Menu Close
GSS-Kalyani
చెట్టు చేసిన మేలు (కథ)
-- G.S.S. కళ్యాణి --

అనగనగా ఒక పట్టణం. ఆ పట్టణంలో త్రిమూర్తి తన భార్య శ్రవంతితో కలిసి నివసిస్తున్నాడు. వారికి లేకలేక ఒక ఆడపిల్ల పుట్టింది. శ్రీమహాలక్ష్మిలా ఉన్న ఆ పాపకు సువర్ణ అని నామకరణం చేశాడు త్రిమూర్తి. సువర్ణకు తమ గురువుగారి దీవెనలు అందించాలన్న సంకల్పంతో సువర్ణను తీసుకుని గురువు దగ్గరకు వెళ్ళారు త్రిమూర్తి దంపతులు. గురువుగారు ఎంతో ఆపేక్షగా త్రిమూర్తినీ, శ్రవంతినీ పలకరించి, త్రిమూర్తి చేతిలోని పసిపాపను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడి, తన ఆశీస్సులను పాపకు అందించారు. శ్రవంతి మనసు గురుభక్తితో పులకించిపోయింది. ఆనందంతో గురుప్రసాదం స్వీకరించి గురువుగారి ఆశ్రమమునుండీ బయటకు వస్తూ ఉండగా ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఒక స్వర్ణగన్నేరు చెట్టు శ్రవంతి కంట పడింది. కొమ్మకొమ్మకూ విరబూసిన పువ్వులు కనులవిందుగా అత్యంత మనోహరంగా ఉన్నాయి.

"అమ్మవారికి ఈ పువ్వులతో పూజ చేస్తే బంగారు పుష్పాలతో చేసినంత ఫలితమట!" అంది శ్రవంతి.

శ్రవంతి ముఖంలో ఆనందాశ్చర్యాలు గమనించిన త్రిమూర్తి, ఆ స్వర్ణగన్నేరు చెట్టు కింద రాలి పడి ఉన్న విత్తనాలు ఒక రెండు ఏరి తన జేబులో వేసుకుని, ఇంటికి తెచ్చి వాటిని తమ ఇంటి ప్రహరీ గోడ బయట నాటాడు.

కొంత కాలం గడిచింది. సువర్ణ బుడిబుడి అడుగులు వేసేనాటికి స్వర్ణగన్నేరు మొక్క మొలిచి చిన్న చెట్టుగా ఎదిగింది. మరికొంత కాలానికి ఆ చెట్టు మొగ్గలు తొడిగి పువ్వులు పూసింది. సువర్ణ చిలక పలుకులు నేర్చి వసపిట్టైపోయింది. ప్రతిరోజూ శ్రవంతికి స్వర్ణగన్నేరు పువ్వులను కోసి మాలగా కట్టి అమ్మవారికి అర్పించడం అలవాటైపోయింది.

స్వర్ణగన్నేరు పువ్వులు కోస్తున్నప్పుడు, "మీ అమ్మ గురువుగారి ఆశ్రమంలో ఉంది. నిన్ను మీ అమ్మకు దూరం చేసేశామనో లేక ఆశ్రమంలోని పవిత్ర తరంగాలు నీకందకుండా చేశామనో బాధ పడకు. నువ్వు మాకిచ్చే ప్రతి పువ్వూ ఆ భగవంతుడి పాదాలకే చేరుతోంది!", అంటూ చెట్టుతో ఆప్యాయంగా మాట్లాడేది శ్రవంతి.

ఎప్పుడైనా చెట్టు కొమ్మలు పెద్దగా పెరిగి రోడ్డుకు అడ్డువస్తూ ఉంటే వాటిని నరికించేవాడు త్రిమూర్తి. ఆరోజంతా శ్రవంతి మనసు మనసులా ఉండేది కాదు.

కొన్నేళ్ళు గడిచాయి. సువర్ణ పెళ్ళీడుకొచ్చింది. స్వర్ణగన్నేరు పెద్ద వృక్షం అయిపోయింది. ఒక్క శ్రవంతికేకాక ఆ చుట్టుపక్కలవాళ్లకి కూడా కావలసినన్ని పువ్వులిస్తోంది స్వర్ణగన్నేరు.

ఒకరోజు సువర్ణకు ఒక విదేశీ సంబంధం వచ్చింది. దేశాన్ని విడిచి వెళ్ళేందుకు సువర్ణ ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. అంతకన్నా గొప్ప సంబంధం రావడం అసాధ్యమనీ, ఆ పెళ్ళి చేసుకుని తీరవలసిందేననీ త్రిమూర్తి పట్టుబట్టాడు. భర్తకు ఎదురు చెప్పలేక కూతుర్ని పెళ్ళికొప్పించింది శ్రవంతి. సంతోషంగా పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైపోయాడు త్రిమూర్తి.

అంతలో త్రిమూర్తి ఇల్లు ఉన్న వీధిలో రోడ్డును వెడల్పు చేసి కొత్త రోడ్డు వెయ్యడానికి నిర్ణయించారు ప్రభుత్వంవారు. ఆ ప్రక్రియలో భాగంగా స్వర్ణగన్నేరు చెట్టును తీసెయ్యవలసి వచ్చింది! కాదనలేకపోయాడు త్రిమూర్తి. ఒక పెద్ద యంత్రం సహాయంతో స్వర్ణగన్నేరు వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకలిస్తూ ఉంటే భరించలేకపోయింది శ్రవంతి.

"నీ మరుజన్మ సద్గురు సన్నిధానంలో తరించే జన్మ కావాలి! ఇన్నాళ్ళూ నువ్వు నాకిచ్చిన ఆనందానికి బదులుగా నేను నీ మంచి కోరడంకన్నా ఇంకేమీ చెయ్యలేని నిస్సహాయురాలిని!" అని స్వర్ణగన్నేరు చెట్టుతో అంటూ భోరున విలపించింది శ్రవంతి.

"ఏడవకమ్మా! ఆ స్వర్ణగన్నేరు చెట్టు జీవితం కూడా ఈ సువర్ణ జీవితంలాంటిదే కదా!" అంది సువర్ణ.

సువర్ణ అన్న మాటలు అర్థం కాలేదు శ్రవంతికి.

శ్రవంతి దుఃఖం నుండీ కొంచెం తేరుకున్నాక త్రిమూర్తి సువర్ణను, "అమ్మా సువర్ణా! ఇందాక నీ జీవితం ఆ మొక్క జీవితం ఒకటే అన్నావూ?! అదెలాగమ్మా? నువ్వేమో మనిషివీ అది కేవలం ఒక మొక్క! మీ ఇద్దరికీ పోలికెక్కడుందీ?" అని అడిగాడు ఆశ్చర్యంగా.

"ఉంది నాన్నా! ఆ విత్తనం మీరు భగవంతుడితో సమానమైన గురువుగారి ఆశ్రమం నుంచి పట్టుకొచ్చారు. నన్ను మీకు ఆ భగవంతుడిచ్చాడు. మొక్కలో ప్రాణం ఉంటుందనీ, అది చుట్టుపక్కల పరిస్థితులకూ, మన మాటలకూ మనిషిలాగే స్పందిస్తుందనీ ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఆ మొక్క మీకు పువ్వులనిస్తే నేను మీ జీవితంలో నవ్వులు పంచే ప్రయత్నం చేశాను. ఆ మొక్క మీరునాటిన చోటికి అలవాటుపడి, ఇదే దాని స్థిర నివాసమనుకుని ఇన్నాళ్ళూ బంగారు పువ్వులతో దేవుడిని పూజించిన ఫలితాన్ని మీకిచ్చింది. కానీ ఇవాళ దాన్ని పీకెయ్యాల్సివచ్చింది. అలాగే మీరు నన్ను కని, నాకు భారతీయసంస్కృతి గొప్పతనాన్ని నేర్పి, సనాతన ధర్మ విశిష్టతను తెలిపి, మన ఆచారవ్యవహారాల మధ్య ఇన్నాళ్ళూ నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచారు. ఇదే నాదేశమనీ, ఇదే నా జీవితమనీ అనుకుంటూ పెరిగాను నేను. ఇప్పుడు విదేశాలకు వెళ్ళమంటూ నా మాతృభూమినుండీ నన్ను దూరంగా వెళ్ళిపోమంటున్నారు. ఈ వాతావరణంలో పుట్టి పెరిగిన నన్ను ఇందుకు పూర్తి భిన్నంగా ఉండే చోటికి వెళ్ళమంటున్నారంటే ఇక్కడ పెరిగిన ఈ మొక్కను కూడా పెకలిస్తున్నట్లే కదా? చెట్టు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. నేను మనిషిని కాబట్టి నా బాధను చెప్పుకున్నాను. అంతే!", అంది సువర్ణ ఉబికివస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ.

సువర్ణ అన్న మాటలకు చలించిపోయిన శ్రవంతి తన కూతురిని గుండెలకు గట్టిగా హత్తుకుంది.

వెంటనే త్రిమూర్తి, "అమ్మా సువర్ణా! విదేశాలకు వెడితే నువ్వు సుఖపడతావని అనుకున్నానే తప్ప అక్కడకు వెళ్లడంలో నీ మనసు ఇంత బాధ పడుతుందని అనుకోలేదు! నీకోసం మరో మంచి సంబంధం చూస్తాను! దిగులు పడకు", అన్నాడు.

కళ్ళు తుడుచుకుంది సువర్ణ.

"మంచి నిర్ణయం తీసుకున్నారు!", అంది శ్రవంతి.

స్వర్ణగన్నేరు చెట్టు రాల్చిన ఆకులను శుభ్రం చేస్తూ, "నా బంగారుతల్లి కష్టపడితే నేను తట్టుకోగలనా? ఏ మాత్రం అవకాశమున్నా బంగారు పువ్వులనిచ్చిన ఆ వృక్షాన్ని కూడా వదులుకునేవాడిని కాదు!", అన్నాడు త్రిమూర్తి.

అందుకు శ్రవంతి, "ఆహా! గురు మహిమ ఎంత గొప్పది! మన గురువుగారి ఆశ్రమంలో పెరిగిన చెట్టు ఇచ్చిన విత్తనమునుంచీ పెరిగిన మొక్క ఆఖరి క్షణం వరకూ మనకు మేలు చేసి, వెడుతూ వెడుతూ మన అమ్మాయి ఎదుర్కొంటున్న మానసికవేదనకు పరిష్కారం చూపించింది! ఆ చెట్టు ఋణం తీర్చలేనిది! దాని విత్తనాలు నలుగురికీ పంచి, మనకు దూరమైన చెట్టుకు గుర్తుగా మరో పది చెట్లను పెంచుదాం!", అంటూ తన కాలివద్ద పడిఉన్న విత్తనాలను జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంది.

"మంచి ఆలోచన! నేను కూడా కొన్ని విత్తనాలను ఏరి, నా స్నేహితురాళ్ళకు పంచుతానమ్మా!" అంది సువర్ణ ఉత్సాహంగా.

********

Posted in August 2025, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *