ఆకాశాన్ని మేఘాలు కమ్ముకుని ఉండడంతో, వాతావరణం దిగులుతో ఉన్నట్లు దీనంగా ఉంది. ఆరోజు ఒళ్ళు బాగుండకపోవడంతో డ్యూటీ కి సెలవు పెట్టి డాక్టర్ సునీత ఇంట్లోనే ఉండిపోయింది. ఈవేళ వాతావరణం ఎలాగుందో అలాగే ఆమె మనసు కూడా దిగులుతో దీనంగా ఉండడం వల్ల ఆమెకు, ఏమీ తోచకుండా వుంది. ఏనాటివో జ్ఞాపకాలు తామర తంపరలుగా ఒకదాని తరవాత ఒకటి గుర్తుకి వచ్చి, మనసును కలతపెడుతున్నాయి. ఎలాగైనా మనసును మరిపించుకోడానికని ఆమె TV ఆన్ చేసి, సోఫాలో కూర్చుని, విశ్రాంతికోసం వెనక్కి వాలింది. కాని అంతలోనే ఫోన్ రింగయ్యింది.
సెలవులో ఉన్నప్పుడు హాస్పిటల్ నుండి ఫోను వచ్చింది - అంటే, తగినంత పెద్ద కారణమే ఏదో ఉండి ఉంటుంది - అనుకుంది సునీత. కంగారు పడుతూ కాల్ రిసీవ్ చేసుకుంది. నిజమే! ఈ కాల్ రావడానికి పెద్ద కారణమే ఉంది . . .
బ్రేకులు సడలిన వాటర్ ట్యాంకర్ ఒకటి తప్పుదారిన వచ్చి, పిల్లలను స్కూల్‌కి తీసుకు వెడుతున్న ఒక స్కూల్ బస్సును ఢీకొట్టి పడదోసిందనీ, చాలామంది పిల్లలకు గాయాలయ్యాయనీ, కొందరు ప్రమాదకర స్థితిలో ఉన్నారనీ, పీడియాట్రీషియన్ ఐన ఆమె అవసరం అక్కడ చాలా ఉందనీ ఆ ఫోన్ కాల్ సారాంశం. ఏమాత్రం వీలుగా ఉన్నా వెంటనే బయలుదేరి రమ్మని వచ్చిన అత్యవసర పిలుపు అది.
డాక్టర్ సునీత మరి ఆలోచించ లేదు. తన ఆరోగ్యాన్ని అసలు పట్టించుకో లేదు, వెంటనే, కారు బయటకు తీసి డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్‌కి బయలుదేరింది. డ్యూటీ పడితే ఆమెకు మరి తిండీ, నీళ్ళూ కూడా గుర్తుకి రావు. డ్యూటీకి అడ్డు తగిలేటంత బాదరబందీ లేమీ కూడా లేవు ఆమెకు. ఆమె అవివాహిత!
అందం, చదువు, సంస్కారము వగైరాలన్నీ ఉన్న ఆమెకు తగిన వరుడు దొరకక కాదు ఆమె అవివాహితగా ఉన్నది - దానికి, వివాహం పై ఆమెకున్న విముఖతయే కారణం! చెప్పాలంటే అదో విషాద గాధ . . .
#### ###
సునీత తండ్రి సీతారాం, సురేశ్ తండ్రి ప్రకాశరావు ఒకే ఊరివాళ్ళు కావడంతో చిన్నతనంనుండీ కూడా వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. పెద్దవాళ్ళయ్యాక కూడా వాళ్ళు ఉంటున్నది ఒకే ఊరు కావడంతో, ఇళ్ళమధ్య దూరం వున్నా, రెండు కుటుంబాలూ ఒకరి ఇంటికి ఒకరు తరచూ వస్తూ పోతూ, చాలా సన్నిహితంగా ఉండేవారు.
తెలిసినవాళ్ళందరూ, వాళ్లకి ఈడైన పిల్లలున్నారు కనుక మిత్రులిద్దరూ వియ్యమందుతారనే అనుకున్నారు. ఆ రెండు కుటుంబాలూ కూడా అదే ఉద్దేశంతో చిన్నప్పటినుండీ సునీతా సురేశులకు కలిసి తిరిగేందుకు పూర్తి స్వేచ్చ నిచ్చేశారు. సునీతా, సురేశులు ఇద్దరూ ఆడుతూ, పాడుతూ కలిసిమెలిసి పెరిగారు. వాళ్లిద్దరూ కూడా, అప్పట్లో తమ పెళ్లి ఖాయం - అనే అనుకున్నారు .
సునీత, సురేశ్ కన్నా ఐదేళ్ళు చిన్నది కావడంతో, సునీత కాలేజికి వచ్చేసరికి సురేశ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. కాని ప్రతివారం విధిగా సునీతకు ఉత్తరం రాసేవాడు. సునీత కూడా ఆ రోజు కారోజే అతనికి జవాబిచ్చేది. అతడు సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా సినిమాలకనీ, షికారుకనీ కలిసి వెళ్ళేవారు. సురేశ్ చదువు పూర్తయ్యి ఉద్యోగంలో ప్రవేశించగానే వాళ్ళ పెళ్లి జరిపించే ఉద్దేశంతో ఉన్నారు మిత్రులిద్దరూ.
ఆ సంవత్సరం దసరా సెలవులు రాగానే సురేశ్, "ఇంటికి వస్తున్నా" నని సునీతకు ఉత్తరం రాశాడు. ఆవార్త సునీతకు చాలా సంతోషానిచ్చింది. సెలవు రోజుల్లో ఇద్దరూకలిసి సంతోషంగా గడిపడానికని ఎన్నెన్నో ప్లానులు వేసుకుంది సునీత. ఆమె సురేశ్ రాకకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది - అన్నది అతిశయోక్తి కాదు!
#######
ఇక సురేశ్ రెండు రోజులకు వస్తాడనగా ఆరోజు ఖరీదైన కారు ఒకటి వచ్చి ప్రకాశరావు ఇంటి గుమ్మం ముందు ఆగింది. సురేశ్ తల్లి తాలూకు బంధువైన కాంతారావు ఆ కారులోంచి దిగాడు. చాలా రోజులకు కనిపించిన బంధువును ఆప్యాయంగా ఆహ్వానించారు భార్యాభర్తలు. అంతలో కారుడ్రైవరు రకరకాల పార్సిల్సు , గిఫ్ట్ రాప్ చుట్టివున్నవి, ఎన్నింటినో కారులోంచి తీసుకువచ్చి నట్టింట వుంచాడు.
ఆ వచ్చినాయన సురేశ్ అమ్మతో, “రమా! ఇవి నీకోసమే! ఆడపడుచు ఇంటికి వస్తూ ఉత్తిచేతులతో రాకూడదంటారు. ఏదో సమయానికి కంటికి ఎదురుగా కనిపించిన ఈ నాలుగూ తీసుకువచ్చా, ప్రస్తుతానికి ఇవి తీసుకో” అన్నాడు చిరునవ్వుతో, పరమలౌక్యుడైన ఆ బంధువు తన స్టేటస్ ఏమిటో గుట్టుగా వ్యక్తం చేస్తూ.
గుట్టగా ఉన్న ఆ పార్సిల్సు చూడగానే రమ కళ్ళు ఆనందంతో మెరిశాయి, “ఇవన్నీ ప్రస్తుతానికేనుట! అంటే - ముందుముందు ఇంకా ఇలాంటివి చాలా ఇస్తాడన్నమాట! వాళ్ళ కిదేం పెద్ద లెక్కకాదుకదా” అనుకుంది మనసులో. పైకి మాత్రం, “అన్నయ్యా! దుబాయి నుండి వచ్చి ఎన్నాళ్ళయ్యింది? ఒక్కనెలైనా ఉంటారా ఈమాటు, లేకపోతే ఇదివరకులాగే సెలవు లేదు - అంటూ వెంటనే వెళ్లిపోతారా” అని అడిగింది, మంచినీళ్ళ గ్లాసు తెచ్చి ఆయనకు అందిస్తూ.
“లేదమ్మా, ఇక వెళ్లే ఉద్దేశం లేదు. పిల్లకి పెళ్ళీడు వచ్చింది, లేక లేక పుట్టిన పిల్ల అది. దానికి మనవాళ్ళల్లోనే "ఔ"నన్నసంబంధం చూసి పెళ్ళిచేసి, మేముకూడా దగ్గరలో, ఇండియాలోనే, వాళ్లకి కూతవేటు దూరంలో ఉండిపోవాలనుకుంటున్నాము. సంపాదించినది మూడుతరాలకి చాలినంత వుంది కదా! చాలదా ఏమిటి? ఎటు చూసినా ఉన్నది ఒక్కపిల్లాయే!“
“సంబంధమేమైనా కుదిరిందా అన్నయ్యా?"
“లేదమ్మా! చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు! నేను ఇప్పుడు వచ్చింది ఆ పని మీదే! మన మామయ్య భార్య లేదూ, కావుడత్త! ఆమె చెప్పింది - మీ అబ్బాయి పెళ్లికి తగిన వయసులో ఉన్నాడన్న సంగతి. వెంటనే రెక్కలు కట్టుకు వచ్చి వాలిపోయా, మీతో సంబంధం మాటాడాలని” అన్నాడు కాంతారావు, రమకు పెత్తల్లి కొడుకు, తన రాకకు కారణం ఏమిటో వెల్లడిస్తూ.
వెంటనే ప్రకాశరావు కంగారుపడుతూ అనబోయాడు, “మా అబ్బాయి పెళ్ళికి ఇదివరకే సంబం... ”
భర్త ఏమి చెప్పబోతున్నాడో గ్రహించిన రమ వెంటనే అతని మాటకు అడ్డు వచ్చింది. “రా అన్నయ్యా, ఇల్లు చూపిస్తాను” అంటూ వచ్చి ఇద్దరికీ మధ్య అడ్డుగా నిలబడింది. రమ వెంట నడిచాడు కాంతారావు.
భార్య ఆలోచన దారి మారిందని గ్రహించాడు ప్రకాశరావు. కాని కొడుకుని నమ్మాడు. కొడుకు సునీతతోనే తన పెళ్లి - అనే గట్టి నిర్ణయంతో ఉంటే తన భార్యేమి చెయ్యగలదులెమ్మని మనసు సరిపెట్టుకుని, రాక రాక వచ్చిన చుట్టం ముందు రభస ఎందుకని, మౌనంగా ఉండిపోయాడు.
#######
ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది. ఈ రోజే సురేశ్ వచ్చే రోజు. అతడు ఈ సరికి ఎప్పుడో వచ్చేసి ఉంటాడు. ఇహనో, ఇప్పుడో అతడు తనకోసం వస్తాడన్న ఆశతో, వీధిగుమ్మ వైపు చూస్తూ వరండాలోనే తచ్చాడుతోంది సునీత. స్నానం చేసి వచ్చి, వరండాలో కుర్చీలో కూర్చుని పేపరు చదువుతూ తన ధోరణిలో తానున్నాడు సీతారాం. పేపర్లోని దుర్వార్తలు ఆతని మనసుని కలతపెట్టాయి. సమీపంలోనే ఉన్న కూతురు నుద్దేశించి అన్నాడు అతడు ...
“ఒకప్పుడు “పుణ్యభూమి”, “ధన్యభూమి” అనిపించుకున్న ఈ. దేశంలో రోజురోజుకీ దుర్మార్గం పెట్రేగిపోతోంది. స్వార్ధం తెగపెరిగడంతో మనిషికి యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం నశించిపోతోంది. చివరికి ఈ దేశం ఏ దారిని పట్టి పోతుందో కదా!“ దీర్ఘంగా నిటూర్చి పేపర్ పేజీ తిప్పే పనిలో పడ్డాడు సీతారాం .
సరిగా అప్పుడే, తన భార్య, కొడుకు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని గురించి మిత్రునికి చెప్పాలని, గుమ్మాలెక్కి వస్తున్న ప్రకాశరావుకి ప్రియ మిత్రుడైన సీతారాం మాటలు తగిలివచ్చాయి. ఇంకేముంది, తన ఇంటి నిర్వాకం అతనికి తెలిసిపోయిందనీ, సీతారాం ఆ మాటలు తనను ఉద్దేశించే అంటున్నాడనీ అనుకున్నాడు అతడు.
ప్రకాశరావు, వెంటనే మిత్రునికి దగ్గరగా వచ్చి, అతని కాళ్ళ ముందు చతికిలపడి, “క్షమించరాని ద్రోహంరా ఇది, నిజమే! ఒప్పుకుంటాను. ఏది ఏమయినా నువ్వు నన్ను మన్నించక తప్పదు. నేను పూర్తిగా నిస్సహాయుణ్ణి అయ్యాను. నా మాటకు విలువలేదు. తల్లీ కొడుకూ కలిసి తీసుకున్న నిర్ణయమిది! నువ్వు నన్ను క్షమించానని అంటేగాని నేను నీ కాళ్ళు వదలను” అంటూ సీతారాం కాళ్ళ మీద వాలిపోయాడు ప్రకాశరావు కన్నీళ్ళతో.
జరిగింది ఏమిటో తెలియని సీతారాం బిత్తరపోయాడు. “ అయ్యో! ఇదేమిటిరా ప్రకాశ్, ఏమయ్యిందిరా నీకు? నాకు నువ్వు చేసిన ద్రోహమేమిటిట!? విడ్డూరం! ఊరుకో, ఎవరైనా వింటే నవ్వి పోతారు” అంటూ అతన్ని బలవంతంగా లేవదీసి పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టాడు సీతారాం. సునీత వెళ్లి మంచినీళ్ళు తెచ్చి అతనికి తాగనిచ్చింది.
మంచినీళ్ళు తాగి కొంచెం తెప్పరిల్లి, తన ఇంట్లో జరిగినదంతా మిత్రునికి చెప్పాడు ప్రకాశరావు. “నా కొడుకైనా నామాట నిలబెడతాడని ఆశపడ్డారా, కాని వాడు కూడా డబ్బు మాయలో పడిపోయి వాళ్ళ అమ్మకే వంతపాడాడు. "మనకేమి తక్కువ" అని తల్లీకొడుకులిద్దరికీ ఎంత చెప్పినా వాళ్ళు నా మాట వినలేదు. వాళ్లకి కాంతారావు భాగ్యం మీద ఆశ పుట్టింది. మెజార్టీ వాళ్ళదవ్వడంతో నేను అసహాయుడినయ్యాను. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోడం తప్పని, ఇది తగదని నేనెంత చెప్పినా వాళ్ళు పట్టించుకో లేదు. నీ కిది తగదని కాంతారావుకి కూడా చెప్పి చూశా. అంతా విని ఆ పెద్దమనిషీ పట్టించుకోలేదు. ఎల్లుండే కాంతారావు కూతురుతో మా వాడికి నిశ్చితార్ధం జరగబోతోంది. ఇంకా మాయలోపడి ఉండిపోకుండా కనీసం ఈ సంగతయినా మీకు చెప్పాలని ఇలా వచ్చా. ఈ బంగారు తల్లిని నా కోడలుగా చేసుకునే యోగం నాకు లేకపోయింది. ఈ నిర్భాగ్యుణ్ణి క్షమించగలవురా సీతారాం?”
సీతారాం రెండుచేతులూ పట్టుకుని కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు ప్రకాశరావు. ప్రకాశరావు పరిస్థితి చూసి కళవెళ పడ్డాడు సీతారాం. ప్రకాశరావు చెపుతున్నదేమిటో సరిగా అర్థం చేసుకోడానికి సీతారాంకి కొంత సమయం కావలసి వచ్చింది. అర్థమయ్యాక కూడా స్నేహితుని స్థితి చూసి అతడు జాలిపడ్డాడు.
“అసలువాడికి లేనప్పుడు నువ్వేం చెయ్యగలవు చెప్పు! బాధపడకురా ప్రకాశం! వాళ్ళిద్దరికీ ఆ బ్రహ్మదేవుడు ముడిపెట్టడం మర్చిపోయాడు కాబోలు! ఘటన లేనప్పుడు ప్రతిఘటన తప్పదు. ఏది ఎలా జరగాల్సి ఉంటుందో, అది అలాగే జరిగి తీరుతుంది - అని అర్ధంచేసుకుని మనం మనసు సరిపెట్టుకోవాలి. మనకు వివరం తెలియక ఏవేవో ఆశలు పెంచుకుంటాము. కాని అవి అన్నప్పుడూ నెరవేరవు. ఎంతటి వాళ్ళకైనా వాస్తవాన్ని భరించక తప్పదు కదా! ఇక మనమెంత” అన్నాడు సీతారాం దీనంగా, తనని తాను ఓదార్చుకుంటూ, తన ఆబాల్య మిత్రునికి కూడా రవంత ఓదార్పు నివ్వాలని ప్రయత్నించాడు.
#######
ప్రకాశరావు తన అశక్తతను వ్యక్తంచేసి వెళ్ళాక కొద్ది రోజులపాటు ఇంట్లో అందరూ ఆ విషయాన్నెత్తకుండా గడిపేశారు. దసరా సెలవులు కావడంతో పిల్లలందరికీ ఆటవిడుపు. తల్లికి సాయపడుతూ సునీత కూడా, మనసులో ఎంత బాధున్నా, దానిని పైకి వ్యక్తం కానీకుండా యాంత్రికంగా పనులు చక్కబెట్టుకుంటూ మామూలుగా ఉన్నట్లు నటిస్తోంది. కాని వైదేహి, సీతారాం భార్య, ఎంతో కాలం మౌనంగా ఉండలేకపోయింది. ఆరోజు మధ్యాహ్నం, డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని అందరూ టీలు తాగుతూన్నప్పుడు, కంఠశోషగా అంది . . .
“తగుదునమ్మా అని ఆ పెద్దమనిషి వచ్చి, కన్నీళ్లు పెట్టుకుని, నాలుగు కల్లబొల్లి కబుర్లు చెప్పి, కొడుకు పెళ్ళి వార్త మీ చెవినేసి వెళ్ళాడు, అక్కడితో ఆయన బాధ్యత తీరిపోయి తెరిపిన పడిపోయాడు. కాని ఇప్పుడు మన సంగతేమిటి?”
సీతారాం నొచ్చుకున్నాడు, “మరీ అంత ఇదిగా ఆడిపోయ్యకే వాడిని, వాడు మరీ అంత చెడ్డవాడేమీ కాడు. పాపం! కొడుకూ, భార్యా కలిసిరానప్పుడు వాడేమి చెయ్యగలడు చెప్పు! మనమింకా మాయలోపడి దేవులాడకుండా విషయం చెప్పి వెళ్ళాడని సంతోషించు. మన పుణ్యం బాగుండి పెళ్ళికి ముందే మనకు సురేశ్ అంతర్గత స్వభావమేముటో తెలిసిపోయింది కనుక సరిపోయింది, ఇలాంటి మాట నిలకడలేని చపలచిత్తుడిని, డబ్బుమనిషిని పెళ్ళాడి మన పిల్ల సుఖంగా బ్రతకగలదనే అనుకుంటున్నావా? అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు!”
“మీరలా మీ నేస్తాన్ని వెనకేసుకు రాకండి. నాకు చిర్రెత్తుకొస్తుంది, ఆ పెద్దమనిషి నాలుగు కోప్పడి పెళ్ళాన్ని కొడుకునీ దారిలో పెట్టకుండా, తగుదునమ్మా - అని, మనకా వార్త చెప్పడానికి వచ్చాడు! ఇన్నాళ్ళూ పిల్లా పిల్లాడూ కలిసి తిరిగారు, వీళ్ళిద్దరినీ చూసి మొగుడూ పెళ్ళాలౌతారనే అనుకున్నారు అందరూ. ఇప్పుడిలా వాళ్ళు కాదంటే, రేపు దీనికి పెళ్ళిచెయ్యడం మనవల్ల నౌతుదనే అనుకుంటున్నారా?” వైదేహికి కూతురు భవిష్యత్తు అంధకార బంధురంగా కనిపించడంతో భర్త మీద చిరాకుపడింది.
అక్కడేవున్న సునీత గతుక్కుమంది. ఆమె స్వాభిమానం దెబ్బతింది. వెంటనే, “అమ్మా! నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కలిసి తిరిగినంత మాత్రంలో తప్పేమిటి? వేన్నీళ్ళు పోసినంతమాత్రాన ఇళ్ళు కాలవు. నువ్వు చెప్పిన జాగ్రత్తలు నేనేం మర్చిపోలేదు. నే నే తప్పూ చెయ్యలేదమ్మా" అంది తలదించుకుని.
“బాగుందమ్మా నీ మాట! అలాగని చెప్పి ఎవరిని నమ్మించగలవు? తాడిచెట్టుక్రింద నిలబడి పాలు తాగినా అది కల్లే అనుకుంటుంది లోకం! అసలే లోకులు పలుగాకులు! క్షణంలో సగంకూడా ఆలోచించరు ఏ మాట అనడానికైనా!. ఒకడు,"దున్నపోతు ఈనిం"దంటే, వెంటనే మరొకడు, "దూడను కట్టేస్తా" అంటాడు. ముందూ వేనుకా ఆలోచించి మాటాడాలనుకోరు ఎవరూ. ఏ ఆధారం లేకపోయినా సరే, కథలల్లి ప్రచారం చెయ్యడానికి నిమిషం పట్టదు ఈ జనాలకు! ఇక ఆధారం దొరికినప్పుడు ఒదులుతారా ఏమిటి! ఇప్పుడింక మీ కూతురు పెళ్లి చెయ్యడం అంత తేలికేమీ కాదు. ఇప్పటినుండీ సంబంధాలు వెతకడం మొదలెట్టండి. మన పుణ్యం బాగుంటే జుట్టు నెరిసీలోగా ఏదైనా సంబంధం కుదరొచ్చు.“ వైదేహి తన కడుపులో రగులుతున్న బాధని మాటల రూపంలో వెళ్లగక్కింది.
సునీత ఖంగు తింది. తల్లి మాటలు ఆమెలోని ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టాయి. వెంటనే సునీత అప్పటికప్పుడు ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. రోషంతో బుసలుకొట్టింది.
“నాన్నా! నా పెళ్లిమాట ఇక ఎప్పుడూ ఎత్తొద్దు మీరు. నేను పెళ్లి చేసుకోను. జీవితానికి పెళ్లి మాత్రమే పరమార్ధం కాదు. నాకు పెళ్ళంటేనే రోతగా వుంది. నా కసలు పెళ్లొద్దు, నేను చదువుకుంటా. డాక్టర్నయ్యి, ప్రజాసేవ చేసి మంచిపేరు తెచ్చుకుంటా.”
“వైదేహీ! అనవసరంగా దాన్ని బాధపెట్టకు. ఇందులో దాని తప్పేముందిట? ఇదంతా పెద్దవాళ్ళమైన మనం చేసిన తప్పు, అర్థం చేసుకో. ముక్కుపచ్చలారని వయసునుండి దానికి లేనిపోని ఆశలు కల్పించిన వాళ్ళం మనమే కదా!”
“నాన్నా! నా పెళ్లి మీకు ఒక సమస్య కావడం నాకు ఇష్టం లేదు. ఒట్టు, ఇంక నా పెళ్లి విషయం ఎవరూ ఎత్తొద్దు. ఆడపిల్లకి పెళ్ళొక్కటే పరమార్ధ మనుకున్నన్ని నాళ్ళూ మాకు ఇలాంటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. పెళ్లి ఒక్కటే కాదు, జీవితాన్ని సార్ధకం చేసుకోడానికి అనేక దారులున్నాయి. శ్రద్ధగా చదివి పరీక్షలు బాగా రాస్తా. మంచి మార్కులు వస్తాయన్న నమ్మకముంది. నా ఫ్రెండ్ కల్యాణి చేరిందని నేనూ BiPC తీసుకోడం ఇప్పుడు నాకు మంచిదయ్యింది. నేను ఎంట్రన్స్ పరీక్షరాస్తాను. నాకు తప్పకుండా MBBS లో సీటు వస్తుంది" అంటూ దగ్గరలో ఉన్న తమ్ముడు రాజు తలపై చెయ్యి పెట్టి తిరుగులేని ఒట్టు పెట్టింది సునీత.
ఉలిక్కిపడ్డాడు సీతారాం. “ఎంత పని చేశావమ్మా! మధ్యతరగతి వాడిని నేను. నిన్ను డాక్టర్ని చెయ్యగల స్తోమత నాకు లేదమ్మా. నిన్నుమాత్రమే కాదు, మిగతా పిల్లల్నికూడా పెంచి పెద్దచెయ్యాలిగా. కన్నబిడ్డల్ని ఒకళ్ళని ఒకలాగా, ఇంకొకళ్ళని ఇంకొకలాగా చూడకూడదు కదా” అన్నాడు.
హతాశురాలై బిక్కమొహం పెట్టుకుని తలవంచుకుని ఉండిపోయింది సునీత. అంతలో డోర్ బెల్ మోగింది. గమ్మున లేచాడు రాజు. చూసివచ్చి తండ్రితో చెప్పాడు, “నాన్నా! లాయర్ అంకుల్ వచ్చారు” అని.
టీ కప్పు టేబుల్ మీద ఉంచి లేచాడు సీతారాం. వైదేహి కూడా గమ్మున లేచింది, ఆయనకోసం టీ తయారు చేసే సన్నాహంలో వంటగది వైపుగా నడిచింది.
సీతారాం మిత్రుడిని లోనికి ఆహ్వానిస్తూ, “లక్ష్మీపతీ! ఇలావచ్చావేమిటి? ఊరకరారు మహాత్ములు - అంటారు! ఏమిటీ సంగతి?” అన్నాడు, లేని నవ్వు పెదవులపైకి తెచ్చుకుంటూ.
సీరియస్ అయ్యాడు లక్ష్మీపతి. “ఔను, అది నిజమే, పనుండే వచ్చా. నాతో పార్కుకి రా, నీతో పర్సనల్‌గా మాటాడాలి” అంటూ తను ముందుగా దారితీశాడు దగ్గరలోనేవున్న పార్కుకి.
గమ్ముని చొక్కా అందుకుని అతని వెంట నడిచాడు సీతారాం.
పార్కులోని చెట్టునీడనున్న బెంచీమీద కూర్చున్నాక లక్ష్మీపతి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టాడు, “రేపు పోతాడనగా, ఆ ముందు రోజు నా దగ్గరకు వచ్చాడు మన ప్రకాశం ...”
“ఏమిటీ! మన ప్రకాశం పోయాడా! ఎప్పుడు, ఎలా” అంటూ ఆశ్చర్యంతో కెవ్వుమన్నాడు సీతారాం.
లక్ష్మీపతి, ప్రకాశరావు, సీతారాం కాలేజీ రోజులనుండీ మిత్రులు, పైగా ముగ్గురూ హైదరాబాదులోనే స్థిరపడడంవల్ల స్మేహ బంధం మరింతగా పెంచుకున్న వాళ్ళు.
“ఏమిటీ! వాడు పోయినట్లు నీకు తెలియనే తెలియదా? ఎంతకైనా తగినవాళ్ళే ఆ తల్లీ కొడుకులు! నీకు వాళ్ళు కబురు కూడా పంపలేదన్నమాట! “మాస్సివ్ హార్టు ఎటాక్“ అన్నారు కానీ, కాదని నా అనుమానం. ఆ రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు వాడు పడ్డ ఆవేదన చూసిన నా కది ఆత్మహత్యేమోనన్న అనుమానం వస్తోంది. పోయేందుకు ముందు రోజు, అంటే మొన్న, వాడు నా దగ్గరకు వచ్చాడు. భార్య, కొడుకు చేసిన నిర్వాకమంతా చెప్పుకొచ్చాడు. నీ కూతురికి అన్యాయం జరిగిందని వాడు చాలా ఫీలయ్యాడురా! చివరకి అన్నాడు – బంగారుతల్లి సునీత నాకు కోడలౌతుందని ఆశపడ్డా! కాని అది జరగలేదు. కనీసం ఆమెను నేను నా కూతురుగా భావించి, నా స్వార్జితంలో కొంత వాటా ఆమెకు ఇవ్వాలనుకుంటున్నా. అది నీవల్ల జరగాలి. నేనింక ఏ మొహం పెట్టుకుని వెళ్ళి వాడి మొహం చూడగలను చెప్పు - అంటూ ఈ అట్ట పెట్టె నా చేతిలో ఉంచాడు. ఇందులో డబ్బు ఉందిట! ఈ డబ్బు వివరాలున్న ఉత్తరం, వాడు స్వహస్తంతో రాసినది, దాంట్లోనే ఉందన్నాడు ప్రకాశం. నువ్వు కనక కాదంటే తను రౌరవాది నరకాల పాలైపోతానని నీకు చెప్పమన్నాడు. ఇప్పుడు నేను నీకు చెపుతున్నా, వాడి ఆత్మ శాంతికోసమైనా సునీత ఈ డబ్బు తీసుకోక తప్పదు. ఇది తీసుకెళ్ళి నీ కూతురుకియ్యి, ఆమెకు ఇష్టమైన పద్ధతిలో ఖర్చుపెట్టుకోమను” అంటూ ఆ పెట్టెను సీతారామ్ కి అందించాడు లక్ష్మీపతి.
“నువ్వలా అంటూంటే నేనింకేమి మాటాడగలను” అంటూ కారే కన్నీటితో, ఒణికే చేతులతో ఆ పెట్టిని అందుకున్నాడు సీతారాం.
########
స్కూల్ బస్సు పక్కకి పడిపోడం తో చాలాపెద్ద యాక్సిడెంట్ అయ్యింది. బడికి పోతున్న పిల్లలు కొంతమంది బస్సు కింద పడి నలిగిపోయారు. వారిలో నలుగురు పిల్లలు అక్కడి కక్కడే మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి. అందులో ఒక పిల్ల ఒళ్లంతా గాయాలతో ప్రాణావశిష్టంగా ఉంది. చాలా రక్తంపోయింది ఆ పిల్లకి వెంటనే తగిన చికిత్స జరిగితే ప్రాణం నిలబడవచ్చునని ఆశపడ్డారు మెడికల్ సిబ్బంది. ఆ పిల్ల ఆ ఊరి కలెక్టర్ కూతురు కావడం విశేషం.
సునీత రాగానే మెడికల్ సిబ్బంది ఎదురుగా వచ్చి చెప్పారు, "ఫస్టు ఎయిడ్ చేసి, బ్లడ్డుగ్రూప్ టెస్టు చేసి, X - rays తీసి అంతా సిద్దంచేసి ఉంచాము డాక్టర్! ఆ అమ్మాయిది రేర్ బ్లడ్డుగ్రూప్. (-AB)! బ్లడ్డు బ్యాంకుకి ఫోన్ చేస్తే, ఆ గ్రూప్ లేదన్నారు. ఎవరైనా డోనర్లు ఉంటే తీసుకురమ్మని స్కూల్ కి ఫోన్ చేశాము.”
“ఇంటికి ఫోన్ చేశారా? సాధారణంగా తల్లితండ్రులలో ఎవరో ఒకరి బ్లడ్ సరిపోవచ్చు” అంటూ డా. సునీత ఆ పాప రిపోర్టులన్నీ తీసి చూసింది. ఆ తరవాత నేరుగా ఆమె డ్రెస్సింగ్ రూములోకి నడిచింది. డ్రెస్ మార్చుకుని ఆపరేషన్ ధియేటర్లోకి వెళ్ళింది.
“ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్” అన్నదానికి గుర్తుగా ఆపరేషన్ ధియేటర్ గుమ్మం మీదున్న రెడ్ లైట్ వెలిగింది.
########
ఆ రోజు, పేషెoట్లతాకిడి ఎక్కువగా ఉండడంతో ఛీఫ్ పీడియాట్రీషియన్ డాక్టర్ సునీత చాలా బిజీగావుంది. చల్లని చెయ్యనీ, రోగం ఎంత గడ్డుదైనా ఆమె చెయ్యిపడితే తప్పకుండా పరారి ఔతుందనీ పేరురావడంతో ఆమెకు ఎప్పుడూ పేషంట్ల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఆ రోజున, రోజూకంటే కూడా ఎక్కువమంది పేషంట్లు ఉన్నారు. పసిపిల్లల ఏడుపులతో, ఎడపిల్లల ముద్దు మాటలతో తల్లుల అదలింపులతో కోలాహలగా వుంది అక్కడి వెయిటింగ్ హాల్. రొటీన్ గా పేషంట్లను చూస్తోంది డాక్టర్ సునీత. పేషంట్లని ఒకరి తరవాత ఒకరినిగా పిలుస్తోంది ఆమెకు సహాయకురాలిగా వున్న నర్సు.
ఒక పేషంటు వెళ్ళిపోగానే వరసలోవున్న తరవాతి పేషంట్ ఫయిల్ ముందుంచుకుని చూస్తూన్న సునీతకు ఎవరో తనను "సునీతా" అంటూ పేరు పెట్టి పిలిచినట్లై తలెత్తి చూసింది. చేతిలో గులాబీ పూల గుత్తితో ఎదురుగా సురేశ్ నిలబడి ఉండడం కనిపించింది.
ఆమె చూపు తన చూపుతో కలవగానే, “సునీతా! నేను నీకు ధన్యవాదాలు చెప్పడానికి స్వయంగా వచ్చాను. నా కూతురికి ట్రీట్మెంట్ నువ్వు చేస్తున్నావని తెలిసినప్పుడు - నిజం చెప్పొద్దూ - నేను చాలా భయపడ్డాను. పాత జ్ఞాపకాలు మనసులో ఉంచుకుని, నా కూతురుకి నువ్వేమైనా హాని చేస్తావేమోనని చాలా భయపడ్డాను నేను. కాని నువ్వు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా చెయ్యడమే కాకుండా సరైన సమయానికి నీ రక్తం కూడా ఇచ్చి నా కూతుర్ని బ్రతికించావు. నీకు నా ధన్యవాదాలు! అది అసలు నీ కూతురు కావలసినదేగాని కొద్దిలో తప్పిపోయింది. ఇప్పుడు నువ్వు నీ రక్తమిచ్చి దానికి పునర్జన్మ నిచ్చావు, డాక్టర్ సునీతా! ఇప్పుడు నీ రక్తమే ఉంది నా కూతురిలో! “హాట్సాఫ్ టు యూ!” నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను” అన్నాడు.
అంత చక్కగా మాటలు కూర్చి మాటాడినందుకు మనసులో తనను తాను అభినందించుకున్నాడు సురేశ్. పూల గుత్తి ఆమెకు అందించబోయాడు. కానీ, ఆమె అందుకోలేదు.
“జీవితం భగవంతుడిచ్చిన వరం! దాంపత్యజీవితం అన్నది అందులోని ఒక చిన్న భాగం గాని మొత్తం జీవితం కాదు. కాలి వేలుకి “గాంగ్రీన్” వచ్చిందని, ఏ డాక్టరూ పీక కోయడు. నా జీవితంలోంచి నువ్వు ఏనాడో శాశ్వతంగా నిష్క్రమించావు. ఇప్పుడు నువ్వు నా పేషంటుకి నాన్నవి మాత్రమే! నువ్వు నాకు గత విషయాలు గుర్తుచెయ్యాలనుకోకు, వృధా శ్రమ! దానివల్ల నాలో ఏ స్పందనా రాదు” అనుకుంది నిరీహతో డాక్టర్ సునీత మనసులో.
అతనివైపు చీదరగా చూసింది డాక్టర్ సునీత. “నాకు పొగడ్తలు నచ్చవు. మీ ధన్యవాదాలతోగాని, మెప్పూ మెహర్బానీలతోగాని నాకు పనిలేదు. ఈ ఆసుపత్రి గడపదాటి నా ఎదుటికి వచ్చి, నా వైద్యాన్ని ఆశించిన ఏ బిడ్డనైనా నా స్వంత బిడ్డగా భావించి, మనసారా ఆ బిడ్డ శ్రేయస్సు కోసం పాటుపడడం నా ధ్యేయం. ఆ బిడ్డ ఆరోగ్యం మామూలు స్థితికి వచ్చేవరకూ, ఏమీ దాచుకోకుండా నాకున్న వైద్య విజ్ఞానమంతా ఉపయోగించి ఆబిడ్డ శ్రేయస్సుకోసం కృషి చెయ్యడం అన్నది నా కర్తవ్యమ్. దానికోసమని పగలూ రాత్రీ అన్న భేదం లేకుండా, గొప్ప వాళ్ళు , బీదవాళ్ళు - అన్న తేడా లేకుండా వాళ్ళకోసం పనిచెయ్యడం నా వృత్తిధర్మం. విధి నిర్వహణలో నే నెవరి ప్రశంశలను ఆశించను. మీరెవరో నాకు గుర్తులేదు. ఇక మీరు వెళ్ళవచ్చు” అని అతనికి చెప్పింది. ఆపై, తన ఎదురుగా ఉన్న ఫైలును తెరిచి చూడసాగింది డాక్టర్ సునీత.
డాక్టర్ సునీత సంకేతాన్ని అందిపుచ్చుకుని, తరవాతి పేషంట్ ని పిలవడానికి వెళ్ళింది సహాయకురాలైన నర్సు.
(తొలిసారి మధురవాణిలో, ఇటీవల సిరికోనలో ప్రచురించబడింది.)
చాలా బాగుందండి
Very touching story,