Menu Close
దూరం (ధారావాహిక)

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి

ఏదో పోగొట్టుకున్నదానిలా దిగులుగా కూర్చున్న లత వైపు అనుమానంగా చూస్తూ అడిగింది సంధ్య.

“ఏమైంది లతా! అలా ఉన్నావేం”?

లత మాట్లాడలేదు. తలవంచుకుని టేబుల్ అంచులు చూస్తూ కూర్చుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జలజలా రాలి టేబుల్ తడిపాయి. సంధ్య హృదయం ద్రవించింది. పాపం అన్నీ కష్టాలే లతకి. భర్త తాగుబోతు ఏ పని చేయడు .. ఇద్దరాడపిల్లలు. ఒకమ్మాయి ఈ మధ్యే అతి కష్టం మీద డిగ్రీ అయిందనిపించి క్లాస్ మేట్ ఎవరినో ప్రేమించి, లేచిపోయింది. రెండో అమ్మాయి డిగ్రీకి వచ్చింది. ఇద్దరూ కూడా తండ్రి పాలన లేకనో, కాలేజి వాతావరణమో, కాల ప్రభావమో మొత్తానికి ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా తయారు అయారు. షోకులు, తిరుగుళ్ళు, తల్లి కష్టం గమనించని అంధుల్లా ప్రవర్తిస్తారు. ఇంట్లో కూడా ఒక్క పనిలో సాయం చేయరు. పాపం లతే మొత్తం ఇంటి బరువు బాధ్యతలు మోస్తూ నలభై ఏళ్ళకే అరవై ఏళ్ల వయసు వచ్చేసినట్టు ఉంటుంది.

సంధ్య ఆమె భుజం మీద చెయ్యేసి అనునయంగా అడిగింది “ఏమైంది? నాకు చెప్పకూడదా!”

లత ఒక్కసారిగా బరస్ట్ అయింది. ఏడుస్తూ చెప్పింది పెద్ద కూతురు ప్రేమించి ఎవరితో లేచిపోయిందో ఆమె తిరిగి వచ్చిందిట. అది విన్న సంధ్య తేలిగ్గా నిట్టూర్చింది.

“ఇది ఊహించిందేగా లతా! పోనీలే ఇప్పటికైనా తప్పు తెలుసుకుంది” అంది సంధ్య.

“తప్పు తెలుసుకుని కాదు సంధ్యా! నా నెత్తిన నిప్పులు పోయడానికి వచ్చింది” అంది వెక్కుతూ లత.

“కొంచెం అర్థం అయేలా చెప్తావా!” విసుగు అణచుకుంటూ అంది.

“నీకు కాకపొతే ఎవరికీ చెబుతాను...” కళ్ళు తుడుచుకుని చెప్పసాగింది. ఆమె చెప్పిన సారాంశం ఏమిటంటే కూతురు ప్రేమించి, వెళ్ళిపోయిన తరవాత ఇద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ కుర్రాడి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఎడా, పెడా తిట్టి ఆ అమ్మాయిని వెళ్ళగొట్టారు. ఆ అబ్బాయి కూడా ఆమెతో పాటు బయటకి వచ్చేసాడు. ఇద్దరూ లత ఇంటికి చేరారు. వాడికి ఉద్యోగం లేదు. సద్యోగం లేదు.. పైగా పిట్టలు పట్టే వాడిలా ఉన్నాడు.. ఇప్పుడెం చేయాలో అర్థం కావడం లేదు సంధ్యా.. ఆయనకీ ఇల్లు పట్టదు.. దీన్ని చూసి చిన్నది ఏం చేస్తుందో అని భయంగా ఉంది.. అని బావురుమంది.

సంధ్య నిరుత్తరురాలు అయింది. ఏం చెప్పగలదు! ఈ మధ్య ఎక్కడ చూసినా ఇవే కేసులు... టి వి పెడితే ఇవే వార్తలు.. ప్రేమ, పెళ్లి, గొడవలు, హత్యలు.. పిల్లలు అలాగే ఉన్నారు.. పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు.. పిల్లలు ఆకర్షణలో పడితే, పెద్దవాళ్ళు ఆవేశం, ఉద్రేకం వీటితో రెచ్చిపోతున్నారు. వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న మీడియా.. కుటుంబ గొడవలన్నీ ఇప్పడు రచ్చకీడుస్తున్నారు. జీవితాల్లో దాపరికం అంటూ లేకుండా పోతోంది..

సంధ్యకి ఒక్క క్షణం ఒళ్ళంతా జలదరించింది. తన కూతురు స్మరణ మెదిలింది. ఇరవై నాలుగేళ్ళు వస్తున్నాయి. ఎం. టెక్ అంది.. ఉద్యోగం అంది.. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఇంక పెళ్లి చేసేయాలి. ఇప్పుడు బుద్దిగానే ఉంది.. ఈ జనరేషన్ పిల్లలకి ఎప్పుడు బుద్ధి మారుతుందో అంతుబట్టకుండా ఉంది.. ఎందుకైనా మంచిది స్మరణకి సంబంధాలు చూసేయాలి.. ఆ మధ్య ఒకళ్ళిద్దరు కొన్ని సంబంధాలు చెబితే తనతో ప్రస్తావించింది.. “మైగాడ్ నాకిప్పుడు పెళ్ళేంటి.. నేను చేసుకోను.. నాకు మంచి జాబ్ రావాలి” అని గట్టిగా అరిచింది..

ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి ఇంక నోరేత్తద్దు అని చెప్పి మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేయాలి.. ఆయనకి చెబితే “దానిష్టం సంధ్యా.. అది ఎప్పుడు చూడమంటే అప్పడు చూద్దాం సంబంధాలు” అంటారు.. ఏ ఆడపిల్ల అయినా ఇంక నేను పెళ్లి చేసుకుంటా సంబంధాలు చూడండి అని చెబుతుందా..దీన్నేగా పిదపకాలం అనేది.. ఆయనతో లాభం లేదు.. మావయ్యగారితో మాట్లాడాలి..

అలా అనుకున్న వెంటనే తన సీటు దగ్గరకు వెళ్లి మొబైల్ తీసి ఆంజనేయులు నెంబర్ డయల్ చేసింది.

వెంటనే లిఫ్ట్ చేసాడు ఆయన.. సంధ్య స్వరం వినగానే “ఏమ్మా సంధ్యా! ఎలా ఉన్నారు?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు.

సంధ్య మనసు పులకించిపోయింది ... మావగారు కాదు ఆయన ఆమెకి... తండ్రి.. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సంధ్య అంటే ఆయనకీ అంతులేని వాత్సల్యం. ఆమె పెళ్లి అయి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి కన్న కూతురుని చూసుకున్నట్టే చూసుకున్నాడు. ఆమె కూడా అంతే ప్రేమగా ఉంటుంది. ఆయన పలకరింపుకి పులకరించిపోతూ “బాగున్నాను మావయ్య గారూ! మీరెలా ఉన్నారు? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నారా! సింహాచలం, లక్ష్మి ఉన్నారా.. మా దగ్గర ఉండండి అంటే వినకుండా వెళ్ళిపోయారు.., ఒక్కరే అక్కడ ..” కినుకగా అంది.

ఆయన నవ్వాడు..సింహాచలం, లక్ష్మి నన్ను కంటికి రెప్పల్లా చూసుకుంటున్నారు తల్లి.. నా సంగతి సరే.. ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నావా.. చిట్టి తల్లి ఎలా ఉంది?” అడిగాడు ఆయన స్మరణని ఉద్దేశించి.

“దాని విషయమే మాట్లాడాలని చేసాను మావయ్య గారూ! స్మరణకి ఉద్యోగం దొరికింది మీకు తెలుసుగా.. ఆరేడు నెల్ల నుంచి చేస్తోంది.. ఇంక సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాం .. అసలే రోజులు బాగాలేవు.. ఆడపిల్లని అలా వదిలేయడం భావ్యం కాదేమో” సంధ్య మాటల్లో వినిపించిన ఆందోళన ఆయన పసిగట్టాడు.

“ఎందుకమ్మా నీకింత టెన్షన్... స్మరణ బంగారు తల్లి.. దాన్ని చేసుకునే వాడు పెట్టి పుట్టాలి.. తప్పకుండా మంచి సంబంధం చూద్దాంలే“ అన్నాడు.

“త్వరగా చూడాలి మావయ్యా.. ఈ రోజుల్లో ఆడపిల్లలని కూడా నమ్మేలా లేదు.. ఎప్పుడో ఓ ఫైన్ మార్నింగ్ నేను వీడిని ప్రేమిస్తున్నా అంటూ దారిన పోయే దానయ్యని తీసుకువచ్చేస్తున్నారు.. మీరు మీ ఫ్రెండ్స్ కి చెప్పండి మంచి సంబంధాలు వస్తే చెప్పమని..”

ఆయన ఆలోచిస్తూ అన్నాడు.. “ఆ మధ్య మా సుబ్బారావు చెప్పాడు.. ఏదో అమెరికా సంబంధం.. మరి పరవాలేదా పంపిస్తావా అంత దూరం..”

“ఈ రోజుల్లో ఎవరు ఆగుతారు అమెరికా వెళ్ళకుండా.. ఎప్పుడో అది మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తున్నారు అని వెళ్ళదూ! అంతకన్నా పెళ్లి చేయడం పంపించడం మేలు కదా.. చూడండి..”

“సరే.. నేను మాట్లాడతాను.. అబ్బాయి ఎం ఎస్ చేశాట్ట అక్కడే.. మంచి ఉద్యోగం వచ్చిందిట.. కుర్రాడు చాలా బాగుంటాడు అన్నాడు.. తండ్రి హైదరాబాద్ లోనే డాక్టర్ ట ... మిగతా వివరాలు కనుక్కుంటాలే ... దీపక్ ఎలా ఉన్నాడు”

“మీ అబ్బాయికేం ... బ్రహ్మాండంగా ఉన్నారు” నవ్వింది సంధ్య..

“నీ చేతుల్లో పడ్డాక బ్రహ్మాండంగానే ఉంటాడులే.. అందుకే నేను నిశ్చింతగా ఉన్నాను.”

“ఊరుకోండి మావయ్యా.. ఉంటాను మరి.. ఆఫీస్ కి వస్తూనే మూడ్ పాడై మీకు ఫోన్ చేసాను.. పని చేసుకోవాలి. మళ్ళీ రాత్రికి మాట్లాదతాలెండి..” అంటూ ఫోన్ పెట్టేసి ఫైల్స్ తీసుకుని పని మొదలుపెట్టింది.

సరిగ్గా ఒక గంటలో ఆంజనేయులు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది..

“సంధ్యా! నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను రాసుకో” అన్నాడు.

“చెప్పండి” అంది పెన్ను చేతిలోకి తీసుకుని..

ఆయన నెంబర్ చెప్పి, “డాక్టర్ సూర్యప్రకాశరావు ... ఆయన భార్య ఎల్ ఐ సి ఆఫీసర్ .. ఒక్కడే కొడుకు.. చెప్పాగా యు ఎస్ లో ఎం ఎస్ చేసి, అక్కడే మంచి ఉద్యోగం లో ఉన్నాడు. అమెజాన్ లో చేస్తున్నాడుట.. వచ్చే నెలలో ఇండియా వస్తాడుట.. సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకుని వెళ్తాడుట ... దీపక్ ని ఆయనతో మాట్లాడి పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానించామను.. పిల్లలిద్దరికి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు” అన్నాడు.

సంధ్య ఆనందంగా అంది.. “భలే మావయ్యా.. ఇలా అనుకున్నాం అలా వచ్చింది మంచి సంబంధం.. చెప్తాను మీ అబ్బాయికి... ఇది కుదిరితే హమ్మయ్య.. నాకు ఓ పెద్ద టెన్షన్ పోతుంది”

ఆయన నవ్వాడు.. “పిచ్చిపిల్లా” అంటూ.

సంధ్య ఐదు ఎప్పుడు అవుతుందా అన్నట్టు మాటి, మాటికీ చేతి వాచీ చూసుకుంటూ పని చేసింది. అయిదు అవగానే అన్నీ సర్దేసి బాగ్ తీసుకుని హడావుడిగా బయలుదేరుతుంటే “అరె ఆగు నేనూ వస్తున్నా” అంది లత.. “సారీ లతా.. పనుంది అర్జెంటు” అంటూ వేగంగా వెళ్లి ఆటో మాట్లాడుకుని ఎక్కింది. బస్ కోసం ఎదురు చూసే ఓపిక లేదు ఆమెకి. లత కూడా బస్ లోనే వెళ్తుంది. రోజూ ఇద్దరూ స్టాప్ వరకు కలిసి వెళ్లి, ఎవరి బస్సు రాగానే వాళ్ళు ఎక్కి వెళ్ళిపోతారు. సంధ్యకి ఇంటికి త్వరగా చేరాలని ఆరాటంలో దీపక్ తను వెళ్లేసరికి ఇంట్లో ఉంటాడా అనే సందేహం రాలేదు. సాధారణంగా దీపక్ ఇంటికి వచ్చేసరికి ఏడు దాటుతుంది. ఆఫీస్ నుంచి కాసేపు క్లబ్ కి వెళ్లి వస్తాడు.

సంధ్య ఇల్లు చేరి తాళం తీసి లోపలికి వెళ్లి ముందు దీపక్ కి ఫోన్ చేసింది..”మీరు త్వరగా ఇంటికి రండి మీతో మాట్లాడాలి” అంటూ అతనేదో చెబుతున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని, చీర మార్చుకుని టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్ళింది.

తన సంకల్పబలం ఎంత గొప్పది అనిపించింది ఆమెకి. ఇలా అనుకోగానే మనసంతా పరిమళం నిండినట్టు అనిపించింది. అలా పైగా అల్లా టప్పా సంబంధం కాదు... మంచి సంబంధం.. ఈయనకి చెబితే అసాధ్యురాలివే అంటారు... అలా అనుకుంటూ ఉంటె ఆమె పెదాల మీద చిరునవ్వు విరిసింది.

సంధ్య  టీ తాగడం పూర్తీ చేసి, చపాతీ లకి పిండి తడుపుతూ ఉండగా దీపక్ స్కూటర్ శబ్దం అయింది. ఎప్పుడెప్పుడు శుభవార్త భర్త చెవుల్లో వేద్దామా అని తహతహలాడుతున్న సంధ్య గుమ్మంలోనే ఎదురు అవడానికి అదే చేత్తో గుమ్మం వైపు నడిచింది.

లోపలికి వచ్చిన సంధ్య వైపు, గోధుమ పిండి నిండి ఉన్న చేయి వైపు వింతగా చూస్తూ “ఏంటి ఈ అవతారం.. ఏం జరిగింది? మొహం చూస్తుంటే నీకేదో కోటి రూపాయల లాటరీ తగిలినట్టు అనిపిస్తోంది” అన్నాడు.

“అలాంటిదే లెండి.. కాళ్ళు కడుక్కుని రండి.. కాఫీ ఇస్తూ మంచి కబురు చెప్తాను” అంటూ తిరిగి వంట గదిలోకి వెళ్ళిపోయి పిండి తడపడం పూర్తి చేసింది.

దీపక్ ఫ్రెష్ అయి వచ్చాడు.

“చెప్పు ఏంటో వార్తా... నన్ను క్లబ్ కి వెళ్లనీకుండా పిలిచిన విశేషం?” అన్నాడు.

“ఇంక మీ తిరుగుళ్ళు ఆపండి .. అల్లుడు వస్తే మావగారి దారి పడతాడు..” కాఫీ కప్పు అందిస్తూ అంది.

“మగాడన్నాక ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వస్తే ఛండాలంగా ఉంటుంది చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చినట్టు.. అయినా నేనేం తాగి తందానాలాడుతున్నానా.”

“అదొక్కటి తక్కువైంది గాని వినండి..మీ నాన్నగారు స్మరణకి మంచి సంబంధం చూసారు..”

“నాన్నా! స్మరణకి సంబంధమా! ఎవరు చెప్పారు ఆయనకి చూడమని” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఎవరు చెప్పడం ఏంటి? ఆయన బాధ్యతకాదా.. మంచి సంబంధం మీ మనవరాలికి మాట్లాడండి అంటూ సుబ్బారావు గారు చెప్పారుట.. ఇదిగో నెంబర్.. వాళ్లకి ఫోన్ చేసి పెళ్లి చూపులకి రమ్మనండి” అక్కడే ఉన్న బాగ్ లో నుంచి ఫోన్ నెంబర్ రాసుకున్న కాగితం ఇచ్చి “ఆయన డాక్టర్ ట” అంది.

“ఎవరాయన?” అడిగాడు.

“ఎవరేంటి? కుర్రాడి ఫాదర్...”

“అది సరే దానికి చెప్పకుండా మనం ఫోన్ చేసేస్తే అది ఒప్పుకోవద్దూ..”

“ఒప్పుకుని తీరాలి.. మీరు సీరియస్ గా చెప్పండి.. చిన్నపిల్లనా.. ఇంకా ఎప్పుడు చేసుకుంటుంది!” గయ్యిమంది సంధ్య.

“నా వల్ల కాదు తల్లి.. నువ్వు చెప్పు.. పెళ్లి మాటెత్తితే నా మీద విరుచుకుపడుతుంది.. నన్ను మీ గొడవల్లో లాగకు..” తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

ఒళ్ళు మండింది సంధ్యకి. “మీరసలు దానికి తండ్రేనా.. కూతురు అరుస్తుందని భయపడే తండ్రిని మిమ్మల్నే చూస్తున్నా.”

“అలాగే అనుకో నాకేం పర్వాలేదు కానీ నేను మాత్రం చెప్పను.. నాన్ననే చెప్పమను” అన్నాడు.

“సరే.. నేనే చెప్తాను.. మీరు మాత్రం అది ఏదంటే దానికి తలాడించకండి..” హెచ్చరించింది.

సరిగ్గా అప్పుడే స్మరణ బండి గేట్లోకి దూసుకువచ్చింది.

ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సంధ్య నేను మాట్లాడతాను అన్నట్టు సైగ చేసి కాళీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది.

****సశేషం****

Posted in April 2021, కథలు

1 Comment

  1. షామీరు జానకి దేవి

    అద్భుతం ఉంది ఆరంభం..మనచుట్టూ జరిగే సంఘటనలా ఉంది..చాలాబాగుంద.. విజయలక్ష్మి గారికి అభినందనలు..👌👏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!