ఎక్కడిది?
- పారనంది శాంతకుమారి
భామిని లేనిదే యామినికి విలువెక్కడిది?
పడతి లేనిదే పురుషునకు పరమెక్కడిది?
ప్రేయసి లేనిదే ప్రియునకు ప్రియమెక్కడిది?
వధువు లేనిదే వరునికి మధువెక్కడిది?
రమణి లేనిదే రమణునికి రంజెక్కడిది?
ముదిత లేనిదే మగనికి ముదమెక్కడిది?
భీరువు లేనిదే భర్తకు ధీరమెక్కడిది?
అతివ లేనిదే ఆర్యునకు అతిశయమెక్కడిది?
నాతి లేనిదే నాధునికి నీతెక్కడిది?
చెలువ లేనిదే చెలునికి చెలిమెక్కడిది?
సీత లేనిదే సామికి హితమెక్కడిది?
అంగన లేనిదే యజమానికి ఆలోచనెక్కడిది?
ఇంతి లేనిదే ఈశునికి కాంతి ఎక్కడిది?
నాతి లేనిదే నర్మకీలునికి నీతెక్కడిది?
భీరువు లేనిదే ధీరునికి ధీరమెక్కడిది?
ప్రమద లేనిదే పెనిమిటికి ప్రజ్ఞ ఎక్కడిది?....
ముదిర లేనిదే మనువుకు మధురమెక్కడిది?
వలజ లేనిదే వోఢకి వలపెక్కడిది?
వనిత లేనిదే విభునికి వినుతెక్కడిది?
వశ లేనిదే వరునికి యశమెక్కడిది?
శోభాంగి లేనిదే శూరునికి శుభమెక్కడిది?
సుమతి లేనిదే సమాప్తాలునికి మతి ఎక్కడిది?
మానిని లేనిదే మగనికి మానమెక్కడిది?
కేశిని లేనిదే కాంతునికి ఖుషీ ఎక్కడిది?
కలికి లేనిదే క్షేత్రి కి కులుకెక్కడిది?
హే(భా)మ లేనిదే ప్రేమెక్కడిది?
ఉవిద లేనిదే సువిద ఎక్కడిది?
జలజనేత్ర లేనిదే జీవయాత్ర ఎక్కడిది?
తన్వి లేనిదే తన్మయత్వ మెక్కడిది?