు కొంటెగా. చేతిలో ఉన్న దువ్వెన్న విసిరేసింది. దాన్ని కేచ్ పట్టి పకపకా నవ్వాడు.
“నేను నెక్స్ట్ వీక్ అంతా నీతోనే ఉంటాను సంజనా... అప్పుడు హాయిగా కబుర్లు చెప్పుకుందాం!” అన్నాడు. ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఈ శంకర్ ఎక్కడ తగిలాడో? అతడూ, అతడి గేంగ్ రాకముందు సిరీన్ కి అంతా సంజనానే! చాలా సంతోషంగా గడిపిన రోజులవి. ఏడుపొచ్చినంత పనయింది. నిగ్రహించుకుంది. ఎప్పటికీ సమాధానం చెప్పని ఆమెని చూస్తూ –
“ఏంటి? వస్తావా? రావడం లేదా?” అడిగాడు సరదాగా. అప్పటికీ ఆమె మూడ్ మారలేదు.
“సరేగానీ ఆడపిల్లకు సిగ్గు అందమంటారు. నీకసలు సిగ్గే లేదు. ఏమనిపించదా? ఎలా ఇలా ఉంటావ్? ఇలా టీ షర్ట్ వేసుకుని.. . ఇలా...!” అని చిలిపిగా నవ్వాడు.
“సిరీన్!” పట్టుకోబోయింది. అందకుండా పరుగెడుతూ వెళ్ళిపోయాడు. వచ్చాక టి.వి. చూస్తూ ఉన్నాడే తప్ప ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదు.
తరువాతి వీకెండ్ ఇంట్లోనే ఉన్నాడు. అటూ ఇటూ తిరిగి సాయంత్రం వరకు ఓపిక పట్టి –
“ఎందుకుండమన్నావో చెప్పు తల్లీ! ఈ సస్పెన్స్ భరించడం చచ్చేచావు గా ఉంది!”
“నేనంటే నీకిష్టమే కదూ?” అడిగింది ఉపోద్ధాతంగా.
“ఇదేం ప్రశ్న? నాకు శంకర్, వాడి గ్రూపు, నా కొలిగ్స్, షర్మీ అందరూ ఇష్టమే... నువ్వయతే మరీ!” అన్నాడు.
“మరి నన్నెందుకు తప్పించుకు తిరుగుతావు?”
“నువ్వు భలేదానివి సంజనా! నిన్ను తప్పించుకుని తిరగడం ఏమిటి? నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. వాటి కోసం, వాటిని అమలు చేయడం కోసం వెళ్తూ ఉంటాను. నువ్వు ఏవేవో ఊహించుకోకు!” అని బట్టలు మార్చుకుని –
“సిల్లీగా అందరిలా ఆలోచించకూ సంజనా ప్లీజ్!” అని వెళ్ళి పోయాడు.
గంట తర్వాత ఏదో మరిచిపోయి వచ్చి సూట్కేస్ తిరగేసి, మరగేసి ఏదో కాగితాన్ని పట్టుకుని వెళ్ళబోతుంటే అడ్డుపడి ఆపింది. ప్రశ్నార్ధకంగా చూశాడు.
“నువ్వు ఇంతకు ముందు నాతోనే ఉండేవాడివి. ఇప్పుడు మారిపోయావ్!” అంది.
“మార్పు సర్వ సాధారణం. నిన్నఉన్నట్టు ఈ రోజు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటాయా? అందులోనూ నీకిప్పుడు ఏ సమస్యలు లేవు. జాలీగా గడుపు!” అని వెళ్ళిపోయాడు.
వారం రోజులు వస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటుంటే ఒక రోజు సీరియస్ గా మొహం పెట్టి _
“ఎందుకు ఏడుస్తున్నావు? ఇలారా.. . చెప్పు!” నిలదీశాడు.
“నువ్వు నన్ను లెక్కచేయడం లేదు!” అంది.
“అదేనా కారణం?”
“అవును!”
“అయితే నేను చేసేదేమి లేదు. నేను స్వేచ్ఛగా బతుకుతాను సంజనా! నువ్వూ అలాగే ఉండు. నాకు ఏ మాత్రం అడ్డు రావద్దు. నన్ను ఆపడంలో అర్ధం లేదు. నువ్వంటే నాకు చాలా విలువుంది!” అనేసి వెళ్ళిపోయాడు.
పదిహేను రోజులు ముభావంగా ఉంది. అతడు తనకేమి పట్టనట్టు ఉన్నాడు. ఒకసారి హడావిడిగా బయటకు వెళ్తుంటే_
“ఈ రోజు నువ్ నాతో ఉండాలంతే!” అంది.
“పిచ్చానీకు?” పక్కకి జరిగి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఏమి మాట్లాడడం మానేసింది. పది రోజులు అయ్యాక తీరికగా హల్లో కూర్చుని గొంతెత్తి పాడుతున్నాడు. అది ఇంగ్లిష్ పాట.
“ఐ నెవర్ లీవ్ యూ.. . నిన్నొదిలి పోలేనూ.. . అంటూ పాడేస్తున్నాడు. మండిపోతోంది సంజనకి. ఆ రోజు రెండో శనివారం. మధ్యాహ్నం పన్నెండు దాటుతోంది. సంజన వంట చేయలేదు సరికదా టీ కూడా పెట్టలేదు. ఇంటర్ కం లో లక్ష్మణ్ కి చెప్పి కేరెజ్ తెప్పించాడు. మళ్ళీ పాట అందుకున్నాడు. లక్ష్మణ్ నెమ్మదిగా హాల్లోకి చేరిపోయాడు. పాటలు వినిపించాయా... పిచ్చెత్తి పోతాడతడు.
“బావా! ఎప్పుడొచ్చితీవు!” అని అందుకున్నాడు లక్ష్మణ్. గిటారు మోగించేస్తున్నాడు సిరీన్. అరగంట సాగదీసి.. . ఆపాక గట్టిగా చప్పట్లు కొట్టాడు సిరీన్...
“మనం ఖుషీ! ఇంద.. . ఈ వంద నీకు బక్షీస్!” అన్నాడు.
ఒంగి ఒంగి సలాములు కొట్టి వెళ్లిపోయాడు. ఈ లోగా శంకర్ వచ్చాడు. చిరునవ్వు నవ్వేసి లోపలికి వెళ్లిపోయింది.
“ఏమయింది అక్కకి?” అడిగాడు శంకర్.
“ఏం లేదు పద! అని బయిటికి లాక్కుపోయి అరగంట అయ్యాక వచ్చి, భోజనం చేద్దామని అని అడిగి తిన్నాక సాయంత్రం దాకా నిద్రపోయి, ఆరు దాటాక త్వరగా రెడీ అవమని తొందర చేసి తీసుకుపోయాక-
“షర్మిల ఫ్లాట్ కేనా ఇంత హడావిడి!’’ అనుకుంది.
షర్మిల మొహం ఎర్రగా కందిపోయి ఉంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. సిరీన్ షర్మిల పక్కనే కూచుని ఆమె భుజానికి తల ఆనించి ఊరికే పడుకున్నాడు. షర్మిల అతడి తల మీద చెయ్యెసి-
“ఏరా! పోదామా మన ఊరు?” అంది.
“వద్దులే! నువ్వున్నావుగా?” అన్నాడు. సంజన మనస్సు చివుక్కుమంది. అందరితో చనువుగా అందరూ తన వాళ్ళనుకుని మెలిగే సిరీన్ తన దగ్గర మాత్రమే ‘డిస్టెన్స్’ మెయిన్ టైన్ చేస్తాడు.
“ఈ రోజు ఇక్కడే ఉండొచ్చుగా?” అంది షర్మిల ఇద్దరి వైపు చూస్తూ.
“తప్పకుండా!” తనే మాట ఇచ్చేశాడు. షర్మిల చెవిలో ఏదో చెప్పాడు.
“నిజమా?” అంది సంతోషంగా మొహం పెట్టి. సంజన కి బాధ వచ్చేస్తోంది. తన ముందు ఇలా సీక్రెట్స్ చెప్పుకోవడం మర్యాద కాదనిపించింది. దాదాపు రాత్రి పన్నెండు వరకు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. వారి మాటల్లోని వ్యక్తులు తనకి తెలియరు కాబట్టి కలిగించుకోలేదు సంజన.
“అల్లం టీ తాగుతావా సిరీన్?” అడిగింది షర్మిల. ‘ఈ టైమ్ లో టీ ఏంటి?’ అనుకుంది. అది సిరీన్ కున్న అలవాటు అని చెప్పింది షర్మిల. ‘ఇన్ని నెలల్లో అతడొక్కసారి కూడా అడగలేదే?’ అనుకుంది. మర్నాడు మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు.
******
ఆదివారం సాయంత్రం కూడా అయిపోవస్తుంటే ఉక్రోషంగా ఉంది సంజన కి.
“నేనంటే నీకు ఇష్టమే కదా?” అడిగింది సంజన.
“య. ఈ ప్రశ్నఈ నెలలో ఎన్నోసారి అడిగావంటావ్?”
“అదికాదు నేనడిగేది?”
“మరి?”
“చాలా ఇష్టమా? కాదా?”
అప్పుడతడు ఏదో పుస్తకం తీశాడు చదవాలని. అది మూసేస్తూ-
“నీకేం కావాలమ్మా?” అన్నాడు.
“మనిద్దరం ఇంకా ఇలాగే కలిసుందామా?”
“ఏం? నీకిష్టం లేదా?”
“కాదు!”
“మరి?”
“నాకింకా దగ్గర కావాలనే ఉద్దేశ్యం ఏమీ లేదా?” అనగానే టక్కున పక్కకొచ్చి కూర్చున్నాడు.
“ఇది కాదు”
“సరే! అదేమిటో సీరియెస్ గా చెప్పు!”
“మనం పెళ్లెప్పుడు చేసుకుందాం?”
“ఏంటీ? మనకి పెళ్ళా? జోక్ చేస్తున్నావా? తుళ్ళిపడి అడిగాడు.
“నేను సీరియెస్సే!” అంది.
“నా అవుట్ లుక్ వేరు సంజనా! నా సన్నిహితుల్లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాను. నువ్వు కష్టంలో ఉన్నంత కాలమూ నీతోనే ఉన్నాను. శంకర్ చిక్కుల్లో ఉంటే తనతో. షర్మిల నిన్న ఎందుకలా ఉందో తెలుసా? షర్మిల కి మా ఊరివాడితోనే పెళ్ళయింది. అతడు చాలా మంచివాడు. ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని చిన్న చిన్న విషయాల్లో పంతాలొచ్చి పెద్దవి చేసుకుంటున్నారు. మన అపార్ట్మెంట్లో ఏమేం జరుగుతున్నాయో తెలుసా నీకు? మహేంద్ర గారితో నెలరోజుల క్రితం పరిచయం అయ్యింది నాకు. మా ఇద్దరి స్వభావాలు, ఆదర్శాలు ఒక్కటే. నా జీవితం ఎవ్వరితో ముడిపడినా నాకు స్వేచ్చఉండదు... అందరి జీవితాల్ని, కష్టాల్ని పరిష్కరించుకుంటూ దానిలో ఆనందం పొందడం నాకిష్టం. నీ’ పొసిసివ్ నెస్’ నేను గమనిస్తూనే ఉన్నాను. మనకి కుదరదు సంజనా! నువ్ నాతో పాటు రాలేవు. వదిలెయ్ ఇదంతా! హాయిగా నవ్వుతూ ఉండు!” అనేసి వెళ్ళిపోయాడు. నిశ్చేష్ట అయింది సంజన. చేష్టలుడిగికూర్చుండిపోయింది. చీకటి పడుతున్నా ఆమె కదలలేదు.
ఒక్కసారిగా నవ్వుల్తో, కేరింతల తో లైటు వెలిగింది హాల్లో. సిరీన్, శంకర్, చుట్టూ పక్కల పిల్లలూ! సిరీన్ చేతుల్లో ఏవో కాగితాలు బొత్తుగా ఉన్నాయి.
“సంజనా! ఇక్కడ సంతకం పెట్టు!” అన్నాడు ‘ఇంటూ’ మార్క్ చూపిస్తూ.
‘ఎంటా?’ అని చూడబోయింది.
“అబ్బా! నీ ఆస్తి రాయించుకోను గానీ సంతకం పెట్టు!” అన్నాడు. తలెత్తి చూస్తే-
“నువ్వో అనాథ బాలుణ్ణి చదివించబోతున్నావు. అంతే!” అన్నాడు నవ్వి.
సంతకం పెట్టాక ఓ పిల్లాడొచ్చి చాక్లెట్ ఇచ్చాడు. వరసగా అందరూ చాక్ లెట్స్ ఇస్తూనే ఉన్నారు సంజనకి. నేను, నేను అంటూ గోలగోల గా. నవ్వుతూనే ఉంది.
‘అసలు ఇంతక్రితం ఒక భారమైన సంఘటన జరిగిందా?’ అన్నట్టు ఉంది ఆ అల్లరి.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|