Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

విశాఖపట్నం. ఉదయం ఎనిమిది గంటలు.

సిటీ ఔట్ స్కట్స్ లో ఒక  స్కూటీ నల్లటి తారు రోడ్డు మీద సాగిపోతుంటే చల్లని గాలి ‘హాయ్ హాయ్‘ గా ఇంగ్లీష్ లో తగులుతోంది. భలే కట్టారు. ఊరి చివరన ఇంజనీరింగ్ కాలేజీని. చుట్టూ ఎవ్వరూ లేని ప్రదేశం లో తన రాజహంస లాంటి బుజ్జి ఎర్ర స్కూటీ ఝామ్ ఝామ్ అంటూ హైవే మీద పోతూనే ఉంటుంది.

చెప్తే కానీ తెలియని హాయి.

దారిలో ‘ఎవడికో బైక్ దొబ్బింది’ అనుకుంది ఆ పిల్ల. కిందకి వంగి బండివైపు చూసి పైకి లేచి ఇటూ అటూ చూస్తున్నాడు ఒకడు. తనకాళ్లు పట్టేసుకుంటాడా ఏంటి? అనుకుంది ఆ పిల్ల స్తుతి.

కన్నాల జీన్స్, బొమ్మల షర్ట్, వైలెట్ కలర్ గాగుల్స్, చెవికో పోగు.

దసరా వేశాలే నయం ఇంతకన్నా. ‘స్లో ‘చేసినట్టే చేసి, మగ గాడిదల్తో పెట్టుకోకూడదని బండి పోనిస్తోంది.

“ఓయ్!” పిలిచాడు గట్టిగా. బండి ఆపి, తనవైపు చూపించుకుంటూ ‘నన్నా?’ అని సైగ చేస్తూ అడిగింది. అవునంటూ తలూపి-

‘దీని దుంపతెగ! స్కర్టు మోకాళ్ళు కనిపించేలా! మినీ షర్ట్ పొట్ట చూపిస్తూ. మేచింగ్ గాగుల్స్’ అనుకున్నాడు ఆ కుర్రాడు.

“ఏంటి?” అడిగింది స్కూటీ ‘స్లో’ చేస్తూ.

“పోరికి బాగా ఉన్నట్టుంది! అనుకున్నాడు కుర్రాడు రాకీ!

“పెట్రోలు కొంచెం లాగుతా ఈ వైరుతో నీ బండి నుంచి” అన్నాడు జేబులోనుంచి సన్నని వైరు తీసి!

“ఏంటీ?” ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టింది. ‘పోరడికి బాగా బలిసినట్టు ఉంది’ అనుకుంది.

“పెట్రోలు అయిపోయి బైక్ ఆగిపోయింది ఇయ్యి ప్లీజ్!” అన్నాడు అవసరం తనది గనుక మర్యాదగా.

“సెంచెర్స్ కాలేజా?” నువ్వు?” అడిగాడు.

ఆన్సర్ చెప్పలేదు స్తుతి. ఐదువందలు తీశాడు జేబులోనుంచి.

‘అబ్బో! డబ్బు పొగరా? బాబు సంపాదన. ఎదవలు!’ అనుకుంది.

“నీ డబ్బేవడికి కావాలి!” అంది.

“ప్లీజ్!” అన్నాడు నోటు జేబులో కుక్కేసి.

“సరే తీస్కో!” అంది. థాంక్స్ అంటూ వైరు నోట్లో పెట్టుకుని స్తుతి బండిలోనుంచి పెట్రోల్ లాగి తన బైక్ కి ట్రాస్ఫర్ చేసుకున్నాడు.

“సర్లే! పనికొస్తాడు!” కనుబొమలు పైకి ఎత్తి పెట్టింది.

“పడుండనీ. ఎందుకైనా పనికొస్తుంది. చెయ్యి చాచి ‘ఫ్రెండ్స్?” అన్నాడు. తన చేత్తో ఆ చేతి మీద కొట్టి ‘ఫ్రెండ్స్' అంది. ఈ లోగా ‘పరిణితి’ అనే అమ్మాయి తన స్కూటీని ఆమె పక్కన ఆపి,

“వాట్ హెపెండ్ యార్?” అంది.

“పెట్రోలు కొట్టించకుండా వచ్చాడు బుడ్డోడు!” అంది. నవ్విందాపిల్ల. ‘ఇదెవత్తబ్బ! హిందీ గుంట లాగుంది.’ అనుకున్నాడు రాకీ.

“ఏ గ్రూప్?” స్టయిల్ గా అడిగింది. చెప్పాడు.

“నువ్వూ అదేనా?” అడిగాడు ఫ్రెండ్లీ గా.

“కాదులే... దాని పక్కది! అంది వెటకారంగా. కిసుక్కున నవ్వింది స్తుతి. ‘పాపా ... టైమ్ వస్తుందిలే’ అనుకున్నాడు మనసులో.

ఈ లోపలే ఇంకో గులాబీ రంగు స్కూటీ వాళ్ళ పక్కన ఆగింది. అది ‘జకాలు’ ది.

“ఏంటి కధ?” అంది.

“ఓ!” అంది జకాలు. గోవా పిల్ల.

“మనూరు ఏది?” అడిగింది జకాలు తల ఎగరేస్తూ.

“ఇక్కడికి దగ్గర్లోనే. పోదామా?” అన్నాడు.

“ఏయ్! ఏంటి నువ్ మాట్టాడేది?” అరిచింది స్తుతి.

‘మరేంటి? కొచ్చెన్లేస్తున్నారు. కొచ్చెన్లు!” అన్నాడు రాకీ.

“వాడితో మనకేంటి? పోదాం పదండి!” అంది పరిణితి.

“ఏంటే? వాడంటావా?” మీద మీద కొచ్చి జాగ్రత్త చెప్పాడు చూపుడు వేలితో.

వెనక్కెళ్ళి-

“స్తుతీ! థాంక్స్ వన్స్ ఎగైన్!” అన్నాడు బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ.

“అరె! వాడికి నా పేరేలా తెలుసు?” అంది స్తుతి.

“తల్లీ! అందరికీ తెలిసేలా స్కూటీ వెనక ఉంది నీ పేరు!” పరిణితి చూపించింది. ‘స్తుతి’ అని కొట్టొచ్చేలా కనిపిస్తున్న అక్షరాల్ని!!

రెండు రోజుల తర్వాత స్కూటీ పార్క్ చేసి కారిడార్ లో నడుస్తోంది స్తుతి.

“శ్రీరామ రామ రామేతి  రమ్మే రా...మే  మనోరమే!” పాడేస్తున్నాడు ఒకడు.

“ఏంట్రా? రామస్తుతా?” అన్నాడొకడు.

“సుత్తిరా!” అన్నాడింకొకడు.

ఒక్కొక్కరు ఒక్కో అమ్మాయిని ఇమిటెట్ చేస్తూ సరదా పడుతున్నారు. స్తుతి ఆగి వాళ్ళ వేపు చూసింది. ఆ గుంపులో పెట్రోలు బుడ్డోడు కూడా ఉండడం గమనించింది.

“అబ్బబ్బబ్బాబ్బా!” ఏం చూపురా? పిడిబాకురా. ఏం లుక్కురా? అది లవ్వు లుక్కురా!” అన్నాడు పెట్రోల్.

కాస్త వెనక్కి వెళ్ళి ‘జకాలు’ చిత్రమయిన ఈల వేస్తే చుట్టుపక్కల అదిరిపోయే సౌండ్ వచ్చింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. లాఘవించి స్తుతిని అన్నవాడిని పొట్టలో గుద్దబోయి ఆగి- ‘జాగ్రత్త’ అని వేలు చూపించి వెనక్కి వచ్చింది. ఆడపిల్లలందరకీ ‘జకాలు’ సేఫ్టీ గార్డ్. కాలేజీ ముగిశాక అమ్మాయిల స్కూటీ లు ఝామ్మంటూ వెళ్ళిపోయాయి. అబ్బాయిల బైక్ లలో గాలి లేదు. జకాలు ఈలపాట గుర్తొచ్చింది రాకీకి. సీనియర్స్ ధర్మమా అని ఇళ్ళకి చేరుకున్నారు అందరూ!

******

ఆ రోజు కాలేజీ కి అమ్మాయిలందరూ అరగంట ముందొచ్చి కూర్చున్నారు ఎంట్రన్స్ లో. హీరోలందరూ ఒక్కరూ మిస్ కాకుండా వచ్చేశారు. పైకి చెప్పరు గానీ అమ్మాయిలు. అబ్బాయిల అల్లరి, ఆ గోల అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే వాళ్ళు బి.టెక్ లు చేసేదే అందుకు రోషన్ అనే స్టూడెంట్ బల్లగుద్ది చెప్పే నిఖార్సయిన నిజం.

“లేకుంటే టైమ్ కి రాకుండా... ముందే ఎందుకొస్తార్రా అబ్బాయ్? అంటాడు ఖాసీం.

“అందాలు సూపిత్తా నికి!” అంటాడు స్వామినాయుడు.

“కాదు మావా! నాలాంటి హండ్సమ్ బాయ్ దొరికితే లాటరీ కొట్టేయ్యడానికి”. అన్నాడు గౌతమ్.

“వీడా? హాండ్సమ్? నాలాంటి కాంప్లాన్ బాయ్ ని సొంతం చేసుకోవాలని కాదూ వీళ్లొచ్చేది?” అంటాడు విక్కీ కాలరేగరేస్తూ.

“మరీ ఇంత బుర్రలు లేవేంటి బావా మీకు? బీచ్ లకీ, సినిమాలకీ తిప్పడానికి ఒక ఎస్కార్ట్ కావాలి కదా? ఆళ్ళ పేకెట్ మనీ ఆళ్ళ దగ్గరే ఉండిపోడానికి. ఇది నిజం!” బన్నీలా ఫీల్ అయ్యే శ్రీకర్ విషయం తేల్చేశాడు.

ఇవన్నీ వింటూ నవ్వుకుంటారు అమ్మాయిలందరూ.

“అద్గదీ! అటు సూడోపాలి!" అన్నాడు ఉత్తరాంధ్ర యాసలో స్వామినాయుడు.

ఓ అమ్మాయి పరికిణీ, ఓణీలో ఒయ్యారంగా అడుగేసుకుని వస్తోంది. కుర్రాళ్ళందరూ ఒకేసారి ఈల వేసి గోల చేశారు. ఒకడు పుస్తకాన్ని గుండ్రంగా చుట్టి... బూరాల చేసి_

“వినండి జనులారా! ఈ శతాబ్దానికే ఈమె రాణి. గత జన్మలో మహారాణి. ఎన్నటికైనా, ఎప్పటికైనా మీరు ధరించేవి మా ఓ ఆప్ టెక్స్ పరికిణీ, ఓణీలే. నైంటీ పర్సెంట్ రిబేటు. జనులారా! త్వరపడుడు!” ఆమె వెనుకే నడుస్తూ వయ్యారాలు పోయాడు టిప్పు.

“కాలేజీ అంతా అల్లరే తప్ప చదువు, సంధ్యా ఉండదు!” వాపోయాడు ప్రొఫెసర్ గిరి.

“ఎటోలే! సదువు సంగతి నాకు తెల్దుగానీ సంధ్య మాకు సీనియర్!” అంటాడు స్వామినాయుడు.

“అబ్బాబ్బా! ఏమి సెప్పితివి... ఏమి సెప్పితివి” అన్నాడు రాకీ.

అందరూ ఉత్తుత్తినే దరువులు, అరుపులు, చప్పట్లు, ఈలలు. అమ్మాయిల మూసిముసి నవ్వులు. బెల్ కొట్టగానే ఎక్కడిపిట్టలు అక్కడికి ఎగిరిపోయాయి.

*****

“ఏంటే! రాకీ పిలగాడు ఎక్కువ సెత్తన్నాడు!” అంది స్తుతి.

“వాడు జాంపండే!” అంది కల్పన

“కొరుక్కుతినమన్నావు కాదు” అంది ఇంకో పిల్ల.

“అదేం కాదు. స్వామినాయుడు సూపర్!” అంది జకాలు. అందరూ మెట్లమీద కూర్చుని హస్క్ వేస్తున్నారు. జకాలు మాత్రం సీరియస్ గా రాసేసుకుంటోంది. తొంగి చూసి కెవ్వున అరిచింది కల్పన. ప్రతీ దానికి హంగామా చేయడం ఇప్పటి పిల్లల అలవాటు. అందరి దృష్టిని ఆకర్షిస్తే గానీ కుదరదు.

“ఏమయిందే?” అడిగింది స్తుతి.

“దేవలిపిలో ఏదో రాసేస్తోంది జకాలు.

“కొంకిణీ!” అంది జకాలు అక్షరాల వేపు చూసుకుని మురిసిపోతూ. మళ్ళీ బరికెయ్యడం మొదలుపెట్టింది.

“స్వామికోటి!” అంది సునయన. కిసుక్కుమన్నారు అమ్మాయిలందరూ.

“వాట్ స్వామికోటి? ఇది లవ్ లెటర్!” అంది జకాలు.

“కోయ్ కొయ్! కొంకిణీ భాషకి అసలు లిపి లేదు!” అంది స్తుతి.

‘’కానే కాదు. నేను కనిపెట్టి రాస్తున్న. అందుకే కొంకిణీ గ్రామర్ పైన పెట్టా.” అంది సిగ్గుపడుతూ.

*****

“వా! వా! అని నోరంతా తెరిచి గగ్గోలు పెట్టేస్తున్నాడు స్వామినాయుడు. అందరూ చుట్టూ చేరారు.

“చీకి కళ్ళ... స్పెల్లింగ్ మిస్టేక్...చిలిపి కళ్ళ చిన్నది గాల్లోకి ఎగిరి పొట్టలో తన్నేది ఇంత పని చేస్తుందనుకోలేదురా కొడకా!” శోకాలు మొదలెట్టాడు.

“ఏమయిందిరా! చెప్పన్నా ఏడువ్. లేదా ఏడ్చైన చెప్పు!” అన్నాడు రాకీ.

“ఏటి సెప్పన్రా మావా! ఇదుగో ఇదిచ్చింది!” అని ఫాంటు జేబులోనుంచి ఓ కాగితం ఊడబెరికి ఇచ్చాడు. అందరూ ఆ కాగితం లోకి చూసి ఫక్కున నవ్వారు.

“ఇదెలా సదవను? నానెక్కడికి ఎల్లను? నాకొద్దురా ఈ పేమలు!” అని పొర్లి పొర్లి ఏడుపు సాగిస్తున్నాడు స్వామినాయుడు.

“ఇది ఖచ్చితంగా లవ్ లెటర్. అది వీడి వేపు చూస్తుంటే నేను చూశాను!” అన్నాడు విక్కీ.

టక్కున ఏడుపు ఆపేసి –

“ఓలే! అదీ ఇదీ అనమాకరా!  గుండెల్దగ్గర గొప్ప బాధగా అనిపిస్తది. దీన్లో ఏటుందో సదువు మీ!” అన్నాడు స్వామినాయుడు.

“నువ్ తెన్నేటి పార్కు కి రా సూసుకుందాం. అనుందిరా!” అన్నాడు ఆట పట్టిస్తూ ;

“నానెల్లను. సంటోడిని సేసి తాపులు తంతది!” అన్నాడు స్వామినాయుడు.

రెండు రోజులు అయ్యాక జకాలు అందరి ముందు స్వామినాయుడికి మరో పేపర్ అందించి వెళ్ళింది.

“ఏటిది? నా కేసి సూడదు. ఇదిచ్చి ఎల్లిపోతుంది. ఏంట్రా బాబూ?” అయోమయంలో పడిపోయాడు స్వామి. రెండు నెల్లు పోయాక బొత్తి బొత్తి ని బైండ్ చేయించి ఖాళీ టైముల్లో సదువుకోడం మొదలెట్టాడు.

“ఏరా పిల్ల పడినట్టేనా?” రాకీ ఏడిపించాడు.

“పోయి పోయి పులి బోన్లో తల ఎట్టేసానుకదరా మావా!” అన్నాడు ఏమి అర్ధం కానట్టు మొహం పెట్టి.

******

“నెల్రోజుల్లో కొంకిణీ భాష నేర్పబడును” అని బోర్డు చూసుకుని ఆ మెట్లెక్కాడు స్వామి. అక్కడ డబల్ రోటీ లా లావుగా ఒకావిడ కూర్చుని ఉంది.

దగ్గరికి వెళ్ళి –

“రోజూ ఏటి తింటారు?” అని అడిగాడు.

“గెట్ అవుట్...” అని ఏదేదో తిట్టింది! ఆ భాష కొంకణీ అన్నమాట.

వాడిని ఫాలో అయి వాడి వెనకే నించున్న రాకీ బృందం నవ్వు ఆపులేకపోయింది.

“వచ్చీసినారా ఏటో అంటున్నది రా ఇది!” అన్నాడు జాలిగా మొహం పెట్టి.

ఆమె మళ్ళీ ఏదో అంది.

“మళ్ళీ పేలిందిది. ఏటే?” అన్నాడు స్వామినాయుడు. చాచి లెంపకాయకొట్టడానికి చెయ్యెత్తి ఆగి నవ్వుతూ –

“నాకు తెలుగు వచ్చురా రేయ్!” అంది.

“ఇద్దీ పద్దతి అంటే... ఎంత బాగా తెలుగు నేర్చుకున్నారో చూడు!” అన్నాడు. ఆమె అందంగా సిగ్గుపడింది.

“నీ జిమ్మడ!” అన్నాడు మెల్లిగా స్వామి. అందరూ నవ్వేశారు.

“వాట్?” అంది ఆవిడ. బైండు పుస్తకం ఆవిడ చేతుల్లో పడింది. పావుగంట చదివింది పేజీలు తిరగేస్తూ. అప్పుడు నవ్వింది.

“మొత్తం అంతా ఒకటే మేటర్. నువ్వంటే నాకిష్టం. మా నాన్నకి చెప్పి పెళ్ళికి వప్పిస్తాను. నాతో నువ్ గోవా వచ్చేయ్. ఈ లోపల ఎవత్తి వైపైనా చూసేవో తోలు ఒలిచేస్తాను!” అంది ట్రాన్స్ లేట్ చేసి చెప్తూ.

“నేను గోవా చస్తే వెళ్ళను.” అన్నాడు స్వామినాయుడు.

“మాది ఉడుం పట్టు. ఆ అమ్మాయే నిన్ను తీసుకుపోతుంది” అంది బోండాం. గిలగిలా తన్నుకున్నాడు స్వామినాయుడు. ఆ రాత్రి స్వామినాయుడికి ఒక కల వచ్చింది. తను మేఘాల్తో ఆడుకుంటున్నాడు. ఆ ఆట చూసి ఆకాశ రాజకుమారి ఆకాశం మీద నుంచి వచ్చి తనని వాటేసుకుంది. అది కొంకణీకి ఎలా తెలిసిపోయిందో గాలిలోకి సర్రున ఎగిరి సరాసరి తన పొట్టలోకి...

“దేవుడోయ్!” అంటూ స్వామినాయుడు గభీమని లేచి కూర్చున్నాడు.

‘కలలురావడానికి కూడా ఇల్లేదన్నమాట!’ బావురుమన్నాడు.

అమాయకుడు, మంచివాడిని ఎన్నుకొంది జకాలు!

*****

రాకీకి, స్వామికి గాఢమైన స్నేహం అల్లుకుంది. రాకీ కాఫీ షాప్ లో స్తుతి కోసం స్వామి తో కలిపి కాపుకాస్తాడు. ఎప్పుడూ షాప్ లో ఫ్రెండ్స్ తో బాతాకానీ కొట్టే స్తుతి ఎందుకో రెండురోజులుగా రావడం లేదు. ఆరా తీస్తే స్తుతి కి ఫీవర్ అనీ, వాళ్ళ ఫాదర్ వచ్చాడనీ ఇన్ఫో ఇచ్చాడో ఫ్రెండ్. ఆగలేక ఆమె ఇంటిదాకా వెళ్ళాడు రాకీ! హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఒక అపార్ట్మెంట్లో ఆమె ఒక్కత్తే ఉంటోందని తెలిసింది. ఇంటి ముందు కారు, హంగామా చూసి

“బాప్ రే! ఇది పైసలున్న కేస్. అస్సలొదల్ను!” అనుకున్నాడు రాకీ. ఇకమీదట దేవుడిచ్చిన రెండు కళ్ళల్లో ఒకటి స్తుతి, రెండు దాని డబ్బు. రెండింటినీ పదిలంగా కాపాడుకుంటానంతే!” హుషారుగా అనుకున్నాడు.

‘చదివేది బీటెక్ కదా? చదవకుండా టెక్కు వేషాలేస్తుంది. సరిగా చదవకపోతే ఎలా నా బంగారు బాతుగుడ్డు’ అనుకుని, తను చదవడమే కాదు... ఆమెకీ తాను రాసిన నోట్సులిచ్చి అడక్కుండానే ఓ చెయ్యి పట్టేస్తున్నాడు. తన మోచేతికి ఆమె మోచేతిని మెలి పెట్టేసి చెట్టాపట్టాలేసేశాడు. బీచ్, కైలాసగిరి, తొట్లకొండ, యారాడ పార్క్ తెగ తిప్పేసి షికార్లు కొట్టించేస్తున్నాడు. ఈ లోగా జకాలు స్వామిని తన వాడిని చేసుకుంది. ఆమె గీసిన గీత దాటకుండా బుద్దిగా చేతులు కట్టుకున్నాడు స్వామి.

******

సముద్రం ఒడ్డు. ఒకరి వీపుని ఒకరు ఆనుకుని కూర్చున్నారు స్తుతి, రాకీ! ఆమె జుట్టు గాలికి ఎగిరి అతి సుందరంగా వెనక్కొచ్చి ఆమె పెదాల మీద వాలుతోంది. ఆ పెదాల నాజూకు తనం, గులాబీ తళుకు, ఆమె ఒంటి పరిమళం, రాకీని నిలవనియ్యకుండా చేస్తోంది. స్తుతికి కూడా అతనిని చూస్తుంటే సినిమాల్లో చూసిన హీరోలా ఫీల్. మాటరాని మౌనంలో ఉందామె!

చాలా మాడ్రన్! ఈ కాలానికి తగ్గ డ్రెస్ తో. పొట్టి టీషర్ట్ మాటి మాటికి పైకి పోయి ఆమె పొట్టనీ, ఆ కొంచెం నడుమునీ, చూపించినట్టే చూపించి దాచేస్తోంది. స్లీవ్లెస్ వేసుకున్న బుజాలు లవ్లీ లవ్లీ గా ఉన్నాయి.

“స్తుతీ!” అన్నాడు రాకీ.

“ఊ!” అంది ముద్దుగా.

“ఒకటి చెప్పాలి” అన్నాడు.

“చెప్పు!” అంది.

“ట్రస్ట్ మీ యార్!” అన్నాడు.

“ఐ నో యూ!” అంది ముద్దుగా.

‘ఇంకేం? కలిసి ఉందాం! ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకుందాం!” అన్నాడు. మరో ఆలోచనకి తావివ్వకుండా ముందుకి తిరిగి గట్టిగా కౌగలించేసుకుంటూ. కౌగిలి హాయిగా ఉన్నా_

“ఇంకొంచెం టైమ్ తీసుకుందాం!” అంది గారాలు పోతూ.

“ఊహూ! ముందు కలిసి ఒక ఫ్లాట్ లో ఉందాం. అప్పుడు ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకుందాం ఆ తర్వాతే పెళ్లి!” అన్నాడు క్రీమ్ బిస్కెట్ ఇస్తూ.

బాగా ఆలోచనలో పడినట్టు నోటి మీద వేలితో సుతారంగా కొట్టుకుంటోంది స్తుతి.

జారిపోతోంది చేపపిల్ల. ఒడిసిపట్టేసుకోవాలి... అనుకుంటూ-

“ఓకే! ఓకే! అన్నీ నచ్చాకే పెళ్లి చేసుకుని ఒకటవుదాం!” అన్నాడు త్వర త్వరగా!

మూడు  రోజుల తర్వాత లక్ష్మి నగర్ కాలనీ లో కొత్తగా కట్టిన బడ్డీఎన్ క్లేవ్ లోఒక ఫ్లాట్ తీసుకున్నారు.

*****

విశాఖలో కొండమీద కట్టిన సాఫ్ట్ వేర్ కంపెనీ!

సాయంత్రం ఆరు! ఒక షిఫ్ట్ వాళ్ళు రిటర్న్ అవుతుంటే రెండో షిఫ్ట్ ఎంటర్ అవుతున్నారు.

“సంజనా!” షర్మిల పిలుపు అది. బాగ్ లోనుంచి సెల్ తీసి-

“బస్ మిస్ అవుతాను షర్మీ!” అంది.

“ఒక్కసారి రా. పనుంది!”

ఉసూరుమంటూ షర్మిల వైపు వచ్చింది. ఆమెది నైట్ డ్యూటి. పక్కన ఎవరో ఉన్నారు.

“ముందేవచ్చేశావ్... ఏంటి సంగతి!” అడిగింది. ఒక పక్క బస్ పోతుందనే బాధ!

షర్మిల పక్కన నించున్న యువకుడు చాలా పొడుగ్గా డార్క్ కలర్ డ్రస్ లో జేబుల్లో చేతులు పెట్టుకుని ఉన్నాడు.

“నిన్ను పట్టుకోడానికే! అదేం ఫోనే? చేసి చేసి విసుగొచ్చింది. సముద్రం లో విసిరెయ్!” అంది. ఆ యువకుడు అందంగా నవ్వాడు. గాగుల్స్ షర్ట్ కి తగిలించి ఉన్నాయి.

“మీట్ మిష్టర్ సిరీన్! రేపు జాయినవుతాడు మా సెక్షన్ లో. కానీ ‘డే డ్యూటీ’ నీలాగే! మాఊరివాడే! అంది పరిచయం చేస్తూ.

“మీ ఫ్లాట్ లో నువ్వు ఒక్కదానివేగా? ఇతనితో షేర్ చేసుకుంటావా?” అడిగింది. ఒకసారి ఎగాదిగా చూసి _

“మంచోడేనా?” అంది.

“పక్కా!” అన్నాడు సిరీన్ భుజాల్ని ఎగరేస్తూ.

“వేషాలేస్తే కుదరదు!” అంది కళ్ళెగ రేస్తూ పదునుగా. మళ్ళీ నవ్వాడు భుజాలు ఎగరేస్తూ. ‘ఇదో అలవాటు కాబోలు. ఆరడుగులు ఉంటాడా?’ అంచనా వేసింది.

“వచ్చేయ్ రెప్పొద్దున్న. హోటల్లో ఉన్నావా?” అడిగింది.

“యా!” అన్నాడు. ‘పోజుగాడే ‘అనుకుంది.

“అడ్రస్ రాసుకో. శాంతిపురం, నగారా అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 203. మర్చిపోతే షర్మి నడుగు.” అని చెప్పేసి ఫాస్ట్ వెళ్తున్న బస్ ని ఆపింది. రోజూ అలవాటయిన ఆమెను చూసి బస్ ఆగింది.

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in June 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!