సర్వాత్మకుడు!!
పల్లముల నెరిగి నీటి నెవడు పరుగెత్త మనెనొ
కల్ల వంటి చీకట్ల కాల్చ అగ్గి కెవడు ఆనతిచ్చెనొ
వెల్ల గొడుగై అట్టె నిల్వ నాకసము కెవ్వడు నేర్పెనొ
చల్లచల్లన, వీచుట కెవడు గాలికి గుర్వాయెనొ!
(ii)
ఎల్ల జీవరాశి సుఖించ ధర నెవ్వడు వసుమతి జేసెనొ
అల్లదె మహర్వాటిపై,ఇల్లిదె రేణువున,అద్రృశ్య సత్త్వమై!!
*****
(పంచ భూత నియామకుడు,అనగా సర్వాత్మకుడు!)
మహిళ!
ఆమె వసుమతి, సహనమున ధరణియే!
ఆమె దయార్ద్ర, కరుణారస నిత్య వర్షిణి!
ఆమె గగన సదృశ , సకల భావ గ్రాహి!
ఆమె ప్రాణ శక్తి, గ్రృహసీమ కాధార వీచి!
2
ఆమె కినిసెనా అగ్నినేత్ర, చలద్విద్యుజ్జ్వాల/
ఆమెయే సోదరి,జాయ,జనని యగు మహిళ!!
*******
(5 పాదాల్లో, అయిదు మూల శక్తులు, ప్రుధివ్యప్తేజో వాయురాకాశాలున్నాయి!)
Not in that order, though!
రౌద్రం చివరకు, అనగా అగ్ని!)
శివం వందే!!
ఏ వనఘనసమ జటాజూటమున నాకసపు గంగ కట్టువడె
ఏ వరు కరముపట్ట హిమగిరి గాదిలి పట్టి తపముల జేసె
ఏ వరకంఠమున నేరేడు గుళికయై కాలకూట విషమొదిగె
ఏ విశిష్టాంగుళీ చిన్ముద్రామౌన వ్యాఖ్యాదీప్తు ల్సంశయ ఛ్ఛేదము జేసె
(ii)
ఆ ధూర్జటి కా ఛన్నవటువు కా నీలకంథరుకా దేశికాద్యునకు
ఆధారమీ చరాచరముకా సర్వమంగళాయుత శర్వుకు నమముల్!
తెలుగు తల్లి!
వందన మందుకో, అందముకె తొలి కుదురైన ఓ అక్షర జనని!
చందన తాంబూల మిడదె యెల్ల జగతి,నీ అజంత రమ్యతకున్!!