Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

“ఆ రోజండీ...స్టోరీ నెంబర్ నాలుగో ఫ్లోర్ అండి. ఉండేది సుభాష్, ధీరజా. ఏం జరిగిందంటే-

బడ్డీ ఎన్ క్లేవ్ ముందు టాక్సీ ఆగింది.

లక్ష్మణ్ వేగంగా వెళ్ళి సుభాష్ చేతిలో సూట్కేస్ అందుకుని లిఫ్ట్ వైపు నడిచాడు. ధీరజ ని తన దగ్గరగా ఒత్తుకుని లిఫ్ట్ దాకా నడిపించాడు సుభాష్. వాళ్ళు కొన్నాళ్లు టూర్ తిరిగి అప్పుడే వచ్చారు. నాలుగో ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగాక సుభాష్ అత్యంత అపురూపంగా ధీరజని లోపలికి తీసుకొచ్చాడు. సుభాష్ ఆ అమ్మాయిని తనకి కాబోయే భార్య అని లక్ష్మణ్ కి చెప్పాడు. ఆహా!” అనుకుంటూ మిగిలిన బాగ్ లు కింద పెట్టేసి వెళ్ళిపోయాడు.

ఆమె చేతిలోఉన్న ఒక నలుపు రంగు సూట్కేస్ ని అపురూపంగా, భద్రంగా తన బీరువాలో ఉంచాడు. దానిని ఒకసారి తాకి వెనకకి తోశాడు. ధీరజ అటు తిరిగి మరో సూట్కేస్ లో బట్టలు తీసుకుని వాష్ రూమ్ వైపు వయ్యారంగా నడిచింది.

సుభాష్ చూపులు మాటి మాటికి ఆ బుల్లి నల్ల సూట్కేస్ వైపే పరుగులు పెడుతున్నాయి. ‘అంత చిన్నది 20 లక్షల్నిమోస్తోంది. తను తొందరపడకూడదు!’ అనుకున్నాడు సుభాష్. వాష్ రూమ్ నుంచి బయిటికి వచ్చిన ధీరజ తెల్లగా, మిలమిలా మెరిసిపోతోంది. అద్దంలో చూసుకుని హాయి హాయిగా నవ్వుకుంది. ఎంతో సాహసం చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఎగ్జయిట్మెంట్ గా ఉందామెకి. సుభాష్ వైపు నవ్వుతూ చూసింది. ‘వహ్వా!’ అనుకున్నాడు సుభాష్. ‘ఏమందం,ఏమందం... స్కైప్ లో చూసినడానికంటే వెయ్యి రెట్లు మెరిసిపోతోంది. ఆమెకి నమ్మకం కలిగేలా కొన్ని ఊర్లు తిప్పుతూ, కబుర్లు చెప్తూ ఆమెని తాకను కూడా తాకలేదు.

‘పెళ్లి చేసుకునే వరకు తాకను!’ అన్నాడు మహా బుద్దిగా. ధీరజ పొంగిపోయింది. ఆమె కళ్ళల్లో ఎడ్వంచర్ చేసిన ఫీల్ కొట్టొచ్చినట్టు కనపడుతోంది.

‘అసలెంత మంది ఇంత ధైర్యం చేసి తనని ప్రేమించిన వాడిని చేరుకోగలరు!’ పైగా అందమైన అమ్మాయి పక్కనే ఉన్నా తాకనైనా తాకని బుద్దిమంతుడు. చేతులు జాచాడు ఆమె ఆలోచనలని తను పట్టుకున్నట్లు. అన్నీ సినిమాల్లో ఇదే పిలుపు. చేతులు జాచి పిలవడం... హీరోయిన్ పరుగెత్తుకొచ్చి ఆ కౌగిలిలో వాలిపోవడం,హత్తుకు పోవడం... బాగా గుర్తొచ్చింది ధీరజకి. అందుకే ఆ ప్రభావం తోనే ఒక్క అంగ లో అతణ్ణి పెనవేసుకుపోయింది. అల్లుకుపోయింది. కౌగిలిలో పరవశించి పోయింది. అన్ని సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ అంతే! అరమోడ్పుల కళ్ళతో ఉంటుంది!” అనుకుంది హాయిగా “పోదామా?” అన్నాడు బెడ్ వైపు చూసి కన్ను కొడుతూ. సిగ్గు పడినట్లు అభినయం చేసింది.

‘ఛీ! పో!’ అంది సిగ్గుగా.

“ఓసోస్! చూడని అందాలా? ఇవన్నీ. ఇప్పుడు ఒక్కొక్కటిగా లాగేసుకోవడమే!” అన్నాడు కొంటెగా.

“నాకిదంతా కొత్త!” అంది ధీరజ గుండె దడదడ లాడుతుంటే. ఫక్కుమని నవ్వాడు. ‘నాకూ ఇదే మొదటి సారి’ అని సైగ చేశాడు.

“మొదట్లో అంతా కొత్తే చిలుకా రావే నా రాజహంసా!” అన్నాడు దగ్గరగా పొదుపుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ. అతని కళ్ళనిండా ఆమె నగల మెరుపులు, తళుకులు. ఎప్పుడు తన స్వంత మవుతాయా అని కమ్మని కలలు. ఆమెక్కావలసింది ఆమెకిచ్చి తనక్కావలసింది తాను ఒడుపుగా లాగేయ్యడమే!’ అనుకుంటూ నల్ల సూట్కేస్ వైపు చూశాడు. అది పసిగట్టింది ధీరజ.

“ఇవన్నీ పెళ్ళయ్యాకే!” అంటూ దూరంగా జరిగింది. అంగీకారంగా తల ఊపాడు సుభాష్!

*****

మర్నాడు సుభాష్ డ్యూటీ కి వెళ్ళాక దగ్గర్లో ఉన్న బాంక్ లో లక్ష్మణ్ సాయం తో అక్కౌంట్ ఓపెన్ చేసింది ధీరజ. లక్ష్మణ్ బతక నేర్చిన వాడే కాక చెడు అంటే అతడికి గిట్టదు, ఒకరి విషయం మరొకరి దగ్గర చెప్పడు. ఏదైనా మహేంద్ర కే చేరవేస్తాడు.

సుభాష్ ధీరజ దగ్గర నగల ప్రసక్తి ఎన్నడూ తీసుకు రాలేదు. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడూ, తిరిగి వచ్చాక నల్ల సూట్కేస్ వైపు ప్రేమగా చూస్తాడు. ధీరజని ధైర్యంగా ఉండమని ఆప్యాయంగా చెప్తాడు.

రెండు నెలల్లో ధీరజ కాలనీ లో ఉండే గొప్ప గొప్ప వాళ్ళందరూ పరిచయం అయ్యారు. దానికి కారణం ఆమె సౌందర్యమే! ఎవరైనా సరే ఆమెని చూడకుండా దాటిపోలేరు. ఆ పరిచయాల తోనే ఆమె చాలా త్వరగా బాంక్ లాకర్ ని సంపాదించగలిగింది. ఆ తర్వాత  పది రోజుల్లో నగల్నిమొత్తం లాకర్ లో భద్రపరిచింది. ఆ నగలన్నీ తల్లికి సంక్రమించిన పసుపు, కుంకుమలే! వాటిని ధీరజ పెళ్ళిలో బహుకరించిదామె!. సుభాష్ ఆమె దగ్గర తీసుకున్న డబ్బుని కొంచెం కొంచెంగా కొంచెంగా ఇచ్చేస్తూ ‘స్త్రీ ధనం తాకకూడదని’ జోక్ చేశాడు. సుభాష్ ని అనుమానించినందుకు బాధ పడుతూ అతడిని పొందినందుకు మురిసిపోయింది ధీరజ.

తన మీద బాగా నమ్మకం కుదిరేవరకు ఓపిక పట్టదల్చుకున్నాడు సుభాష్! తన ఉద్యోగం, కంపెనీ వివరాలన్నీ తప్పుగా ఇచ్చాడు. ఇంకో రెండు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఇంటి ఓనర్ కి!

******

ఒక పక్క ధీరజ తండ్రి రామారావు పిచ్చివాడిలా రోడ్డున పడ్డాడు. ప్రతీ కాలనీ తిరగడం, ఎవర్ని ఏమని అడిగినా పరువుపోతుంది కనుక పిల్లని వెతికే విషయం గుంభనంగా ఉంచుతున్నాడు. అతని భార్య సుశీల ఏడ్చి ఏడ్చి ఆందోళనతో, బాధతో చిక్కి సగమయ్యింది. ధీరజ ఎంత అమాయకురాలో, ఎంత స్వప్న జీవో తెలుసు.

మధు మంచి పిల్లాడని ఇద్దరికీ ఈడూ,జోడూ బాగుంటుందని ధీరజని అతడి చేతుల్లో పెట్టి తాము నిశ్చింతగా ఉండొచ్చని అనుకుంటే... జరిగినదిది!

ఆ రోజు మధు ఇంటికి వచ్చేసరికి ఇల్లు బార్లా తెరిచి ఉంది. సూట్కేస్ లు లేకపోవడంతో ఊహించాడు. ఆమె ఎక్కడికో, ఎవరితోనో వెళ్ళిపోయిందని. ధీరజ తండ్రికి ఫోన్ చేసి వెంటనే రమ్మని కోరాడు. ఆ పిలుపు లో ఏదో కంగారు విని భార్యతో సహా వచ్చి విషయం విని కుప్పకూలిపోయాడు. తల పట్టుకుని గోడకానుకుని నింపాదిగా తల మోకాళ్ళల్లో పెట్టుకుని అచేతనంగా ఉండిపోయాడు. కూతుర్ని ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. పద్ధతైన వాడిచేతిలో పెట్టాడు. భార్య వైపు చూశాడు ఆమె మొహం పాలిపోయి ఉంది. ఆమె వైపు చూశాడు మధు చూడగానే రక్షించమంటూ, గట్టెక్కించమంటూ కూతుర్ని క్షమించమంటూ చేతులు జోడించి ప్రార్ధించింది. మధు కి చాలా బాధగా అనిపించి దగ్గరగా వెళ్ళి ఆమె చేతుల్ని ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఆవిడ బావురుమంది.

“అదంత పాపిష్టిదని తెలియదయ్యా! ఇలా మనందర్నీ బజార్న పడేస్తుందని తెలుసుకోలేకపోయాం... అదింకా బాగుపడదులే!” అంది.

“పెద్దవారు! అంతమాట అనకండి అత్తయ్య! ముందు మీరు ధైర్యం తెచ్చుకోండి!” అన్నాడు ఊరడింపుగా.

కాసేపాగాక హాలంతా పరికించి చూసింది. కిటికీలకి హాయిగొలిపే సన్నని తెరలు. డైనింగ్ టేబుల్, అందమైన గాజు తలుపుల అల్మారా,, ముద్ధైన రిఫ్రజరేటర్, ఖరీదైన సోఫాసెట్, గోడలకి అందమైన తైల వర్ణ చిత్రాలు, హాలునానుకుని ఎదురెదురుగా రెండు బెడ్రూంలు, పంతం పట్టి రోజ్ వుడ్ తో హంసతూలికా తల్పంలా తయారు చేయించింది. ఆ పక్కనే పుస్తకాల షెల్ఫ్. అందంగా తీర్చి దిద్దిన ఇల్లు. ‘ఏం చదువులు... సంస్కారం లేకపోయాక!’ ఇంత దారుణంగా ఇన్ని బంధాల్ని వదిలి ఎలా వెళ్లగలిగింది?

‘ఎవడితోనో జంప్!’ అనే ఆలోచన ఎవరికీ మింగుడుపడడం లేదు. ‘ఇంకేదో రీజన్! అది సిల్లీ దయి ఉండాలి’! అనుకున్నాడు మధు.

”ఇద్దరిదీ జాయింట్ అకౌంట్ అత్తయ్య లాకర్ కి. మీరొచ్చే ముందే చూశాను. లాకర్ లో నగలు లేవు!” భోరుమంది సుశీల. మధు తల్లి తండ్రులు వచ్చారు. మధు తల్లి సుశీలని అక్కున చేర్చుకుని ఓదార్చింది. రామారావు వియ్యంకుడి చేతులు పట్టుకుని –

“బావగారూ! ఈ కాలం పిల్లలు జీవితం, దాని విలువ తెలుసుకోలేకపోతున్నారు. నేను పిల్లని క్రమశిక్షణ తో పెంచాను” ఏడ్చాడు భోరుమంటూ.

“మీరు ముందు ఇలా దు:ఖపడడం మానెయ్యండి. పొరపాటు చేసి ఉంటుంది. ఈ పాటికి కొంచెం అర్ధమయే ఉంటుంది. పూర్తిగా తెలుసుకునేటట్టు చేసి పిల్లని తెచ్చుకుందాం. ఎప్పుడు పెళ్ళయిందో అప్పుడే మనందరం ఒకటి!” అన్నాడు మధు తండ్రి.

చేతులు జోడించి మోకాళ్ళ మీద ఒంగి అతని పాదాలు పట్టుకున్నాడు రామారావు. అప్పట్నుంచి వీధీ, వీధీ తిరిగాడు ఎక్కడన్న కనపడదా.. . అనే ఆశతో! అమాయకమైన కూతురి మొహమే కళ్ళముందు కదలాడుతుంటే రామారావు తిరగని కాలనీ లేదా సిటీలో.

ఆ రోజూ అలాగే భార్య ఇచ్చిన టిఫిన్ డబ్బా పాక్ చేసుకుని అల్లుడు మధు ఇచ్చిన ధైర్యంతో రోడ్డు మీద కొచ్చి బైక్ స్టార్ట్ చేశాడు.

******

‘లక్ష్మీ నగర్ కాలనీ’ లో’ బడ్డీ ఎన్ క్లేవ్!!’

సెల్లార్ లో ఆ ఆదివారం పొద్దున్న పదిగంటలకి అపార్ట్మెంట్ మీటింగ్!

లక్ష్మణ్ అయిదింటికే లేచి సెల్లార్ ని క్లీన్ చేసి అందరికీ పేపర్లు ఇచ్చాక, ఒకొక్కరూ ఒక్కో పని చెప్తుంటే అవి చేసిపెడుతూ హడావుడిగా ఉన్నాడు. మహేంద్ర వాకింగ్ వెళ్ళి వస్తూ వస్తూ లక్ష్మణ్ కి కూడా టిఫిన్ తెచ్చాడు.

చెమర్చిన కళ్ళతో-

‘ఈ బాబు అందరిమేలు కోరుతాడు. వందేళ్లు చల్లగా జీవించాలి!’ అని దీవించాడు.

తొమ్మిదింపావు నుంచి తొమ్మిదిన్నర లోపలే అందరూ కిందికి దిగి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ పలకరించు కుంటున్నారు. పాతవారంతా కొత్తవారిని పరిచయం చేసుకుని వివరాలు కనుక్కుంటున్నారు. ఆదివారం ఇలాంటి మీటింగ్ లు లక్ష్మణ్ కి పండగే పండగ. అందరూ ఒక్కటై కబుర్లు చెప్పుకుంటూ తననీ ఆ కుటుంబంలో ఒకరిగా గుర్తిస్తారు. సుభాష్ ధీరజని తనకి కాబోయే భార్యగా పరిచయం చేశాడు. లావణ్య, విరించి సంతోషిస్తూ ఆ అమ్మాయి బెరుకుగా, మొహమాటంగా ఉండడం చూసి సినిమా కబుర్లు మొదలెట్టారు. ఆ అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరూ మీటింగ్ కి వచ్చి తీరాలని ప్రెసిడెంట్ రూల్ పెట్టాడు. మీటింగ్ జరిగిన తర్వాత ఏ ఇబ్బందుల మీద ప్రశ్నలు వేసినా కుదరదని అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వారి వారి సందేహాలు నివృత్తి చేసుకుని ఒకరి కొకరుగా ఉండాలని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు.

పాపం! కాలనీ అంతా తిరుగాడుతున్నాడు రామారావు ధీరజ కోసం.

పదిగంటలవగానే ‘పిండ్రాప్ సైలెన్స్తో’ ఎవరి కుర్చీల్లో వాళ్ళు కూర్చున్నారు. ధీరజ మూడో వరసలో మూలగా కూర్చుని ఉంది. మిగతా వాళ్ళు అడ్డు రావడంతో ధీరజ అంతగా కనపడడం లేదు. గేటు దగ్గర కొచ్చాడు రామారావు. అందర్నీ పరికించి, పరిశీలించి చూస్తున్నాడు. లక్ష్మణ్ అతనికి అడ్డుగా నిలబడి మీటింగ్ జరుగుతోందనీ లోపలికి రావడం కుదరదనీ అన్నాడు. మొత్తానికి ధీరజని గుర్తు పట్టాడు. లోపలికి రానివ్వని వాచ్మేన్ ని ఏమి అనలేక, గొడవ పడలేక సతమత మవుతున్నాడు.

‘తమ ఇంటి ఓనరు దగ్గర తమ ఫ్లాట్ కొనుక్కున్నట్టు ప్రకటించారు విరించి,లావణ్యలు. మహేంద్ర కూడా చిరునవ్వుతో తాను కూడా ఈ నెలలో తానున్న ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నట్టు చెప్పాడు. కొత్తగా అద్దెకి వచ్చినవాళ్లందరికి స్వాగతం చెప్తున్నామని అంటే చప్పట్లు కొట్టారు. ప్రెసిడెంట్ మాట్లాడడం మొదలుపెట్టాడు. లక్ష్మణ్ ఏదో గొడవ పడుతున్నట్లు అనిపించి మహేంద్ర గేటు దగ్గరికి వెళ్ళాడు. రామారావు మొహం లోని ఆందోళన ని గమనించి లక్ష్మణ్ ని వెళ్ళిపొమ్మని చెప్పి ఏం కావాలని అడిగాడు...రామారావు ధీరజని వేలితో చూపిస్తూ విషయం చెప్పాడు. చేతులు జోడించి ప్రార్ధించాడు. మహేంద్ర రామారావు ని అక్కడికి కొంచెం దూరం తీసుకెళ్ళి –

తొందరపడవద్దనీ, ఏ మాత్రం గొడవ చేయొద్దనీ మొత్తం సంగతంతా తాను తెలుసుకుని కబురు చేస్తాననీ.. . ఇప్పుడు అమ్మాయి అవివేకంతో ఎదురుతిరిగితే ఆమెకే నష్టమనీ తనంత తానుగా... తానేమి పొరపాటు చేసిందో తెలుసుకోవడం, అప్పుడు రావడమే మంచిదనీ నచ్చజెప్పి పంపుతూ నెంబర్ తీసుకున్నాడు. కళ్ళనీళ్ళ పర్యంతరం అవుతూ వెనుతిరిగాడు రామారావు.

మీటింగ్ ముగిసేముందు _

అవార్డ్ కొట్టిన తమ “బంగారు పల్లె” గురించి  ఆ పల్లెవాసుల ఐక్యత, అందువల్ల జరుగుతున్న అభివృద్ది గురించి వివరించారు విరించి,లావణ్యలు.

******

ఇప్పుడు స్టోరీ నెంబర్ 2 సార్! అన్నాడు మహేంద్రతో లక్ష్మణ్! నవ్వాడు అతడు.

‘నవ్వుతారేంటండీ బాబూ! ఇయన్నీ దిద్దేయ్యాల్సింది మీరే!

రెండో ఫ్లోర్! డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ సార్! ముందు ఇంకో కాలనీ లో ఉన్న కబురు చెప్తా అండి. అప్పుడు ఇక్కడి లింక్ అర్ధమయిపోతుంది!” అన్నాడు.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in October 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!