Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

తెల్లవారగానే పెట్టె బేడా తో వచ్చేశాడు సిరీన్.

“కాఫీ తాగుతావా?” అడిగింది.

“నో! హెల్త్ విటా!” బాగ్ లోనుంచి బాటిల్ తీసుకున్నాడు.

“అదిగో! నీరూమ్. అన్నీ సద్దుకున్నాక పొద్దుట వంట నీది. సాయంత్రం నాది. నీకు రెండు రోజులు రెస్ట్, వంట వచ్చా?” వచ్చు అన్నట్టు తలూపాడు.

“కారాలు పొయ్యకు. అంతా సోబర్ గా ఉండాలి. సండే మాత్రమే మసాలా.” అంది. తలూపాడు. మర్నాడు పొద్దున్నే కిచెన్ లోకి దూరిపోయాడు. సంజన తయారయ్యేసరికి రెండు బాక్స్ లు అందించాడు. తానూ బాగ్ లో సద్దుకున్నాడు. కలిసే బస్ ఎక్కారు.

ఆ సాయంత్రం –

“ఏంటీ గిటార్ ఉంది. వాయిస్తావా?” అడిగింది.

“అవును. టైం ఉన్నప్పుడు రాత్రుళ్లు క్లబ్బుల్లో, పబ్బుల్లో పాడతాను. పార్ట్ టైమ్ జాబ్!”

“డబ్బు అంత అవసరమా?” అడిగింది.

“హాబీ! చాలా ఇష్టం!” అన్నాడు.

“ఏదీ పాడు!”

“పబ్ కి ఓ రోజు  తీసుకెళ్తాలే!” అన్నాడు.

సిరీన్ ఎక్కువ మాట్లాడడు. ఇంగ్లీష్ నవలలు రాక్ నిండా సద్దాడు. ఎప్పుడూ ఒక పుస్తకం ఉంటుంది అతడి చేతిలో. కిటికీ దగ్గర కూర్చుంటాడు. ఏవేవో ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉంటాడు.

పది రోజుల తర్వాత _

“ఏంటీ? ఈ రోజు రావా?” అన్నాడు షూ లేస్ బిగిస్తూ.

“లే” అంది.

“ఏం?”

“లేడీస్ సిక్”

“లీవ్ లెటర్ ఇచ్చేయ్. సబ్మిట్ చేస్తా.” అన్నాడు.

“ఇప్పుడెవడు రాస్తాడు? డిక్టేట్ చేస్తా నువ్ రాసేస్తావా? సంతకం పెడతాను!” అంటూ బద్దకంగా దివాన్ మీద వాలింది. నవ్వుతూ లెటర్ పాడ్ అందుకుని చెప్పమన్నాడు.

‘డే’ షిఫ్ట్ లు చేసేవాళ్ళకి ‘సండే హాలీడే’ గనక తనకి ఎటువంటి శలవు వద్దని, దయచేసి సిరీన్ అనే అతను జాబ్ ని ఇంత డెడికేటెడ్ తో చేస్తున్నందున ఈ సండే అతడికి లీవ్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను” అని రాయమనగానే తనని తాను చూసుకుంటూ పెద్ద పెట్టున నవ్వాడు.

“సంజనా! యార్!!” అంటూ మళ్ళీ మళ్ళీ నవ్వాడు. అతడు నవ్వడం ఎంతో బాగుంది సంజనకి. డ్రెస్ ఛేంజ్ చేసి రిలాక్స్డ్ గా కూర్చున్నాడు. ఆమె వైపు తీరిగ్గా చూశాడు. సంజన అయిదడుగుల మూడు అంగుళాలే ఉంటుంది. సిరీన్ దగ్గర పొట్టిగా కనపడుతుంది. పొడుగాటి జుట్టు. జీన్స్ వేసుకున్నా ఎబ్బెట్టు గా ఉండదు. ఏదైనా ఒకేసారి చెప్తుంది. అందమని చెప్పలేం గానీ ఆకర్షణీయంగా పదేపదే చూడాలనిపించేట్టుగా ఉంటుంది.

“ఏంటలా చూస్తున్నావ్? లైనా?” అడిగింది.

“లైనా? పాడా? నా కంత ఓపిక, తీరిక లేవమ్మా తల్లి!” అన్నాడు.

“ఏం చేద్దాం ఈ రోజు?” అడిగింది.

“నేనైతే ఫుల్ నిద్ర తీస్తా! నువ్ నీ ఇష్టం. ఏదైనా వండేసిపో ప్లీజ్!” అన్నాడు.

“ఎక్కడికి పోను? పోనీ నీతో కబుర్లు?” అంది.

“తల్లోయ్! ఇప్పుడు నన్ను చంపకు. రాత్రంతా ఫుల్ గా పాడాను. సెకండ్ సింగర్ రాలేదు!” అన్నాడు. నవ్వి కిచెన్ లోకి వెళ్ళింది.

“ఎందుకింత కష్టపడడం?” కిచెన్ లోనుంచి గట్టిగా అడిగింది.

“ఓపిక ఉన్నపుడే సంపాదించాలి!” అని గది తలుపు వేసేసుకున్నాడు.

మధ్యాహ్నం రెండు దాటినా సిరీన్ నిద్ర లేవలేదు. ఆకలిగా ఉన్నా తినకుండా వెయిట్ చేసింది. రెండు మూడుసార్లు  గది తలుపు మీద తట్టి చూసింది. ఐదు నిముషాలు ఆగి తలుపు గట్టిగా బాదింది. తలుపు తెరుచుకుంది. బాగా నిద్రలో ఉన్నట్టున్నాడు.

“రెండు గంటలు దాటుతోంది. భోజనం చేద్దామా?” అడిగింది.

“నాకోసం చూస్తున్నావా? ఒక్క నిముషం లో వస్తా!” అన్నాడు.

తింటూ ఉండగా ఏదో కాల్ వచ్చి తీసి చూశాడు. నెంబర్ చూడగానే అతడి మొహం వాడిపోయింది. లిఫ్ట్ చేసి-

“నేను కాల్ చేస్తాను ఈవినింగ్! ష్యూర్!! మళ్ళీ చేయొద్దు. ఒద్దుఒద్దు!” అన్నాడు.

మూడు నిముషాల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది.

“ఒద్దు అన్నానా? నాకు టైమ్ ఉంటే నేనే రానా?” విసుగ్గా కట్ చేశాడు.

అలా ఈవినింగ్ మొత్తం కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆఫ్ చేస్తూనే ఉన్నాడు. ఒకసారి విసిగిపోయి –

“ఏంటీ? నేను ఫియాన్సీ దగ్గర ఉన్నాను. ఇంట్లో అందరూ ఉన్నారు!” చాలా గట్టిగా చెప్పాడు.

రాత్రి వరకు మళ్ళీ కాల్ రాలేదు. పది దాటుతుండగా కాల్ వస్తే సంజన లేచి తన గదిలోకి వెళ్తుంటే వద్దని సైగ చేసి ఆపాడు.

“చెప్పు జానూ!” అన్నాడు ఫోన్ లో.

“అవును అవును అవును. కానీ నేనేం చెప్పానునీకు? ముందే చెప్పాను కూడా. నేను పెళ్ళిచేసుకుంటానని ప్రామిస్ చేశానా? చూడు. నువ్వూ, నేనూ కలిసి ఉండడానికే అనుకున్నాం. నువ్వు లేనిపోని ఆశలు పెట్టుకుంటే అది నాతప్పా? అందుకనేగా వెంటనే ఖాళీ చేసింది?”

ఆమె ఏమందో కానీ-

“జానూ! నాకు అర్ధమయింది. ప్రేమ ఇద్దరికీ ఉండాలి. నీ దంతా ఎట్రాక్షన్! దాన్ని ‘ప్రేమ’ అనుకుంటున్నావు.” అన్నాడు.

“నేను నీకు చెప్పానా?” సిరీన్ మాటల్లో తీవ్రత చూశాక సంజన లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. అతడి  స్వవిషయాలు తనకి అనవసరం. అంతే!

కాస్సేపటి తర్వాత సంజనని పిలిచి క్లబ్ కి కాల్ చేయించి హెల్త్ బాగాలేదని రాలేనని చెప్పించాడు. సంజన మౌనంగా సోఫా లో కూర్చుంది. అతడు చాలాసేపు అసహనంగా హాలంతా కలియ తిరిగాడు.

“నన్ను కొంచెంసేపు భరించి నేను చెప్పేది విను!” అన్నాడు. సర్దుకుని కూర్చుంది.

జానకి మా ఊరి అమ్మాయి. బాగా రిచ్. నాకు ఉద్యోగం వచ్చాక ఈ ఊర్లో కలిసింది. తాను పనిచేసే కంపెనీ లో చూశాక కొలీగ్స్ అందరికీ ఒక ఊరి వారమని బాగా దగ్గర అని చెప్పుకుంది. మా ఊళ్ళో ఉన్నప్పుడు ఉండే డబ్బు గీర ఇక్కడ లేకపోవడం చూసి నాణేనికి ఇరుపక్కల చూడాలని, ఇంకో వైపు మంచి మనిషి కూడా ఉంటుందని భావించి చెయ్యి కలిపాను. సిటీలో ఆడ. మగ తేడా లేకుండా కలిసి మెలిసి ఆరోగ్యకరమైన స్నేహంతో ఉండడం తో మేమిద్దరం కూడా ఒకే ఫ్లాట్ ని ‘షేర్’ చేసుకున్నాం. కొంత కాలం బాగానే ఉంది. తాగడం, తిరగడం ఎక్కువయిపోతే వాళ్ళ నాన్నకి చెప్పక తప్పలేదు.

ఆయన ఆదరా బాదరా వచ్చి ‘డి.ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి మనిషి నార్మల్ అయ్యాక జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పజెప్పి వెళ్ళాడు. జానకి నన్నెంతో అభిమానిస్తూ, గౌరవం తో నా మాట వినేది. డబ్బు ఒకోసారి మనుషుల్ని బాగా పాడు చేస్తుందని, తనని ఎవరో మోసం చేశారని బాగా ఏడిచేది. నేను అనునయిస్తూ వచ్చాను. దానిలో ఆమెకి ఏమి కనిపించిందో పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసి, పల్లెలో ఉన్న మా ఇంటికెళ్ళి నన్ను ప్రేమిస్తున్నానంటూ గొడవ మొదలెట్టింది. మా మధ్య ఏమి లేదని మా వాళ్ళనీ, వాళ్ళ నాన్నకి నచ్చజెప్పేసరికి తాతలు దిగివచ్చారు.

మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న కష్టపడి సంపాదించి మాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. దాన్ని ఇంకా ఇంకా పైకి తీసుకురావాలని నా ప్రయత్నం. ఈ మధ్య జానకి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

అదో తెలివైన బెదిరింపు.

ఆమె ఏ పని చేయమంటే అది చేయాలి. నేను కొన్నాళ్లు బెంగుళూరు కేంప్ వేయించుకుని వెళ్ళిపోయాను. ఫోన్ చేస్తుందా? ‘ఇప్పుడొస్తావా? లేక చావనా?” అని బెదిరిస్తుంది. నేను ఆ పిల్ల ఎక్కడ ప్రాణం తీసుకుంటుందో అని ఎన్నో సార్లు ఆ బెదిరింపులకి బెదిరిపోయాను.

లాంగ్ డ్రైవ్ అంటూ దూరదూరాలు తిప్పడం, తనని ప్రేమించమని ఒత్తిడి చేయడం, అస్సలు సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం తో పిచ్చిఎక్కుతోంది.

ఈ మద్య నాన్నని పెంచుకున్న తండ్రి యావదాస్తిని నాన్న పేర రాశాడని తెలిసింది. పెంచుకోడానికి ఇచ్చాడే తప్ప ఎటువంటి అనుమతి పత్రం రాసివ్వలేదనే కోపంతో మా నాన్న ని సొంత తండ్రి దగ్గరికి పంపించినా, పెంచుకున్న మమకారం తో పోయేముందు ఆస్తి రాసిన విషయం జానకి తండ్రికి తెలిసింది. అంతే!!! నా మీద అవ్యాజ్యమైన ప్రేమని మోసుకొచ్చి తన కూతుర్ని చేసుకోవాలని ఒకటే పోరు.

“ఇప్పుడేమయింది సిరీన్? అంతా మంచే జరిగింది కదా? నీ కోసం అంతా పాకులాడుతున్నప్పుడు ఒప్పుకోవొచ్చుగా?” అంది సంజన.

తల గట్టిగా విదిల్చి అన్నాడు.

“సంజనా! జానకికి అస్సలు కుదురు ఉండదు. ఈ రోజు మాట్లాడే మాటకి, రేపు మాట్లాడ బోయే మాటకీ ఎక్కడా పొంతన ఉండదు. ఫ్రెండ్స్ అందరితోనూ ఒకలాగే తిరుగుతుంది. కొంచెం దగ్గరకొచ్చి మాట్లాడగానే దానికి “ప్రేమ” అనే పేరు పెడుతుంది. చాలా పెంకిది. అందరూ జానకిని దూరంగా పెడతారు. అంత ఫికిల్ మైండ్ ఉన్న ఆమెని పెళ్ళిచేసుకోవడం నా వల్ల కాదు. నా మెతకతనం తోనే ఇన్ని రకాలుగా వేధిస్తుంది. నలుగురిలో ఏమనడానికైనా వెనకాడదు. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు!” సిరీన్ చాలా వేదనగా అన్నాడు.

******

ఆ తర్వాత సిరీన్ తన రోజుని సిస్టమేటిక్ గా పెట్టుకున్నాడు. ఈవినింగ్ చీకటి పడుతుండగా వస్తాడు. ఫ్రెష్ అయి అక్కడున్న గ్రౌండ్ కి వెళ్ళి కాలేజీ కుర్రాళ్లతో ఆటలు ఆడతాడు. పాటలు పాడడానికి వెళ్ళి ఏ రాత్రో వచ్చి నిద్ర సరిగా లేకపోయినా పొద్దున్నే వంట చేసేస్తాడు. కాఫీ కలిపి ఫ్లాస్క్ లో ఉంచుతాడు. శాండ్ విచెస్ తయారుచేసి పెడతాడు.

చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారతడికి. కిందనుంచి ‘సిరీన్’ అనే పిలుపు వినపడుతూనే ఉంటుంది. అలా పిలవగానే బాల్కనీ అంచున నిలబడి కబుర్లు చెప్పుకోవడం, గేటు దగ్గర గుంపుగా చెరీ కేరింతలు కొట్టే వాళ్ళందరిని చాలా సార్లు చూసింది. ఇంట్లోకి రమ్మని ఒక్కసారి కూడా వాళ్ళని పిలవడు.

*****

ఒకరోజు సిరీన్ సోఫాలో గట్టిగా తన తలని చేతుల్తో పట్టుకుని కూర్చున్నాడు. ఆ రోజు జానకి పుట్టిన రోజట. ‘వస్తావా? చస్తావా?’ అన్నట్టు హఠంవేసుకుని ఉందామె. రెండు రోజుల ముందే స్లీపింగ్ పిల్స్ తీసుకుని సూసైడ్ చేసుకుంటున్నానని తీవ్రంగా బెదిరించింది. తల విదిలించుకుని లేచి గబగబా రెడీ అయి కంపెనీకి వచ్చాడు. అతడు మామూలుగా లేడని ఎవ్వరైనా ఇట్టే కనిపెట్టేయ్యొచ్చు కంగారు, కంగారుగా ఉంది అతని వాలకం.

జానకి నిజం గానే స్లీపింగ్ పిల్స్ మింగేసింది. కాకపోతే కాస్త తక్కువ మోతాదులో. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి తాను చనిపోతున్నట్టు అనౌన్స్ చేసి హడావుడి చేసింది. హుటాహుటిన ఆమె తండ్రి వచ్చి కొన్నాళ్లు తన కూతురి తో ప్రేమాయణం నడిపి సహజీవనం చేసినందుకు తన కూతుర్ని పెళ్ళి చేసుకోక తప్పదని సిరీన్ కి వార్నింగ్ ఇచ్చాడు.

షర్మిలకి ఆ క్రితం రోజు నైట్ డ్యూటి. అయినా ఆమె ఇంటికి పోకుండా సిరీన్ చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యం చెప్తూనే ఉంది. షర్మిల తండ్రికి ఉండే పలుకుబడి వల్ల ఈ గండం గట్టెక్కవచ్చని పదేపదే చెప్తోంది. సిరీన్ పెదవి బిగపట్టి కోపాన్ని, ఆగ్రహావేశాల్ని ఆపుకుంటున్నాడు. అది చూసి షర్మిలా వెంటనే ఫోన్ చేసి తండ్రితో మాట్లాడి విషయాన్ని వివరించింది. ఏదో ఉపద్రవం వచ్చి పడిపోతుందనే భయం నెమ్మదిగా కనుమరుగయింది. షర్మిల తండ్రి ఏమి చేశాడో గానీ జానకి సిరీన్ కి కాల్ చేసి ఏడుస్తూ తిట్టిపోసింది. చివరికి ‘ఏడవరా వెధవ’ అనే మాటతో పెట్టేసింది. అక్కడితో తుఫాన్ వెలిసిపోలేదు. వెళ్ళేముందు అతలాకుతలం చేసి పోయినట్టు సరిగ్గా సిరీన్’ ప్లే గ్రౌండ్’ లోవాలీబాల్ ఆడుతున్నప్పుడు జానకి హడావిడిగా వచ్చి ఏడ్చి, తిట్టి, భోరుమని ఏడ్చి గోల చేసిపోతూ... కాలనీ వాళ్ళందరూ వింతగా చూస్తూ ఉండగా.. .పార్కులో ఉన్న ప్రతిఒక్కరికి తనని మోసం చేశాడని చెప్తూ వలవలా ఏడ్చింది.

గమ్మత్తేమిటంటే, ఒకటికి పది చేర్చి చెప్పుకోవడం జనానికి సరదా! ఫలితం సిరీన్ బయటికి వెళ్ళడం తగ్గించాడు. అందరూ అతన్ని అదోలా చూడడం మొదలయ్యింది. ఆ అపవాదుకి బలైపోయిన సిరీన్ చాలా ‘డల్’ అయిపోయాడు. ఈలోగా సంజన అఫీషియల్ ట్రిప్ కి పూణే వెళ్ళాల్సివచ్చింది. ఏం చెయ్యాలి? ఇలాంటి కష్ట సమయంలో సిరీన్ వదిలి వెళ్లిపోవడం కరక్ట్ గా అనిపించక ఎలాగూ జానకి పీడ వదిలిపోయింది గనుక ఇంకా అక్కడినుంచి మారిపోవడమే సరైన నిర్ణయం అనుకుంది. మర్నాడు ఆఫీస్ బాయ్ ని అడిగితే ‘లక్ష్మి నగర్ కాలనీ, బడ్డీ ఎన్ క్లేవ్’ ఖాళీ ఉందని చెప్పాడు. చూసి అడ్వాన్స్ఇచ్చాక సిరీన్ తో చెప్పి ఆశ్చర్యపరిచింది. సంభ్రమంతో ఆమె చేతుల్ని ఊపి కృతజ్ఞత చెప్పాడు.

సామానంత రాత్రికి రాత్రే పాక్ చేసేశారు. నేను జాగ్రత్తగా షిఫ్ట్ చేస్తానని ఆమెను ట్రైన్ ఎక్కించి మర్నాడు’ బడ్డీ ఎన్ క్లేవ్’ లో చేరిపోయి కిటికీ దగ్గర కూర్చుని తేలిగ్గా, హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు!

******

అప్పన్న గారి పాలెం! అచ్చ తెలుగు పల్లె!

ఆ రోజు కాత్యా చాలా అసహనంగా ఉంది. ఊరు ఊరంతా ఇంక ఈ సంగతే మాట్లాడుకుంటారు. ఇంతని అంతచేసి చెప్పే మనుషుల్ని ఏమనాలో కూడా తెలియదు. ఎక్కడ ఏం జరుగుతుందా అని కాపు గాసే గుంట నక్కలు. పల్లెటూళ్ళు, పచ్చని పొలాలు, అమాయక హృదయాలు, అంటూ ఉంటారే గానీ చూస్తా చూస్తా రాజకీయాలు పాకిపోనే పోయాయి! అనుకుంది.

చేలు, గట్లు, పంటలు, వాగులు, వంకలు, ఇయ్యేనా ఉన్నవి? ఆడు గెలిస్తే ఈడ్నెలాపడేయ్యాల? ఈ ఇల్లు బాగుంటే ఆ ఇంటికెలా నిప్పెట్టాల? అని చూసే జనమేగా? బడాయి! పల్లెటూళ్ళు, ప్రశాంతతలూ అంటూ.. . లోలోపల కచ్చగా ఉంది కాత్యాకి.

అన్నం కుతకుతా ఉడుకుతానే ఉంది. చేతికింద సాయం చేసే పావని బాగా పొద్దెక్కాక పదకొండు గంటలు దాటుతా ఉంటే పన్లోకివచ్చింది. అప్పుడే కాఫీలు, టిఫిన్లు అయిపోయాయి. కాత్యా భర్త వెంకటాద్రి ఊరి పెద్ద. ఆకలికి తాళలేడు. కోపం ఎక్కువ. చేసిందేదో తినేసి కోపంగా, ఆవేశంగా హాలు మొత్తం తిరిగి పారేస్తున్నాడు. కొడుకు కనపడితే ఉతికి పిండి ఆరేసేవాడు. కాత్యా కొట్టుగదిలో నిద్రోతున్న పుత్ర రత్నాన్ని చూసి, తండ్రి చూస్తే ఇంక అవుటేనని లాగి తలుపుకి గడేసి వంటింటోకి వచ్చింది. తల్లి మనసు మరి!

అమ్మగారేం అనడం లేదని అర్ధమయ్యాక పావని గిన్నెలు పరపరా తోమేసి, ఎక్కడివక్కడ బోర్లించేసి ఇల్లు ఊడవడానికి వెళ్ళింది. దాని మనసు మనసులో లేదు. నాలుగ్గదులు ఊడ్చేసి అయ్య కోపంగా ఉన్నాడని హాలొగ్గేసి కొట్టుగదికి వచ్చింది. తలుపు తీసి లోన కెల్లగానే ‘దొంగ కిట్టయ్య’ లా నిద్రొతున్న చిన్నోడిని చూసి, మెటికలు విరిచి, దిష్టి తీసి, ఇట్నంచటూ, అట్నించిటూ చీపురుతో కెలికి పారేసి తడి బట్ట పెట్టడానికి వెళ్ళిపోయింది. ఆమాట్న వంటింట్లో కొచ్చి ఓ మూల గమ్మున కూకుంది. ఒంటిగంట దాటిపోయాక వెంకటాద్రి ముందుకొచ్చి నిల్చుంది కాత్యా!

పది నిముషాలైన కదలకపోతే ఆ బతిమాలుడుకి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూచున్నాడు వెంకటాద్రి. తింటా ఉన్నాడు గానీ గొంతు దిగట్లా! పొట్ట నింపుకున్నడెట్టాగో!

“ఆడు ఇంట్లో అడుగుపెట్టగానే నాకు కబురు చెయ్యి!” అన్నాడు.

“చిన్నాడు ఏదో తొందరపడి... కాస్త పెద్ద మనసు ఎట్టుకుని...” కాత్యా మాటలకి వెంకటాద్రి కోపంతో ఊగిపోయాడు.

“ఏంటే... నువ్వు నాకు సెప్పేది? చెప్పింది చెయ్. మళ్ళీ మాట్టాడావంటే దవడ పేలిపోగలదు!” అన్నాడు. గతుక్కుమంది కాత్యా.

‘ఎట్టారా బాబూ! ఇంకో మాట మాట్టాడితే నిజంగానే కొడ్తడు. కొప్మొస్తే అంతే! పోనీ, కాస్తంత మంచిగా ఉన్నప్పుడు సెబ్దామా అంటే, తానే అందరికీ న్యాయం సెప్తాడనీ, రచ్చబండ దగ్గర తన పరువేం కావాలనే ఎగురుతడు!

“ఏయ్! మళ్ళీ సాంబారు పోసావ్. పెరుగయ్యమంటే... ఏటిదిది? చంపి ఉప్పుపాతరేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే!” గాండ్రింపు.

ఈ సారి భయంతో ఒళ్ళు ఒణికింది కాత్యాకి. గరిటె టక్కున వదిలేస్తే అది గట్టి చప్పుడు చేస్తూ కింద పడింది.

“ధూ! కడుపు నిండా అన్నం కూడ తిననివ్వరు!” చెయ్యి కడుక్కుని లేచిపోయాడు.

దిక్కు తోచక నించున్న కాత్యాని చూస్తూ నవ్వింది పావని. “ఛి!’ దీనిక్కూడా  అలుసయిపోయాను!” అనుకుంది కాత్యా.

‘ఇంకా నయం! ఊరంతా గోల అవకముందే భర్త కి చెప్పింది. ఎలాగో ఒకలా ఏదో ఒకటి చేసి పరువు నిలబెట్టుకుంటాడనే కదా?’ అనుకుంది.

వెంకటాద్రి హడావిడిగా బయటకు వెళ్ళడం గ్రహించి రాహుల్ రాకెట్ లా దూసుకొచ్చి దూకుడు గా తల్లి ముందు నిలబడ్డాడు. పావని కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది.

“ఏదో చెప్పావట నాన్నకి నాగురించి!” తలెగరేస్తూ అడిగాడు. తేరీ పారా చూసింది కొడుకు పొగర్ని! వీడికి బొత్తిగా మర్యాద, మప్పితం లేవు. ఇప్పుడే గమనిస్తోంది తను!

సమాధానం చెప్పకుండా పావనికేదో పని చెప్పింది. చిన్నప్పటి నుంచి చేసిన గారం తర్వాత ఇంత మౌనం తట్టుకోలేకుండా ఉన్నాడు రాహుల్.

తల్లే తన అజెండా!

“నిన్నేమి అనను. ఉరేసుకు చస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు!” అన్నాడు.

లక్ష్య పెట్టకుండా ఎటో చూసింది తల్లి. ఆశ్చర్యపోయాడు రాహుల్. ఇన్నేళ్లలో తల్లిని ఇదివరకెన్నడూ ఇలా చూడలేదు. ఎప్పుడు తను బెదిరించినా తిరిగి బతిమాలుకునేది. ముద్దు చేసేది. ఇదుగో! ఈ అయిదు రోజుల నుంచే ఇలా!

తనేమన్నా అనుకునీ, కలగనీ అలా చేసేడా? అసలు తనని అని ఏమి ప్రయోజనం? ఆడపిల్లలకి బుద్ది చెప్పాల్సింది పోయి! జరిగిందాన్లో తను నిమిత్తమాత్రుడు, అమాయకుడు, నోరులేని పసికూన.

అసలీ కథ అంతా గుమాస్తా కూతురు సీత వల్లే! దీందుంప తెగ! ఈ సీత నిజంగా సీత అనుకుందా? అబ్బో! నెరజాణ! అక్కడికీ తను చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. అలాంటి బట్ట లేసుకుని తన వైపుకి రావద్దని. విందా ఒక్కసారి అయినా!

ఓ బుట్ట లంగా, దానిమీద పల్చని ఓణీ, జడగంటలు టింగు టింగు మంటుంటే తలమీద నాగారం, గీగారం, ఘల్లు ఘల్లు మంటూ గజ్జెలు. ఎహే అవి మువ్వలు కావు. గజ్జెలు.

‘నీ డ్రెస్ సెన్స్ నాకు నచ్చలేదని తనేమన్నా ఒక్కసారి చెప్పాడా?’ మాట విందా? వినదు. విననే వినదు. అక్కడికీ గుమాస్తా తో అన్నాడు ఆ గంగిరెద్దు వేషం ఏంటని!

అదేదో సాంప్రదాయమనీ, తెలుగుతనమనీ, ఎప్పట్నించో అనాదిగా వస్తోందనీ, తొక్కనీ, తోలనీ, పద్ధతి గా పెంచానని, తనలాంటి గుమాస్తాకి, పేదవాడికి అదే అష్టైశ్వర్యమనీ తెగ వాగాడు గుమాస్తా. ఇప్పుడేమయింది? అందరూ తనననుకుంటున్నారు.

ఛ! ఒక్కసారి చెప్పాడా తను?

సంకురాత్రి పండక్కి వచ్చినప్పుడు మార్కులు తక్కువొస్తే చీల్చి చెండాడేస్తానని నాన్న తిడుతుంటే అక్కడే నించుని కదిలిందా? నౌకర్ల తో పాటు ఇల్లంతా శుభ్రం చేస్తుంటే... పోన్లే...అమ్మకి సాయం చేస్తోందని కదా తను ఊరుకున్నాడు. ఆ సత్తిగాడిని నిచ్చెన పట్టుకొమ్మని, తన గదిలో ఉన్న ‘అటక’ ని లంగా అడ్డంగా గోచీ కట్టి ఎక్కుతుంటే వద్దన్నాడా? విందా? ఎక్కుతుంటే నిచ్చెనకున్న మేకు తగిలి పరికిణీ పర్రు మంటే ఏదో అనుకుని... ఇంకేదో అయిపోయిందనుకుని  ‘ఓణీ‘ లాగి పారేసి కెవ్వుమంటే...

“దేవదేవా! చూడలేక చచ్చాం కదా?

యవ్వనం లో ఉన్న మగపిల్లాడికి యవ్వనవతి ‘గాలి’ సోకవచ్చునా?

అదే పంజాబీ డ్రెస్ అయితే ఒంటిని కప్పి పడుంటుంది. ఇప్పటి ఆడపిల్లలు లంగా, ఓణీ ల్లోంచి డ్రెస్సు ల్లోకి దూరిపోయారంటే బుర్ర తక్కువా? ఫాషనా?

తెలివి తేటలు. అడ్డమైన వాడికీ పొట్ట కనపడకూడదనేగా? అప్పుడు తనేం చేశాడు? నెమ్మదిగా దగ్గరికి పిలిచి ‘ఇంక ఇలాంటి బట్టలొద్దు!’ అని నచ్చజెప్పలా? విందా?

సంవత్సరాదికి వచ్చాడు. ఎద్దులు పొలానికెళ్తున్నట్టు ‘టింగు టింగు’ మంటూ రావొద్దని తెగ చిరాకు పడిపోయాడు కూడా!

దసరా కొచ్చాడు. బుడబుడక్కల వాడే నయం దీని కంటే.

వినాయకచవితికి వచ్చాడు. ఆ సాయంత్రం తొమ్మిది వినాయక స్వాముల్ని చూడాలని ఆడంగులందర్నీ వెంటబెట్టుకుని గుంజీలు గుంజీలు తీసింది. ఆడంగుల చేత తీయించింది. గాజులు గజ్జెలు గణగణ మంటుంటే మండిపోలేదూ తనకి!

దీపావళి కొచ్చాడు. ఎంత అమాయకమో? అమ్మ అమ్మ! తండా... తండానంతా వెంటేసుకొచ్చి తాము కొన్న టపాకాయల్ని టింగు రంగా కాల్చడానికి, పేల్చడానికి వచ్చింది.

తను చూస్తూనే ఉన్నాడు. అదంతా భరిస్తూనే ఉన్నాడు.

టింగుమని ఇంట్లోకి రావడం... ఓ చిచ్చు బుడ్డి పట్టుకెళ్లడం, బుడుంగుమని రావడం, ఓ మతాబా పట్టుకెళ్ళడం, తనకా శబ్దాలంటే చిరాకు. బయట ఢాం,ఢాంలు. ఇంట్లో గిల్ గిల్ లు.

అసలెందుకు వచ్చిందో తెలుసా? మాటి మాటికి తనని చూడడానికి వచ్చిందంతే. అన్నీ పాకెట్లు ఒక్కసారే వసారా లోకి తీసుకెళ్లి అక్కడే కాల్చొచ్చు కదా?

అబ్బో! ఐనాక్స్ థియేటర్ లో చెవుల్లో ‘నగారా’ మోగించినట్టు భారీ సౌండ్లు.

“సీతా! ఇట్రా!’ అన్నాడు ఆకాటికీ.

టింగు, టింగు, టింగు, మూడు అడుగులు. మూడు గిల్ గిల్ లు.

వచ్చింది ఎట్టాగో!

“నువ్వేం చిట్టి బుజ్జివా? మువ్వల అడుగులేస్తుంటే మురిసిపోడానికి? ఆ గజ్జె లేసుకుని ఇంక ఇటు రాకు! ఇదే ఆఖరి వార్నింగ్! పో!” అన్నాడు. పోయింది. మరి రాలే!

కానీ ఇంటి చుట్టూ దాని గజ్జెల సౌండ్ లే!

గుమాస్తా గారి మీద గౌరవం తో కాదూ తను సీతని భరించింది? ఎంత ఓపిక తనకి?

అన్నీ మరిచిపోయి బుద్దిగా చదువుకుంటుంటే –

ఫస్ట్ లో పాస్ అయితే అమ్మకి సంబరం అనీ, నాన్నకి మహా గర్వం అనుకుని  కదా ‘ప్రిపరేషన్ హాలిడేస్’ కి ఇంటికి వచ్చింది! ఆ సంవత్సరం తో బి.టెక్. అయిపోతుందనే కదా?

ఆ తర్వాత ఉద్యోగం వచ్చి ఎక్కడుంటాడో? ఏ దూరాభారం లో అయితే అమ్మతో ఉండే ఛాన్స్ ‘మిస్’ కాకూడదనేగా! అలా తనలో తాను మాట్టాడేసుకుంటూ ఉంటే -

‘చెప్పకు! సీత కోసం కూడా!’ అంది మనసు. వినరానిది వింటున్నట్టు మొహం పెట్టి –‘సీత కోసమా? ఆ పాత చింతకాయ పచ్చడి కోసమా? నెవ్వర్, నోర్ముయ్!’ అని చెప్పేశాడు మనసుకి.

అప్పటి కది ‘కామ్’ అయిపోయింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in July 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!