కార్పొరేట్ స్కూళ్ళు కావవి
పసిబిడ్డల పాలిట నరకపు గూళ్ళవి
పాలబుగ్గల బాల్యాన్ని పరమ కర్కశంగా
చిదిమేసే యమలోకపు లోగిళ్ళవి
ఆనందపుటానవాళ్ళు మచ్చుకైనా కనిపించని
కసాయి సైతాను సమాధుల వాకిళ్ళవి
బాధల బంధిఖనాలో కన్నీరు సైతం
ఇంకిపోయి అలసిన వసివాడిన పసికళ్లవి !
అర్థంకాని పుస్తకాల మోతలతో ఆకాశహర్మ్యాల
మెట్లెక్కే లేత వెన్నులొంగిపోతాయ్ అక్కడ
ఆర్భాటపు ఆంగ్లపు కూతలతో పాశ్చాత్యపు సంస్కృతికి
అందమైన అమ్మభాష లొంగిపోతుందక్కడ
అమ్మను మమ్మీగా నాన్నను డమ్మీగా మార్చేసే
సరికొత్త చదువులు స్వార్థానికి బీజాక్షరాలు వేస్తాయ్ అక్కడ
పైసల కోసం పరుగు పందెమే జీవిత పరమార్థమనే
కొత్తవిలువల బ్రాండ్ వలువలు బిడ్డలకు తొడుగుతాయక్కడ !
తాము వేసుకున్న తెల్లకోటు వెనుక నెత్తుటిచెమటతో తడిసిపోయిన
తల్లిద౦డ్రుల వెతలను గుర్తి౦చలేని వైద్యులుద్భవిస్తారిక్కడ
తాము గీస్తున్న ప్లానుల డ్రాఫ్టుల క్రి౦ద నలిగిపోతున్న
జనాల వేదనలను చూడలేని ఇ౦జనీర్లు పుట్టుకొస్తారిక్కడ
జీవన౦ కోస౦ రాసే జియస్టీ లెక్కల పద్దుల క్రి౦ద చితికిపోయిన
బడుగుల జీవితాలను పట్టి౦చుకునే తీరికలేని సీయేలు తయారౌతారిక్కడ
మనిషిని మనిషిగా చూడలేని ఆధునిక అకడమిక్ మెషిన్లు
సమూహ౦లో ఏకా౦త౦ అనుభూతి౦చే సరికొత్త రోబోలు స౦చరిస్తాయిక్కడ !