Menu Close
చిట్టి కథలు - 5
-- దినవహి సత్యవతి --

బుజ్జాయి

”బుజ్జాయీ కథ చెపుతాను ఊ కొడతావా?” నెలల పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ మాట్లాడుతోంది సుమన.

పాప బోసి నవ్వే సమాధానంగా చెప్పడం మొదలెట్టింది...

“అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు. ఆయనకి ఏడుగురు కొడుకులు... ఊ కొట్టవే బుజ్జాయీ”

పాపాయి హావభావాలే తన కథ కి ఊతగా మధ్య మధ్య లో అడుగుతూ కథ కొనసాగించింది...

“ఆ ఏడుగురూ ఒక రోజు వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టారు...అందులో ఒక చేప ఎండలేదు...చేపా చేపా…. ఎందుకు ఎండలేదూ... చిన్న తల్లీ కథ చెప్తున్నప్పుడే అమ్మ ఒడిని తడపొచ్చునా.... ఉండు నాపీ మారుస్తాను” పాపాయిని ప్రక్కన పడుకోబెట్టి వెళ్ళింది.

ఇంతలో భర్త వచ్చి పాపని ఎత్తుకుని చేతులని ఉయ్యాలగా చేసి ఊపుతూ ఆడిస్తుంటే గబ గబా వచ్చి పాపని అతని చేతుల్లోంచి లాక్కుని “అలా కాదు పాపాయిని ఇలా ఆడించాలి” అని గాల్లోకి ఎగరేసి పట్టుకోబోతుంటే బుజ్జాయి చేతుల్లోంచి జారిపోయింది...

!+!+!

“తల్లీ బుజ్జాయీ” చేతులు గాల్లోకి చాపి గావుకేక పెడుతూ లేచిన భార్య సుమనని చూసి, మంచం మీద ప్రక్కనే వెనక్కి వాలి పుస్తకం చదువుకుంటున్న రాజన్, కంగారుపడి, ఆమె భుజాలు పట్టుకుని మళ్ళీ నెమ్మదిగా వెనక్కి వాల్చి పడుకోబెట్టి దీర్ఘంగా నిట్టూర్చాడు...

‘పిల్లలు పుట్టలేదన్న దిగులు ఒకవైపు, నలుగురూ గొడ్రాలు అని పిలుస్తున్న బాధ (ఈ రోజులలో కూడా) ఒకవైపు, నాకు పిల్లలంటే చాలా ఇష్టమని తెలిసీ ఒక బిడ్డని ఇవ్వలేకపోయానన్న బాధ సుమనని మానసికంగా కృంగదీసాయి. ఆ బాధనుంచి ఉపశమనం కోసమేమోనన్నట్లు ఒక బొమ్మని బిడ్డగా భావించి, బుజ్జాయి అని పిలిచుకుంటూ, దానికే అలంకారాలు చేస్తూ, దానితో కబుర్లు చెప్తూ... కనీసం నన్ను కూడా బొమ్మని అంటే ఊహలలో బుజ్జాయిని తాకనివ్వడం లేదు సుమన. ప్రతిరోజూ ఇలా ఏదో ఒక కలతో ఉలిక్కిపడి లేవడం పరిపాటి అయిపోయింది.

పిల్లలకోసం చేసిన ఐ.వి.ఎఫ్. ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎవరినైనా దత్తత తీసుకుందామనుకునేటప్పటికే సుమన మనఃస్థితి నాజూకుగా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆ ప్రయత్నం కూడా విరమించుకోవాల్సి వచ్చింది. పిల్లలు ఉంటే ఆనందమే కానీ లేరని సుమనని బాధపెట్టేంత కుసంస్కారిని కాదు. అయినవాళ్ళందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పినా ససేమిరా అన్నాను. ప్రాణం లేని ఆ బొమ్మని బుజ్జాయి అనుకుని ప్రేమగా చూసుకుని మురిసిపోతోంది పిచ్చి సుమన! నాకు మాత్రం ప్రాణమున్న సుమనే నా బుజ్జాయి, నా సర్వస్వం. నా బుజ్జాయిని నేను కూడా జీవితాంతం ప్రాణప్రదంగా చూసుకుంటాను’ ఆప్యాయంగా సుమన తలనిమురుతూ భావోద్వేగానికి లోనయ్యాడు రాజన్.


ప్రేమమయి

మేమిద్దరమూ డిగ్రీ ఒకే కాలేజీలో చదువుకున్నాము.

ఆమెని మొదటి సారి చూసేవరకూ తానెవరో నేనెవరో! తొలి చూపులోనే, ఆమే నాకు సరి జోడి అనిపించింది.

ఆమె నడత, స్నేహశీలత, మృదుభాషణ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మదిలో ప్రేమ నింపుకుని ఆమెనే గమనించాను. ఒకరోజు దరికి జేరి మనసులో కోరిక తెలిపాను.

సున్నితంగా నా కోరిక త్రోసిపుచ్చింది. అందుకు కారణం మావి విభిన్న మతాలు.

పట్టువదలని విక్రమార్కుడిలా నా ప్రయత్నం కొనసాగించాను.

నా ప్రేమ దేవత నన్ను కనికరించింది. నా ఆనందానికి అంతులేకపోయింది.

ఓ శుభ ముహూర్తాన “అమ్మా నేనొక అమ్మయిని ప్రేమించాను” అని చెప్పాను.

“ఎవరు?” ప్రశ్నార్థకంగా చూసింది అమ్మ.

నా ప్రేమమయిని గూర్చి వివరంగా చెప్పాను.

“కుదరదు” అమ్మ సమాధానం నన్ను అధః పాతాళం లోకి తోసేసింది. నిరాశతో నిండి పోయింది నా మనసు.

ఒక వైపు నన్ను నమ్మిన ప్రేమమయి మరొకవైపు జన్మ నిచ్చిన ప్రేమమయి.

అమ్మకి నచ్చజెప్పడానికి విశ్వ ప్రయత్నం చేసాను.

“అయితే అమెని మతం మార్చికోమను” నియమం పెట్టింది.

నాన్న చనిపోయాక, కష్టాల నీడ కూడా నన్ను తాకకుండా, నన్ను పెంచడానికి అమ్మ ఎన్ని పాట్లు పడినదీ నాకు తెలుసు.

అయితే నేను కూడా అన్ని మతాలూ సమానమని దైవం ఒకటేనని నమ్మిన వ్యక్తిని.

భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత. అలాంటప్పుడు ఇరు భిన్న మతాల వ్యక్త్రులు వివాహబంధం లో కలిసి జీవించాలని కోరుకోవడం తాము నమ్మిన దైవాన్ని పూజించడం ఎందుకు వీలవదు? అది తప్పు ఎలా అవుతుంది... ఇది నా సందేహం!

“అది నాకు ఇష్టం లేదు” అన్నాను.

“కానీ అది నాకు అవసరం. నువ్వు పెళ్ళి జేసుకోక పోయినా ఫరవాలేదు కానీ వేరే మతం అమ్మాయి నా ఇంటి కోడలిగా రావడానికి ససేమిరా ఒప్పుకోను” కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పింది.

“మీ అమ్మ అనుమతి లేకుండా మనం వివాహం చేసుకోవద్దు. అన్నిటికంటే విలువైనది కన్న తల్లి ఆమె ప్రేమ. నా కోసం అది నువ్వు కోల్పోవడం నేను భరించలేను” ఆమె నిర్ణయం ఆమె పట్ల నా గౌరవాన్ని ఆరాధనగా మార్చింది.

ఒకరి జీవితాలకి మరొకరు ప్రతి బంధకం కాకూడదని స్నేహ పూర్వకంగా దూరమవుదామని నిశ్చయించుకున్నాము.

ఆరోజు మొట్ట మొదటి సారిగా చివరిసారిగా కూడా నా ప్రేమమయిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను.

నా జీవితంలోకి మరెవరినీ ఆహ్వానించలేకపోయాను.

ఆమెని అన్నీ మరచిపోయి ముందుకు సాగమని చెప్పాను.

“నువ్వు సాగగలవా?” ఎదురు ప్రశ్నించింది. మౌనమే నా సమాధానమైంది.

మేము విడిపోయినా మా ప్రేమ కొనసాగింది మూగగా! ఆ రోజు మా ఇరువురి జీవితాలలో చెరగని మధుర జ్ఞాపకంగా మిగిలింది.


తుఫాను!

సిద్ధార్థ చేతులు రేంజ్ రోవెర్ స్టీరింగ్ మీద గట్టిగా బిగుసుకున్నాయి. పైనుంచి హోరున వాన. రోడ్డుకి ఒక వైపు కనుచూపు మేర వరకూ జలమయం. అప్పటికి కొంత తెరిపి ఇచ్చినా కమ్ముకొస్తున్న మేఘాలు చూస్తుంటే ఇప్పుడో అప్పుడో  జోరువాన  కురిసేలానే ఉంది వాతావరణం.

‘ఏది ఏమైనా నేను వెళ్ళి తీరాల్సిందే’ యాక్సిలరేటర్ బలంగా తొక్కాడు... కారు ముందుకి దూసుకెళుతుంటే ఆలోచనలు వెనక్కి పరిగెత్తాయి...

!+!+!

డాక్టర్ చదువు ముగించి సొంత ఊర్లో  ప్రాక్టీస్ పెట్టాడు సిద్ధార్థ్.

వారం క్రితం ఉదయాన్నే ఫోన్, “హలో సిద్ధు... నేను వికాస్ ని” అంటూ.

“హేయ్ వికాస్! ఏంటి విశేషాలు? ఎక్కడున్నావు? ఏఁ చేస్తున్నావూ?” ప్రశ్నల వర్షం కురిపించాడు సిద్ధార్థ.

“ఉండుండు అన్ని ప్రశ్నలా ఒక్కసారే! అన్నిటికీ సమాధానం చెప్తాను కానీ ముందిది విను. వచ్చే నెల నా పెళ్ళి. మంగళాపురం లో. నువ్వు తప్పక రావాలి. ఇదే పెర్సనల్ ఇన్విటేషన్ అనుకుని వచ్చేయ్. ఎదురుచూస్తుంటాను”

సిద్ధార్థ నివసించే ఊరి ప్రక్కనే, 40 కి.మి. దూరంలోని మంగళాపురమే, పెళ్ళికూతురు వాళ్ళ ఊరు.

క్లినిక్ బాధ్యతలు తోటి డాక్టర్లకి అప్పజెప్పి, పెళ్ళికి రెండు రోజుల ముందుగానే వచ్చేసాడు సిద్ధార్థ. వచ్చే ముందరే వాన మొదలైనా ఇక్కడికి రాగానే ఒక్క రాత్రిలోనే ఉధృతి పెరిగి తుఫానులా మారింది. ముహూర్తం సమయానికి వద్దామని అనుకున్న వాళ్ళంతా తుఫాను కారణంగా రాలేక పోయారు.

అదృష్టవశాత్తూ వికాస్ మేనమామది మంగళాపురమే కావడంతో పది రోజుల ముందరే వికాస్ కుటుంబం అక్కడికి చేరుకున్నారు.

తుఫాను హడావిడి లో పెళ్ళి తంతు తూ తూ మంత్రంలా చేసి ముగిసింది అనిపించారు.

“ఇంత తుఫానులో ఏమి వెళతావురా సిద్ధు. తగ్గాక వెళుదువులే” అని వికాస్, అతని తల్లిదండ్రులూ కూడా చెప్పడంతో ఆగిపోయాడు సిద్ధార్థ్.

అయితే మర్నాడు ఉదయమే తల్లినుంచి ఫోన్, “సిద్ధూ మీ నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. నువ్వు ఎలాగైనా వెంటనే బయలుదేరి రా” అని.

మాట్లాడుతూనే భోరుమని ఏడుస్తున్న తల్లిని ఓదార్చి హుటాహుటిన బయలుదేరాడు సిద్ధార్థ...

!+!+!

వేగంగా వెళుతున్న కారు ముందు స్క్రీన్ పై నీళ్ళు పడి దారి కనిపించక పోవడంతో ఉలిక్కిపడి, యాక్సిలరేటర్ మీదనుంచి కాలు తీసి బ్రేక్  తొక్కాడు సిద్ధార్థ్. దాంతో కారు నీటి గుంటలో ధఢేల్ న ఆగింది. గుంటలో నీళ్ళు ఆకాశానికెగిరిపడి కారుని అభిషేకించాయి!

వైపర్స్ తో స్క్రీన్ తుడిచి చూసాడు ... వాన జల్లు మొదలైంది మళ్ళీ.

తల్లికి ఫోన్ చేద్దామని చూసాడు. నెట్ వర్క్ లేదు. అప్పటికే పది మిస్సెడ్ కాల్స్ ఉన్నాయి తల్లి నుంచి.

‘సమయానికి నెట్వర్క్ కూడా అందకుండా పోయింది. ఈ, ఛీ.ఛీ. ఎల్. సర్వీసులన్నీ ఇంతే! ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. ఇంతకీ నాన్నకెలా ఉందో? నేను బయలు దేరేటప్పటికి బాగానే ఉన్నారు. ఇంతలోనే ఇలా జరిగడం ఏమిటో! అమ్మ కంగారు పడుతున్నట్లుంది పాపం. ఛ... ఛ... అసలు నిన్ననే బయలు దేరి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఈ వెధవ తుఫాను చూస్తే ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ముందు దారి ఎలా ఉందో?’ పరిపరి విధాలా ఆలోచిస్తూ ‘భగవంతుడా ఈ తుఫాను తగ్గించు. నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు. నాన్నని కాపాడు” మనసులోనే ప్రార్థిస్తూ రేంజ్ రోవర్ కారుని వేగంగా ముందుకి దూకించాడు సిద్ధార్థ.

ఇటు వాతావరణంలో చెలరేగిన తుఫానూ చల్లబడింది, అటు సమయానికి ఆపరేషన్ జరిపించి తండ్రిని బ్రతికించుకున్న కారణంగా సిద్ధార్థ్ జీవితంలో చెలరేగబోయిన పెనుతుఫాను కుడా ఆగింది!

********

Posted in December 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!