నీలిరంగు చీరలో నీలాకాశం తో పోటీ పడుతూ పారిజాతాలూ, మందారాలు, తులసీ దళాలు తుంపి పూల సజ్జాలో లో నింపింది వాసంతి. వాచ్మేన్ లక్ష్మణ్ ఆమె దగ్గరగా వచ్చి మెత్తని కంఠంతో-
“అమ్మాయిగారూ! నాన్నగారు కేకేస్తున్నారు. మెట్లమీద నుంచి వెళ్ళిపొండి. కరెంట్ లేదమ్మా. మనది ఫస్ట్ ఫ్లోరేగా? సరేనా? అన్నాడు. తలూపి మెట్ల వైపు వచ్చింది. అయిదో అంతస్తులో ఉండే మహేంద్ర ఫస్ట్ ఫ్లోర్ కి చేరువవుతున్న వాసంతికి ఎదురుగా వచ్చాడు. కనురెప్ప వేయలేదు. ఎంత ముగ్ధత్వం? ప్రశాంతంగా ఉందామె మొహం. కదిలీ కదలని పెదవులు. ఏదో చెప్తున్నట్టు అరవిచ్చుకున్నాయి. తానెందుకు ఇంత వరకు చూడలేదీ బొమ్మని?
కిందకి దిగగానే లక్ష్మణ్ చేతిలో అయిదువందల రూపాయల నోటు పెడుతూ ఇది అడ్వాన్సే అనీ ఇక మీదట తన పనులు చేసి పెట్టమన్నాడు. తనని చూడడానికి వస్తూ, పోతూ ఉండే చెల్లెలు, బావగారూ, తల్లి తండ్రుల అవసరాల్ని కనిపెట్టుకు చూడాలని చెప్పాడు. ఆనందంగా ఒప్పుకున్నాడు లక్ష్మణ్!!
******
ఎప్పటిలాగే-
పొద్దున్నే వన దేవతలా కాలనీలో ఉండే చెట్లని పలకరిస్తూ, నెమ్మదిగా నడుస్తూ, సన్నగా, చక్కగా పాడుతుంది.
“పూవులేరి తేవలె
చెలి పోవలే కోవెలకు...నీ వలె సుకుమారములు...
నీ వలనే సుందరములు!”... అంటూకృష్ణ శాస్త్రి గారి పాటని పాడుకుంటూ పువ్వులని ఏరుతూ పలకరిస్తూ ఉంటుంది. పిట్టల అరుపుల్ని తిరిగి అనుకరిస్తూ తిరుగు జవాబు చెప్తుంది. ప్రకృతిలో మమేకం అవుతుంది వనకన్యలా.
మర్నాడు యధావిధిగా పవర్ కట్!
మహేంద్ర మెట్లు దిగుతూ ఆమెనోసారి పరికించి చూశాడు. ఆమె తమ ఇంటి ముంగిట చాక్ పీస్ తో చుక్కలేసి వాటిని కలుపుతూ ముగ్గు వేస్తోంది. పూర్తయ్యాక మిగిలిన ముక్కతో ముగ్గు మధ్యలో చందమామని ముద్దగా చేసి తీర్చిదిద్ది లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు ఏదో పని మీద మెట్లెక్కుతూ మహేంద్ర మనసు కనిపెట్టేశాడు లక్ష్మణ్.
ఈ మధ్య ఏదో ఒక టైమ్ లో లక్ష్మణ్ మహేంద్ర ఫ్లాట్ కి వెళ్ళి కబుర్లు చెప్తున్నాడు. ఆ చేత్తోనే ఇంటి పనులు అందుకుని మచ్చికయిపోయాడు. ఎప్పుడూ ఏదో ఒక కబురు చెప్పి నవ్వించే లక్ష్మణ్ ఆ ఆరోజు తాను తెలుసుకున్న బాధపడే విషయాన్ని చెప్పాడు.
బాంక్ మేనేజర్ పరమేశ్వర్ ఈ ఫ్లాట్ కి షిఫ్ట్ అవకముందు ఉడాపార్క్ దగ్గర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. వాసంతికకి మంచి సంబంధం వస్తే అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనీ నయాపైసా కట్నం అవసరం లేదని చెప్పాక, తనంత అదృష్టవంతుడూ లేడని దండిగా కానుకలు సమర్పించి వైభోగంగా పెళ్ళి చేశాడు. అప్పగింతలు కూడా ముగిశాక చావు కబురు చల్లగా చెప్పాడు వియ్యంకుడు. తన కొడుకు మొదటి రాత్రికి ఇష్టపడడం లేదనీ, తల్లి చస్తానని బెదిరిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడనీ, అమెరికాలో ఒకమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి తప్ప తనకేవ్వరూ అవసరం లేదని తేల్చి చెప్పేసాడనీ, పరిస్థితుల్ని చక్కబరుస్తానని అంతదాకా సహనం వహించమని వియ్యంకుడు బతిమాలాడు. కుప్ప కూలిపోయాడు పరమేశ్వర్. పెద్దల సమక్షం లో తేల్చుకుందామని ఆవేశపడుతున్న తండ్రిని వారించింది వాసంతి. ఇక్కడికి చాలించి విడాకులు ఇస్తే చాలని కన్నీళ్ళతో చెప్పింది.
******
అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. అతని ప్రియురాలు పెళ్ళికి ఒప్పుకోలేదు. అబ్బాయి డైవర్స్ ఇవ్వడు. ఇలా సాగుతోంది వాసంతి కథ. ప్రతినెలా వియ్యంకుడొచ్చి వాసంతిని పంపమని అడగడం, వాసంతి అంగీకరించక పోవడం జరుగుతోంది. లక్ష్మణ్ ఇదంతా చెప్తూ ఉంటే మహేంద్రకి కళ్ళు చెమర్చాయి.
మహేంద్ర గ్రూప్ వన్ ఆఫీసర్. తరుచుగా కేంప్స్ ఉంటాయతనికి. అతని తండ్రి మరో నాలుగు నెలల్లో రిటైర్ అవుతాడు. అప్పుడు తల్లితండ్రులు మహేంద్ర తోనే కలిసి ఉండబోతున్నారు. మహేంద్రది అందరితో కలిసిమెలిసి ఉండే తత్త్వం. అందర్నీ కలుపుకు పోతాడు.
******
ఇంకా వెన్నెల కనుమరుగవలేదు. చందమామ మసక బడలేదు. చీకటో, వెలుతురో తెలియని నిశ్శబ్ద వేళ!
వాసంతి ఖాళీ స్థలం లోని మొక్కలని పలుకరిస్తూ ఊసులాడుతోంది. తమ వెనుక బాల్కనీ నుంచి ఆమెనే చూస్తున్నాడు మహేంద్ర. తెలుగు దేశంలోని ఆడవాళ్ళల్లో చాలా మందికి ఏ భాష కి అందని సొగసు, హొయలు ఉంటుంది. ఏ అలకరణాలూ అవసరం లేని అందం అది. ఆ అందాన్ని అవసరం లేని బేషజాలతో, అక్కర్లేని తాపత్రయాలతో, ఈర్ష్య, అసూయలు ఒకరి నుంచి ఒకరు కొనితెచ్చుకుని మరీ సహజమైన తమ సౌందర్యాలని కోల్పోతారు. అప్పుడు వారెంత వికృతాకృతి తో ఉంటారో, అందరిలో ఎంత కిందకి పడిపోతారో, ఎంత విలువని పోగొట్టుకుంటారో తెలిస్తే బాగుండును. వాసంతిక లాంటి అమ్మాయిల్ని చూస్తే చాలా హాయిగా, చల్లని గాలి ఉండుండి వీచినట్టు తనువంతా పులకింతగా ఉంటుంది.
ఆమెని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటుంది. ఆమె కళ్ళ కదలికలతో పాటుగా కదలాలని, ఆమె కళ్ళెటుచూస్తే ఆ చూపునయి పోవాలనీ ఉంటుంది అతడికి. మనిషి మనసుతో కదా జీవించేది? అర్ధం కాదేం జనాలకి? అనుకున్నాడు.
అరె! ఆమె ఎక్కడికి ఎగిరిపోయింది? ఇప్పుడేగా కళ్ళారా చూసింది? అనుకున్నాడు. కానీ కళ్ళల్లోనే నింపుకుని ఉన్నాడన్నమాట! మహేంద్ర తనలో తాను చాలాసేపు నవ్వుకుంటూనే ఉన్నాడు.
పరమేశ్వర్ గారు ఆవుకి అరిటిపండు తినిపిస్తున్నాడు. ఓహ్! అవును. లక్ష్మణ్ చెప్పాడు.
ఈ పరమేశ్వర్ గారికి కి చింతాకు అంత చాదస్తం కూడా ఉందని! ఇంతకు ముందు తాముండే ఫ్లాట్ లో ఏదో వాస్తుదోషం ఉందనీ, అందుకే తన కూతురికి జరగరానిది జరిగిందనీ నమ్మకం కలిగాకే పట్టుబట్టి ఈ ‘లక్ష్మీ నగర్ కాలనీ, ‘బడ్డీఎన్ క్లేవ్’ కి వచ్చేశాడుట. అసలు తన తల్లే కూతురిగా పుట్టిందని అతడి విశ్వాసం. పూర్వజన్మ సుకృతం వల్లే ఇలా అయిందనీ కూడా అనుకుంటూ ఉంటాడు. కూతురి వైపు చూస్తుంటే గుండె తరుక్కు పోతూ ఉంటుందతడికి. ఇది వరకు అతడికి దీపారాధనతో పూజ ముగిసేది. ఇప్పుడతడు శివుణ్ణి ధ్యానిస్తూ నిరంతరం తన బంగారు తల్లి ని కాపాడమని, ఆమె జీవితాన్ని తిరిగి చిగురింపజేయమనీ ఆర్ధిస్తూ ఉంటాడు. ఎవ్వరితోనూ మాట కలపడు. తన ఇల్లు, తన సమస్యలు... అంతే! పొద్దున్నే గోమాతకి పూజా చేస్తాడు. పేదలకి దానధర్మాలు చేస్తాడు. కూతురిచేత చెట్లమొదళ్ళలో చీమలకి పంచదార జల్లిస్తాడు. ఎంతో కొంత పుణ్యం చేస్తే తన కూతురి జీవితం బాగుపడుతుందనే ఆశ అతడికి.
లక్ష్మణ్ మంచి పాటగాడు. ఎనిమిదో క్లాసు వరకు చదివాడు కూడా! మహేంద్ర కి ఫ్లాట్స్ లో విషయాలు చెప్తూ ఉంటాడు. అవి ఒకరి మీద పోటీలు చెప్తున్నట్టు కానీ ఒకరిని కించపరిచేవిగా గానీ ఉండవు. అవన్నీ తనకి అనవసరం అనుకున్న లక్ష్మణ్ చెప్పే విధానం అతడిని ఆకట్టుకుంటుంది. లోకం ఎలా ఉందో, ఏమి జరుగుతుందో చెప్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్పడం మొదలెట్టాడు.
ఇప్పుడతడు మొదలెట్టింది పెళ్ళయి పదేళ్ళు దాటిన లావణ్య, విరించిల గురించి!!
******
థర్డ్ ఫ్లోర్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్!
ఈ మధ్యే వచ్చారు అక్కడికి విరించి, లావణ్యలు. లావణ్యకి బాంక్ దగ్గర అని షిఫ్ట్ అయ్యారు.
సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలు.
స్కూలు నుంచి భారీ ఊబకాయాలతో దొర్లుకుంటున్నట్లు మెట్ల ఎక్కి వచ్చారు స్వాతి, హర్షలు. వాచ్మేన్ లక్ష్మణ్ స్కూలు బాగ్ లు మోసుకొస్తే, హర్ష లాక్ ఓపెన్ చేసి తలుపు తెరిచీ తెరవగానే సోఫాల్లో పడెయ్యమని సైగ చేసి అలాగే వాలిపోయాడు. అపార్ట్మెంట్ పక్కనే ఉన్న పాకలో ఉన్న పనిమనిషి సత్యవతి పరుగుపరుగున వచ్చి సోఫాలో పడేసి ఉన్న బాగుల్ని తీసి అక్కడే ఉన్న చిన్న బెంచ్ మీద పొందికగా పెట్టింది. పిల్లల్ని చూసి పలకరింపుగా నవ్వింది.
ఐదు నిముషాలు రిలాక్స్ అయ్యాక బలవంతంగా వాష్ రూమ్ లోకి పంపించింది.
కాళ్ళూ, చేతులు సోప్ తో కడుక్కోమని హెచ్చరించి, బట్టలు మార్చుకోమని బతిమాలి, విడిచిన యూనిఫాం లని వాషింగ్ మిషిన్ లో వేసి, డైనింగ్ టబుల్ మీద ఆల్రెడీ వండి ఉన్న భోజనాన్ని పదేపదే ఇదికావాల? ఇదెయ్యనా? మరికొద్దిగా వేసుకో అని కొసరి కొసరి వడ్డించింది. మంచినీళ్లు వద్దన్నా అందించింది. అయిదు గంటలకి వచ్చి పాలూ, స్నాక్స్ ఇస్తానని జాగ్రత్తలు చెప్పి చదువుకోవాలని మరోసారి హెచ్చరించి వెళ్ళింది.
ఆ పనికి ఆమె పిల్లల పట్ల ఎంత శ్రద్ద వహిస్తుందో గమనించి తగిన డబ్బు వస్తుంది. అందుకే అంత ఓపిక ఆమెకి. అప్పుడు దివాను మీద ఒకరు, పొడుగాటి సోఫాలో ఒకరు శరీరాల్ని పడేసి టి.వి. కి అతుక్కుపోతారు. లావణ్యకి పిల్లలంటే బాగా గారం. టి.వి. లో వచ్చే అడ్వటేజ్ మెంట్స్ ఇచ్చే చెత్త లో పిల్లలకోసం వాళ్ళు మెచ్చే చిరుతిళ్ళన్నీబజార్లో కొని తెచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా ‘గాలి తిండి’ పేరు మరిచిపోతే, వెంటనే పిల్లలు చెప్పేస్తారు. తెగ మురిసిపోతుంది లావణ్య.. తమ పిల్లలు ఏక సంథాగ్రాహులనీ, అందుకే ప్రతీదీ గుర్తుంటుందనీ టైము దొరికితే చాలు ఎవ్వరు ఇరుగు పొరుగులు కనిపించినా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది.
పెళ్ళికాకముందు ఉన్నఈ లావణ్య పూర్తిగా వేరు. పల్లెలో ఉండే నాజూకుతనం మచ్చుకైనా లేదు. బాగా ఎరువేస్తే మొక్కలు ఏపుగా పెరిగినట్టు పిల్లలకి బాగా తిండి పెడితే ఆరోగ్యంగా ఉంటారనే అపోహతో ఉంది లావణ్య. ఇద్దరూ బోండాల్లా, గుండ్రంగా ఉంటారు. ఎవ్వరేమన్నా అంటే ‘వాళ్ళ ఒంటితీరే అంత’ అని చెప్తుంది.
సాయంత్రం నాలుగున్నర తర్వాత పాలు వేడి చేసి తాగించి కాలనీ లో ఉన్న పార్క్ లో ఆడుకు రమ్మని తరుముతుంది పనిమనిషి. తామిద్దరూ ఇల్లు చేరుకోడానికి ఇంకో రెండు గంటలు పడుతుందని ఈ లోగా పార్కులో తోటి పిల్లలతో గెంతితే ఒళ్ళు తగ్గుతుందని లావణ్య ఆశ!
పార్కు చాలా దగ్గర! “పేరుకి పార్కే తప్ప అక్కడ పచ్చని చెట్లేమీ ఉండవు. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించి పోయాక పచ్చదనం అంతరించిపోయింది. ‘చెట్లు ఉంటే కదా స్వచ్చమైన గాలి?’ వాతావరణ సమతుల్యం గతి తప్పిపోయింది. రోజంతా వేడి. దానికి తోడు కాలుష్యం. ఎక్కడచూసినా అపార్ట్మెంట్లు. వర్షం అనే పదమే మరిచిపోయారు. మొక్క వేసే చోటేక్కడా లేదు” అంటున్నాడు తోటమాలి పిల్లలతో. వీటన్నిటికి తోడు ఒంటికి తగిన శ్రమ లేదు పిల్లలిద్దరికి! అక్కడున్న బెంచీల మీద కూర్చుని వచ్చేస్తారు టి.వి. కోసం. టి.వి. ఇప్పుడు ‘రేటింగ్‘ కోసం అన్నీ చూపిస్తోంది. హాయిగా చూస్తారు. పిల్లలకి ఒక్క పూట స్కూలు. చూసినంత సేపూ చూడడం, ఎక్కడ బడితే అక్కడ నిద్రపోవడం.
విరించి, లావణ్యలు గమనించలేదు గానీ స్వాతి రౌండ్ గా ఊరుతోంది. హర్ష సంగతి సరేసరి. మగవాడిననే నిర్లక్ష్యం, దానికి తోడు బద్దకం. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో మామ్మగారు హెచ్చెరించే వరకు లావణ్య పిల్లల వైపు సరిగా చూడలేదు. మామ్మగారి మాటతో ఉరుకులు, పరుగుల మీద డాక్టర్ ల దగ్గరికి పట్టుకెళ్లింది లావణ్య. ఇప్పటికే చాలా బరువు పెరిగారనీ, జాగ్రత్తలు తీసుకోకపోతే ‘డయాబిటిస్’ వచ్చే ప్రమాదముందని చెప్పాడు డాక్టర్. పై ప్రాణాలు పైకే పోయాయి లావణ్య కి. నడక, జాగింగ్ ల గురించి చెప్తూ ఏమేం తినాలో, ఏం తినకూడదో చాలా పెద్ద చార్ట్ ఇచ్చిందామే. ఒక్కసారే అన్నీ ఎక్సెర్ సైజులు చెయ్యొద్దని, నెమ్మదిగా పెంచుతూ పోవాలని చెప్పింది. ఇప్పుడు లావణ్య కి ఇది అదనపు బాధ్యత. ఇంటికి రాగానే ఇదంతా విన్నాడు విరించి. ఎప్పుడూ బిజీ బిజీనే సాఫ్ట్ వేర్ ఫీల్డ్. టైము ఎక్కడిది?
భార్య, పిల్లల్ని పరికించి చూశాడు విరించి. హర్ష చిన్న సైజు డ్రమ్ములా ఉన్నాడు. ఆ రోజు నుంచి పదిహేనురోజులు విరించికి సరయిన నిద్ర లేదు. పిల్లలు బోండ్రకప్పల్లా, ఆంబోతుల్లా, ఏనుగుపిల్లల్లా కనిపిస్తున్నారు. ఏడుస్తున్న భార్య ని చూస్తే జాలి వెయ్యలేదు. మండిపోయింది. ఆ ముందురోజు రాత్రి గురక పెడుతుంటే కాస్త కుదిపితే గురక పోతుందని టచ్ చేస్తే ‘ఉండు విరీ!’ అని మళ్ళీ గురక పెట్టడం మొదలెట్టింది. జోరీగ చెవిలో రొద పెడుతున్నట్టు అనిపించి లైట్ వేశాడు.
‘ఎంటిది... లావణ్యేన!’ ఆశ్చర్యంతో మతి పోయింది విరించికి. గుండ్రంగా నాపరాయిలా ఉంది. ఎంత నాజూకుగా, సుకుమారం గా ఉండేది! చ! తనెక్కడ గమనించాడసలు! వెళ్ళి అద్దం ముందు నిలుచున్నాడు. తాను ఏమంత లావెక్కలేదు గానీ పొట్ట తన్నుకు వచ్చేసింది.
‘వామ్మో! దేవుడా! ఏంటిది? ఏం జరుగుతోంది?’ భయంతో మంచం మీద పడిపోయాడు.
******
ఆ రోజు శుక్రవారం. ‘ఈ ఒక్క రోజూ బాంక్ కి వెళ్ళి వచ్చేస్తే మిగిలిన రెండు రోజులు శలవులు. పిల్లల పట్ల శ్రద్ద తీసుకోవచ్చు.’ అనుకుంది లావణ్య. కానీ-
ఆ సాయంత్రం నాలుగున్నరకి పనిమనిషి పిల్లల్ని పార్క్ కి తీసుకెళ్తుంటే నడవలేక ‘సెల్లార్’ లో పడిపోయాడు హర్ష. కళ్ళు తిరిగినట్టయి స్పృహ కోల్పోయాడు. స్వాతి వెక్కి వెక్కి ఏడుస్తోంది. లక్ష్మణ్ అప్పుడే కేంప్ నుంచి వచ్చిన మహేంద్ర దగ్గరికి పరుగెట్టి కిందకి తీసుకువచ్చాడు. మహేంద్ర పల్స్ చూసి డాక్టర్ దగ్గరికి ఎకాఎకిన తీసుకెళ్ళాడు. విషయం తెలుసుకున్న లావణ్య ఒక్క పరుగున హాస్పిటల్ కి వెళ్ళింది. మహేంద్ర విరించికి కాల్ చేస్తుండగా మహేంద్రని పట్టుకుని ఏడుస్తూనే ఉంది. ‘మరేం పర్లేదనీ, లావు తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టమని’ చెప్పాక గానీ కుదుటపడలేదు. మహేంద్ర దగ్గరగా తీసుకుని ‘మరేం పర్లేదు సిస్టర్ ‘ అని సముదాయించాడు. పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాక దిష్టి తీసింది లావణ్య. ఆ ఆదివారం ఒక కోయదొర వచ్చాడు విరించి ఇంటికి. కాస్సేపటిలో ఒక సాధువు వచ్చి మంత్రాలేవో చదివి పోయాడు. మహేంద్ర ఇదంతా తెలుసుకుని ‘మంత్రాలకి చింత కాయలు రాలవని, ఇక మీదట జిమ్ లో చేరడం, నడిపించడం, ప్రోటీన్ ఫుడ్ మాత్రమే ఇవ్వడం అవసరమని చెప్తూ లావణ్యకి తోడుగా నిలిచాడు.
లావణ్య, విరించిలు ఇప్పుడు మహేంద్ర ని ఫాలో అవుతున్నారు!
******
మహేంద్ర కాస్త గట్టిగా మందలించాడు లక్ష్మణ్ ని.
“రోజుకో కధ చెప్తావ్! ఎందుకు చెప్పు అందరి ఇళ్ళల్లో విషయాలు నాకు? లోకంలో ఇంత జనం ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కో కధ ఉంటుంది. ఇక్కడున్న అందరి గురించి చెప్తే రేపు వాళ్ళు నాకు ఎదురుపడితే ఇబ్బందిగా ఉండదూ? అయినా ఇళ్ళల్లోకి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కూడా చెప్తావ్. అది నీకేలా తెలుసు? అలా రాంగ్ రూట్ పట్టించడం తప్పు కదా? దీని వల్ల ఎవరికి ఏమి ఉపయోగం?” అన్నాడు కొంచెం కోపంగా,
లక్ష్మణ్ అస్సలు అదరలేదు, బెదరలేదు.
“బాగా అడిగారు. నా పనేదో నేను చేసుకుని అందర్నీ పొగిడేస్తూ ఉంటే నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు కూడా! కానీ ఈ మనస్సాక్షి ఉంది చూసారూ... అది మంచి ని గుర్తు పట్టేస్తుంది. మీరు అందరి క్షేమాన్ని కోరుకునే మనిషి. అందరికీ మంచే జరగాలని అనుకుంటారు. కానీ పట్నపు పోకడలు మహా చెండాలంగా ఉన్నాయి.
ఆఫ్టర్ ఆల్, నేనొక పనోడిని. నాకెందుకులే ఇయన్నీ అందరూ అనుకుంటే మేలు ఎలా జరుగుతుందండి? మీరు అన్నీ తెలుసుకుంటే ఇక్కడ మనుషుల్ని బాగు కోరుకునే వారిగా వాళ్ళ బతుకులు బాగుపడొచ్చేమో? మీరు చెప్పక పోయిన మీ ఉద్యోగం నేను కనిపెట్టానండి. మనకు అందుబాటులో ఉన్న కొన్ని అన్యాయాలనయినా అరికట్టాలి కదండీ? ఇళ్ళల్లో ఏమి మాట్లాడుకుంటారో నేను పెర్శనల్ గా ఒక్కోరు మాట్లాడే మాటలని బట్టి పట్టేస్తానండి. కొంతమంది కష్టం వస్తే అన్నీ చెప్పేస్తారండి!” అని అనేసి వెళ్ళిపోయాడు.
******
రెండురోజులు పోయాక _
ఒక సాయంత్రం-
వాసంతిక లక్ష్మణ్ ని అడుగుతోంది.
“ఈ మొక్కలకి చీడ పట్టింది. తీసి పారేయ్ లేకపోతే మిగిలిన మొక్కలన్నిపాడవుతాయ్. నేనూ సాయం పడతాను రా!” అంది.
అప్పుడు లక్ష్మణ్ వీధి గేటు దగ్గర నించుని అటూ ఇటూ వాకింగ్ లు చేస్తున్న జనాల్ని చూస్తున్నాడు.
“రేపు పొద్దున్నే అన్నీ చూసి తీసి పారేస్తాను అమ్మాయి గోరూ! అల్లటు చూడండి. మన వెనుక అశోక్ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ అబ్బాయి బి.టెక్ చదువుతున్నాడట! బాగా మందు మరిగీశాడు. ఇదీ చీడే కదండీ? వీడినేటి సెయ్యాల?” అన్నాడు.
ఆ అబ్బాయి గట్టిగా మాట్లాడకూడని భాష మాట్లాడుతూ, అరుస్తూ, తూలుతూ వస్తున్నాడు! అది విన్నాక మహేంద్ర లక్ష్మణ్ కధలు వింటానన్నాడు. అది విన్న లక్ష్మణ్ ఆనందం ఇంతా అంతా కాదు. చెప్పడం మొదలెట్టాడు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..పేరు: బులుసు సరోజినిదేవిప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు. వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో, ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు |