Menu Close
డ్రగేరియా

ఘాలి లలిత ప్రవల్లిక

-- ఘాలి లలిత ప్రవల్లిక --

"ఒరే చవటసన్నాసి లేచి తగలడు బారెడు పొద్దెక్కినా తెల్లారలేదా?!?

కప్పలా మంచాన్ని కరుచుకు పడుకున్నావ్  లే ...లే ..".. అంటూ బకెటుడు నీళ్ళు బోదేష్ మీద కుమ్మరించాడు హనుమంతరావు.

"ఊ ..." అంటూ ఓ మూలుగు మూలిగి పక్కకొత్తిగిలి పడుకున్నాడు బోదేష్.

"ఒరే దున్నపోతా ఈ రోజు నీకు ఇంటర్వు ఉంది గుర్తుందా లే లే" అంటూ ఇంకో బకెట్ నీళ్ళు తెచ్చి పోసాడు హనుమంతరావు.

"అబ్బా ఉండు నాన్న లేస్తున్నా పొద్దున్నే ఏమిటి ఈ గోల" అంటూ ఒళ్లు బద్దకంగా విరుచుకుంటూ పైకి లేచాడు బోదేష్.

"లేచి పళ్ళు తోముకుని స్నానం చేసిరా నాతో పాటు నిన్నూ తీసుకెళ్లి ఇంటర్వ్యూ దగ్గర నిన్ను వదిలి నేను ఆఫీస్ కి తగలడతా. లేకపోతే బలాదూర్ లా తిరిగి ఇంటర్వ్యూ ఎగ్గొడతావ్."

క్రితంసారి ఇంటర్వ్యూ కెళ్ళమని పంపిస్తే ఫ్రెండూ... పార్టీ .... అంటూ తూలుతూ అర్థరాత్రి ఇంటికొచ్చిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అన్నాడు హనుమంతరావు.

"స్నానం ఎలాగో చేయించావు ఆ చేత్తో పళ్ళు కూడా తోమేస్తే పని అయిపోయేదిగా నాన్నా." గొణుగుతున్నట్లుగా అన్నాడు బోదేష్.

"ఏంటీ అంటున్నావ్" హూంకరించాడు హనుమంతరావు.

"ఏం లేదు ఏం లేదు" అంటూ దిగలేక దిగలేక మంచం దిగాడు బోదేష్.

ఖడేరావు బంట్రోతులా నుంచున్న తండ్రికి భయపడి పళ్ళు తోముకుని బట్టలు మార్చుకుని వచ్చాడు బోదేష్.

"ఒరేయ్ టిఫిన్ తిందువుగానిరా" అని పిలిచింది తల్లి.

"వద్దమ్మా ఇప్పుడు తినే అంత ఓపిక లేదు" అన్నాడు బోదేష్.

"ఓపిక రావాలంటే తినాలి. నీ బద్ధకం కడుపు మీద చూపిస్తే అది నీ శరీరం మీద పగతీర్చుకోగలదు జాగ్రత్త!" హెచ్చరిక జారీ చేశాడు హనుమంతరావు.

బద్దకమా పాడా రాత్రి పబ్బులో నిండిన పొట్ట .... ఇంకా దిగలేదు  ...ఎక్కడ ఖాళీ ఉందని, తినకపోతే ఈ ముసలాడొదలడు అని మనస్సులో అనుకొని తిన్నాననిపించుకున్నాడు బోధేష్.

******

"గాల్లో..తే...లి..పో...నా

నిం..గిలో...నిండి...పోనా...

స్వర్గం..మే...చేరి...పోనా

ఒ..రే.‌.ఎంత బాగుందో..ఆ స్వర్గం.

అలా అలా తేలిపోతున్నట్లుంది రా." మత్తుగా మాట్లాడుతున్నబోధేష్ ను పట్టుకుని బయటకు తీసుకు వస్తున్నారు అతని స్నేహితులు.

"రేయ్ ...ఎక్కడికీ ....నేను రాను...

వదిలేయ్ ..‌నన్నొదిలేయ్ ....ఆ నరకానికి నేను రాను ....ఇక్కడే ఉంటా ....

నువ్వూ ఇక్కడే ఉండు. నీకు స్వర్గం చూ ....." ఏదో పిచ్చి గా మాట్లాడుతూ తూలుతున్న బోధేష్ ను అతి కష్టం మీద ఇంటికి చేర్చారు అతని మిత్రులు.

అర్ధరాత్రి దాటుతున్నా ఇంటికి రాని కొడుకు కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తున్న బోధేష్ తల్లి, రోజూ వీడు ఏ టైంకు వస్తున్నాడో చూడాలని పట్టుదలగా మెళుకువగా ఉన్న హనుమంతరావు కి బోధేష్ ని ఆ స్థితిలో చూడగానే బాధేసినా తల్లికి క్షేమంగా ఇంటికొచ్చాడన్న ఆనందము, తండ్రికి అక్కరకు వచ్చిన కొడుకు వ్యసన లోలుడయ్యాడేననే కోపం కలిగింది.

బోధేష్ ఫ్రెండ్స్ కి థాంక్స్ చెప్పి బయటకు పంపించారు. బోధేష్ తల్లిదండ్రులు.

నిటారుగా నుంచో లేని బోధేష్ సోఫాలోకూలబడిపోయాడు.

ఆ రాత్రి హనుమంతరావు ఆలోచనలు కొడుకుని ఎలా మార్చాలి అనే దిశగా సాగాయి.

*****

మధ్యాహ్నం రెండు. ఆ టైం కి నిద్ర లేచాడు బోధేష్. ఎవర్ని పిలిచినా ఎవరూ పలకలేదు రాలేదు. చుట్టూ చూశాడు అంతా కొత్తగా ఉంది.

లేవబోయాడు కాని పైకి లేవలేక పోయాడు.

ఒళ్ళంతా బరువుగా అనిపించింది.

తనను తాను పరిశీలనగా చూసుకొన్నాడు. వళ్ళంతా బ్లూ కలర్ క్లాత్ కప్పేసింది. చేతులకీ కాళ్ళకూ గ్లౌజులున్నాయి. తను వేరే ఎక్కడో ఉన్నట్లుగా గ్రహించాడు బోధేష్. మెల్లిగా శక్తిని కూడా తీసుకుని తలుపులు గట్టిగా బాదాడు.

తలుపు బయట నుండి "తలుపులు అలా బాదకండి మీ కున్న ఆ కాస్త శక్తీ తగ్గిపోతుంది" అంటూ వినబడింది.

"ఏమైంది నాకు? ఎందుకు నన్నిలా వంటరిగా ఉంచారు? ఈ బట్టలేంటి? ఎవరు మీరు? మా అమ్మానాన్నా ఏమయ్యారు?"

ఇలా ప్రశ్నలవర్షం కురిపిస్తున్న బోధేష్ తో

"ష్ మాట్లాడకూడదు. మీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెబుతా. ఎదురు ప్రశ్నలు వేయకుండా విని ఊరుకోండి. నా పేరు చెప్పుదెబ్బేశ్వరాచారి. నేనో డాక్టర్ని. మీకు డ్రగేరియా అనే జబ్బు వచ్చింది. మీ దరిదాపుల్లో ఎవరూ ఉండకూడదు. మీ శరీరానికీ నరాలకు వత్తిడి కలగకూడదు. అందుకే మీ దరిదాపుల్లో వ్యక్తులు గాని, ఫోన్ గానీ, టీవి గాని, బుక్స్ గానీ ఏమీ ఉంచలేదు. మీకు లిక్విడ్ ఆహారం రోజుకొకసారి మాత్రమే సీసాలో పోసి కిటికీలోంచి విసిరి తలుపేసేస్తాము. మీ రూములో ఉన్న సీ.సీ. కామ్ ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాము." అంటూ చెప్పాడా డాక్టర్.

"ఇదేం జబ్బు? ఈ పేరే నేను ఎప్పుడూ వినలేదే!" ఆశ్చర్యంగా అడిగాడు బోధేష్.

"పుర్రెకో బుద్ధి, పూటకోజబ్బు పుట్టుకొస్తున్నాయి. ఏం క్షణం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?!?

నేను ఎటువంటి ప్రశ్నలు వేయవద్దని చెప్పాను కదా. పెదవి కదిపితే ఆయువు తగ్గుతుంది జాగ్రత్త!". అంటూ హెచ్చరిక జారీ చేశాడు చెప్పుదెబ్బేశ్వరరావు.

చేసేదిలేక విచారంగా కూర్చుండిపోయాడు బోధేష్.

******

"పాపం బోధేష్ ఎలా ఉన్నాడో ఏమో ఒక్కడూ ఆ రూములో" దిగులుగా అంది బోధేష్ తల్లి.

"మరి మాయరోగమా! ఏ ఉద్యోగమో చూసుకోకుండా నా కష్టార్జీతంతో తాగి తందనాలాడతాడా. అంతటితో ఊరుకోకుండా యువతను పెడత్రోవ పట్టించే ఆ దిక్కు మాలిన డ్రగ్స్ కీ అలవాటు పడ్డాడు. కుటుంబానికీ, దేశానికి ఉపయోగపడాల్సిన ఈ యువత బ్రెయిన్స్ మత్తులో జారుకుంటే ఎలా? వయసుకొచ్చిన పిల్లల్ని వద్దని వారిస్తే ఎదురు తిరుగుతారు.

అలాగని చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలేం. అందుకే నా ఫ్రెండ్ తో కలిసి వాడు మత్తులో ఉండగానే వాడింటికి షిఫ్ట్ చేసి ఈ నాటకమాడించా ఓ వారం రోజులు పోతే వాడే మామూలు స్థితికి వస్తాడు." అన్నాడు హనుమంతరావు.

ఏదో రకంగా బిడ్డమారితే చాలనుకుంది బోధేష్ తల్లి.

o00o00o00o00o

Posted in May 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!