ఏమైనా అవనీ…
ఈ ప్రారబ్ధం ఇలా పగలబడి నవ్వనీ
ఈ కనులు ఇలా కుమిలి కుమిలి ఏడ్వనీ
ఈ మనసిలా మండనీ
ఈ ఖర్మ ఇలా కాలనీ
కళ్ళలోని కాంతి కరగనీ,
మనసులోని శాంతి మరగనీ
ఓర్పు ఒరగనీ,
ఓదార్పు కనుమరుగవనీ
ఈ జీవితం మోడై మిగలనీ
ఒంటరితనమే నా తోడై నిలవనీ
కాలం శూలమై పొడవనీ,
శీలం శిధిలమై తొలగనీ
గతం గదమనీ, ప్రస్తుతం పెగలనీ
భవిష్యత్తు భయపెట్టనీ
విషాదం వ్యాపించనీ,
విరోధం శపించనీ
గొంతు గద్గదమవనీ,
తంతు తడబడనీ
జడత్వం జతపడనీ
సత్వగుణం శోకించనీ
రజోగుణం రాజుకోనీ,
తమోగుణం ప్రకోపించనీ
శూన్యం అనంతమై నన్నాక్రమించనీ
శోకం అనన్యమై నన్నావరించనీ
విరక్తి విజృంభించనీ,
విముక్తి పలాయనం చిత్తగించనీ
మానవత్వం ఆగమమవనీ
మాధవత్వం మూగబోనీ
ఇంకా ఇంకా ఏమైనా అవనీ...
ఈ జీవితమంతా అతలాకుతలం అయి
మృత్యు ఒడిలో చేరనీ...