దేవదేవుడు!
ప:
తెల్లని మేని, సిగను పింఛము వాడు చల్లని చూపుల దేవుడు!!
చ.
ధనువుల నడుమను శిలీముఖమంటి కనుబొమల సందు తిలకపు రేడు
నుదుటి వీథుల చక్కగ తోచెడి దివ్య వేదాక్షరముల వెల్గు లీను ఘనుడు!!
చ.
వనమున గలసి నిండిన ఉసురుకు ప్రాణమిచ్చినట్టి మేటి శిష్యుడు
నీచపు బుద్ధుల లోకపు బెడదల పీచ మడచిన వీరుడూ!!.....
చ. చక్కదనంపు వ్రేళుల ఓరగ వేణువు,నిక్కపు గానముల దేవు
చిక్కని నమ్మిక కొల్చిన జనులకు,చుక్కానియై దరి చేర్చు క్రృష్ణుడూ!!
చ. కన్నుల నవ్వును, పెదవుల నవ్వును! సన్నని హాస రేఖ నిరతము వెల్గ
పన్నుగ ఈరేడు భువనముల కను సన్నల నడిపెడు జగన్నాథుడూ!!
జగన్మాత!!
అమ్మను నెఱనమ్మితి, నండాండంబుల బ్రహ్మాండంబుల
ఉన్మేష నిమేషంబుల కల్పించు త్రైలోక్య జననిని,
సన్నుతేందిరావాణీశచిని, కళ్యాణ గుణ గుణనిక,
న్పన్నగభూషావిభాజ్య న్చిదగ్నిసంభూతన్మహారాజ్ఞిన్!
శివంకరము!
ఉమ పట్టుబట్టి చేపట్టిన శుభ కరము, కరముత్సహించి
యమ్మునిరక్షో గణము లాశ్రయించు శ్రీకరమౌ పదవరము
ఎమ్మెయియైన కరుగు నీ జాలి యెడద యని భక్తతతులు
నమ్మి నతులై భజించు వరప్రదాప్రతిమాన జలాకరము
(ii)
అరమరికలు లేని చిత్తముల శరణనరె అర్ధేందుమౌళి
నిరుల పోద్రోలి సరగున కరావలంబమిడు,జగద్యోనిన్!
వాణీ దర్శనం!!
వాణి, అలినీలవేణి, చదువుల రాణి, జగన్నిర్మాణ చణుడా
నలువ పట్రాణి, సిరి గిరిబాలల సఖ్యతల వెల్గు పూబోణి,
గానాక్షర కళలె శోభాయమాన నయనాబ్జములౌ చిద్రూపిణి
అనంత భవ్యగుణోజ్జ్వల చారిత్రిణి, నిరత వీణాపాణియున్!