నాలుగింటికి స్కూల్ నుంచి వచ్చిన బాలాజీ ఇంట్లో తల్లి పెట్టిన తాయిలం తిని సైకిల్ షాపుకి బయల్దేరాడు. నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది దాకా తండ్రి రంగారావు సైకిల్ షాపులో ఆయన చెప్పినట్టూ పనిచేయాలి; లేకపోతే వీపు చీరేస్తాడు. ఇల్లు సైకిల్ షాపు దగ్గిరే, ఆ పక్కనే రైల్వే స్టేషన్. షాపుకెళ్ళాక చిన్న చిన్నపనులు – ఒక పేచ్ రిపైర్ చేస్తూంటే తండ్రి అడిగిన పనిముట్టు ఏదో అందివ్వడం, పేచ్ అయ్యాక రబ్బర్ ట్యూబ్ లో గాలి కొట్టి బేసిన్లో ఉన్న నీట్లో పెట్టి లీక్ ఉందేమో చెక్ చేయడం, సైకిల్ టైర్లలో గాలి కొట్టడం వగైరా. ఆ రోజు రాత్రికి ఇంక షాపు కట్టేద్దాం అనుకుంటూంటే అప్పుడొచ్చారు ఇద్దరు మనుషులు – ఒకరు మోటార్ సైకిల్ మీదా మరొకాయన ముందు చక్రం ఎనిమిది అంకెలా వంగిపోయిన ఒక పాడైపోయిన సైకిల్ ని రిక్షాలో మోసుకుంటూను. ఇద్దరికీ మొహం చిటపటలాడుతోంది. ఈ బేరం పరోక్షంగా బాలాజీ జీవితం మీద పడుతుందని ఎవరూ ఊహించలేదు.
వాళ్ళిద్దరూ చెప్పడం ప్రకారం సైకిల్ ఓనర్ గారు రెండు వీధులు కలిసేచోట ఓ వారగా తన సైకిల్ చేత్తో పట్టుకుని స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఈ లోపుల మోటార్ సైకిల్ ఆసామీ కళ్ళుమూసుకుపోయి ఈ సైకిల్ ని గుద్దేశాడు. ఎవరికీ పెద్ద దెబ్బలు తగల్లేదు కానీ సైకిల్ ముందు చక్రం ఎనిమిది అంకెలా మారి సైకిల్ కదల్లేక పోతూంటే చుట్టూ ఉన్న అందరూ కల్సి మోటార్ సైకిల్ ఓనర్ ని పట్టుకుని, తప్పు ఆయనదే అని తేల్చారు. ఆయన కూడా ‘సైకిల్ రిపైర్ నేను చేయిస్తాను తప్పునాదే’ అని వప్పుకున్నాక ఇద్దరూ ఇలా వచ్చారు రంగారావు సైకిల్ షాపుకి. మొదట విషయం – ఈ రిపైర్ కి ఎంతవుతుంది? నాలుగు వందలకి అటు ఇటూ అంటూ నాన్చాడు బాలాజీ నాన్న రంగారావు. బేరం ఆడాక మొత్తానికి మూడు వందల యాభైకి వప్పుకున్నారు. ఈ లోపుల సైకిల్ ఆసామీ తన స్నేహితుడితో ఏవో కబుర్లు మాట్లాడుతున్నాడు – ఈ మోటార్ సైకిల్ ఆసామీ ఎలాంటివాడో, ఈయనది ఏ ఊరో అనుకుంటూ. మరో అరగంటకి అందరూ రంగారావు షాపులోంచి బయటకొచ్చారు. రిపేర్ కి మోటార్ సైకిల్ ఆసామీ డబ్బులు ఇస్తాడు కనక సైకిల్ ఆసామీ దాని గురించి మాట్లాడలేదు. ఈ కబుర్లు అన్నీ అయ్యాక రంగారావు వచ్చి చెప్పాడు రెండ్రోజుల్లో వచ్చి సైకిల్ తీసుకెళ్ళవచ్చు అంటూ.
స్నేహితుడితో సైకిల్ ఓనర్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఇంటికి వచ్చాక అప్పుడు గుర్తొచ్చింది – ఈ మోటార్ సైకిల్ ఓనర్ ఎక్కడుంటాడు, ఆయన ఎడ్రస్ అనేది ఏదీ ఇచ్చి పుచ్చుకోలేదు. కాసేపు గుండెల్లో లబ లబ లాడినా చేసేదేం లేదు కనక అప్పటికి అలా ఊరుకున్నాడు.
తర్వాత రెండు రోజుల్లో బాలాజీ జీవితంలో కొంత మార్పొచ్చింది. ఆ రెండు రోజులూ స్కూల్లో మేష్టారు పాఠం చదువుతూ చెప్పినది గాంధీగారి గురించి - అబద్ధాలు ఆడకపోవడం, పరీక్షలో గాంధీ గారి టీచరే ‘పక్కవాడి నుంచి కాపీ కొట్టవోయ్’ అని చెప్పినప్పుడు అలా చేయకపోవడం, ఆయన్ని సౌత్ ఆఫ్రికాలో ఎలా ట్రీట్ చేసారు, అర్ధరాత్రి రైల్లోంచి ఎలా దింపేసారూ ఒక తెల్లవాడి వల్ల అంటూ కధ. జీవితంలో ఇంకా కల్మషం అంటని కుర్రాడు కనక బాలాజీ అన్నీ వంటబట్టించుకన్నట్టే. మూడో సాయంత్రం బాలాజీ ఎప్పటిలాగానే సైకిల్ షాపుకి వెళ్ళేసరికి రెండు రోజుల క్రితం సైకిల్ పట్టుకొచ్చినాయన, ఆయన స్నేహితుడూ కనిపించారు షాపు గుమ్మంలోనే. రంగారావు చెప్పేది ఏమిటంటే సైకిల్ రిపైర్ అయిపోయింది కానీ సైకిల్ ఇవ్వడుట. ముందు రిపైర్ డబ్బులు మూడువందల యాభై కట్టాలి. ‘మోటార్ సైకిల్ ఆయన డబ్బులన్నీ ఇస్తానన్నాడు నాకేం తెలియదు, ఆయనెక్కడుంటాడో కూడా’ అని సైకిల్ ఓనర్, ఆయన స్నేహితుడి అరుపులు. అప్పుడే అక్కడకి వచ్చిన బాలాజీ తండ్రికేసి చూశాడు. మొహంలో ఏ భావం కనిపించడం లేదు గానీ సైకిల్ ఓనర్ దగ్గిర్నుంచి డబ్బులు లాగడానికి వేసిన ఎత్తు తెలుస్తూనే ఉంది. సైకిల్ ఓనర్ మొహంలో జాలీ ఏడుపూ అనేకానేకరకాల మేళవింపు. అసలే గాంధీ గారి గురించి విని ఉన్నాడు కదా రెండు రోజులబట్టీ, వెంఠనే గొంతు ఎత్తి చెప్పాడు బాలాజీ “మోటార్ సైకిల్ ఓనర్ గారు డబ్బులు మా నాన్నకి ఇచ్చేసారు. మీరు ఇవ్వక్కర్లేదు.”
“నీకేం తెల్దు; నువ్వూరుకోరా ఎదవా,” రంగారావు కోపంగా అరిచేడు.
“ఆయన డబ్బులు ఇస్తుంటే నేను చూసాను. అవి నువ్వు జేబులో పెట్టుకుని రాత్రి ఇంటికెళ్ళాక మిగతావాటిలో వంద రూపాయలు అమ్మకి ఇచ్చావు.”
కత్తివాటుకి నెత్తురు చుక్కలేని మొహంతో రంగారావు వెర్రి చూపులు చూస్తూంటే సైకిల్ ఓనర్ అరిచేడు, “ఇదన్న మాట నువ్వు చేసేపని ఇక్కడ. ఆయన దగ్గిర్నుంచీ, నా దగ్గిర్నుంచీ కూడా డబ్బులు గింజుకుందామని ఆశ. నీ కొడుకే చెప్తున్నాడు కదా. కనీసం వాడి నుంచి నిజాయితీగా ఉండడం నేర్చుకో.”
రంగారావు చేతిలోంచి సైకిల్ గుంజుకుని సైకిల్ ఓనర్, ఆయన స్నేహితుడూ వెళ్ళాక రంగారావు కొడుకుని లోపలకి తీసుకెళ్ళి ఏదో చెప్పబోయేడు, కస్టమర్లతో ఎలా మాట్లాడాలో డబ్బులు ఎలా సులభంగా సంపాదించవచ్చో.
“గాంధీగారు అలా చేయలేదు, మా స్కూల్లో మేష్టారు కూడా అలా అబద్ధాలు అడకూడదు అని చెప్పారు నాన్నా,” బాలాజీ అన్నాడు, రంగారావుతో నిజాయితీగా.
వళ్ళు మండిపోయింది రంగారావుకి. రోడ్డు మీదకి తలుపులు తీసి ఉండే షాపులో ఏం చేసినా బయటకి తెలుస్తుంది. ఈ కుర్రాణ్ణి కొడితే రోడ్డుమీద జనం అంతా పోగై తన బడితపూజ చేస్తారు. అప్పటికి కోపం అణుచుకున్నాడు కానీ కొడుకు మూడువందల యాభై రూపాయలు ఉత్తి పుణ్యాన పోగొట్టాడు అనే మంట తగ్గలేదు; షాపు కట్టేసాక కుర్రాణ్ణి ఇంటికి పొమ్మని చెప్పి గవర్నమెంట్ వారి సారా దుకాణానికి (ప్ర.సా.దు) కి బయల్దేరాడు. తాగుడు మైకంలో తూలుతూ, మరో గంటకి కొడుకుని తిడుతూ రంగారావు ఇంట్లొకొచ్చాడు.
పెళ్ళాం కనిపించి ‘అన్నం తింటావా?’ అని అడిగేసరికి నషాళం అంటుకున్నట్టు అరిచాడు, “ఆపవే ముండా, నువ్వూ నీ కొడుకూ నన్ను చంపుకు తింటున్నారు, ఏడీ ముండాకొడుకు, ఇవాళ ఏం చేశాడో తెల్సా?’
“ఆడిమీద సెయ్యేసావో చంపి పాతరేస్తాను, జాగ్రత్త,” పెళ్ళాం చెప్పింది. ఈ లోపుల పడుకున్న బాలాజీ లేచి తల్లి వెనక్కి చేరాడు.
“చూద్దారి ఏం చేత్తావో,” చుట్టూ చూసి అక్కడే ఉన్న తెగిపోయిన సైకిల్ టైర్ రబ్బర్ ట్యూబ్ తో పెళ్ళాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. రబ్బర్ శరీరంమీద పడుతూంటే ఆవిడ వంటిమీద వాతలు తేల్తున్నాయి. కొడుకు ఈ లోపున ముందుకొచ్చి అన్నాడు ‘కొట్టకు నానా, అమ్మ ఏడుస్తోంది, వంటిమీద దెబ్బలు చూడు.’
“దొంగనాయాల రారా నీకు కూడా రుచి చూపిస్తా,” అంటూ కుర్రాణ్ణి కూడా కొట్టడం మొదలు పెట్టాడు రంగారావు. పావుగంటకి తల్లీ పిల్లాడు వంటి మీద తట్లు తేలి ఓ మూల పడిపోయాక రంగారావు అక్కడే చాపమీద కూలబడిపోయి నిద్రలోకి జారుకున్నాడు ప్ర. సా. దు వారి పుణ్యమా అని. అపరాత్రి వేళ రంగారావు భార్య లేచి చూసింది; కొడుకు వంటి మీద దెబ్బలు. రక్తం గడ్డకట్టి అతి దారుణంగా ఉంది లేత శరీరం. తన వంటి మీద దెబ్బలు సరే ఇంతకుముందు అలవాటే. ఈ దొంగనాయాలు అంత చచ్చేలా ఎందుకు కొట్టాడో కుర్రాణ్ణి ఇవాళ?
మంచి సస్పెన్సులో ఆపారు.