Menu Close
చిట్టి కథలు -1
-- దీనవహి సత్యవతి --

దొందు దొందే!

పీనాసి పోచికోలుగారి మనుమడు సన్నాసి రాజు.

పిల్లికి బిచ్చం పెట్టకపోయినా తాను కడుపునిండా తినే తాతగారి పిసినారి లక్షణాలన్నీ అక్షరాలా ఆపాదించుకున్నాడు సన్నాసి రాజు!

మచ్చుకి పరీక్షల వ్రాతప్రతిలో, వెనక వ్రాసున్నదని మర్చిపోయి, ఖాళీగా ఉన్న అర ఠావులన్నీ చింపి తెచ్చుకున్నాడు.

దాంతో సన్నాసి చదువు చట్టుబండలైంది, పోచికోలుగారికి నోటి మాటపడిపోయింది.

చదువూ సంధ్యా అబ్బని సన్నాసికి ఎలాగైతేనేం లావు రాణి తో పెళ్లైంది.

‘సన్నాగాడి భార్య లావు బావుంది జంట’ అనుకుని నవ్వుకున్నారందరూ.

పెళ్ళై అంతా సర్దుమణిగాక ‘కడుపునిండా తినాలని ఉంది’ మనుమడికి కాగితంపై  వ్రాసిచ్చాడు పోచికోలు!

“ఏడ్చినట్లే ఉంది ...తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయని మా తాతయ్య చెప్పాడు. మా పుట్టింట్లోనైతే ఒక్కపూటే భోజనం. ఇకనుంచీ ఇక్కడా కూరా చారూ అంతే!” పెద్దాయన కోరిక విని తెగేసి చెప్పింది లావు కోడలు.

“ధభేల్!“ శబ్దంతో కుప్పకూలాడు పోచికోలు...

గడుసు పెళ్ళాం లావు మాటలకి గుడ్లు వెళ్ళబెట్టాడు సన్నాసి!


మానవత్వం

బెంగుళూరునుంచి సొంతూరు వచ్చి లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయాను. మా అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తోంది.

ఆ మర్నాడు సాయంత్రం ఫోన్లో “ఇక్కడ నీకు తెలిసిన ఇంటి తాతగారు చనిపోయారమ్మా!” అని చెప్పింది.

అక్కడ మా ఇంటికి రెండిళ్ళ అవతల హిందూ కుటుంబం, భార్యా భర్తా, అనారోగ్యంతో ఉన్న అతని తండ్రీ, నాకు పరిచయమే.

“అయ్యో! అవునా” బాధగా అన్నాను.

“అవునమ్మా. ఇవాళ పొద్దున్నే లేచి బాల్కనీలో నిలబడి టీ తాగుతున్నాను. ఆ ఆంటీ ఇంటి బయట నిలబడి అటు ఇటూ చూస్తున్నారు. ఇంతలో ప్రక్కింట్లోని ముస్లిం అబ్బాయి వచ్చి ఏదో అడుగుతుంటే, వాళ్ళకి హిందీ రాదని తెలిసి, నేను గబగబా అక్కడికి వెళ్ళాను. అంకుల్ ఊళ్ళో లేరనీ, తాతగారికి సీరియస్ గా ఉందనీ ఆంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే జవాబు రాలేదనీ, ఆంటీ చెప్పగా అతనికి హిందీలో చెప్పాను. వెంటనే తన కారు తీసుకొచ్చాడు. అయితే తాతగారు ఆస్పత్రికి వెళ్ళే దారిలోనే చనిపోయారుట. ఆ ముస్లిం అబ్బాయి అతని స్నేహితులూ కలిసి తాతగారిని క్రిమేట్ చేసారు” అని చెప్పింది.

మతాలకతీతంగా జరిగే ఇలాంటి సంఘటనలు మానవత్వం ఇంకా మిగిలుందని నిరూపిస్తున్నాయి అనిపించింది.


లిల్లీ

ముఖానికి వెచ్చటి ఊపిరి తగిలుతుంటే ఎవరాని చూస్తే ప్రక్కలో అందాల లిల్లీ..నన్నే చూస్తూ

తనని గమనిస్తానా లేదాని ఎదురుచూస్తోంది ఆత్రంగా...

పూర్తిగా పక్కకు లిల్లీ వైపు ఒత్తిగిల్లాను.

అంతే వెంటనే నా ముఖమంతా తన వెచ్చటి ముద్దులతో ముంచేస్తున్న లిల్లీని నా బిగి కౌగిలిలో బంధించాను.

ఉన్నట్లుండి బాధతో రొప్పసాగింది  లిల్లీ.

“మై స్వీటీ ఏమైంది నీకు హఠాత్తుగా? ఎందుకు రొప్పొతున్నావు?” అన్నాను కంగారుగా!

‘ఇదే మన ఆఖరి కలయిక ఆలోక్, నా నేస్తం, నన్ను మర్చిపోవుకదూ?’ అంటున్నట్లుగా అప్యాయంగా నా ముఖమంతా తడిమి ప్రేమగా నా కళ్ళల్లోకి  చూస్తూ ఆఖరి శ్వాశ విడిచింది లిల్లీ.

తీయని జ్ఞాపకాలను మిగిల్చి, పధ్నాలుగేళ్ళ ప్రాయంలోనే ఆయుష్షు తీరి నా చిన్ననాటి నేస్తం, నా లాబ్రడార్ ‘లిల్లీ’ నన్ను ఒంటరివాడిని చేసి నన్ను దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయింది!

********

Posted in August 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!