Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

శశి ఇల్లు!

భోరుభోరుమని ఏడుస్తూనే ఉంది శశి. పక్కన మనోహర్ తల పట్టుకుని కూర్చున్నాడు.

“నువ్వు ఎన్నయినా చెప్పు మనో! నువ్వు నాతో ఉంటున్నట్టు ఇంట్లో చెప్పి తీరాలి!” అంది.

“హఠం చేయకు శశీ! మనం ఆనందంగా ఉండాలా? అక్కర్లేదా? సమస్యల్ని కొని తెచ్చుకోవడం ఎందుకు?” అన్నాడు.

“అదంతా నాకు తెలియదు మనో! నేనిలా దొంగ బతుకు బతకను!” అంది ఖరాఖండిగా. వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి. శశి వైపు నుంచి ఆలోచిస్తే అది కరక్ట్! ఒకసారి ఇంట్లో చెప్పేస్తే కనీసం తమ ఇంటి నుంచి యుద్దాలు ఉండవు. ఎంతో ఆలోచించాక మహాలక్ష్మి తో చెప్పేశాడు మనోహర్.

మహాలక్ష్మి మౌనంగా, రాయిలా కూర్చుంది. వేదనగా కన్నీరు కార్చింది. తను ఇంక తన బిడ్డల కోసమే బతకాలని నిర్ణయం తర్వాత మనోహర్ రాకపోకల్ని సహితం పట్టించుకోడం మానేసింది. మనోహర్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా వేళకింత భోజనం పెట్టించడం, అది అయ్యాక అక్కడినుంచి వెళ్ళిపోవడం చేసేది. తన ఆవేశం, కోపం ఎందుకూ పనికి రావని తెలిసాక భర్తతో ఒక రోజు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని షరతుల్ని అతడి ముందు ఉంచింది. తమ కుటుంబ పరువు మర్యాదలు నిలుపుకోవడం కోసమే ఈ షరతులని చెప్పాక మనోహర్ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఆమెకి తానెంత దు;ఖం ఇచ్చాడో అర్ధమయి, తానెంత అల్పుడో, ఆమె ఎంతటి మహోన్నతురాలో గుర్తించాడు. ఆమె ముందు తల వంచడం తప్పతాను చేయగలిగేదేముంది?

******

అదే అదనుగా తన కొంగుకి కట్టి పడేసింది శశి మనోహర్ ని. ఎలాగూ తెలిసిపోయింది గనక తన దగ్గరే ఉండమని ఒత్తిడి చేస్తూ వచ్చింది. తన మకాం పూర్తిగా శశి దగ్గరికి మార్చేశాడు.

శశికళ లో చక్కని ఆరితేరిన ‘కళ’ ఒకటుంది. చక్కని కబుర్లపోగు. ఆమె లిప్ మూమెంట్ గమ్మత్తుగా ఉంటుంది. ఆ శరీర కదలిక చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక పడకలో ఆమె ప్రావీణ్యం వర్ణించలేనిది అనుకున్నాడు మనోహర్. అతడికి ఇప్పుడసలు టైమ్ తెలియడం లేదు. ప్రపంచంలో ఉన్నవన్నీ అద్భుతంగా, కధనం గా వడ్డిస్తుంది ఆమె. కంటికి రెప్పలా ప్రతి క్షణం తన వైపు తిప్పుకునే ప్రయత్నం లోనే ఉంటుంది. ఒకసారి ఒక ఆలోచనలో పడింది.

‘ఇలాంటి ప్రయత్నం తనకి నిరంతరం తప్పదు’ అని అర్ధం అయిపోయిందామెకి. ఏది ఏమైనా మహాలక్ష్మి కాల్ వచ్చిన తక్షణం ఇంక మరొకరి మాట వినడు. అవమానాల బారి నుంచి తప్పించుకోడానికి ఇల్లు మారింది శశికళ.

******

అపార్ట్ మెంట్ ల కల్చర్ ఏమిటంటే ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం. మనోహర్ తోనే లోకం అనుకున్న శశికళ తాను ఆ ఒక్క మనిషితోనే బతకలేనని త్వరలోనే తెలుసుకుంది. అతడు తన ఇంటికి వెళ్ళాక ఎప్పుడొస్తాడో తెలియదు. కాల్ లిఫ్ట్ చేయడు. మెసేజెస్ కి అవసరం అనుకుంటే తప్ప రిప్లై ఇవ్వడు. తన ఇంటి పనులన్నీపూర్తి అయ్యాక వస్తాడు.

ఆరోజు చాలా బోర్ కొట్టి ఒకరోజు పక్కింటి తలుపు కొట్టింది. ఒకామె తలుపుతీసి చిరునవ్వుతో ఆహ్వానించింది. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ పర్సనల్ విషయాల్ని కదుపుతోంది. మాట మార్చినా వదలడం లేదు. మర్నాడు ఎదురు ఫ్లాట్ లోకి వెళ్ళింది.

“రండి రండి! ఎన్నాళ్ళకు? ఇక్కడకు వచ్చి నెల దాటిపోలా? అంటూ ఆహ్వానించి ఖాళీ టైమ్ లో ఏంజేస్తారు? వస్తూ ఉండండి!” అంటూ మాట కలిపింది. ఏవేవో, ఎవరెవరి గురించో చెప్పింది. ఫ్లాట్స్ లో వాళ్ళతో తనకి అంతగా పరిచయం లేదని అంది శశికళ.

“చేసుకోవాల్నా! అలా ఇంట్లోనే ఉంటే ఒంటరిగా అనిపిస్తాది.” అంది. ఈ లోగా ఆవిడకి కాల్ వచ్చింది.

“ఆ! బాగుండారా? ఎదురింటి ఆమె వస్తే మాట్టాడుతున్న! అవునా? ఏమంది? నేను అడుగుతాలే. నువ్వు గమ్మునుండు” అని ఫోన్ పెట్టేసి ‘సారి’ చెప్పింది.

“ఏం పర్లేదు” అంది శశికళ.

“బావగారు లేరా అక్కా?” అడిగింది.

“అవును. వారింటికి వెళ్ళారు” అంది.

"వారిల్లు, మీ ఇల్లు వేరు వేరా?” కుతూహలంగా ముందుకి ఒంగింది ఆమె.

“ఊ!” అంది శశి.

“ఎందక్కా? పెండ్లి చేసుకున్నావా? లేదా?”ఆశ్చర్యంగా అడిగింది.

లేదని తల ఊపింది.

“అవునా? అందరూ అనుకుంటే నమ్మలా!” అంది విసురుగా. రెండు నిముషాల మౌనం.

“అక్కా! ఏమనుకోక. మా ఆయన వచ్చే టైమ్ ఇది. ‘ఇరుగు పొరుగు తో మాటలేందే నీకు? అని గదమాయిస్తడు. పోయి రా!” అంది.

సిగ్గుతో చచ్చిపోయింది శశికళ. లేచి వచ్చేస్తుంటే చూసింది. ఆమె తన పక్కింట్లోకి వెళ్తోంది మసాలా అందించడానికి. శశికళ కి కన్నీళ్లతో సతమతం అయింది.

*****

మనోహర్ రెండు రోజులుగా ఆఫీస్ కి కూడా వెళ్ళకుండా శశి తోనే ఉన్నాడు.

“శశీ! లోకం ఇంతే! నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి!” అన్నాడు బతిమాలుతూ, అనునయిస్తూ. తానున్నానని లోకానికి వెరవొద్దని చెప్పాడు. మర్నాడు ఆఫీస్ నుంచి కాల్ చేసి పెద్దకూతురు అత్తవారు వస్తున్నారని తాను ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు.

“కాల్ చేస్తూ ఉండు!” అంది శశి.

“ప్లీజ్ బంగారూ! నన్ను ఇబ్బంది పెట్టకు!” అని కాల్ కట్ చేశాడు. కానీ మర్నాడే వచ్చేశాడు.

‘అమ్మయ్య!” అనుకుంది. ఇంక తాను భయపడాల్సిన పనిలేదు. ఏ మాత్రం టైమ్ ఉన్నా మనోహర్ తనతోనే ఉంటాడు. ‘ధీమా’ వచ్చేసింది శశికి.

మనోహర్ ఈ సారి చాలా హుషారుగా ఉన్నాడు. లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక గెస్ట్ హౌస్ లో చాలా చిన్న పిల్లాడిలా అల్లరి చేశాడు. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు.

“నా శశి! ఐ లవ్ యు రా బంగారం!” అని చుట్టుపక్కల ప్రతిద్వనించేలా అరిచాడు. ఫ్లాట్ కి రాగానే ఆ అల్లరి అంతా ఏమయిపోయిందో బుద్దిగా ఉన్నట్లు ఫోజు పెట్టాడు. నాలుగు రోజులు నాలుగు క్షణాలుగా గడిచిపోతూ ఉండగా ఆ శుక్రవారం బాగా లేట్ ఈవినింగ్ సరిగ్గా శశి ని దగ్గరగా తీసుకునే క్షణంలో మహాలక్ష్మి కాల్. శశిని తోసేసి కాల్ అటెండ్ అయ్యాడు.

“చెప్పు మహా!” అన్నాడు అతి ప్రేమగా.

“పెద్దమ్మాయిని పురిటికి తీసుకురావాలి. పొద్దున్న అయిదింటికే మన ట్రైన్. మీరు బయలుదేరగలరా?” ఆ మాటల్లో ఎంతో నమ్రత వినపడుతోంది శశికి.

మరుక్షణం స్ప్రింగ్ లా లేచి బాగ్ లో బట్టలు సద్దుకున్నాడు.

“రేపు పొద్దున్నపదింటికి ఫ్లయిట్ అని చెప్పావు కదా మనో!” అంది శశి.

“అవును. మహాలక్ష్మి ట్రైన్ కి బుక్ చేసినట్టు ఉంది శశీ నేను తనతో ఫ్లయిట్ టిక్కెట్స్ బుక్ చేసానని చెప్పడం మరిచిపోయాను ఇంటికెళ్ళాక ఏమి చేయాలనేది నిర్ణయించుకుంటాం!” అన్నాడు.

“ఇప్పుడు చెప్పు. పొద్దున్నేవెళ్ళొచ్చు!” పట్టు పడుతున్నట్లు గా అంది.

“లేదు లేదు. మాట్లాడే పనుంది శశీ!” అన్నాడు.

ఏమిటా పనులు? నాకు చెప్పకూడదా?” గట్టిగా నిలదీసింది.

“అవన్నీ ఎందుకు శశీ? ఇఫ్ ఎనీ క్రిటికల్ ఆర్ సీరియెస్ ఐ విల్ టెల్ యు డెఫినట్లీ!” అంటూ శశిని దగ్గరగా తీసుకున్నాడు. దూరంగా జరుగుతూ

“అంటే? మిగతా విషయాలేవీ నాకు చెప్పకూడదనా అర్ధం?” అంది.

“అమ్మాయి అత్తవారింటితో డిస్కషన్ నీకెందుకు శశీ తలనొప్పి గానీ!” అన్నాడు అర్ధం చేయిస్తూ.

“అంటే మన అమ్మాయి విషయాలు నాకు అనవసరం అనా నువ్వు చెప్తున్నది?” గొంతు తీవ్రంగా ఉంది.

“వదిలేయ్ ప్లీజ్!” అన్నాడు.

“ఇప్పుడు చెప్పు. వదలను!” అంది శశి కళ.

“శశితల్లీ! నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. ఆ టాపిక్ ఇక్కడితో ముగిద్దాం!” అన్నాడు. ఆ అనటంలో ‘వద్దు. ఆపేయ్!’ అనే హెచ్చరిక కూడా ఉంది. శశి ఊరుకోకుండా

“ఇది మన ఇంటి విషయం మనో!”అంది.

“ష్యూర్! నువ్వలా ఫీల్ అవడం, మనదనుకోవడం చాలా సంతోషం కానీ ప్రతి చిన్న విషయం చెప్పమనీ, అనవసరమైనవి మాట్లాడుతూ అక్కర్లేనివి చెప్పమని వేధించకు!” ఖచ్చితంగా చెప్పేశాడు.

“అంటే నీకు నాతో చెప్పకూడని రహస్యాలు కూడా ఉన్నాయన్న మాటేగా?

ఆన్సర్ చెప్పలేదు మనోహర్.

“వెళ్ళొస్తాను!” అన్నాడు మౌనంగా ఉంది శశికళ.

“నువ్వు కదా ఆర్గ్యూచేస్తున్నది. వదిలేద్దాం ప్లీజ్!” అన్నాడు విషయాన్ని తేలిక చేస్తూ.

“లేదు మనోహర్! నీకు నీ కుటుంబం, నీ సమస్యలే ముఖ్యం. నేనూ, నా పెద్దకూతురు ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన విషయం, ఇవేవీ నీకు సంబంధించవు!” ఆమె గొంతులో ఏడుపు బయిటికి వచ్చేస్తోంది.

“శశీ! ఆపేయ్. నేను వచ్చాక తీరిగ్గా మాట్లాడతాను!” అన్నాడు నెమ్మదిగా, అనునయంగా.

“ఇప్పుడే తేల్చు! నీ కుటుంబం, నేను నీకు వేరు వేరు కదూ?” అంది ఆవేశంగా.

“శశీ!” ఆశ్చర్యపోయాడు మనోహర్!

“నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను ఆఫీస్ కి వెళ్ళే సమయం తప్ప మిగతా రోజంతా నీతోనే గడుపుతున్నాను. నీకోసం, నీకోసమే నీ దగ్గర ఉంటున్నాను. పిచ్చా నీకు?” అన్నాడు కోపంగా.

“ఓహో! నీకోసం నువ్వు నాదగ్గర ఉండడం లేదన్నమాటేగా?” అంది.

విపరీతార్ధాలు తీయకు ప్లీజ్!” బతిమాలాడు.

“నేను విపరీతార్ధాలు తీస్తున్నానా?” తల మీద గట్టిగా కొట్టుకుంది. విస్తుపోయాడు మనోహర్. నిముషం నిశ్శబ్దం.

“శశీ! విను. ఇది సమయం కాదు వాదనలకి. నేను వెళ్తున్నాను. వచ్చేదాకా ఓపికగా ఉండు. అప్పుడు మాట్లాడదాం!” నిష్కర్షగా చెప్పి వెళ్ళిపోయాడు.

******

రోజులు గడిచిపోతున్నాయి. శశికళ కి ఆవేశం, మనోహర్ కి విసుగు వచ్చేలా గడుస్తున్నాయి. ఆరోజు ఆదివారం. మనోహర్ అయిపు లేడు. కోపంతో వణికి పోతోంది శశికళ శరీరం. చాలా ఆవేశంగా ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయబడలేదు. మళ్ళీ మళ్ళీ చేసింది. పదిహేను కాల్స్ తర్వాత మనోహర్

“హలో!” అన్నాడు. మాట్లాడకపోతే

“శశీ! నువ్వేనా? అన్నాడు మళ్ళీ.

“నేను బిజీ రా! ఓకే ఓకే చెప్పు మా!” అన్నాడు.

“ఎప్పుడొస్తున్నావ్?” అధికారం గొంతులో.

“నెక్స్ట్ మండే ఈవినింగ్. ఇక్కడ కేంప్ లో ఒక చిక్కు వచ్చిపడింది. పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేస్తానురా చిన్నీ!” అన్నాడు. శశి కోపం సగం చల్లారింది ఆపిలుపుకి. మనోహర్ చెప్పిన సోమవారం పోయి మరో సోమవారం కూడా వచ్చేసింది. ఎంక్వయిరీ చేస్తే మరో పదిహేను రోజుల శలవులో ఉన్నాడని తెలిసింది. అతని ఫ్రెండ్ రామానుజానికి కాల్ చేసింది.

“ఓ శశి మేడమ్ గారూ... చెప్పండి. చెప్పండి“ అన్నాడు.

“మనోహర్...అడగడం పూర్తి కానే లేదు...

“మనూని కలవాలండి. ఎలా ఉన్నాడు? ఏవో పనులతో తీరికే దొరకడం లేదు నాకు. నామీద అలగ వద్దని చెప్పండి. మీ చేత కాల్ చేయించాడేమిటి? బాబోయ్! దయ ఉంచి త్వరలోనే కలుస్తానని చెప్పండి!” అని ఫోన్ పెట్టేశాడు. అంటే తన ప్రాణ స్నేహితుడికి కూడా తానెక్కడున్నాడో చెప్పలేదన్నమాట.

ఏమీ తోచక పబ్లిక్ గార్డెన్స్ వైపు దారి తీసింది. పార్క్ మొత్తం తిరిగింది. రామానుజం కనిపించాడు. పక్కనే మనోహర్! పానీ పూరీ తింటూ జోక్స్ వేసుకుంటూ సాదాసీదా ఉన్నారు. తల గిర్రున తిరిగినట్టయింది. ఒక్క ఊపున ఇంటికొచ్చి పడింది. ఆమెను చూడనే చూశాడు మనోహర్. ఒక మెసేజ్ ఇచ్చాడు. తాను త్వరలోనే వస్తానని, వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుకొవొచ్చునని. ఏడ్చి ఏడ్చి నీరసపడిపోయింది శశి.

పదిహేను రోజులు గడిచాయి. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలవుతోంది. అప్పుడొచ్చాడు. రాగానే నిలదీసింది శశి.

“ఏం? ఇన్నాళ్ళకి కనిపించానా నేను?” అని.

‘టూమచ్ శశి! నేను ఎంతో అలిసిపోయి ఇంటికి వచ్చాను. ఎన్నో పనులు పెండింగ్! అటు ఆఫీస్ కి, ఇటు మీ ఇద్దరికీ న్యాయం చేయాలా? నేను పనులతో సతమతమవుతూ ఉంటే రాగానే యక్ష ప్రశ్నలు!” చిరాకు పడ్డాడు మనోహర్!

“నువ్వు నాకేం న్యాయం చేస్తున్నావో చెప్పు ముందు!” అడిగింది గట్టిగా.

“కూర్చో శశీ! ముందు కూర్చో నువ్వు. నా దగ్గరగా... అని పక్కన కూర్చొబెట్టుకుని అనునయంగా అన్నాడు.

“నువ్వంటే చాలా ప్రేమరా నాకు. లోకానికి కూడా వెరవనంత ప్రేమ. అందుకే కదా నీతో కాపురం కూడా పెట్టాను. ఇదేదో సరదాకి చేసిన పనా? నేను అందరిలో దోషిగా నిలబడడం నీకు మాత్రం బాగుంటుందా? నువ్వు తట్టుకోగలవా?” అడిగాడు. లేదంటూ తల ఊపింది శశి.

“అందువల్ల మన కోపాలు, చిరాకులు, పక్కన పెట్టి, ఉన్నంతలో సరదాగా, హాయిగా జీవితాన్ని ఆస్వాదిద్దాం. నీకు కోపం రావడం సహజమే. అందుకే కొద్దికాలం నీకు అర్ధం అవాలనే దూరంగా ఉన్నాను. అది నాకూ నరకమే కదా శశి?” అనగానే-

అతన్ని అల్లుకుపోయింది. ‘అవును. మనోహర్ చెప్పింది అక్షరాల నిజం. తాను సమాధాన పడాలి‘ అనుకుంది పశ్చాత్తాపంతో.

******

మనోహర్ కూతురికి డెలివరీ రోజులు. మహాలక్ష్మి కాల్ రావడం తో వెళ్ళిపోయాడతను. వెళ్ళేముందు – దీనంగా –

“వెళ్ళి పోతున్నావా?” అని అడిగితే గుండె పిండేసినట్టయింది మనోహర్ కి.

“వెళ్ళాలి కదా?” అన్నాడు దగ్గరగా తీసుకుని తల నిమిరి. ఒక్కక్షణం ఆగి-

“శశీ! నీకొకటి చెప్పాలి!” అని ఆమె సరే అని తలూపగానే –

“ఇంత చదువుకున్నావు. దేశానికి ఒక సేవ అనుకుని చిన్న పిల్లల స్కూల్ లో హాయిగా పాఠాలు చెప్పు. పిల్లలతో గడిపితే శాంతిగా ఉంటుంది. నాపనుల ఒత్తిడిలో నిన్ను పట్టించుకోలేదనే ఫిర్యాదూ ఉండదు!” అన్నాడు. మౌనంగా వింది. ఇదివరకటిలా మాటకి మాట ఇవ్వలేదు.

“ఒక పక్క అబ్బాయి వస్తున్నాడు. రెండు నెలలు ఉంటాడు. వాడు తిరిగి వెళ్ళేలోగా మంచి సంబంధం చూసి పెళ్ళిచేసి పంపాలి. అమ్మాయి డెలివరీ గనక వాళ్ళ అత్తవారు వస్తూ, పోతూ ఉంటారు. నువ్వు కూడా ఏదో ఒక పని చేస్తూ ఎప్పుడూ బిజీ గా ఉండు!” అన్నాడు సౌమ్యంగా.

“అయితే ఇప్పట్లో రావన్న మాట!” ఏడుపు వచ్చేస్తోంది ఆమెకి.

“మళ్ళీ ఆదేమాట. ఇంత చెప్పాను నీకు. వినవా నువ్వు?” అడిగాడు గట్టిగా. ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూడలేకపోతున్నాడు మనోహర్. మొదటి సారిగా విసుగు కూడా వచ్చింది.

మహాలక్ష్మి ఫోన్ చేసిందంటే అందరూ వస్తున్నారని అర్ధం. అక్కడ ‘మహా’ ని వదిలి ఈమెతోనే కదా తానున్నది? ఈ మాత్రం అర్ధం చేసుకోదేంటి?” ఏడుస్తున్న ఆమెని అలాగే వదిలి బయిటికి వచ్చేశాడు.

“ఎప్పుడొస్తావో కూడా చెప్పకుండా నన్నిలా వదిలి వెళ్ళి పోతున్నావా?” అని గట్టిగా ఏడుస్తూ అడుగుతోంది శశికళ. అది విన్న మనోహర్ కి కూడా కన్నీళ్ళు వచ్చాయి.

*****

నెలరోజుల తర్వాత మనోహర్ మనుమడికి ‘బాలసార’ జరిగిందని తెలిసింది శశికి. మనోహర్ ఫోన్ చేశాడు తానెంతో సంతోషంగా ఉన్నానని. శశి కూడా అమ్మమ్మ అయిందని జోక్ చేశాడు. అతని ఉత్సాహం ఆమెకి సంతోషాన్ని ఇవ్వలేదు. శశికి తనకి కావలసింది ఏమిటో ఆమెకే తెలియడం లేదు. మరో నాలుగు రోజుల అయ్యాక నూతనోత్సాహం తో శశిని ప్రేమగా దగ్గరకు తీసుకుని మర్నాడు తాము వైజాగ్ వెళ్దామని, అక్కడ తనకి పని ఉందని శశి కూడా తనతో ఉండాలనుకుంటున్నానని అన్నాడు. సంబరంగా వెళ్ళింది. అయిదురోజులున్నారక్కడ. ఒక సాయంత్రం బీచ్ కి, మరో రోజు హోటల్ రూమ్ లోనే, మిగతా రోజులు చుట్టుపక్కల పల్లెలకి తిప్పాడు. శశికి సంతోషం ఒక వైపు, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోదామంటాడో అని ఒక వైపు సాగే ఆలోచనలతో శాంతిగా లేదనిపించింది.

ఆ సాయంత్రం వచ్చీ రాగానే బీచ్ ప్రోగ్రామ్ పెట్టాడు. మర్నాడు వాళ్ళ తిరుగుప్రయాణం. అలిగినట్టు మొహం పెడితే –

“కమాన్ శశీ! టైమ్ వేస్ట్ చేయొద్దు!” అని లాక్కుపోయాడు. బీచ్ లో ఎగసిపడే అలల వైపు చూస్తోంది శశికళ. పక్కనే మనోహర్ “హల్లో!” అని వినిపిచ్చి చూసేసరికి...

“హల్లో శ్రీకర్!” అంటూ వెళ్ళిపోతున్నాడు మనోహర్. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా కౌగలించుకున్నారు. అక్కడే నిలబడి ఏవేవో మాట్లాడుకున్నారు. సడన్ గా మనోహర్ చెయ్యి పట్టుకుని అక్కడే ఉన్న బైక్ మీద తీసుకు వెళ్ళిపోయాడతను. రెండు గంటలపాటు ఒంటరిగా అక్కడే కూర్చుంది. డ్రైవర్ వచ్చి శశికి నమస్కారం పెట్టి హోటల్ కి వెళ్దామని అడిగాడు. తాను అక్కడే ఇంకాసేపు ఉంటానని. ఆటోలో వెళ్తానని చెప్పడం తో అతడు వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి పొద్దుపోయాక హోటల్ రూమ్ కి వచ్చిన మనోహర్ ని చాలా గట్టిగా నిలదీసింది శశి.

“నువ్వు నన్ను అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాలి శశి. శ్రీకర్ నా కూతురు మామగారి తమ్ముడు. నిన్ను ఏమని పరిచయం చెయ్యను?”

‘ఫ్రెండ్ నని చెప్పు!”

“ చెప్పను. ఈ వయసులో అవన్నీ కుదరవు. కొన్నిసార్లు నువ్వే నన్ను అర్ధం చేసేసుకోవాలి!” అన్నాడు.

“నాకు అర్ధమయేలా చెప్పు” అంది ఏడుపు మొహం పెట్టి.

“నీకు అర్ధం కాదులే శశి. అర్ధమయి, కానట్టు నువ్వడగడం, నేను ఊరడించడం, ఇదంతా మనకి మామూలే! కొన్ని విషయాల్ని పెద్దవి చేయకు. వదిలేయ్!” అన్నాడు కటువుగా.

“అంటే నాగురించి ఎవరికి చెప్పననేగా అర్ధం? అసలు నీ దగ్గర నా స్టేటస్ ఏమిటో చెప్పు!” అంది.

“ఆపేయ్ శశీ!” అన్నాడు గట్టిగా. ఏడుస్తూ పడుకుంది శశి.

******

రెండు నెలలు శశి అంటే ఎవరో అన్నట్టు బతికాడు. కొడుకు పెళ్ళి అంగరంగ వైభవం గా చేశాడని వింది శశి. రెండు నెలలూ పిచ్చిదానిలా ఎదురుచూస్తూనే ఉంది. కొడుకు అమెరికా వెళ్ళాక శశి దగ్గరకు వచ్చాడు మనోహర్. అతన్ని చూడగానే కోపం నసాళానికి అంటింది ఆమెకి.

“చెప్పు నీ దృష్టిలో నేనేమిటి? నీకు నేనెవర్ని? చెప్పి తీరాలి!” షర్ట్ పట్టుకుని కుదిపిపారేసింది. మనోహర్ ష ర్ట్ విడిపించుకుని, విదిలించుకుని విసురుగా వెళ్ళిపోయాడు. కింద కారు స్టార్ట్ చేసిన శబ్దం వినగానే బావురుమంది. అలా వెళ్ళిన వాడు పదిహేనురోజులు గడిచాక వచ్చాడు. ప్రశాంతంగా ఉండతడి మొహం.

“నువ్వారోజు అలా వెళ్ళిపోయావు కదా? నేను సూసైడ్ చేసుకుని ఉంటే? అడిగింది. పగలబడి నవ్వాడు. కోపంగా మొహం పెట్టింది.

“నువ్వంత తెలివితక్కువ పని చెయ్యవు శశి. నా మెడకి చుట్టుకుంటుందనే ఆలోచనతో అస్సలు చెయ్యవు. నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు!” అన్నాడు.

‘ఇదుగో! ఇలాంటి మాటలతోనే తను బుట్టలో పడిపోతూ ఉంటుంది.’ అనుకుంది.

******

రెండు సంవత్సరాలు గడిచాయి. వైజాగ్ ట్రాన్సఫర్ అయింది మనోహర్ కి. వైజాగ్ వెళ్ళబోయేముందు శశి పుట్టిన రోజున సినిమాకి తీసుకెళ్ళాడు మనోహర్. సినిమా చూస్తుండగా ఒక సీన్లో చీకటిగా ఉన్నప్పుడు చాలా ప్రేమగా, తమకంగా శశి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇంటెర్వెల్ లో లైట్లు వెలిగాయి. యధాలాపంగా వెనక్కి చూశాడు. నాలుగు ‘రోస్’ వెనకాల తన పిల్లలు, అల్లుళ్ళు, భార్య, మనవలు అందరూ ఉన్నారు. మనవడు అత్యుత్సాహం తో “తాతా” అని అరిచాడు.

“తాత లేరు నాన్న! కేంప్ కి వెళ్ళారు” అంటోంది మహాలక్ష్మి.

తల ముందుకి తిప్పేసి తెర వంకే చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళెవ్వరూ తనని గమనించినట్టు లేదు. పిక్చర్ స్టార్ట్ అవగానే శశి ని తీసుకుని బయిటికి వచ్చేసాడు. చెమటలతో అతడి బాడీ అంతా స్నానం చేసినట్టు తడిసిపోయి ఉంది. దారిలో కారు ఆపి అటూ, ఇటూ అశాంతిగా నడిచాడు. అతడి వైపే చూస్తోంది శశికళ. చాలా అప్ సెట్ అయినట్టు ఉన్నాడు.

“తనతో ఎప్పటికైనా అతడికి ప్రాబ్లమే!” అనుకుని నిట్టూర్చింది శశికళ.

ఎలాగో ఒకలా శశికళ అపార్ట్మెంట్ దగ్గరికి రాగానే షామియానా, హడావుడి. ఏదో పార్టీ, సెల్లార్ లోనే జరుగుతోంది. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా సెల్లార్ పక్కనుంచే వెళ్ళాలి. ఎలాగోలా వెళ్తూఉంటే ఒకామె పిలిచి ‘తన మనమడి పుట్టినరోజని, పిలవడానికి వస్తే లాక్ చేసి ఉందని చెప్తూ సాదరంగా ఆహ్వానించింది. మొహమాటంగా అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారిద్దరూ. ఓ చిన్న బాబు ని తీసుకొచ్చి అక్షతలు వేయించుకున్నారు. జేబులోనుంచి కొంత డబ్బు తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టాడు మనోహర్. ఆమె డిన్నర్ చేసి వెళ్ళమని చెప్పింది. వెనక నుంచి ఎవరో రహస్యం చెప్తున్నట్టు _

“వీళ్లేనా?’ అని వినిపించింది.

“ఆవిడే! అతన్ని పట్టింది!” అన్నారెవరో.

“పెళ్ళాం, పిల్లలు ఉన్నారతనికి. ఈ మధ్యే మనవడట కూడా!”

“సహజీవనమా? కోర్టు ఒప్పుకుందిగా?”

“సహజీవనం అంటే అటు పెళ్ళాం బతికుండీ, ఇటు మొగుడూ ఉంటే కుదరదు. ముందు విడాకులు ఉండాలి ఇద్దరికీ. ఇది చెల్లదు!”

“ఏంటో! భయం లాంటివేవీ లేవు. సెకండ్ సెటప్ లు ఎక్కువయిపోలా?”

“ఛీ! బుద్దుండాలి. ఏళ్ళు రాగానే సరా?”

“ముందు మీ ఆయన్ని ఇంటి పట్టున ఉండేట్లు చూసుకో!” సందు దొరికింది కదా అని చురకేసింది ఆవిడ పక్కావిడని ఆడేసుకుంటూ. వెనక నుంచి వినపడుతున్న మాటల వల్ల ఎవరో తెలియలేదు కానీ శశి కళ్ళల్లో ఎనలేని బాధ. చెయ్యి పట్టుకు లాక్కొచ్చేశాడు మనోహర్. ఇంట్లోకి రాగానే వెక్కిళ్ళ మధ్య చెప్పింది –

“రోజూ ఇలాగే! ఈ ఎత్తిపొడుపు మాటలు భరించలేక పోతున్నాను మనో!’ అంది. నిముషాల మీద ఎవరికో ఫోన్ చేసి వైజాగ్ లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. తనతో పాటుగా విశాఖ కి తీసుకు వెళ్ళిపోవటమే కరక్ట్ అనుకున్నాడు.

“శశీ! రేపే మనం షిఫ్ట్అయ్యేది. నేను ఏర్పాట్లు చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు!” అన్నాడు.

వైజాగ్ లో ‘లక్ష్మీ నగర్ కాలనీ లోని బడ్డీ ఎన్ క్లేవ్ లో మరొక ఫ్లాట్ అద్దెకి తీసుకోబడింది.

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in May 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!