‘భారతీయ సంస్కృతీ వారసత్వం’ - అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ
హ్యూస్టన్ USA
కళలతో విద్య, విద్యతో సేవ దిశగా సాగే పయనంలో
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ
సంయుక్త నిర్వహణలో
సాహిత్యరంగంలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులకు ‘సాహిత్య భారతి’
2025 జీవితకాల పురస్కారాల ప్రదానం
----------------
అకాడమీ సంస్థాపకురాలు – కూచిపూడి నాట్య గరువు – రచయిత్రి – నటి – దర్శక నిర్మాత
‘నాట్యభారతి ఉమాభారతి’
----------
1981 లో హ్యూస్టన్ నగరంలో ఉమాభారతి గారు స్థాపించిన ఒక గొప్ప సాహితీ సేవా సంస్థగా రూపొందింది అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ. కూచిపూడి నాట్య కళకు అంకితమైన నృత్య శిక్షణాలయంగా మొదలై లెక్కకు మిక్కిలి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.
కళాప్రపూర్ణ ‘వేదాంతం జగన్నాధ శర్మ’గారు మరియు పద్మశ్రీ ‘వెంపటి చినసత్యం’ గారి నృత్య వారసత్వాన్ని అనుసరిస్తూ ‘ది ఉమాభారతి షో’ పేరుతో దక్షిణాఫ్రికా, మలేషియా-సింగపూర్, మారిషస్ మరియు అమెరికాలో దేవాలయ నిర్మాణాలు, గ్రంథాలయాలు, కంటి వైద్య శిబిరాలు, భారతీయ కళలు మరియు వారసత్వ ప్రచారం కొరకు నిధులు సేకరించడమే లక్ష్యంగా అసంఖ్యాక నృత్య ప్రదర్శనలు చేశారు.
1981 నుండి కూచిపూడి నృత్యకళని విదేశాలలో విస్తరింపజేయడంలో చేసిన విశేష కృషికి అకాడెమీ అందుకున్న సత్కారాలలో కొన్ని...
- 1987 లో వంశీ వారి 'గురు వేదాంతం జగన్నాధ శర్మ స్మారక' పురస్కారం,
- 1989 లో LVR ఫౌండేషన్ – చెన్నై వారి ‘రాజ్యలక్ష్మి’ అవార్డు మరియు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ కౌన్సిల్ 'జవహర్‌లాల్ శతాబ్ది’ కళల అవార్డు,
- 2000 లో ‘సోమ పారిజాత’ అవార్డు మరియు వంశీ-‘బెర్కలీ మిలీనియం’ అవార్డు
- 2013 లో TANA వారి ‘తెలుగు తేజం’ అవార్డు
- 2017 లో ఢిల్లీ తెలుగు సంఘం వారి ‘ప్రవాస భారతీయ కళా సేవక్’ అవార్డు
- 2025 లో అమృతలత ‘జీవన సాఫల్య పురస్కారం’ మరియు వంశీ సంస్థ నుండి ‘NTR ప్రవాస భారతీయ పురస్కారం’.
2018 లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ కి అనుబంధ సంస్థగా ‘శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీని స్థాపించి తద్వారా బాలల సంక్షేమానికి, సామాజిక సేవాకార్యక్రమాలకి, పశు సంక్షేమానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. సాహిత్యరంగంలో కథల పోటీలు, వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తుల సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అకాడమీ విద్యార్థులు దలైలామా గారి ప్రపంచ శాంతి కార్యక్రమం, TANA మరియు ATA వంటి ప్రపంచ తెలుగు మహా సభల్లో చురుకుగా పాల్గొని ప్రపంచవ్యాప్తంగా కళాప్రియుల మన్ననలు, పలుమార్లు అత్యుత్తమ ప్రదర్శన అవార్డులు అందుకొన్నారు. ఆలయ నిర్మాణ ప్రాజెక్టులకు నర్తించి సేవే ప్రధాన ధ్యేయంగా నడిచింది అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ.
కూచిపూడి నృత్య శిక్షణతో పాటు, భారతీయ సంస్కృతి, కళల ద్వారా సేవ మరియు సాహితీ వారసత్వాన్ని కొనసాగించేలా శిక్షణ ఇస్తోంది. అందుకే అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ ‘భారతీయ సంస్కృతీ వారసత్వం’ గా నిలిచింది.
ఉమాభారతి గారు స్థాపించిన ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశేష గుర్తింపు పొంది 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.
పుష్కర కాలంగా సాహిత్య రంగంలో కృషి చేస్తూ... మూడు కథా సంపుటాలు, నాలుగు నవలలు ప్రచురింపబడి, పలుమార్లు కథలకు, 2023 లో నవలకు ఉత్తమ రచన పురస్కారాలు, పాఠకుల ఆదరణ పొందిన సంస్థాపకురాలు ఉమాభారతి .. .. సాంస్కృతిక మరియు సాహిత్యకళా రంగాలలో మరెన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని భావిస్తున్నారు.