పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
బ్రాహ్మణుడు – మేక
అనగనగా ఒక గ్రామంలో వేదశర్మ అనే అతి నిష్టాపరుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. పాండిత్యానికి సంబంధించినంతవరకూ ఎంత తెలివి గలవాడో నిత్య జీవితంలో అంత అమాయకుడు.
ఒకనాడు వేదశర్మ పొరుగూరు పనిమీద వెళ్ళి, తిరుగు ప్రయాణంలో అదే ఊర్లో ఉన్న తన శిష్యుణ్ణి చూద్దామని వెళ్ళాడు. గురువుగారిని చూసి పరమానందభరితుడైన శిష్యుడు వేదశర్మకి పాదసేవ చేసి, పంభక్ష్యాలతో భోజనం పెట్టి మర్యాద చేశాడు.
తన గ్రామానికి తిరుగు ప్రయాణమైన గురువు గారికి ప్రేమతో, తన వద్ద ఉన్న మేకలమందలోని ఒక నల్లమేకను వేదశర్మకి కానుకగా సమర్పించుకుని భక్తి శ్రధ్ధలు చాటుకున్నాడు శిష్యుడు.
శిష్యుడి అభిమానానికి అత్యంత సంతసించిన వేదశర్మ మేక మెడకు పలుపుతాడు కట్టి చేతిలో పట్టుకుని గ్రామంవైపు నడక సాగించాడు.
దారిలో దాహం వేసి ఒక చెరువు దగ్గర నీళ్ళు త్రాగుదామని ఆగాడు వేదశర్మ. అక్కడే చెరువు గట్టుపై కూర్చున్న ముగ్గురు దొంగలు వేదశర్మని, అతడి దగ్గర ఉన్న మేకను చూశారు.
ఎలాగైనా మేకని కాజేద్దామని దుర్భుధ్ధి పుట్టింది ఆ దొంగలకి. మంచి నీళ్ళు త్రాగి మేకను తోలుకుని ముందుకి నడక సాగించాడు వేదశర్మ.
కొంత దూరం వెళ్ళగానే ఆ ముగ్గురిలో ఒక దొంగ వేదశర్మ దారికి అడ్డంగా వచ్చి ‘మీరు చూస్తే బ్రాహ్మణోత్తములుగా ఉన్నారు. ఈ నల్ల కుక్కను వెంట పెట్టుకుని పోతున్నారేమిటీ?’ అని అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి.
‘ఓరీ మూర్ఖుడా! నీకు కళ్ళు కనిపించడం లేదా లేక మతి భ్రమించిందా? చక్కటి మేకని పట్టుకుని కుక్క అంటావేమిటీ? దారికి అడ్డులే, ఫో అవతలికి’ అని ఛీత్కరించుకున్నాడు వేదశర్మ.
అలా ఇంకొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురొచ్చి బ్రాహ్మణుడికి వంగి దొంగదణ్ణం పెట్టి ‘అయ్యా! మీరు చూస్తే అన్ని శాస్త్రాలూ తెలిసిన వారిలాగా ఉన్నారు. అలాంటిది ఈ నల్ల కుక్కని తోలుకు పోతున్నారేమిటీ? మీలాంటి పెద్దలు ఏం చేసినా చెల్లుతుందనా ఏం?’ వెటకారంగా అని వెళ్ళిపోయాడు.
రెండో దొంగ కూడా మేకని కుక్క అనేటప్పటికి వేదశర్మ మనసులో ఏ మూలో చిరు సందేహం తొంగి చూసింది. అయినా సరే తొణకకుండా గంభీరంగా ముందుకి నడక సాగించాడు.
మరి కొంత దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చి ‘అదేమిటీ బ్రాహ్మణ పుటక పుట్టీ ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదూ ఈ నల్ల కుక్కని వెంటబెట్టుకుని పోతున్నావా? నీలాంటి వాళ్ళ వల్లనే ఆచారాలు మంట కలుస్తున్నాయి, ఛీ ఛీ’ అని నోటికొచ్చినట్టల్లా వాగి చీదరించుకుని వెళ్ళిపోయాడు.
అంతే! వేదశర్మకి మనసంతా కలచినట్లయ్యింది. ‘ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు దీనిని నల్లకుక్క అన్నారు. అసలు ఇది నల్ల మేకా లేదా నల్ల కుక్కా అని నాకే సందేహం కలుగుతున్నది’ అనుకుని దిగులుపడి ఎక్కడివాడక్కడ కూలబడిపోయి తలపట్టుకున్నాడు.
ఇదంతా వేదశర్మని అనుసరించి వస్తున్న ముగ్గురు దొంగలూ చూసి తమ పన్నగం పారినందుకు ఆనందించసాగారు.
అమాయకుడైన వేదశర్మ తనపై తనకి నమ్మకం లేక ఆ మాయగాళ్ళ మోసకారి మాటలను నిజమని నమ్మాడు.
ఇంతలో, ఆముగ్గురికీ తోడు దొంగ ఇంకో మాయగాడు బ్రాహ్మణుడికి వినిపించేలా ‘పాపం ఎవరో ఈ వెర్రి బ్రాహ్మణుడిని మోసం చేసి ఈ నల్ల కుక్కని అంటగట్టారు. ఇతడేమో దానిని మేక అనుకుని భ్రమించి పలుపు కట్టి ఏకంగా ఇంటికే తోలుకుని పోతున్నాడు. ఇప్పుడు నిజం తెలిసి ఏంచేయాలో తెలియని అయోమయంలో పడ్డాడు’ ఆ ముగ్గురు దొంగలతో అని హేళనగా నవ్వాడు.
వేదశర్మ మరి ఇంక భరించలేక మేకని అక్కడే విడిచి పెట్టి గిర్రున చెరువువద్దకు పోయి ముక్కు మూసుకుని మూడుసార్లు నీళ్ళలో మునిగి లేచి శుచియై ఇంటిదారిపట్టాడు.
వేదశర్మ వదిలి పెట్టిన మేకను ఆ ముగ్గురు దొంగలూ తమ నాల్గవ తోడు దొంగతో కలిసి ఇంటికి తీసుకుని పోయి విందు చేసుకున్నారు.