పొన్నాడ అనే గ్రామంలో పున్నయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆయన భార్య రంగమ్మ. ఇద్దరూ తమకున్న రెండెకరాల పొలంలో నీటి సౌకర్యాన్ని బట్టి, మొదటి కారు వరి వంటి ధాన్యాలు, రెండో కారుకు పప్పు ధాన్యాల వంటివో, కూరలో పండించుకుని అమ్ముకుని జీవించేవారు. వడ్లను మాత్రం తమ ఇంటిముందు త్రవ్వుకున్న పాఁతఱలో మూడు నెలలు దాచి మంచి రేటుకు అమ్ముకుని, తాము తినను కొంత ధన్యాన్ని తమ పూరింట్లో ఒక మూల భూమిలోకి త్రవ్వి ఉంచుకున్న పెద్ద బానలో దాచుకుని తినేవారు. కేవలం వరే కాక, సజ్జ, జొన్న పంటలను ఏడాది పొడవునా కష్టపడి పండించటాన తినను ఏదో ఒక ధాన్యం ఉండేది.
పున్నయ్య తన చెల్లెలు చంద్రమ్మ ను పట్నంలో వున్న వెంకటయ్యకు ఇచ్చి వివాహంచేసి ప్రతి ఏడాది ఉగాదికి వచ్చిన వారికి కొత్తబట్టలూ, ధన్యమూ ఇచ్చి పంపేవాడు.
రంగమ్మ కూడా ఆడపడుచును ప్రేమగా చూసుకునేది. ఊరివారంతా "పున్నయ్యా! ఆడపడుచుకు పెట్టొచ్చు కానీ మరీ భారిగా పెట్టి, రేపు మీ కడుపునొకకాయ కాస్తే చిప్ప ఇస్తావా! ఏం?" అనిమందలిస్తే,
"ఒక్కగానొక్క చెల్లెమ్మ! యాడికిపోద్ది మావా! అడపడుచుకు పెట్టింది, రేపొకనాడు నెనెల్తే నన్ను సూడదాఏం?" అని అనేవాడు.
ఇలా ఉండగా ఒక ఏడాది విపరీతంగా వర్షాలు పడి, తుఫాను మూడుమార్లు వచ్చి పక్కనే వున్న పిల్లేరుకు కట్టిన డాం పొంగి పంటపొలాలన్నీ ఇసుక మేటేసుకు పోయాయి. పొలాల్లొ కోతకున్న పైరంతా నీటిపాలైంది. రైతులంతా గుండెలవిసేలా ఏడ్చారు. పున్నయ్య ఇల్లు నడుంలోతు నీటిలో మునిగిపోయింది. ముందురోజు రాత్రి రంగమ్మ పదిరోజులపాటు అమ్మిన కూరలతాలూకూ సొమ్ము పొద్దుపోయి అందగా కొంగుకు కట్టుకుంది. అది మాత్రమే వారిచెంత ఉంది. కట్టుబట్టలతో నిల్చిపోయి, ఏమీ తోచక కొన్ని దినాలు చెల్లెలు దగ్గర కెళ్దామన్నాడు పున్నయ్య.
"అయ్యా! కోప్పడ మాకు, 'చెడి చెల్లెలింటికి పోరాదంటారు. మా పుట్టింటికెళదాము! మా అన్నలూ, వదిన్లూ నెత్తిన పెట్టుకుని గౌరవంగా చూస్తారు. మన ఆపద వారి ఆపదలా తల్చి ఆదుకుంట్రు" అంది రంగమ్మ.
"కాదు మాసెల్లెలు కాడికే పోదాము. అన్న కట్టంలో ఉండి గడపతొక్కితే కాదంటదా!" అన్నాడు రోషంగా పున్నయ్య. రంగమ్మ మౌనంగా భర్తను అనుసరించింది.
వాళ్లను చూసి పున్నయ్య చెల్లెలు ముఖం నిండా సంతోషం పులుముకుని ఆహ్వానించి. వేడి వేడి అన్నం వండి పెట్టింది. 'చూశావా! నా సెల్లెలు ప్రేమ' అన్నట్లు చూశాడు పున్నయ్య భార్యవైపు.
ఆ రాత్రి పడుకునున్న పున్నయ్య, రంగమ్మలు, నిద్ర పోతున్నారని భావించి భర్తతో చంద్రమ్మ "పొలం మునిగిపోయి వచ్చినట్టున్నాడు, మా అన్నవదింతో. ఎన్నాళ్ళుంటరో, యావో! మనిల్లు గుల్లవుద్దేమో!"అంది. దానికామె భర్త "ఛ నోర్ముయ్! ఇంతకాలం తన ఇల్లు దోచి పెట్టాడు. వచ్చిన రోజే ఇలా మాట్లాడతావా! వాల్లు వింటే ఏమనుకుంటారే "అని మందలించాడు. అది విన్న రంగమ్మ మెల్లిగా "విన్నావుటయ్యా! నీ సెల్లెలు మాటలు బయటికి గెంటించుకోకుండా తెల్లారి బయల్దేరి మా పుట్టింటికెళదారి" అంది.
పున్నయ్య మౌనంగా ఉన్నాడు. మరునాడు నూకలన్నం పెట్టింది చెల్లెలు చంద్రమ్మ."ఏంటమ్మా! మీరు నూకలన్నం తింటారా!"అన్నాడు పున్నయ్య.
"పట్నంలో అంతా ఎక్కువ రేట్లేన్నా. జాగరత్తగా ఉండకపోతే ఇల్లు కొల్లేరవుద్ది" అంది కాస్త గట్టిగానే.
భోజనం చేశాక "సెల్లెమ్మా! వస్తాం, నీ ఇల్లు కొల్లేరు కానివ్వం" అని రోషంగా భార్య చెయ్యి పట్టుకుని బయల్దేరాడు పున్నయ్య.
సామెతలు ఊరకే రావు. అన్నీ అనుభవ సారాలే. కధ బాగుంది