(ఒక గుడిలో ప్రత్యక్షంగా నేను చూసిన ఓ అనుభవాన్ని అక్షరాలల్లో .....)
గుడికెళ్లినప్పుడల్లా
దేవుడితో తగాదా
వాకిలికడ్డంగా హుండీతో
ఈ దోపిడీ ఏమిటని?
భక్తి ముడిసరుకుగా
లాభసాటి వ్యాపారంలో
దగా పడుతోంది
అమాయకుల ఆస్తికత్వం.
బాధలో గుడిని నమ్మిన నమ్మకం
దర్జాగా కరెన్సీగా మారుతుంటే
ఆలయ పరపతి ఏమై పోవాలి?
గోపురం గౌరవం ఏం కావాలి?
ఒకరిది కోరికో?
మరొకరి నమ్మకమో?
భక్తిగా ముద్రపడి తలచుకొంటూ
తరిస్తూ వంచిన తలపై
దీవెన పేరుతో అందమైన
లంచాలెన్నింటినో సృష్టించడం
బలహీనతను అలుసు చూసి
గురిచూసి చేసేది మోసమేగా?
దేవుని కన్నా ముందు
కానుకల డబ్బా కనిపించి
గుంజే గొంతులకు కురిసిన
పెద్దోళ్ల నోట్లు, పేదోల్ల చిల్లర
సొమ్మేక్కడికి పోతుందో మరి?
ముప్పొద్దులూ ఎదురుగుండే
పూజారి కష్టాలను తీర్చలేక
ధర్మకర్తల బాధితుడైన దేవుడికి
ఎప్పుడన్నా ఎదురుపడ్డ వారి
బాధను తీర్చే శక్తి ఏక్కడుంది?
మనిషి జన్మెత్తిన పాపానికి
కష్టాలను తట్టుకోలేని లోపానికి
గుడి ఒడిని చేరితే
అడుగడునా ఆర్ధిక ఆంక్షలే.
పలు రకాల పూజల ఆకృతిలో
కకృతి పడే పాలకుల నైపుణ్యాలకు
నిజాలు మరచిన అమాయకులుగా
చదువుకొన్న నిర్లక్ష్యరాస్యులు
సహితం చిక్కుకొని,
చెప్పుల టోకెను నుండి
ప్రసాదాల టికెట్స్ దాకా
మనసును మెలివేస్తున్నా
"దేవుడి భయం"తో
"దొంగల పరపతి"కి భయపడి మౌనంగా
నోళ్లు, గోళ్లు గిల్లుకొంటున్నాయి.
ఆలయ చరిత్ర చూస్తే ఆమోఘమే.
అధికార వసతులన్ని
గెజిటెడ్ ర్యాంక్ లే.
వాహనాలు, ఏ.సి.రూములు,
పట్టు పరుపులు, తెల్లని వస్త్రాలు
హంగామలో హద్దులుండవు.
ఆర్భాటాలకు తిరుగుండదు.
ఎవడి సొమ్మును ఎవడనుభవిస్తున్నాడు?
దేవుడు ఒంటరిగా ఉన్న వేళలలో కూడా
కటిక పేదోడు కూడా
టికెట్ కొంటేనే దర్శనమనేది
పుణ్యానికి దారి చూపే
పెద్దల పాపపు ఆలోచన.
కలియుగంలో శాపాలకు దేవుడు అతీతుడు కాకుండా
చేయగలిగిన మానవ మేధస్సుకు
దేవుడు సామాన్యుడికి దూరంగా...
సంపన్నులకు దగ్గరగా..
బాధపడుతూనే ఉన్నాడు.
ఎన్ని పీఠాలున్న
ఎంత మంది స్వాములున్నా
సామాన్య భక్తికి
గుడిలో చోటే లేకుండాపోయింది.
దేవుని ప్రతిరూపాలుగా
చెప్పుకొనే దొంగ స్వాములు
దేశ ప్రధానుల స్థాయికి ఏ మాత్రం
తక్కువకాని చరిత్ర వారిది ఈ దేశంలో.
అధికారం మారినప్పుడల్లా
దేవుడికి అగ్నిపరీక్షే.
ఏ రంగు జెండా వస్తే
ఆ రంగు జండాపై ఊరేగాలిసిందే.
అధికార అంధకార కుతిలో
అవినీతి గోతిలోకి
కూరుకుపోతుంది ఆలయ పాలన.
సంప్రోక్షణ నోచుకోని సంరక్షణ
దీనంగా, హీనంగా, నీచంగా,
ఘోరంగా బోరుమంటోంది.
ఆలయ గొప్పదనం
యుగాలుగా సాక్షాలతో
అగుపించినా ఏమి లాభం?
శిలా పలకలపై
చరిత్ర గంభీరంగా కనిపించినా
ఏమి ఫలితం?
పవిత్రమైన ఆలయంలో
అపవిత్రమైన రాజకీయంతో
గుడిలో అర్చనకు అర్ధం మారి
పూజకు రేటు కట్టడంతో
పెరిగేది దేవుడి విలువో?
తరిగిది భక్తుడి నమ్మకమో?
దేవుడున్నాడో? లేడో?
మనిషి మాత్రం ఉన్నాడు ఎప్పుడూ.
ఆధ్యాత్మిక చింతనలో
మంచిని పెంచే భక్తితో
గుడి ఒక విశ్వాసమైతే
అదే మనిషిలో స్వార్ధం
గుడిని హుండీగా మార్చి,
ఆలయాలను
వ్యాపార కేంద్రంగా మార్చాడు
కనిపించని ఆ దేవుడు
తన ఇంటి పరువును కాపాడుకొంటాడో?
బిడ్డల వంటి భక్తులకు కళ్ళు తెరిపిస్తాడో?
గుడిలో కళ్ళు మూసుకొని
మౌనంగా అలాగే ఉండిపోతాడో
మరి చూడాలి?