శభాష్!
ఎదిగే పిల్లలు పుష్టికరమైన ఆహారం తినాలనే విషయం అరేళ్ళ బంటీకి తెలియజెప్పాలని ఒక పూలకుండి తెచ్చిచ్చి,
“పది రోజులలో మొక్కకి పువ్వు పూస్తే నీకొక మంచి గిఫ్ట్. అమ్మ హెల్ప్ తీసుకోకూడదు” కొడుకుతో అన్నాడు చందర్, చంటి వాళ్ళ నాన్న.
సరేనని మొక్కకి కొన్ని నీళ్ళు పోసి తర్వాత దాని సంగతే మర్చిపోయేటప్పటికి మొక్క వాడిపోయింది.
“మొక్కకి పువ్వు రాలేదు” తండ్రికి చెప్పి వెక్కసాగాడు.
“అసలు మొక్కకి నీళ్ళు పోసావా?”
“నువ్విచ్చిన రోజు బోలెడు పోసేసానుగా”
“అలా ఒక్కరోజే అన్ని నీళ్ళు పొయ్యకూడదు”
“ఎందుకనీ?”
“ఒక్కరోజే బోలెడంత చాక్లెట్లు తిన్నావనుకో ఏమౌతుంది?”
“యాక్...డోకు?”
“అవును కదా! అలాగే మొక్కలకి కూడా ఒక్కరోజు చాలా కాకుండా రోజూ కొంచం కొంచం నీళ్ళు పోయాలి. నీళ్ళని ఆహారంగా తీసుకుని మొక్క బలంగా ఎదుగుతుంది. నీళ్ళు చాలక వాడిపోయింది. అలాగే బలం రావాలంటే నువ్వూ పాలూ, పళ్ళూ, అన్ని రకాల కూరలతో రోజూ అన్నం తినాలి. లేకపోతే నీరసం వస్తుంది”
“ఓ అలాగా....అయితే ఇవాల్టినుంచీ బలమైన ఆహారం తింటాను. స్కూల్లో రేస్ గెలుస్తాను, నాకిష్టమైన ఫుట్ బాలూ ఆడతాను” ధృఢంగా చెప్పాడు.
“శభాష్” మెచ్చుకుని నాన్నిచ్చిన గిఫ్ట్, అందమైన ఫుట్ బాల్, చూసుకుని మురిసిపోయాడు చంటి.
మౌనవ్రతం
రాఘవయ్య శాంతమ్మల మనవడు, ప్రజిత్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.
కరోనా నేపథ్యంలో ప్రజిత్ కి, క్లాసులు ఆన్ లైన్లోనే... తర్వాత ఆఫ్ లైన్ కోర్సులను ఎంచుకోని విద్యార్థులను స్వదేశాలకు పంపించేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో మనవడి భవిష్యత్తు తలుచుకుని రాఘవయ్య దిగులుతో మౌనవ్రతం, ఉపవాసదీక్ష పట్టి కూర్చున్నాడు.
ఇదంతా గమనిస్తున్న శాంతమ్మ మనసులోనూ గుబులు, అటు మనవడి గురించీ, ఇటు భర్త గురించీ!
“తాతయ్యా మీరు బెంగపడుతున్నారని చెప్పింది నాన్నమ్మ. ఇక్కడ విద్యార్థులందరం కలిసి, మాకు న్యాయం చేయమని, అమెరికన్ కోర్టులో వ్యాజ్యం వేసాము. తీర్పు మాకు అనుకూలంగానే వస్తుందని అంటున్నారు. కాబట్టీ నా చదువుకేమీ ఆటంకం రాదు. ఇక మీరు నాన్నమ్మా నిశ్చింతగా ఉండండి” అంటూ ప్రజిత్ ఫోన్.
“మనవడు భరోసా ఇచ్చాడుగా ఇకనైనా మౌనవ్రతం వదిలి ఇదిగో ఇది త్రాగి ఉపవాసం వీడండి” ప్రేమగా భర్త చేతికి చల్లని మజ్జిగ గ్లాసు అందిస్తూ చెప్పింది శాంతమ్మ.
ఆనంద్ ‘టు’
“మనవాళ్ళు ఆదివారం ఆనంద్ వన్ చూడటానికి వెళదామంటున్నారు” అడిగారు విష్ణు.
అది విని ఒకసారి తలెత్తి విష్ణు కేసి చూసి మళ్ళీ వ్రాయడంలో మునిగిపోయాడు నాలుగేళ్ల మా బాబు హర్ష.
ప్రకృతి అందాలతో నిండి రమణీయ ప్రదేశమైన ఆనంద్ వన్ లో సరదాగా గడిపి తిరుగు ముఖం పట్టాము.
ఉన్నట్లుండి “అమ్మా! ఆనంద్ టు ఎక్కడుంది?” అడిగాడు హర్ష.
“ఆనంద్ టు ఏమిటిరా?” హర్ష బుగ్గలు పుణుకుతూ అడిగాను.
అందరి దృష్టీ మావైపు మళ్ళింది.
“మరేమో... వన్ తరువాత టు వస్తుంది కదా! ఇది ఆనంద్ వన్ అన్నావు కదా మరి ఆనంద్ టు ఎక్కడుంది?’
ఆరోజు విష్ణు అడిగినప్పుడు, వన్..టూ లు వ్రాస్తూ, ‘ఆనంద్ వన్’ పదం బుర్రలోకి ఎక్కించుకుని కొంత సొంత జ్ఞానం జోడించి ‘ఆనంద్ టు ఎక్కడ?’ అని సందేహం వెలిబుచ్చాడని తెలిసాక, ఆ ప్రదేశమంతా నవ్వుల పువ్వులు విరిసాయి.