
విడిచిపెట్టనని పెళ్ళిలో ప్రమాణం చేసిన దానివి
విచిత్రంగా విడిచిపెట్టి వెళ్ళిపోయావు.
ఈ వయసులో ఇలా చేయటం సమంజసమా
అని అడుగుదామంటే తెలియని తీరాలకు మళ్ళిపోయావు.
నీ మాటను తను వేదంగా భావించాడు,
నీసన్నిధినే తన పెన్నిధిగా జీవించాడు.
తన నమ్మకాన్ని వమ్ము చేశావు,
తన జీవితంపై దుమ్ము పోసావు.
మాట తప్పావు, మడమ తిప్పావు.
ఈ వయసులో తనకి సంపాదన ఇవ్వలేని స్వాంతన
నీ సాహచర్యమే ఇస్తుందన్న సంగతి మరిచావా?
లేక,
తన మనసులో కలిగే ఈ అంతులేని వేదన
నీవల్లే తప్ప మరోకరివల్ల తీరదని తెలిసి కూడా విడిచావా?
మరిప్పుడు,
ఈ జీవితపు చరమాంకంలో
తననిలా దిక్కులేని పక్షిని చేసి,
పొడవబడ్డ అక్షిని చేసి,
నువ్వు వెళ్ళిపోయావెందుకు?
నిర్లిప్తతకు సాక్షిని చేసి,
నిర్వేదపు కక్షిని చేసి
మరలా రాలేని లోకాలకు తరలిపోయావెందుకు?
అతని దృష్టిలో శూన్యంగా మిగిలిపోయావెందుకు?
ఎందుకిలా చేశావు?
ఎడారిలో ఒంటరి బతుకును సృష్టించావు?