Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

రాహుల్ రూమ్ నీట్ గా సద్ది ఉంది. కిటికీ దగ్గర చక్కని టేబుల్, కుర్చీలు, పుస్తకాలు వరుసగా పేర్చి ఉన్నాయి. చదవడం మొదలు పెట్టాడు రాహుల్. నాలుగు లైన్లు చదివాడో లేదో కిలకిలలు, కలకలలు. తోటలో చెట్లకి తాళ్ళేసి ఊయలలు కట్టి ఊగి పారేస్తున్నారు సీతా, దాని చెలికత్తెలు! ఊగింది పో. ఆ పోకిరీ నవ్వులేంటి? నవ్వింది పో. నవ్వుల్తో పాటు పైట వదిలెయ్యడాలేంటి? ఓ పిన్ను గట్టిగా పెట్టుకుని చావొచ్చుగా? తాను ఎన్నింటికని ఓపిక పడతాడు? ఎన్ని వార్నింగ్ లిచ్చినా పెడ చెవిన పెడుతుంటే అక్కడికీ వదిలేశాడు ‘పోన్లే’ అని. చూసి చూసి విసుగొచ్చి పుస్తకం విసిరేసి నిద్రపోయాడు.

ఆ సాయంత్రం నాలుగు అయ్యాక తోటలోకెళ్లి ఓ చెట్టుకింద కూర్చుని చదువుకుంటున్నాడు. ఆ పక్కనే పూలతోట. భలే ఆహ్లాదంగా ఉన్నాయి పూలు. ఏమంది తన ఫ్రెండ్స్ తో అప్పుడు?

అసలు అమ్మని అనాలి. ఆ గేంగ్ ని అంతా ఎంటైర్ టైన్ చేస్తుంది? వాళ్ళకి పూలజడలల్లుతుంది. ఒకప్పుడు తాను ఈ చుట్టుపక్కల ఉన్నాడంటే ఒక్కరూ వచ్చేవారు కాదు. అమ్మ ఇచ్చిన అలుసు కదా? ఆడపిల్ల పుట్టలేదని... ఈ గజ్జెల్ని ఎవరైనా ఎంటర్ టైన్ చేస్తారా?

“ఏమే సీతా! ఏమంటున్నాడు హీరో?” అనే మాటలు వినిపించి శ్రద్ధగా చెవులు రిక్కించాడు. ‘ఓహ్! ఇక్కడుందా మంకీ బాచ్! చూద్దాం ఏం మాట్లాడుకుంటారో? తను వాళ్ళకి కనపడడు. పొద ఒకటి తనని దాచింది.

“వాడి మొహం!” ఆ గొంతు సీతది. ఉలిక్కిపడ్డాడు.

“చినబాబుగారూ! కళ్ళు కొద్దిగా జరుపుతారా?” అని కదూ తాను అడ్డుగా ఉంటే వినయంగా అంటుంది?

“పరీక్షలట కదా? నేను చూసా. చదువుకుంటుంటే!” అంది ఒకత్తి.

“వాడి మొహం అని చెప్పానా?”

“ఓసోస్! ఇది ఇంటర్ చదువుతోందని పొజే!”

“ఏం కాదులే!” అంది సీత.

“నిన్న డాబా మీద నుంచి ఫోటోలు తీస్తున్నాడు. నేను చూసా!” అంది ఇంకోపిల్ల.

“ఎవరివి?” ఆత్రం సుశీలకి.

అబ్బో! సుశీలా... సూర్యుడు అస్తమిస్తుంటే  ఫోటో తీశాడు. నేను చూసా!”

“వాడి మొహం!” అంది సీత టపీమని.

“ఏంటిది? యజమాని కొడుకుని వాడి మొహం అంటుందా? దొరక్కపోతుందా? అయిపోయావ్ సీతా!” పళ్ళు పర పరా నూరాడు రాహుల్.

పిలక పీకి చేతిలో పెట్టి ‘నీమొహం అనకపోతానా? పీ తా... అయిపోయావ్ పో” అనుకున్నాడు కసిగా.

“ఏం చేస్తాడులే! చదువు, చట్టుబండలూ లేవెలాగు...!” అని దీర్ఘం తీసింది.

“ఏమో బాబు... ఎప్పుడూ పుస్తకం ఉంటుంది చేతిలో!”

“బుర్ర్రొండొద్దూ? ఎందుకులే?” అంది సీత విస్సాటంగా.

“చెప్పవే చెప్పు... నీకంటే చనువు ఆ ఇంట్లో!” ఎవత్తో తెగ బతిమాలుతోంది.

“పర్లేదు చెప్పవే...! ఇందాకటి గొంతులో ఒకటే ఆతృత!

“దా! నేను చెప్తాను. లాగి లెంపాకాయుచ్చుకుని!” అనుకున్నాడు రాహుల్.

“బుర్రలో ఏమి లేదు. నజ్జు. ఆ పెద్దాయన ఒకటే గుర్రు మనేది ఎందుకు? ఏం చదివినా, ట్యూషన్లు పెట్టినా బుడ్డోడికి అక్షరం ముక్క రాలేదుట! గాడిదలు కాయడానిక్కూడా పనికిరాడని పెద్దాయన ఒకటే తిడతారు!”

కిసుక్కుమన్నారు చెలులు. “నేనెల్తానా? ఉత్తుత్తినే నన్ను బెదిరిస్తాడు. నా కాలి మువ్వలమీద కన్ను. సౌండ్ పొల్యూషన్!! తట్టుకోలేడు. ఇంత చక్కని ఘల్లు ఘల్లు మనే ఈ సంగీతం వినలేడు, నన్నేమీ అనలేడు బిడ్డ!” అంది.

“ఎందుకో?” కవ్వించిందోపిల్ల.

“వాళ్ళ నాన్న వెర్రి వేషా లేస్తే తాట తీస్తాడు!”

“అసలు మనోడి సదువెంటీ?”

‘ఇప్పుడందరూ అదే నమిలి పారేస్తున్నారు. బీటెక్ అనీ అంటారు’

“అంటే!”

“టెక్కు అని అదో చదువు!” అంది సీత.

“కాలేజీలో తిన్నగుంటడా?”

“తెల్దా? రేగింగు అని ఒకటి ఉంటదిలే. కిందటేడు మనోడు ఒకమ్మాయిని తెగ అల్లరి ఎట్టాడంటా! బొక్కలో ఎడితే ఇడిపించుకొచ్చారంట అయ్ గోరు! అప్పటి నుంచి అమ్మాయిలంటే టెర్రర్. మనం ఏటన్నాతిరిగి ఏటీ ఆనడు. భయ్యం!!”

ఉడికిపోయాడు రాహుల్. గుమాస్తా గాడికి నాన్న చెప్పుంటారు. వాడు దీనికి చెప్పుంటాడు. ఇది అందరికీ ఉప్పందిస్తోంది.

“అసలు ‘రాహుల్ ‘అంటే ఏమిటే అర్ధం?” ఆ చెలికి అసలు పని లేనట్టుంది.

“రావణాసురుడు ఆమాత్రం తెలియదా? మొన్న హరికథలో భాగవతార్ చెప్పిండు!” అంది సీత.

గలగల నవ్వులు. ఇంక మనసు పాడయిపోయింది రాహుల్ కి.

‘అయిపోయింది సీత!’ అనుకున్నాడు. పళ్ళు పట పట కొరికాడు. దీని పని ఇంక ఆఖరంతే!!!

******

ఓ రోజు-

“ఏరా రాహులా! లెగరా! పొద్దెక్కింది. రేత్రంతా సదివావా?” వెంకట్రావు కొడుకుని ప్రేమగా లేపాడు. వెనక సీత కాఫీతో! కాఫీ తీసుపొమ్మని సైగ చేసి గింజుకున్నాడు ‘ఇదెందుకొచ్చిందా?’ అని. కాఫీ తాగే దాకా నిలబడి ఖాళీ కప్పు పట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్తుంటే కోపంగా చూశాడు. భయపడ్డట్టు యాక్షన్ చేసింది.

తండ్రి ఊళ్ళో విషయాలు, ఆస్తులు,తగాదాలు, వివాదాలు చెప్తున్నాడు. ఒక్క మాటా వినలేదు రాహుల్. ‘ఎందుకీ సోదంతా నాకు?’ అనుకున్నాడు.

“ఆదిరా సంగతి! ఇంకెంత కాలం ఇదంతా చూసుకోను? చదువైపోగానే వచ్చేయ్ ఇక్కడికి!” అన్నాడు.

“ఎక్కడికి?” అయోమయంగా అడిగాడు.

“పొలం పనులూ, వ్యవహారాలు చూసుకోడానికి. ఈ ఆస్థికి వారసుడివి నువ్వేగా?” అన్నాడు మహా గర్వంగా!

మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయింది రాహుల్ కి.

పసిగుంటడికి భుజాలమీద కర్ర, పొలం దగ్గర నుంచొని చుట్ట కాల్చి పుసుక్కున ఉమ్మి,

“ఏరా! ఎంతవరకు వచ్చింది?” అని పాలేరు ని అడిగినట్టు, గ్లోబుని గిరగిరా తిప్పినట్టు కళ్ళు తిరిగాయి.

“దేవుడోయ్! ఇంక ఈ ఊరుకొస్తే ఒట్టు!” అనుకుని చిన్న నవ్వు నవ్వాడు గొడవలెందుకని.

“నా బంగారు తండ్రి! నా మాట వింటాడని తెలుసు!” అని పొగిడేస్తున్నాడు తండ్రి.

“పోన్లే కాస్సేపు సంతోష పడనీ!” అనుకున్నాడు రాహుల్.

******

సాయంత్రం అయిదవుతోంది. రాహుల్ రాత్రంతా చదవడం వల్ల మధ్యాహ్నం నిద్ర వచ్చేసింది. మెలకువ వచ్చాక గమనిస్తే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రూమ్ లో నుంచి బయిటికి వచ్చాడు. చకచకా మెట్లు దిగి వంటింటి దగ్గరకు వచ్చాడు. పావని తల్లి రాజవ్వ తలెత్తి చూసి-

“లెగిసినవా.. . ఇంద కాఫీ!” అంది గ్లాసుతో ఇస్తూ.

“ఎవరూ లేరా ఇంట్లో?” అడిగాడు.

“సింతల్రేవు సెరువు కాడ తోలుబొమ్మలాట! ఇప్పుడు తక్కువయిపోనాయి కదా? నువ్ లేగంగానే లగెత్తుకు రమ్మంది మీయమ్మ. సిన్నప్పుడు ఇష్టంగా సూసె టోడివంట!” అంది పొడిగా. ఆమె మొహం లోకి చూశాడు. వెళ్ళాలని ఆశగా ఉన్నట్టుంది.

“వంటయిపోయిందా రాజవ్వ రాత్రికి?” అడిగాడు.

“పది నిముషాల్లో అయిపోద్ది. ఇదుగో పూతరేకులు, జంతికలు. తిను!” అంది అందిస్తూ.

“ఇప్పుడు ఒద్దులే!”అన్నాడు. సరే అంటూ డబ్బాలో పెట్టేసింది.

“పోయొస్తావ నువ్వు?” అన్నాడు. గొప్ప ఉత్సాహంగా తలెత్తింది.

“పోయి రానా?”అని

“అమ్మేమంటాదో?” సందేహంగా ఆగింది మళ్ళీ.

“నే సెప్తాలే! ఎల్లు!” అని హాల్లోకి వచ్చాడు. రాజవ్వ వెళ్ళిపోయింది.

కొట్టు గదిలో శబ్దం వినిపించింది. ‘ఏంటా?’ అని తొంగిచూశాడు.

వెదకబోయిన తీగ. కాలికింది కట్లపాము. రాక్షసి, గజ్జెల మోత అక్కడుంది.

“ఎవరదీ?” అడిగింది సీత.

“లోపలేం చేస్తున్నావ్?” అడిగాడు.

“అమ్మ సామానంత చిందరవందర గా ఉంది. ఓ పక్కగా పెట్టమంది!” చెప్పింది. సీత చేతిలో పెద్ద గిన్నె ఉంది. దాన్నట్టుకు కొట్టేయ్యాలనిపించింది రాహుల్ కి.

“సద్దేసావా? లోపలికి అడుగుపెట్టాడు.

“ఇంకా లేదు. సాయం చేత్తావా?” అంది వెక్కిరింతగా. దగ్గరికి దగ్గరికి వస్తున్న రాహుల్ ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు సీతకి. భయం వేసింది. రాహుల్ బలంగా ఉంటాడు. సూటిగా చూస్తాడు. నెమ్మదిగా వణకడం గమనించాడు రాహుల్. మహా సరదాగా ఉంది. దొరికింది పిట్ట.

“ ఏంటీ... నీ ఫ్రెండ్స్ తో అంటున్నావ్ ఏమనీ?” వాడి మొహం! వాడి మొహం! అని కదూ?

“ఎప్పుడూ?” గొంతు తడారిపోతుంటే అడిగింది.

“నిన్న తోటలో!”

“నేను కాదు!”

“నీ గొంతు నాకు తెలీదా? అందరూ కొచ్చెన్లేస్తుంటే తెగ రెచ్చిపోయావ్? నాది పేయిడ్ సీట్ కదూ?” అడిగాడు.

“నేనా ముక్క అనలేదు!” రోషంగా అంది సీత.

“లేని పోనివి కల్పించకు!” అంది మళ్ళీ. జుట్టు పట్టుకుని లాగాడు. తన వైపు తిప్పుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగాడు.

“చెప్పు ఇప్పుడు!” అన్నాడు జుట్టు వదిలేస్తూ. పారిపోబోయింది. ఓణీ పట్టుకుని ఆపుదామని పైట పట్టి గట్టిగా లాగాడు. ఓణీ చేతుల్లోకి ఊడి వచ్చింది. గుండెలకి చేతులు అడ్డుపెట్టుకుంటూ హాల్లోకి పారిపోయింది.

”సీతా! ఇదుగో నీ ఓణీ!  తీసుకో... ఎక్కడున్నావ్?” అరిచాడు.

గజ్జెల చప్పుడు మేడ మెట్లు ఎక్కుతున్నట్లు. చప్పుడవకుండా జాగ్రత్త పడుతున్నట్టు. ఫాస్ట్ గా వెళ్ళాడు. రాహుల్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేసుకోబోయింది. టక్కున తలుపు తోసి గడియవేయకుండా జాగ్రత్త పడ్డాడు. సర్రున అతన్ని దాటుకుంటూ కిందకి పరుగెట్టింది.

“దీందుంపతేగా! ఇంత స్పీడా?’ వెనకే పరుగెట్టాడు. హాలులో వంటింటి వైపు నించుంది. పెరటిదారి వెంబడి పరుగెత్తాలన్నా ఓణీ అతడి చేతిలో ఉంది.

“ఒక ఆట ఆడిస్తే?” చిలిపి ఆలోచన వచ్చింది రాహుల్ కి. అడ్డంగా ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని నెమ్మదిగా ఊగడం మొదలుపెట్టాడు. ఉయ్యాల గొలుసులు కిర్రు కిర్రుమంటున్నాయి.

“నా ఓణీ నాకిచ్చేయ్!” అంది.

“తీసుకో!” అని చెయ్యి చాపాడు. సిగ్గుని అదిమిపెట్టి అందుకోబోయింది. ఒక్క పరుగు తీశాడు. వెనకే పరుగెడుతూ ఇవ్వమని అరిచింది. దొరకకుండా పరుగెట్టి ఆమె దగ్గరగా వచ్చి ఆగాడు. రొప్పుతూ ఆగిపోయింది. ఇంతలో-

వీధి తలుపులు ధడాల్నతెరుచుకున్నాయి. ఆగి అటు చూశాడు. పరిగెత్తుతున్నట్టు ఫోజు ఉంది. తన చిన్ననాటి మిత్రుడు భగవాన్లు, పాలేరు శంభు.

శంభు నోరుతెరుచుకుని ఉండిపోయాడు. సీత లంగా, జాకెట్టుతో నిలబడి ఉందేమిటి? ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు భగవాన్లు!

వెనక్కి రెండు అడుగులేసి ఓణీ ని అందించాడు రాహుల్!

సీత గబుక్కున లాగేసుకుని చుట్టేసుకుంది.

“అక్కా! అన్యాయమై పోయావా? బావురుమన్నాడు శంభు.

ఉలిక్కిపడ్డారు ఇద్దరూ!

“ఇంత పని చేస్తావనుకోలేదురా! అన్నాడు భగవాన్లు.

“ఏం చేశానూ!” అన్నాడు రాహుల్. అతడికి అప్పుడు వెలిగింది టక్కుమంటూ లైటు.

“అదేం లేదు. మీరు పొరబడుతున్నారు!” అంది సీత భగవాన్లు తో.

“కంటికి కనబడుతుంటే పొరబడడం ఏంటి చెల్లెమ్మా?” అని మొహంలో వేదన చూపించాడు భగవాన్లు. మొన్నటి దాకా సీతకి తెగ పోజులు కొట్టేసిన భగవాన్లు వరస కలిపేశాడు.

రాహుల్ కి శివమెత్తిపోతోంది. శంభు అదే పనిగా ఏడుస్తున్నాడు తనకేదో అయిపోయినట్టు. సీత శంభు దగ్గరికి వెళ్ళి చెవిలో జరిగింది చెప్పింది. గట్టిగా చెప్తే వినని శంభు చెవిలో రహస్యంగా చెప్తే విన్నాడు. ‘నిజమా?’ వాడి కళ్ళు మెరిసాయి. ‘

“చినబాబు! పొరపాటయిపోనాది నాది!” అన్నాడు.

“ఏమయిందిరా?” అడిగాడు భగవాన్లు శంభుని.

అంతా వివరంగా చెప్పాడు శంభు!

ఎవరు చెప్పినా తాను ఊహించుకున్నదానికి భిన్నంగా వినేట్టు లేడు భగవాన్లు. ఏదో జరిగిపోయిందనుకుంటూ ఉంటే, ఏమి జరగలేదని తెలిసాక ‘మజా’గా లేదతడికి. తల అడ్డంగా ఊపాడు తను నమ్మడం లేదని.

“అరె! ఇనుకోండి. నిన్న తోటలో సీత ఆడంగులందరినీ ఏసుకొచ్చి అబ్బాయి గారు సమంగా సదువుకోరని ఎకసెక్కాలాడిందిట. ఆదేమో అబ్బాయిగోరు ఇనేశారట. ఈ రోజు సీత ని నిలదీశారా? అడిగిదానికి జవాబు సెప్పకుండా ఎల్లిపోతుంటే కొంగు సిగురు అట్టుకున్నారంట. ఆదేమో ఊడి ఎలిపోవచ్చింది. ‘ఇంకెప్పుడూ అనకు” అని ఓణీ ఇస్తన్నారండి. మనం ఒచ్చాము. అసలు మన కళ్ళే మనని మోసం చేయడం అంటే ఇదేనండీ!” అన్నాడు.

భగవాన్లు రాహుల్ వీపు మీద చరిచాడు. ఇంతలో కాత్యా వచ్చింది. వచ్చీ రాగానే ఈ కథంతా ఆవిడకి చెప్పాడు. కాత్యా మొహం ఎర్రగా, కందగడ్డలా మారిపోయి సీతని పంపిచేసింది. గట్టిగా అరిచింది రాహుల్ మీద! రాహుల్ ఏదో చెప్పబోతే-

“అదేమన్నా దాన్ని నువ్వు తాకడం తప్పు!” అంది ఉగ్రంగా.

శంభు గాడు ఊరు ఊరంతా ఇదే విషయం చెప్తాడు. వాడి నోరు ఊరుకోదు. తనకి తెలుసు. ఆపినా ఆగదు. అందుకే భర్త తో ముందే చెప్పేసింది కాత్యా!

విషయం ఎంత చిన్నదయినా, ఆవగింజ అయినా జనాల నోట్లో ఎలా పేలుతుందో వెంకటాద్రికి తెలుసు. తండ్రి అగ్గిమీద గుగ్గిలం అయిపోవడం, తల్లి చీటికీ మాటికీ తిట్టి పోయడం భరించలేకపోతున్నాడు. తల్లి సరిగా మాట్లాడదు.కన్నెత్తి చూడదు. అతని గారాల్ని పట్టించుకోవడం మానేసింది. సీత రానేలేదు మళ్ళీ. రెండు మూడు రోజులు తీవ్రంగా ఆలోచించాడు రాహుల్.

ఇంక తండ్రి తనని పొలం పనుల్లో పెట్టడం ఖాయం. ఊరికి పెద్ద గా ఉండడం, అజమాయిషీ చేయడం, ఊరంతా తన మాట వినడం బాగుంటుంది కానీ తనకి నచ్చనివి.

ఇంక సీత!

సీతా, సీత అల్లరి తనకెంత మురిపెంగా, హాయిగా తోచినా ముభావంగా ఉన్న కారణం “దీపాలి!” తన క్లాస్ మెట్. రాహుల్ కి ఆమె అంటే పిచ్చి. చాలా మాడర్న్ గా ఉంటుంది. చక్కని ఇంగ్లిష్ అందంగా మాట్లాడుతుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా సెక్సీ గా కనపడుతుంది.

కాలం ఇంత వేగంగా మారిపోతూ ప్రపంచమంతా ఆధునికత లో ‘ఝామ్, ఝామ్‘ అని పారిపోతూ ఉంటే తాను సీత లాంటి లంగా, ఓణీని చేసుకుని పొలం దున్నుకుంటూ, విత్తనాలు చల్లుకుంటూ, పురుగుల మందులు పిచి కారీలు కొట్టుకుంటూ –

దేవుడోయ్! వల్ల కాదు. సీత ఎంతైనా చదువుగాక! కలక్టరో, దాని బాబో అవుగాక! తన కొద్దంటే ఒద్దు. తనకి ఏ ముంబాయో, పూనా నో, ఢిల్లీయో కావాలి. అంతే!

సిటీ సొబగే వేరు! ఆ స్టయిలే వేరు! తల గట్టిగా విదిలించి పెద్ద శబ్దంతో తలుపుల్ని మూసేశాడు.

“ఏంటే? వీడు చదువుతున్నాడా? తలుపులు బిగించేస్తున్నాడు. గాలి ఉండొద్దూ? అసలే వేడిగా ఉందీ మధ్య. ఏ.సి. పెట్టించనా? భార్యని యధాలాపంగా అడిగినట్టు అడిగి ఆ మధ్యాహ్నమే పెట్టించేశాడు. తనని ఇక్కడే ఉంచెయ్యాలని ప్లాను. ఎన్నడూ లేనిది బుద్ది గా చదివాడు. పరీక్షలు రెండు రోజులున్నాయనగా తనకేమేం కావాలో పాక్ చేసేసుకుని గుమ్మం దాటేశాడు రాహుల్.

పదిహేను రోజులు గడిచాక పరీక్షలయిపోయాయనీ, చినబాబుగారు ‘దీపాలి ‘అనే అమ్మాయితో ఒకర్ని ఒకరు అర్ధం చేసుకునేందుకు ‘డేటింగ్’ వెళ్ళారని, వచ్చాక ఏదో అపార్ట్మెంట్ లో కలిసి ఉంటారనీ చెప్పలేక చెప్పాడు గుమాస్తా ఎంక్వయిరీ చేయించి మరీ! వెంకటాద్రి, కాత్యా నోట మాట రానివాళ్ళల్లా ఉండిపోయారు.

దేశమంతా హాయిగా తిరిగిన రాహుల్ తిరిగివచ్చాక –

ముందే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న ఫ్లాట్ లోకి

దీపాలి తో సహా వచ్చి చేరిపోయాడు.

ఆ ఫ్లాట్ ఉన్నది లక్ష్మీ నగర్ కాలనీ లోని “బడ్డీ ఎన్ క్లేవ్” లో.

******

అన్నిజంటలూ హాయిగా గాలికి ఎగురుతూ ‘బడ్డీ ఎన్ క్లేవ్‘ లోకి చేరిపోయాయి. ఇప్పుడు అంతకు ముందే అక్కడున్న కుటుంబాల్లో పరమ నిష్ఠ గల ఆయన జాతీయ బాంక్ మేనేజరు పరమేశ్వర్. సిన్సియర్ ఆఫీసరనే గొప్ప పేరుంది. అతనుండేది మొదటి ఫ్లోర్ లో.

నుదుటి మీద విభూదిరేఖలతో దాని నడుమ గంధపు బొట్టు తో దాని మీద కాస్త కుంకుమ బొట్టు అద్ది గొప్ప వెలుగుతో దేదీప్యమానం గా ఉంటాడు. అతనికి అనుకూలంగా ఉండే అతని భార్య అన్నపూర్ణ. ఇంటర్ చదివే కొడుకు శౌర్య, బి.ఎస్.సి చదువుతున్న కూతురు వాసంతి తో వారా ఫ్లాట్ కి వచ్చి రెండేళ్ళు. బడ్డీ ఎన్ క్లేవ్ లో ప్రెసిడెంటు, సెక్రటరీ తప్ప మిగిలిన అందరూ టెనెంట్స్. మొత్తం పదిహేను ఫ్లాట్స్. అందరూ ఈ మధ్య నే కొత్తగా చేరినవాళ్లే!

ఎవరెలాంటి వారో ఇంకా కొరుకుడు పడలేదు ‘వాచ్ మెన్ లక్ష్మణ్ రావు కి!’ అతని వయసు యాభై ఉంటుంది. భార్య కాలం చేశాక పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలతో పడలేక ఇల్లు రణరంగం గా మారినప్పుడు తానింకా బరువని “దాస పాలెం’ నుంచి శాశ్వతంగా విశాఖ కి వచ్చి వాచ్ మెన్ గా స్థిరపడ్డాడు.

లక్ష్మణ్ రావు అక్కడికి వచ్చి అయిదేళ్ళయింది. ఎవరెవరో వస్తున్నారు. పోతున్నారు. స్థిరంగా ఉండేవాళ్ళు ఒక్కరూ కనపడడం లేదు. ఇప్పుడొచ్చిన వాళ్ళల్లో కాలేజీ పిల్లలు, సహజీవనం చేసేటోళ్ళే ఎక్కువ. పొద్దుట డ్యూటీలకెళ్తే రాత్రికి ఇళ్ళకొస్తారు. శని,ఆదివారాల్లో పిక్ నిక్ లు, సినిమాలు, పార్టీలు. తీరుబాటుగా, విశ్రాంతిగా కూచోడం, ఒక్కసారి కూడా చూడలేదు. వీకెండ్ అంటూ ఈ తిరగడాలు అతడికి నవ్వు తెప్పిస్తాయి. ఆ పరుగులు అర్ధం కానివని అనిపిస్తుంది.

అందరిలో పరమేశ్వర్ కూతురు ఒక్క వాసంతి తల్లే చక్కని పిల్ల. ఈ కాలంలో ఉండాల్సిన అమ్మాయే కాదు. ఆ అమ్మాయి ఏ పని చెప్పినా చెయ్యబుద్దేస్తుంది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in August 2024, కథలు

2 Comments

  1. సుధా లక్ష్మి చిట్టా

    కథ బాగుంది… మిగతా భాగాలు ఎక్కడ దొరుకుతాయి?

    • Sirimalle

      సుధా లక్ష్మి గారు, కథ మొదట్లో “గత సంచిక తరువాయి” అనే లింక్ వుంది. గమనించండి. దాన్ని క్లిక్ చేస్తే ముందరి భాగాలను చూడవచ్చు. లేదా పాత సంచికలలో కూడా చూడవచ్చు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!