వైష్ణవ గురుదేవుడు ప్రభుపాదులు విశ్వేశ్వరుడికి దీక్ష ప్రసాదిస్తూ చెప్పారు,
"పద్మనాథుని నోటి నుండి వెలువడిన గీతా సారాంశం సన్యాసం. నిగ్రహం ద్వారా, విరక్తి మార్గంలో ముందుకు సాగు. యత్ దేఖా ధన్-జన సవే విష్ణు మాయ - అంటే, నీవు చూసే సంపదా, ప్రపంచం అంతా మాయ, నిజమైనవి కావు. ఆ మాయా ప్రపంచం నుండి విడివడేందుకు ఎప్పుడూ నీ దృష్టి సర్వాంతర్యామి మీదే లగ్నం చేయి. ప్రతి వస్తువుని విషతుల్యంగా భావించు. ప్రతి జీవి ఆ అనంతవిశ్వానికి అధిపతియైన వాడి అంతర్భాగమే. కుక్క, నక్క , గాడిద వంటి అన్నిటి శరీరంలోని ఉన్న ఆత్మ కూడా రాముడే. ఆ రాముడికి భోగలాలస ఉండదు. దుఃఖార్తికి అతీతంగా ఉంటాడు. ఆయన నీ నుంచి ఆశించేది బాధితులకు సేవ, జీవుల పట్ల దయ. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే దయాగుణం నీ మూల మంత్రం అయ్యేలా చూసుకో! "
విశ్వేశ్వరుడు తల వంచి, "ప్రభూ, నా అహంకారం ఈ క్షణం నుండి పటాపంచలు అయ్యేలా ఆశీర్వదించండి. ఇప్పటిదాకా నా సొంతమని భావించిన సంపదనంతటినీ జీవుల సంక్షేమం కోసం ప్రభుదేవుల పాదాలకు సమర్పిస్తున్నాను. ప్రభూ, దయచేసి వాటిని తమ సద్గుణాలతో లోక కళ్యాణం కోసం సద్వినియోగం చేసి నన్ను బంధవిముక్తుణ్ణి చేయండి," అన్నాడు.
"నీ విన్నపం పవిత్రమైనది. ఆమోదనీయమైనది" అన్నాడు గురుదేవుడు. తన తంబురా అందుకొని, తీగను మీటుతూ పాడాడు,
మోక్ కినా, కినా ప్రభూ, మోక్ కినా, కినా
ఏకోధన్ నాలాగయా నామ్ ధన్ బినా!!
(ఓ ప్రభూ, నన్ను నీ స్వంతం చేసుకో! బదులుగా భగవన్నామమనే ధనం తప్ప మరే సంపదా నాకు అక్కరలేదు.)
వింటున్న విశ్వేశ్వరుడి కళ్ల నుండి కన్నీళ్లు ధారకట్టాయి. అప్పటి వరకు హృదయంలో గూడుకట్టుకుని ఉన్న అంధకారం తొలగిపోయి ప్రస్థానించవలసిన కాంతి మార్గం కంటి ముందు గోచరించింది.
విశ్వేశ్వరుడి తాదాత్మ్యతను భంగపరుస్తూ ప్రభుపాదుడు చెప్పారు,
"విశ్వేశ్వరా, ఈ వాయిద్యం అందుకో. ఇది నీ జీవన తంత్రులను భగన్నామమహిమతో అనుసంధానం చేస్తుంది. "
విశ్వేశ్వరుడు గురుప్రసాదాన్ని వినమ్రంగా స్వీకరించాడు. సన్యాసిగా మారి దేశాటనకు బైలుదేరాలని నిశ్చయించుకున్నాడు.
***
వంటి మీది గాయాలపై ఈగలు మూగుతున్నాయి. పరిసరాలలో దుర్భరమైన దుర్గంధం. కాలిబాట పక్కన పారే మురుగు నీటిలో చావు యాతనతో కుక్క ఒకటి ప్రాణం మీద తీపితో మూలుగుతూ పడి ఉంది. మశకం నుంచి మృగరాజు వరకు సర్వజీవుల ఆత్మలోని పరమాత్ముని గుర్తించమని బోధిస్తున్నవారు కూడా ముక్కు మూసుకొని దూరంగా తొలగిపోతున్నారు. కొందరు బాలురు దూరం నుండి కుక్క మీదకు రాళ్లు విసురుతూ, బాధతో అది చేసే ఆక్రందనలు వింటూ నవ్వుతున్నారు. ఒక బైరాగి తంబురా వాయించుకుంటూ భగవన్నామ కీర్తనలు పాడుకుంటూ ఆ మార్గంలో నడిచి వస్తున్నాడు.
బైరాగి దృష్టి అక్కడి దృశ్యం మీద పడింది. దేవుని ప్రతీక అయిన ఆ ప్రాణి యాతనను చూసి అతని గుండె కదిలిపోయింది. గాయపడిన ఆ కుక్కను మురుగు నీటి నుండి లేపి చేతుల్లోకి తీసుకొన్నాడు. అప్పటికే దాని తోకను క్రిములు కొంత మేరకు తినేసాయి.
ఆ కుక్క శరీరాన్ని నది నీళ్ళతో శుభ్రం చేసి అక్కడ దగ్గరలోనే ఉన్నతన కుటీరానికి తీసుకువెళ్లాడు. బైరాగి సపర్యలు, జీవుల పట్ల అతను కనపరిచే జౌదార్యం.. కారణాలు ఏమైతే ఏం గానీ, శునకం నిదానంగా కోలుకుంది. ఒంటరి బైరాగికి క్రమంగా దగ్గరయింది. మిత్రుడయింది.
బైరాగి తన మిత్రుడికి 'రాముడు' అని పేరు పెట్టుకొన్నాడు. ఇప్పుడు ఆ బైరాగికి రాముడే సర్వస్వం. మిత్రుడిని హృదయానికి అదుముకుని నిద్రపోతాడు. ఇద్దరూ ఒకే పళ్లెంలో తింటారు. రాముడితోనే తన మనసులోని ఆలోచనలను పంచుకుంటాడు. బైరాగి తత్వాలు పాడుతూ ఉంటే రాముడు అతగాడి తొడపై తలపెట్టి శ్రద్ధగా ఆలకిస్తాడు. ఇప్పుడు రాముడికి బైరాగి తోడు; బైరాగికి రాముడు నీడ.
విశ్వేశ్వరుడు ఇచ్చిన సంపదతో గురుపీఠం స్థాపించడానికి ప్రభుపాదుడు తన శిష్యులతో నగరానికి విచ్చేసాడు. కార్యక్రమం అద్భుతంగా సాగుతున్నది. భగవన్నామ మహిమలు, అతని అద్భుతమైన లీలలు శ్రవణానందంగా గురుదేవుడి స్వరం నుండి వెలువడుతున్నాయి.
"యత్ర జీవ, తత్ర శివ,
యత్ జీవ-జంగమ, కీట పతంగమ,
అగ-నాగ జగ్ తేరి కాయ" అనే వేదాంత సూక్తులకు వారిచ్చే వివరణలు హృదయాన్ని స్పృశిస్తున్నాయి.
"మేము అజ్ఞానులం; ఆ పరమ పిత గొప్పతనం ప్రతి ఆకులో, పుష్పంలో ప్రతిఫలిస్తుంది" ప్రాంగణమంతా ఆధ్యాత్మ భావనతో గంభీరంగా ఉంది.
బైరాగికీ ప్రభుపాదుని పాదాలకు నమస్కరించాలనిపించింది. వెళ్లాడు. గురువువైపుకు వెళ్ళే సమయంలో రాముడు అదే పనిగా రెండు మూడు సార్లు మొరిగాడు. భైరాగి ధోవతిని లాగి, సమీపంలోని పూలచెట్టు వైపుకు తీసుకెళ్ళాడు. గురుదేవుడి కుమార్తె అక్కడ గజగజలాడుతూ ముడుచుకు కూర్చుని కనిపించింది. బైరాగిని, రాముణ్ణి చూసి వెండిరంగులో ఉన్న పామొకటి చరచరా పొదల్లోకి దూరెళ్ళిపోయింది. పూలు కోసుకునే సమయంలో గురువుగారి కూతురును ఆ పాము కుట్టినట్లుంది.
ఆమె వేలిపై కాటును చూసిన మరుక్షణమే మరో ఆలోచన లేకుండా ఆ వేలిని నోటిలో పెట్టుకుని గాయమైన చోట నొక్కిపట్టి ఉబికొచ్చే రక్తాన్ని పీల్చి బైటకు ఉమ్మేశాడు. మూడు నాలుగు సార్లు అలా కొనసాగించిన తరువాత ఆ అమ్మాయి కొద్దిగా తేరుకుంది. ఇంతలోనే ప్రభుపాదుడు ఆత్రుతతో పరుగు పరుగున వచ్చేశాడు. అమాంతం బిడ్డను కౌగిలిలోకి తీసుకొన్నాడు.
‘ఈ బైరాగి ఎవరో సమయానికి దేవుడిలా వచ్చాడు. పాపకు ప్రాణాపాయం తప్పించాడు పుణ్యాత్ముడు'. చుట్టూ మూగిన జనంలో నుంచి ఎవరో అన్నారు.
ప్రభుపాదుడు చటుక్కున తలెత్తి బైరాగి వంక చూశాడు. అతని పక్కనున్న శునకాన్నీ చూసాడు. కోపం తన్నుకొచ్చింది. గర్జించాడు సింహంలా,
"నీచుడా! పవిత్రమైన నా కుమార్తె శరీరాన్ని తాకుతావా? ఆమె వేలును కొరికి రక్తం తాగుతావా? ఎంత కండ కావరం? మీ వల్ల నా కూతురు మైలపడింది. నలుగురిలో నాకు ఎంత అవమానం?"
బిత్తరపోయాడు బైరాగి. మన్నించమని క్షమాపణ కోరి రాముడితో కలిసి ప్రాంగణం నుంచి బైటకొచ్చాడు. రాముడి హృదయం రగిలిపోతోంది. 'ఛీఁ..ఛీఁ! ఈ మనుషులు ఎంత కృతఘ్నులు? ఈ నీచులా సృష్టికర్త ఆలయానికి ధ్యజస్తంభాలు!' చీదరించుకున్నాడు.
అవతల గురుపీఠం నుంచి ప్రవచనాలు హోరెత్తిస్తున్నాయి ..
"భై ముఖే బోలా రామ్-హృదయే ధరా రూప్" ప్రభుదేవుడి స్వరం లో భక్తిరసం పొంగిపోర్లుతోంది.
రాముడు మూగగా ఘోషించాడు, "వినవయ్మా ప్రభుపాదా! నా మిత్రుడి కృప వల్ల నీ కుమార్తె ప్రాణగండం నుంచి బైటపడింది. దానినల్ల నామిత్రుడికి దక్కిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? నీ కూతురిని మింగాల్సిన పాము విషం నా మిత్రుడి నాలుకను బలితీసుకొంది. నాలిక చచ్చుబడి మాట పడిపోయింది. నా మిత్రుడి కష్టాన్ని నీ భగవన్నామ సంకీర్తనలు ఇప్పుడు రక్షించగలవా?! "
రాముడిలా ఆలోచించటం రాదు దయాళువు బైరాగికి. జరిగింది వివరంగా చెప్పి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆ అమాయకుడి ఆరాటం. వివరాలన్నీ రాసిన అట్టముక్కను మెడలో వేసుకుని కర్ర ఊతంగా గురుపీఠానికి బైలుదేరాడు
ద్వారం దగ్గరే ప్రభుపాదుని శిష్యులు బైరాగిని అటకాయించారు. వాళ్ళు మొరటుగా తోసిన తోపుకు తూలి పడిపోయాడు బైరాగి.
మిత్రుడి దీనస్థితికి రాముడి హృదయం కలచివేసినట్లయింది. అచేతనంగా పడివున్న బైరాగి పక్కనే నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ కూర్చుండిపోయాడు.
"ఈ దరిద్రుడికి ఎంత ధైర్యం? చావడానికి మరో చోటే లేదా? 'ఛీఁ..ఛీఁ! వీడి కుక్క చావు మూలకంగా గురుపీఠ ప్రాంగణం అపవిత్రమైపోయింది" గర్జించాడు అప్పుడే వచ్చిన ప్రభుపాదుడు. .
ప్రభుపాదుడి కుమార్తె పక్కనున్న గురువుగారి శిష్యుడితో "ఈ సన్నాసిని ఈడ్చుకెళ్ళండి! ఏ కాలవలోనో పారేసి రండి!" అని గర్జించింది.
రాముడి కళ్లలో నిప్పులు రగిలాయి. ఈడ్చుకెళ్ళే క్రమంలో బైరాగి కాళ్ళు పట్టుకున్న శిష్యుడి చేతిని కటిక్కున కొరికాడు రాముడు.
ప్రభుపాదుడు కోపం పట్టలేక పోయాడు. రాముణ్ణి కర్రతో బలంగా ఒక్కటిచ్చుకున్నాడు. ఆ దెబ్బకు రాముడి ముక్కు చిట్లింది. వాడి వంటి నిండా గాయాలూ, రక్తమూ. మూగగా రోదిస్తూ, బైరాగి దగ్గరకు వెళ్ళి అతని చుట్టూ తిరిగి గుండెలపై తలవాల్చి పడుకుండిపోయాడు రాముడు.
బారెడు పొద్దెక్కింది. ఎండ తీవ్రతకు బైరాగి అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు. "దాహం, దాహం. నీళ్ళు కావాలి." బైరాగి ఆక్రందన వినే నాధుడు లేడక్కడ.
రాముడే తన లాలాజలం నిండిన నాలుకను మిత్రుడి నోటికి అందించాడు. దాహం తీరినట్లు బైరాగి కళ్లు అపారమైన తృప్తితో తడిసిపోయాయి. ఆప్యాయంగా రాముడిని చేతులతో మీదకు లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు.
కరుణామయుడైన పరమదయాళువు నిర్దయ నిర్ణయం ప్రకారం ఇద్దరూ ఆఖరి శ్వాస తీసి లోకాన్ని వదిలేశారు!
దూరంగా కూర్చుని ఈ జగన్నాటకమంతా చూస్తున్న రాబందులు రెండు సిగ్గుతో తలలు రెక్కల్లో దాచుకున్నాయి. పిల్ల రాబందు తల్లి రాబందును అడిగింది..
"అమ్మా! ఈ గురువు పద్దాకా బోధించే సర్వవ్యాపకుడైన దేవుడు అసలు ఉన్నాడంటావా?"
"ఉండకేం. కాకపోతే ఈ రకం జాతికి దయ, దాక్షిణ్యం, జ్ఞానం,ఇంగితం, ప్రసాదించే శక్తి చాలక ఎక్కడో దాక్కుని ఉంటాడు!" అంది తల్లి రాబందు.
నా కథ ప్రచురించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ! మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు! 🙏🙏