ఎవరు?
గాఢనిద్రలో ఉన్న నాకు ఎవరో మెడ నొక్కుతున్నట్లై ఊపిరాడక మెలకువొచ్చి అతికష్టం మీద కళ్ళు తెరిచి పైకి చూసాను.... ఒక ఆకారం ...మిడిగుడ్లూ...ఎత్తు పళ్ళూ బండ గొంతుతో ‘నన్నే జైలుకి పంపుతావూ! నీ పని సరి ఇవాల్టితో’ వికృతంగా నవ్వుతోంది!.
‘ఎవరూ? వదులూ.. దేవుడా కాపాడు’ అనుకున్నాను ...
హఠాత్తుగా మెడపైన పట్టు సడలింది గబుక్కున తిరిగి కళ్ళు చిట్లించి చూడగా ..నడుచుకుంటూపోతున్న ఆకారం అధాటుగ వెనక్కితిరిగి బెదిరించి మాయమైంది!
సమయం చూస్తే పన్నెండు... అర్థరాత్రి...
మర్నాడు టి.వి. వార్తల్లో ఫొటో చూసి ఉలిక్కిపడ్డాను... దస్తగిరి ... ఒకనాడు వీడి అకృత్యానికి ప్రత్యక్ష సాక్షినై వాజ్ఞ్మూలమివ్వగా ఉరి శిక్ష పడింది. అప్పుడు నా అంతు చూస్తానని బెదిరించాడు.
అప్రయత్నంగా మెడ తడుముకున్నాను... రాత్రి ఆకారం వాడే! జరిగినది భ్రమనుకుందామంటే మెడపైన బరికిన చారలున్నాయి.
అదంతా నిజమనుకుందామన్నా ... ఎక్కడో జైల్లో కొద్దిసేపట్లో ఉరికాబోయే వాడు ఇక్కడికెలా రాగలడు!
మరైతే రాత్రి వచ్చింది ‘ఎవరు?’
ఆ కాళరాత్రిని ఎన్నటికీ మరువలేను!
కొడుకు
ఆరోగ్యకారణాలవల్ల కనకయ్య ముందస్తు పదవీ విరమణ చేయడంతో, ముగ్గురిలో ఆఖరి చెల్లెలి పెళ్ళి బాధ్యత ఒక్కగానొక్క కొడుకు పైన పడింది. ఇంటిని నడిపే బాధ్యతతో సహా అన్ని బాధ్యతలు ఆనందంగా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు శరత్.
భర్తకు తగిన ఇల్లాలై, అత్తమామలను ఆదరించడంలోను, ఆడపడుచులను అభిమానించడంలోను ఏమాత్రం లోటు చేయకుండా నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకుంది స్వాతి.
అయినప్పటికీ ఇంకా ఏదో తక్కువైనట్లుగా సూటిపోటి మాటలతో కొడుకునీ కోడలినీ బాధపెట్టసాగారు.
దాంతో మానసికంగా నలిగిపోయి మంచం పట్టాడు శరత్.
సైకాలజిష్టుని సంప్రదించారు. కౌన్సిల్లింగ్ తో శరత్ పరిస్థితి చక్కబడింది.
!+!+!
పార్కులో కనకయ్య... కామాక్షి ఉల్లాసంగా పిల్లల్లాగా ఆడుతున్నారు. ఎదురుగా తమకు ముసలితనంలో నీడనిచ్చే చెట్టు, (చెట్టంత కొడుకు) కూలబోతుంటే మనసున్న మనుషులై తోడూనీడయ్యారు.
పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే పెద్దలు సరిదిద్ది నడక నేర్పుతారు. ఇప్పుడు ఆ వృద్ద దంపతులు అడుగులు వేయటం నేర్చుకుంటున్నారు. పడిపోబోయింది కొడుకు కాదు తామే అనుకుంటూ నడక నేర్చుకుంటున్నారు…
సన్నీ!
టి.వి చూడడమంటే మహా ఇష్టం ఆరేళ్ళ సన్నీకి.
అర్థ సంవత్సర పరీక్షలు ముగిసాక స్కూలులో పేరెంట్ – టీచర్ మీటింగు పెట్టారు.
ఎప్పటికంటే తక్కువ మార్కులు వచ్చిన సన్నీతో “టి.వి. చూస్తూ చదువు ప్రక్కన పెట్టావా?” అన్నారు.
సన్నీ మౌనం వహించడం చూసి, “బాబు చిన్న పిల్లవాడు కనీసం మీరైనా శ్రద్ధ వహించాలి కదా” సన్నీ తల్లి లలితతో అన్నారు.
టీచర్ తనకి వార్ణింగ్ ఇవ్వడమే కాకుండా అమ్మని కూడా అనేటప్పటికి సన్నీకి ఏడుపొచ్చేసింది.
“అమ్మ అసలు టి.వి. చూడదు. నన్నూ ఎక్కువ సేపు చూడవద్దంటుంది. తప్పు నాదే టీచర్. అమ్మనేమీ అనొద్దు” అన్నాడు ఏడుస్తూ.
“అరెరే! ఏడవకు. ఈసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో” అని రిపోర్ట్ కార్డు ఇచ్చి పంపించారు.
“సారీ అమ్మా ఇకనుంచీ నీ మాట వింటాను” అన్నాడు ఏడుస్తూనే.
“మా మంచి సన్నివి కదూ! ఏడుపు ఆపేయ్ ముందు. టి.వి., అదే పనిగా చూస్తే తలనెప్పి వస్తుంది, కళ్ళు నెప్పిపెడతాయి. ఏదైనా అతిగా చేయకూడదు” దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్న తల్లిని గాఢంగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు సన్ని.