ముంబయ్ లో IIT చదువుతున్న నేను, ఈ మే నెలలో సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయని, ఈ సారి జూన్ నెలలో మా మేనత్తగారి ఊరు వచ్చాను. వాళ్ళు ఉండేది అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరు. నాకు చాలా ఇష్టమైన ఊరు అనకాపల్లి దగ్గర తుమ్మపాల(తుంపాల). వెళ్లిన రెండ్రోజులకే పొలాలను చూడాలని ఉందని మా అత్తతో చెబితే, అత్త మావయ్యకు చెప్పడం, మామయ్య తీసుకువెడతాను అనడం చకచకా జరిగిపోయింది.
ఏదైనా చూడాలనుకుంటే వాటి గురించి ముందే ఓ కలగనడం పరిపాటి అయిన నేను... పొలాలు అంటే, పచ్చగా కళకళలాడుతూ, పంటకాలువలో గలగలా పారే చల్లటి నీళ్ళు, పైన నిర్మలమైన ఆకాశం, కనుచూపు మేరలో నీలం, ఆకుపచ్చ కలగలిపిన నెమలి కంఠం రంగుతో, కొన్ని మబ్బులను పెళ్లికూతురి మేలిముసుగులా, టీనేజ్ అబ్బాయి కలల్లోని స్వప్న సుందరి వేసుకునే తెల్లని తెలిమంచు తెరలా వేసుకున్న అందమైన కొండలు, పక్షుల కిలకిలా రావాలు, ఓ గావంచా లాంటి పంచె కట్టి, చేతిలో కర్రతో తాతలు, చీరను గోచీకట్టు, పైట చెంగును నడుంచుట్టు బిగించి జానపద పాటలు పాడే అమ్మమ్మలు, పచ్చని పైరులా వయ్యారాలు పోయే కన్నెభామలు, మొల మీద ఏ అచ్ఛాదనా లేకుండా తాటికాయలను బండిలా చేసుకొని ఆటలాడుకునే పసిపిల్లలు...ఇలా సినిమాల్లో చూపించినంత సీన్స్ ను ముందే వేసేసుకున్నాను. చాలా ఉత్సాహంగా ఉన్నాను. సాయం సందె తీసుకొచ్చే రవివర్మకు కూడా అందని రంగుల చిత్రాన్ని, ఆకాశాన్ని, గాలికి తగ్గట్లుగా తలలూపే వరికంకుల్లా నేనూ తల ఊపుతూ ఆనందిద్దాం అనుకున్నా.
ఇంతలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురవడం, మా మామయ్యగారి పిల్లలు, నేను... మేమందరం ఆ జల్లులలో తడవడంలో, కేరింతలు కొట్టడంలో మా పరిసరాలను కూడా మరచిపోయాం. అప్పుడే వచ్చిన మా మావయ్య...
"అబ్బాయ్ కృష్ణా! జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో కాస్త ఆ పంచాంగం చూసి చెప్పు" అన్నారు.
పంచాంగం తీసి, "జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి - జూన్ 21 వ తారీఖు న" అన్నాను నేను.
"సరే అయితే, మనం ఆ రోజు ఉదయాన్నే పొలాల దగ్గరకు వెడదాము" అన్నారు మావయ్య.
'అంటే, ఇంకా ఆరు రోజులుందన్నమాట!'. అంతే, ఆ మాట అనుకోవడంతోనే కాఫీ నురగ మీద చప్పున ఓ చిటికెడు వెనిగర్ కుమ్మరించినట్లు, ఎత్తున ఎగరలానుకున్న బెలూన్ గాలి తీసేసినట్లు అయిపోయింది నా మనసు. అయినా చేయగలింది ఏం లేదు కదా! అందుకే నోటికి తాటికాయంత తాళం వేసి, కోవై సరళలా గమ్మున కూర్చున్నాను.
ఆరురోజుల తరువాత పౌర్ణమి రానే వచ్చింది. అదేంటో ఆ రోజు, రోజూ కంటే ముందుగా ఊరంతా నిద్ర లేవడం, కళ్లాపు చల్లడం, అందమైన రంగవల్లులు తీర్చిదిద్దడం, గుమ్మాలకు పసుపు, కుంకుమలు పూయడం, తోరణాలు కట్టడం ఇలా ఒక్కోటి చకచకా చేసేశారు. ఇంచుమించు ఓ పండగ వాతావరణాన్ని తలపించేలా ఉంది. ఆ రోజు బసవన్నలు భలే కలర్ఫుల్ గా తయారయ్యాయి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని ఘల్ ఘల్ మని శబ్దం చేస్తూ వీథుల్లో నడుస్తుంటే, 'ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె త్రుళ్ళు' అనే స్వర్ణకమలం సినిమాలోని పాటను అప్రయత్నంగానే నా పెదాలు పాడేస్తున్నాయి, అసందర్భమైనా ఆ శబ్దానికి తగిన పాట కదా! అలా వచ్చేసింది మరి.
సరే, మళ్ళీ విషయంలోకి వెళ్ళిపోదాం...
ఇంతలో మా మావయ్య "ఒరేయ్ కృష్ణా! త్వరగా తయారుకా, మన పొలాలు చూపించమన్నావు కదా! వెడదాం. ఊఁ త్వరగా, మళ్ళీ ఎండెక్కి పోతుంది" అన్నారు.
నాకేం అర్థం కాలేదు. 'నేనేదో సరదాగా సాయంత్రం చల్లగాలి, పైరగాలితో పాటు పిల్లగాలిని కూడా ఆస్వాదిద్దాము అనుకుంటే, ఈయనేంటి ఊరవుదయాన్నే రమ్మంటున్నాడు!' అని తిట్టుకుంటూనే, బయటకు అనే ధైర్యం చెయ్యలేక త్వరగా తయారై బయలుదేరాను.
నేరుగా మా మావయ్య వాళ్ళ పొలాలు ఉన్న చోటుకు తీసుకెళ్ళారు. అక్కడ చూసిన దృశ్యం చూసి నాకు మతిపోయింది.
ఇంచుమించు 25 ఎకరాల సువిశాల పొలం. ఓ ఇరవై నాగళ్ళు, ముస్తాబైన జతల ఎడ్లతో వరుస క్రమంలో నిల్చున్నాయి.
ఇంతలో మా మేనత్త వచ్చి ఆ ఎడ్లకు బొట్టుపెట్టి, హారతి ఇచ్చి, అక్కడే ఉన్న ఒక రాయిమీద కొబ్బరికాయ కొట్టడంతో ఎడ్లు ఒక్కొక్క అడుగు వేస్తుంటే, నాగలి నేలతల్లి గర్భాన్ని శుద్ధిచేస్తున్నట్లు, ఒక ఇంజనీర్ స్కేల్ పెట్టి గీస్తున్నట్లు ఒక తిన్నని గీత, ఒకే లోతుతో వెళుతుంటే ఆ పరిజ్ఞానాన్ని చూసిన నాకు నోట మాట రాలేదు. 'ఏ పరిజ్ఞానమైనా మన పురాతన విజ్ఞానం మీద ఆధారపడి తయారయినదే కదా! అంతటికీ మన పూర్వీకుల జ్ఞానమే మూలధనం కదా!' అనే నా మనసు మాట విపించి, 'అవును, నిజమే కదా!' అనుకున్నాను.
అయితే, ఇక్కడ నన్ను మరింతగా ఆకట్టుకున్నది ఆ మూగ జీవాలు. అసలు వాటికి భగవంతుడు ఎంతటి జ్ఞానాన్ని, ఓర్పును ఇచ్చాడో అనిపించింది. ఎందుకంటే, వాటిని చర్నాకోలాతో కొడుతూ ఉన్నా సరే బాధను ఓర్చుకుంటూనే, యజమానికి సాయపడుతున్నాయి.
ఇలా మైమరచి చూస్తున్న నాకు చక్కని జానపదం నా చెవిని సోకింది....
'ఏరువాక సాగించు
పరువాల పారించు
విత్తనాలు నాటించు
కొత్త ఆశలు చిగురించు....'
అంటూ సాగుతున్న కమ్మటి గుమ్మపాలవంటి జానపదం గీతం, నాగలి వెంబడి విత్తనాలు నాటుతున్న ఆడవారి స్వరం నుండి వింటుంటే...
ఎంతసేపూ ఫోన్ ముందో, లాప్ టాప్ అంటూ కళ్ళకు నొప్పిపుట్టించే పరికరాల ముందో కూర్చొని టిక్కు టిక్కు మంటూ ఉండే యాంత్రికమైన నా లాంటివారికి ఇది ఎంతటి అపురూప దృశ్యమో కదా! అని అనిపించకమానలేదు.
అలా రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాను. ఎంతసేపయిందో తెలియలేదు. ఇంతలో మావయ్య...
"కృష్ణా! ఇహ వెడదామా!" అన్నారు.
నేను 'ఊ... ఉ హుం...ఊ... ఉహున్ ..' ఇలా..... వెళ్ళకూడదని, వెళ్లాలని....అమ్మని విడిచి వెళ్ళలేని పసిపాపలా ఆ దృశ్యాన్ని విడిచి వెళ్ళాలనిపించక అక్కడే ఓ అరగంట తాత్సారం చేశాను.
ఎట్టకేలకు బైక్ ఎక్కి, ఇంటికి వెడుతున్న త్రోవలో చెప్పారు మావయ్య..."ఇదేరా కృష్ణా, ఏరువాక అంటే. దీనిని వేసవి తరువాత వచ్చే ఋతుపవనాలను, తొలకరి జల్లులను ఆధారం చేసుకొని, (మృగశిర కర్తరిలో) జ్యేష్ఠ శుద్ధపౌర్ణమి రోజున శుభ ముహూర్తంలో దుక్కి దున్ని, విత్తులు జల్లుతాం. నేటినుండి వర్షాలు బాగా పడితే, ఏడాదికి నాలుగు పంటలు పండిస్తాం. వేసవికి నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి భూములన్నీ బీడువారి, పంటలకు అనుకూలంగా ఉండదు. అందుకే, మొదట నువ్వు పొలాలు చూద్దాం అన్నప్పుడు, ముంబయ్ నుండి వచ్చిన నీకు పొలాల్లో పంటలేని నెర్రలు బారిన నేలను చూపించడం ఇష్టంలేక, ఇలా ఈ రోజు నీకు చూపిస్తున్న. ఇది రైతులకు ఉగాది వంటిది, అర్థమయ్యిందా!" అన్నారు.
'అర్థమైంది' అని నా నోరు మావయ్యకు సమాధానం చెబుతోంది కానీ, నా మనసు మాత్రం ఆ 'ఏరువాక' మీదే ఉండి పోయింది.
అయినా తప్పదు కదా! మనసుకు కాస్త గంతలు కట్టి నిశ్శబ్దంగా కూర్చున్నాను.
కొంత దూరం వెళ్ళాక వేరే వారి చిన్న పొలంలో ట్రాక్టర్ తో పొలం దున్నడాన్ని చూసి, మావయ్యతో "మావయ్య! ఇంత చిన్న పొలాన్ని వాళ్ళు ట్రాక్టర్ తో దున్నుతుంటే, అంత ఎక్కువ పొలం ఉన్న మీరు మాత్రం సాంకేతికతను ఉపయోగించుకొని, కూలీలకు ఇచ్చే ఖర్చును తగ్గించుకొని, తక్కువకాలంలో ఎక్కువ లబ్ధిపొందకుండా ఇలా చేస్తున్నారెందుకని?" అడిగాను.
వెంటనే మావయ్య అన్నారు, "చూడు కృష్ణ! ముందు నువ్వు 'కూలీలు' అనే మాటను మనసులోంచి తీసేయ్. ఎందుకంటే రేపు మీరు ఉద్యోగాలు చేసినా అది కూడా కూలి క్రిందకే వస్తుంది. అప్పుడు మీరు కూడా ఒకరకంగా కూలీలే! ఖరీదైన కూలీలు. ఒకవేళ ఆ పదంతో నీ యజమాని నిన్ను పిలిస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? బాధపడతావు కదా! వీళ్ళు కూడా అంతే. వీళ్ళందరూ మనలాంటి మనుషులే. కాబట్టి సాటి మనుషులుగా ముందు చూడడం చేద్దాం, సరేనా!
సరే, ఇంక నువ్వు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తున్నా. సాంకేతికతను ఎందుకు వాడరు అని కదా! సాంకేతికతను వాడకపోవడం ఏమీలేదు, అవసరాన్ని బట్టి వాడతాము. నిజానికి మన దేశ జనాభా 142.80 కోట్లు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో, ముఖ్యంగా మీలాంటి యువత కలలుగనే అమెరికాతో పోలిస్తే మన దేశ జనాభా 4 రెట్లు ఎక్కువ. కాబట్టి మనుషులు ఎక్కువగా ఉండే మనవంటి దేశాల్లో సంప్రదాయ రీతుల్లో, మనుషుల ద్వారా ఇటువంటి పనులు చేయించినపుడు మనుషులకు ఉపాధికి ఉపాధి, మూగజీవుల సంరక్షణ, వాతావరణ కాలుష్య నివారణ ఇలా ఎన్నో లాభాలు కలుగుతాయి.
ఉదాహరణకు...ఎడ్లు పొలం దున్నుతున్నప్పుడు అవి వేసే పేడ, మూత్రం భూమికి సహజ ఎరువులుగా ఉపయోగపడి, భూమి సారం బాగుండి మంచి ఫలవంతమైన పంట పండుతుంది. రసాయనిక ఎరువులు వాడకం తగ్గడం ఒక ఎత్తు అయితే, తద్వారా మంచి పంటవలన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు.
నీకు తెలుసు కదా! ఇప్పుడు పట్టణాల్లో అంతా ఆర్గానిక్ పంటల మీద ఎంత మోజు చూపిస్తున్నారో! ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఆరోగ్యాలు దెబ్బతిని, మనిషిలో రోగ నిరోధకశక్తి తగ్గి, సంపాదించుకున్న డబ్బు చికిత్సలకే పోతుంటే, ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అందరికీ. అందుకే ఇప్పుడు మళ్ళీ ముడిబియ్యం, సేంద్రీయ పంటలవైపు క్యూ కడుతున్నారు."
"మరి పంట దిగుబడి తగ్గి, పెట్టుబడి ఎక్కువై లాభాలకు బదులు నష్టాలు వస్తాయి కదా!" అన్నాన్నేను.
నా మాట పూర్తవ్వకుండానే, "పంట దిగుబడి తక్కువేమీ రాదు. సేంద్రియ పద్ధతుల్లో కూడా అధిక దిగుబడి వచ్చే పంటలు పండిచవచ్చు. పైగా, వచ్చిన పంట బలవర్ధకమైనదిగా ఉండడంవలన, దానికి మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. దానివలన నష్టం అన్న మాటే లేదు. అందుకే 'కమ్మనిది కాసింత' అని మన పెద్దలు ఇటువంటి వాటిని చూసే అన్నట్లున్నారు", నా సందేహాన్ని కొంత తీరుస్తూ చెప్పారు మావయ్య.
"మరి ప్రకృతి వైపరీత్యాలు వస్తే, అప్పుడు ఈ శ్రమ, పెట్టుబడి అంతా వృధాయే కదా! మావయ్య" అని నేనంటే...
"అది ఒకప్పటి మాటరా. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా పంటలకు భీమా సౌకర్యం కల్పించడం, నష్టపరిహారం చెల్లించడం వంటి కార్యక్రమాలు చేయడంతో, నష్టాలు అనే మాట తగ్గిపోయింది. అందుకే, సేంద్రీయ పంటలు పండించడానికే రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎక్కడో నాలాంటి వారు సంప్రదాయపద్ధతుల్లో కూడా వ్యవసాయం చేస్తే, కొంతమేరైనా అవసరం ఉన్నవారికి ఉపాధి కలిగి, నిరుద్యోగం తగ్గి, దేశానికి ఎంతోకొంత సేవ చేస్తున్నామనే తృప్తి, ఆనందం మిగులుతుంది. ఏదైనా రైతు కూడా దేశానికి సైనికుడివంటివాడే కదా!" అన్నారు మావయ్య.
ఆయన విడమరిచి చెప్పిన తీరుకు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాను. అలాగే, మనుషులు నాగలితో దున్నతున్నప్పుడు కనిపించిన అందమైన వాతావరణం, ఈ ట్రాక్టర్ ను వాడుతున్న పొలం దగ్గర కనబడకపోవడం కూడా, మావయ్య చెప్పిందానితో ఏకీభవించేలా చేసింది.
హ్మ్...ఏదేమైనా, ప్రాంతపు పరిస్థితులబట్టే అన్నీ ఆధారపడి జరగాలి అని మాత్రం కచ్చితంగా తెలుసుకొన్నాను. అంతేకాదు, పట్నంలో ఉండే ఇరుకైన మనుషులకంటే, పల్లెటూళ్ళో ఉండే స్వచ్ఛమైన మనుషులు ఎంత గొప్పగా ఆలోచిస్తారో కూడా అర్థమైంది.