విద్యుత్ కేంద్రాలలో బొగ్గు వాడకం
విద్యుత్తుని ఉత్పాదించే కేంద్రాలలో శిలాజ ఇంధనాలని మండించే వ్యవస్థకి ప్రపంచ వ్యాప్తంగా చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. శిలాజ ఇంధనాలు అంటే రాక్షసి బొగ్గు (లేదా నేలబొగ్గు), ముడి చమురు (లేదా పెట్రోలియం), సహజ వాయువులు మొదలైనవి. ఇవన్నీ చేసే పని ఏమిటంటే ఇంధనాన్ని మండించగా వచ్చిన వేడిని (వేడి రూపంలో ఉన్న శక్తిని) యంత్ర శక్తిగా మార్చి, అప్పుడు దానిని విద్యుత్తుగా మార్చుతాయి. ఇది సమర్ధవంతమైన ప్రక్రియ కాకపోయినా గత్యంతరం లేక ఈ నల్లటి, కంపుకొట్టే, కల్మషాలతో నిండిన బొగ్గుని కాల్చి దాని పర్యవసానం అనుభవిస్తున్నాం. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 45 శాతం బొగ్గుని కాల్చగా వస్తోంది. అమెరికాలో బొగ్గు నుండి 1,000 వాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చెయ్యటానికి 1,000 డాలర్లు దాటి ఖర్చు పెట్టవలసి వస్తోంది.
చిన్న లెక్క వేసి చూపెడతాను. గిగావాట్ అంటే బిలియన్ వాట్లు. బిలియన్ అంటే 1,000,000,000. ఒక గిగావాట్ సామర్ధ్యం ఉన్న విద్యుత్ కేంద్రం, మిలియన్ ఇళ్లకి సరిపడే విద్యుత్తుని పుట్టించగలదు. (అమెరికాలో అయితే ఒక్కొక్క ఇంటికి సగటున 1,000 వాట్లు అవసరం ఉంటుందని ఊహించుకుంటున్నాను.)
ఒక గిగా వాట్ సామర్ధ్యం ఉన్న విద్యుత్ కేంద్రం ప్రతి 7 క్షణాలకి ఒక టన్ను నేలబొగ్గుని స్వాహా చేస్తుంది. ఒక టన్నులో మిలియను గ్రాములు ఉన్నాయి కనుక, ప్రతి ఇంటి అవసరాలకి 7 క్షణాలకి ఒక గ్రాము బొగ్గు ఖర్చు అవుతోందన్నమాట. ఇంతే కదా, “ఇది అత్యల్పం” అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇదే లెక్కని మరో కోణంలో చూద్దాం.
మన విద్యుత్ కేంద్రం ప్రతి 2 క్షణాలలో 1 టన్ను కార్బన్ డై ఆక్సైడ్ వాయువుని గాలిలోకి విడుదల చేస్తోంది. అంటే ప్రతి 7 క్షణాలలో 1 టన్ను బొగ్గుని కాల్చి, 3 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ని గాలిలోకి విడుదల చేస్తోంది. ఇది మన మనుగడకే ఎసరు పెట్టగల సామర్ధ్యం ఉన్న హరితగృహ వాయువు!
ఒక టన్ను బొగ్గు లోంచి 3 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఎలా వచ్చింది? కార్బన్ డై ఆక్సైడ్ బణువులో (మోలిక్యూల్) ఒక కర్బనం అణువు, రెండు ఆమ్లజని అణువులు ఉంటాయి. కర్బనం అణువు, ఆమ్లజని అణువు ఒకే “గరిమ” (mass) ఉండవు కాని లెక్క సౌలభ్యం కోసం ఒకటే అనుకుందాం. అప్పుడు ఒక కార్బన్ డై ఆక్సైడ్ బణువు గరిమ ఒక కర్బనం అణువు గరిమ కంటె మూడింతలు ఉంటుంది. అందువల్ల మనం కాల్చిన బొగ్గు ఒక టన్నే అయినా మనకి మిగిలే కార్బన్ డై ఆక్సైడ్ చాల ఎక్కువ.
పై లెక్క ప్రకారం మనం బొగ్గు కాల్చటం వల్ల వ్యష్టిగా పర్యావరణానికి చేసే హాని తక్కువే కావచ్చు, కాని సమష్టి గా విపరీతమైన హాని కలుగజేస్తున్నాం. ఈ విషయం తెలిసి కూడ మనం భారతదేశంలో శిలాజ ఇంధనాలని ఎంత నిర్లిప్తంగా వాడుతున్నామో చూపెడతాను.
ప్రపంచం జనాభా 7 బిలియన్లు. ఈ జనాభాలో ప్రతి ఆరవ వ్యక్తి భారతీయుడే. మన అవసరాలకి సా.శ. 2010 లో 160 గిగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేమని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 50 శాతం బొగ్గు కాల్చడం వల్లనే ఉత్పత్తి అవుతోంది. బొగ్గు, చమురు, సహజవాయువు దిగుమతి చేసుకోకపోతే మనకి రోజు గడవదు. టన్ను ఒక్కంటికి 30 డాలర్లు చొప్పున, ఏడాదికి 3 బిలియను డాలర్లు వెచ్చించి దరిదాపు 100 మిలియను టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ బొగ్గు కాలినప్పుడు ఎంత కల్మషం వాతావరణంలోకి విడుదల అవుతుందో, అది మన ఆరోగ్యానికి ఎంతభంగకరమో లెక్కవేసి చూసే బాధ్యత చదువరులకే వదలిపెడుతున్నాను.