Menu Close
Kadambam Page Title
GVRao
దేవదేవుని ఆలంబనకై అసహాయుని ఆవేదన
గుమ్మడిదల వేణుగోపాల రావు

నేనెవర్నో, ఆత్మనో, ఆ పరమాత్మలో అంశమో,
అనంతాకాశములో అణువునో,
ఎవరి ఇచ్ఛపై, ఎవరి ఆజ్ఞపై, ఏశక్తి ప్రోద్బలంతో
పిండాన్నై నిలచానో మాతృగర్భాన
ఎందుకోసం జన్మమెత్తుతున్నానో,
ఏమి సాధించబోతున్నానో,
ఏజననీ జనకులకు
మధురానుభూతులు పంచబోతున్నానో,
ఎవరినెత్తిన నా విపరీత చేష్టలతో
దుఃఖాన్ని రుద్దబోతున్నానో,
ఎవెరితో నా భవిష్యత్
పంచుకోబోతున్నానో తెలియని అజ్ఞానిని.

అయినా చిదానందమూర్తిగా మందహాసాన్ని చిందిస్తూ
అమాయకత ప్రదర్శిస్తూ,
అహంకారమంబరాన్న మేఘాలపై
తేలుతూ, ఏలుతూ, ఆవేశంతో ఊగిపోతూ,
నా ఔన్నత్యాన్ని కొల మానంగా చూపిస్తూ,
లోపభూయిష్టమైనదంటూ లోకాన్ని నిందిస్తూ, ఆ భ్రమలో,
ఆ మహాదేవుని తాండవ కేళిలో భాగమై
ప్రపంచ నాటక సంద్రంలో భాగమై, ఒక పాత్రనై
నిస్సహాయతో ఇలా నిలుస్తానని తెలియదు.

చంద్రోదయం మేల్కొలుపుతోంది సౌందర్య పిపాసని
వెన్నెల రేపుతోందీ అపురూప రాగాలని లోలోన
కానీ పాడాలంటే లేవటంలేదు గొంతు,
మాటల పొందిక కుదరదు భావోద్రేకం నింపడానికి
రెచ్చగొడుతోంది కోయిల తీయని గొంతుతో
అయినా తెగించడానికి చాలదు మనోధైర్యం
నిస్సహాయత అన్నివైపులా అలుముకోగా
నిలచా సహాయాన్ని అర్థిస్తూ ఆ తెలియని అదృశ్యశక్తిని,
అదే నా ఆవేశానికి ఊపిరిపోస్తుందన్న గంపెడాశతో.

ఆ దేవదేవుని చిరునవ్వుగా విరిసిన నీలాకాశంలో
దట్టమైన కారుమబ్బులు అటునిటు పరుగెడుతూ
యుద్ధంచేస్తూ లోకాన్నంతా తళతళలతో ఫెళఫెళలతో
భీభత్సంచేస్తూ లోకాన్నంతా అతలాకుతలం చేస్తుంటే
పసిపాపలు ఏడుస్తూ, అమాయక మృగాలు బిత్తరపోయి
ఏమవుతోందో తెలియక
దీనజీవాశృతుడైన దేవదేవుని ఆలంబనకై
అసహాయంగా అరుస్తూ
మాతృమూర్తుల చుట్టూ గజిబిజి గా తిరుగుతూ వుంటే
తామెవరో తెలుసుకోలేని ఆ నిస్సహాయస్థితిలో
ఆ దీనులకు ధైర్యాన్ని కలిగించే దెవ్వరు
ఆర్తజీవ పరాయణుడైన పరమాత్మ తప్ప.

Posted in April 2025, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!