Menu Close
Nirmaladithya
బిచ్చగాడు (కథ)
-- నిర్మలాదిత్య --
bitchagadu katha image

'ఈ సారి తప్పకుండా ప్రమోషన్, దానికి తగ్గ రైజ్ రావలసిందే' అనుకున్నాడు నీల్, తన గత సంవత్సరం చేసిన పనిని గురించి వ్రాస్తూ. కార్పొరేట్ కంపెనీలలో ఇదో ఆనవాయితీ. సంవత్సరం ముందు ఏమి చేయదలచు కున్నారో అన్న విషయం ప్రతీ ఉద్యోగి, మేనేజర్ ను సంప్రదించి రాయడం, ప్రతీ క్వార్టర్ ఆ పనులు ఎంత వరకు సాధించారో అని మేనేజర్, ఉద్యోగి తిరిగి రివ్యు చేస్తూ, కలిసి మాట్లాడుకోవడం, సంవత్సరం చివర, చేసిన పనిని బట్టి ఉద్యోగి పని సగటు కంటే తక్కువ వుందా, సగటుగా ఉందా లేక సూపర్/ఎక్సలెంట్ గా ఉందా అని పరిగణించి, దానికి తగ్గట్టుగా జీతం పెంచడం, దానితో పాటు అరుదుగా ప్రమోషన్ ఇవ్వడం మామూలే. నీల్ మూడు సంవత్సరాల నుండి ప్రమోషన్ వస్తుందని ఆశిస్తున్నాడు. ఈ సారి కూడా డిపార్ట్మెంట్ లోని అన్ని పనులలో తల దూర్చాడు. పని చేశాడు. అందుకే ఈ సారి నమ్మకంగా ప్రమోషన్ వస్తుంది అని అనుకోగలిగాడు. కానీ ఎక్కడో మనస్సులో ఒక మూల సంశయం. ఆ ఆలోచనలు, చిలికి, చిలికి గాలి వాన కాకుండా, ఫోన్ ఒక రెండు సంగీత స్వరాలు పలికింది.

టెక్స్ట్ మేసేజి వచ్చింది. నీల్ ను వీలుంటే, ఆ సాయంత్రము లేకపోతే వీకెండ్ లోనో తనను కలవమని. మెసేజ్ చేసిన ఫోన్ నంబర్ కొత్తనే. నీల్ కాంటాక్ట్స్ లో లేదు. మెసేజ్ క్రింద పేరు చూసాడు. రిచ్!

నీల్ రిచ్ టెక్స్ట్ చూసి ఆశ్చర్య పడ్డాడు. అసలు రిచ్ దగ్గర ఫోన్ ఉందని తెలీదు. ఎప్పుడూ రిచ్ ని ఫోన్ తో చూడలేదు. ఇంత వరకు నీల్ రిచ్ ని కలవమని కోరడమే కానీ, రిచ్ ఎప్పుడూ నీల్ ను కలవాలని ప్రయత్నించలేదు. రిచ్ ని కలవడానికి ఒక పోస్ట్ ఇట్ కాగితం మీద దగ్గర్లో ఉన్న స్టార్ బక్స్ అడ్రస్, సమయం ప్రతీ సారీ నీల్ రాసి ఇచ్చే వాడు.

సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వస్తానని నీల్, భార్యకు టెక్స్ట్ చేసి, రిచ్ కు ఆ సాయంత్రమే కలుస్తానని టెక్స్ట్ చేసాడు.

రిచ్ టెక్స్ట్ నీల్ కు ఆనందమే కలుగజేసింది. రిచ్ కోసం గత రెండు నెలలుగా ఎదురు చూస్తున్నాడు. రిచ్ కనపడలేదు. నీల్ కు మళ్లీ మెదడు పనిచేయడం మానేసింది. కొత్త ఆలోచనలు ఏవీ రావటం లేదు. పత్రికలకు తన వ్యాసం రాసి సంవత్సరం పైనే అయ్యింది. రైటర్స్ బ్లాక్ తిరిగి వచ్చిందనుకున్నాడు. నీల్ కు రెక్కాడితే కానీ డొక్కాడదు. కష్ట పడి పని చేసి ఆంచెలు ఆంచెలుగా కార్పొరేట్ నిచ్చెన ఎక్కుతున్నాడు. జర్నలిస్ట్ కావాలని ఆశ. కానీ, డబ్బు కోసం ఈ బ్యాంకులో ఉద్యోగిగా చేరక తప్పలేదు. తీరిక సమయాలలో, వీలున్నప్పుడల్లా ఏదో ఒక విషయం పై రీసెర్చ్ చేసి, స్థానిక న్యూస్ పేపర్ 'ఒపీనియన్ పేజీ' లో ఒక వ్యాసం రాసే వాడు. పని తొందర్లో ఇరుక్కు పోయిన మెదడు కు పని గురించి తప్పితే మరే ఆలోచనలు రావడం మానేసాయి. అలాంటి పరిస్థితి లో ఎదురు పడ్డవాడు రిచ్.

నీల్ కు రిచ్ తో ఒక ఐదు ఏళ్ల క్రితం పరిచయం అయ్యింది. అదీ చాలా విచిత్రంగా. హైవే ఎగ్జిట్ తీసుకొని, కుడి వైపు రోడ్డు మీద ఒక మైలు డ్రైవ్ చేస్తే, నీల్ పనీచేస్తున్న బ్యాంక్ ఆఫీస్ ఉన్న కాంప్లెక్స్ వస్తుంది. అక్కడ బ్యాంక్ పార్కింగ్ గరాజ్ వైపు కారు నడుపుతుంటే ఒక స్టాప్ సైన్ దగ్గర వారానికి ఒకటి రెండు సార్లు రిచ్ తటస్థపడుతుంటాడు. ప్రొద్దున్న చాలా కార్లే లైన్ గా నిలబడి, ఒక దాని తరువాత మరో కారు, స్టాప్ సైన్ దాటి ముందు వెళ్ళుతుంటాయి. స్టాప్ సైన్ దగ్గర చింపిరి జుట్టుతో, మరకలు లేక్కున్నా, బాగా నలిగిన గుడ్డలతో ఒక 'ఆకలితో ఉన్నాను. ప్లీజ్ హెల్ప్' అని రాసి ఉన్న కార్డ్ బోర్డ్ ముక్క అక్కడ వస్తున్న కార్ల వైపు చూపుతూ నిలబడి ఉంటాడు. పది మందిలో ఒకరైనా కారు విండో దించి రిచ్ కు ఒక డాలర్ నోటు, లేక చిల్లర అందించే వాళ్ళు. మొత్తం మీద రిచ్ కి ఆ రోజు ఆకలి మాత్రం ఖచ్చితంగా మాయం అయ్యేఉంటుంది.

నీల్ రిచ్ ను చూసినా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. తనకు కష్ట పడకుండా ఇలా అడక్కు తినే వాళ్ళు అంటే అసహ్యం. తను ఎంత కష్ట పడి చదివాడు, ఎంత కష్ట పడి ఈ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఎంత కష్ట పడి పని చేస్తున్నాడు. తన పిల్లలకు, ఇతరులకు ఒక రోల్ మోడల్ గా జీవించి సంఘంలో అంతో, ఇంతో పేరు తెచ్చుకోవాలని, నీల్ తాపత్రయం. రోల్ మోడల్ అయితే అవ్వగలిగాడు కానీ సంఘంలో కొంచెం నిల దొక్కుకోవడానికి పత్రికలలో రాయడం మొదలెట్టాడు. ఆ రాసిన వ్యాసాలు అంతంత మాత్రమే కాబట్టి, సంఘంలో పెద్దగా పేరు రాకపోయినా, బంధు మిత్రులు ప్రేమతో తనను ఒక రచయితగా చూడడం నీల్ కు తెగ నచ్చింది. ఈ బంధు, మిత్రులు తను రాసినదంతా చదవటం లేదని మొదట్లోనే తెలిసిపోయింది. ఫోన్లో వచ్చే సొల్లు కబుర్లు, వీడియోలు చూసిన తరువాత కనీసం 15 నిమిషాల పాటు వెచ్చించి పత్రికలు చదివే పాఠకులు అరుదే, అని తనని, తనే సమర్దించుకున్నాడు నీల్. కానీ తన రచనలు చదివినా, చదవక పోయినా 'ఈ మధ్యన ఏమి రాసావు' అన్న వాక్యం నీల్ ను చూసిన వారి కల్లా ఒక కాన్వర్జేషన్ ఓపెనర్ అయ్యింది. రాయడం ఆషా మాషి కాదు కదా.

మెంటల్ బ్లాక్ వచ్చి, తరువాత ఏమి రాయాలి అని విషయం కోసం వెదుకుతున్న నీల్ కంట్లో రిచ్ పడ్డాడు. చూడడానికి బాగానే ఉన్నాడు. బిచ్చగాళ్ళు ఈ నగరంలో అరుదే. కొద్దిగా శారీరక శ్రమ చేసే ఆలోచన ఉంటే తిండి గుడ్డకు సరిపడా డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు ఈ దేశంలో. మరి దృఢంగా కనిపిస్తున్న రిచ్ బిచ్చగాడు ఎలా అయ్యాడు. ఇతని వెనుక ఒక మంచి కథ దాక్కుని ఉంది, అది తెలుసుకొని రాస్తే ఒక మంచి వ్యాసం అవ్వుతుందనిపించింది నీల్ కు. తన ముందు ఇంకా ఒక పది కార్లు ఉన్నాయి. స్టాప్ సైన్ కాబట్టి కార్లు ఆగీ, ఆగి ముందుకు పోతున్నాయి. నీల్ సీటు పక్కనున్న అరలో నుంచి పోస్ట్ ఇట్ ప్యాడ్ తీసి, ఆఫీసు పక్క నున్న స్టార్ బక్స్ కాఫీ షాప్ లో సాయంత్రం ఐదు గంటలకి కలవమని ఒక నోట్ రాసి, స్టాప్ సైన్ దగ్గర రాగానే, కారు విండో దించి ఆ పోస్ట్ ఇట్ కాగితం తో పాటు, ఒక పది డాలర్ల నోట్ జత జేసీ రిచ్ కు అందించాడు.

సాయంత్రం ఐదింటికి నీల్ అనుకున్నట్లే రిచ్ కాఫీ షాప్ కి వచ్చాడు. పది డాలర్ల నోట్ ఇచ్చాడు కాబట్టి, రిచ్ వస్తాడనే నమ్మకం ఉండింది నీల్ కు. రిచ్ తల దువ్వడం వల్ల పొద్దున లాగా బిచ్చగాడుగా కనిపించలేదు.

"నా పేరు నీల్. బ్యాంక్ లో పని చేస్తున్నాను," అన్నాడు నీల్.

"నా పేరు రిచర్డ్. కాల్ మి రిచ్," అని తనను తాను పరిచయం చేసుకున్నాడు.

"ఏమి తీసుకుంటావు?"

"వైట్ చాక్లెట్ మోకా, ఒక కుకీ, ఒక మఫ్ఫిన్"

ఎలాంటి కాఫీ అని మాత్రం జవాబు ఆశించిన నీల్ కు కుకీ, మఫ్ఫిన్ ల ఆర్డర్ తోడవడం కొంచెం ఆశ్చర్యమనిపించింది. బిచ్చగాడు కదా ఎక్కువ ఆకలితో ఉంటాడేమో, ఇలాంటి వారు ఎప్పుడు తిండి దొరికితే అప్పుడు లాగించేసి, దొరకనప్పుడు పస్తులు ఉంటారేమో అని సరి పుచ్చుకున్నాడు. తనకు అమెరికన్ బ్లాక్ కాఫీ ఆర్డర్ లో జత చేసి, డబ్బు కట్టాడు నీల్. అక్కడి బారిస్ట డెలివరీ చేసిన తరువాత, షాప్ బయట వేసిన టేబిల్ కుర్చీల వైపు వెళ్లి కూర్చున్నారు.

రిచ్ కుకీ నీ కవర్ తో బాటు తన ప్యాకెట్ లో పెట్టుకొని, మఫ్ఫిన్ పై దాడి చేస్తూ, మోకా తాగడం మొదలెట్టాడు. ఇదంతా చూస్తూ, తన బ్లాక్ కాఫీ సిప్ చేస్తున్ననీల్ వైపు, 'మరి విషయం ఏంటి? ఎందుకు నన్ను పిలిచావు' అన్న చూపు ఒకటి విసిరాడు రిచ్.

"నిన్ను మా బ్యాంక్ స్టాప్ దగ్గర అప్పుడప్పుడు చూస్తుంటాను. నేను బ్యాంక్ లో పని చేస్తున్నా, అప్పుడప్పుడు ఈ కమ్యూనిటీ లో జరుగుతున్న విషయాల పై వ్యాసాలు రాస్తుంటాను. నీ వెనుక ఒక కథ దాగుందని, నాకు తెలుసు. నువ్వు ఎలా బిచ్చగాడి వైయ్యావు? నీ లాంటి హోమ్ లెస్ జానాల మీద వ్యాసం రాస్తే బాగుంటుంది అనిపించింది. నువ్వు ఆ విషయాలు నాతో పంచుకుంటే బాగుంటుంది," అన్నాడు నీల్.

"పంచుకోక పోతే?"

"అది నీ ఇష్టం. నిన్ను ఫోర్స్ చేయలేను. ప్రయత్నం అయితే చేసాను కదా అని సరి పుచ్చుకుంటాను."

"ఎందుకో నిన్ను చూస్తే సదభిప్రాయం కలుగుతున్నది. ఆ విషయాలు పంచుకోవడం ద్వారా నాకు నష్టం ఏమి లేదు. నాకు ఆకలి వేసి, నాకు భోజనం అందుబాటులో లేక పోతే అడుక్కుంటాను," అన్నాడు రిచ్.

"థాంక్స్. అడుక్కోవడం ఎందుకు? కష్ట పడి పని చేయొచ్చు కదా. పని చేసే వారికి ఏదో ఒక పని దొరుకక పోదు. చూడ్డానికి బాగానే ఉన్నావు."

"నాకు పని చేయడం ఇష్టం లేదు. నాకు ఇలానే బాగుంది."

"మరి నీకు కుటుంబం లేదా? పెళ్ళి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకోలేదా?"

"పెళ్ళి ఎందుకు? నా శారీరక అవసరాలు ఈ లైఫ్ స్టైల్ తోనే తీరిపోతున్నాయి."

"ఇలా అడుక్కోవడం నీకు సిగ్గుగా లేదు. నిన్ను రోడ్డు మీద తిరిగే  కాప్స్, క్రిమినల్స్ ఇబ్బంది పెట్టరా?"

"నేను ఎప్పుడూ అడుక్కోను. అవసం అనుకున్నప్పుడే. ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు అడక్కుండానే కాఫీ, కుక్కీలు తినిపించినట్లు, ఎవరో ఒకరు నా అవసరాలు అడక్కుండానే తీరుస్తుంటారు," గట్టిగా నవ్వాడు రిచ్.

నీల్ ఇబ్బందిగా కదిలి 'ఔట్ డోర్ కాబట్టి సరి పోయింది. ఏమిటా నవ్వు' అని మనస్సులోనే గొణిగి, "మరి  కాప్స్, క్రిమినల్స్ మాటేమిటి?" మరోసారి ప్రశ్నించాడు.

"ముందు క్రిమినల్స్. నా దగ్గరేమి వుందని నా వెంట బడతారు? నన్ను ఇబ్బంది ఎందుకు పెడతారు? ఈ నగరం రోడ్ల పక్క నున్న లాంప్ పోస్ట్ లకి, నాకు పెద్ద తేడా లేదు వారి దృష్టి లో. ఇక కాప్స్ అంటావా. వాళ్ళందరూ నా పాల్స్," అన్నాడు రిచ్.

"అదెలా వీలౌతుంది. కాప్స్ నీ స్నేహితులు ఎలా అయ్యారు? నీలా రోడ్ల దగ్గర అడుక్కునే వాళ్ళను వారు అడ్డుకుంటారు కదా."

"మొదట్లో ఎక్కువసార్లు పట్టుకొని, ప్రశ్నించేవారు. ఇప్పుడు వాళ్ళకు నేను తెలుసు, అవసరం కూడా. నన్ను చూసి, చూడనట్లు వదిలేస్తారు."

"అదెలా సాధ్యం?"

"నన్ను పట్టుకున్నప్పుడు నేను ఎప్పుడు భయపడలేదు, బాధ పడలేదు. నా దగ్గర ఏమి ఉందని, ఏమి పోతుందని భయపడడానికి. నా మాటలు వారికి స్టాండ్ అప్ కామెడీ లాగా ఉంటాయట. మొదటి సారి నన్ను పట్టినప్పుడు, నేను ఎక్కడెక్కడ అడక్కుంటాను అని అడిగారు. ఒక డో నట్ షాప్ ముందు తప్పితే, అన్ని చోట్ల అన్నా. వాళ్ళకి ఒకటే నవ్వు."

"మరి కాప్స్ కి నువ్వు అవసరం అన్నావు?" అడిగాడు నీల్, రిచ్ జోక్ కి నవ్వుతూ.

"మాటలలో వారికి నేను ఒక మనిషిని చూసానంటే బాగా గుర్తు పెట్టుకుంటానని, మరిచిపోనని తెలిసి పోయింది. ఆ ఫొటోగ్రాఫిక్ మెమొరి నేను అడుక్కునే దానికి అవసరం కూడా. ఒక సారి నాకు డబ్బు ఇవ్వలేదంటే వారిని మళ్లీ, మళ్లీ అడిగి బాధ పెట్టడం లో లాభం లేదు. కాప్స్ నేను తిరిగిన చోట ఏదైనా నేరం జరిగితే, నన్ను విచారించే వారు. నేను చెప్పిన వివరాలు వారికి ఆ నేర పరిశోధనలో బాగా ఉపయోగ పడతాయి అని వారే చాలా సార్లు చెప్పారు. అందుకే నేను అడుక్కున్నా, నన్ను పెద్దగా పట్టించుకోరు. అంతే కాదు, వాళ్ళే నేను అడుగ కుండానే ఏవో తిండి, డ్రింక్స్ నా కప్పుడప్పుడు అందిస్తుంటారు "

"అంటే నువ్వు పని చేస్తున్నట్లే కదా? కాప్స్ నువ్వు చెప్పిన విషయాలకు నీకు తిండి ఇస్తున్నారు."

"అబ్బే నేను పనిలా అనుకుంటే ఆ పని అసలు చేయను. నేను అలా ఇలా నాకు నచ్చినట్లు తిరుగుతుంటాను. ఆ కాప్స్ అడిగితే జవాబిస్తాను. అదే పనిగా నేను ఎవరి వెంట బడను. ఎవరైనా ఏదైన ఇస్తే తింటాను. ఇవ్వకపోతే నాకేమీ ఇబ్బంది లేదు. అలానే ఆకలేసి తిండి దొరుకక పోతే బోర్డ్ పట్టుకుని కొంత సేపు నిలబడతాను. కొన్ని సార్లు నీళ్ళు తాగేసి ఉండి పోతాను. నాకు తిండి కూడా పెద్ద సమస్య కాదు. ఇదిగో నీ లాంటి వారు ఎవరో ఒకరు తటస్థ పడుతూనే ఉంటారు. నా అవసరాలు తీరుస్తుంటారు." అని రిచ్ తాపీ గా మఫ్ఫీన్ తినడం ముగించి చేతులు నేప్కిన్స్ తో తుడుచుకున్నాడు. చేతులలో ఇంకా ఏదైనా కనిపించిందేమో, చేతులను షర్ట్ ఛాతీ ప్రాంతంలో రుద్ది, చేతులు దులుపుకున్నాడు.

పని అంటే చేయనని భీష్మించి జీవితం సాఫీగానే నడుపుకుంటున్న ఈ రిచ్, నీల్ కు ఒక విచిత్రమైన వ్యక్తి గానే మిగిలి పోయాడు. కానీ ఈ మోడల్ ఎన్ని రోజులు పని చేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు తిండి లేక కొన్ని దినాలు వరుసగా మాడితే, అప్పుడు తెలుస్తుంది పని చేయడం ఎంత అవసరమో అని అనుకున్నాడు నీల్. కానీ గత కొన్ని ఏండ్ల గా రిచ్ ను అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాడు. రిచ్ చెప్పిన విషయాలు ఆర్టికల్స్, ఒపీనియన్ పేజీలు రాయడాని నీల్ కు బాగానే ఉపయోగ పడ్డాయి. కానీ రిచ్ ఎప్పుడూ ఆకలితో నక నక లాడింది చూడలేదు. ముఖంలో ఎలాంటి నిస్సహాయ, నిస్పృహ లను చూడలేదు. పని పైన గౌరవం, ఆ పనిని నా జీవనాధరం అని నమ్మకం ఉన్ననీల్ కు రిచ్ ఒక ‘కొరకరాని కొయ్య’ అయిపోయాడు.

అందుకే రిచ్ నుంచి టెక్స్ట్ చూసిన తరువాత నీల్ కు ఎక్కడో ఒక మూల సంతోషం వేసింది. రిచ్ కూడా ఏదో పనిలో చేరి పోయి అందరిలాగే జీవితం ఇక ముందు గడుపుతాడెమో అని ఒక క్షణం అనిపించింది నీల్ కు.

***

ఆ సాయంత్రం, రిచ్ ఇచ్చిన అడ్రస్ యాంత్రికంగా గూగుల్ మ్యాప్స్ కి అప్ప చెప్పితే, అది నీల్ కు నేరుగా సన్సెట్ బీచ్ పక్క నున్న ఒక విశాలమైన భవంతి చూపెట్టింది. నీల్ తన కళ్ళను నమ్మలేక పోయాడు. ఇంత పెద్ద భవంతిలో, అదీ ఇలాంటి బీచ్ పక్కన ఉండడం ఎవరో సెలబ్రిటీ లకో, ధనవంతులకో మాత్రం సాధ్యం. రిచ్ లాంటి వాడు ఇక్కడెలా ఉండగలుగుతున్నాడు. తనకే ఈ జీవిత కాలంలో ఇలాంటి ఇండ్లలో అడుగు పెట్టడం అసాధ్యం.

నీల్ డ్రైవ్ చేసి, భవంతి దగ్గర వచ్చాక, రిచ్ నుండి వచ్చిన టెక్స్ట్ మెసేజ్ కి వెళ్లి, రిచ్ కు ఫోన్ చేసాడు. రిచ్ ఫోన్ అందుకొని గేట్ తెరుస్తాను, లోపలికి రండి అని నీల్ కు చెప్పాడు. ఎలక్ట్రానిక్ గేట్ లు కాబట్టి, తనున్న చోటు నుండే రిచ్ గేట్ తెరిచాడు. గేట్ దాటి కారు ఒక అర మైలు నడిపిన తరువాత భవనం కనపడింది. దారి పొడవునా అడవిలో పెరిగినట్లు చెట్లు ఉన్నాయి. భవనం దగ్గర పడే సరికి లాండ్స్కేప్ చేసిన మైదానం, పూల చెట్లు, నీళ్ళ ఫౌంటెన్ లు అందంగా కనపడ్డాయి. ఒక యాభై కార్లు పార్క్ చేసుకునే సౌకర్యం ఉన్న పార్కింగ్ యార్డ్ భవనం పక్కనే ఉంది. రిచ్ అక్కడే వేచి ఉన్నాడు.

నీల్ రిచ్ తో చేతులు కలిపి, "గుడ్ టు సీ యు. ఇక్కడికి ఎప్పుడు మారావు?" ఆశ్చర్యంగా అడిగాడు.

"పెద్ద కథ వుంది. నా కథలు వినేవాడివి నువ్వొక్కడవే కదా," నవ్వుతూ భవనం పక్కనున్న ఒక కాటేజీ వైపు దారి తీసాడు రిచ్. ఆ కాటేజీ కి దారి భవంతి ద్వారానే. రాజ మహల్ లా ఉన్న ఆ భవంతి లోని డెకార్ చూస్తూ, రిచ్ వెంబడి నడువసాగాడు నీల్.

భవనం చుట్టూ అక్కడక్కడ కాటేజీ లు కట్టారు. గెస్ట్స్ లకి అయ్యి ఉంటాయి అనుకున్నాడు నీల్. రిచ్ తీసుకెళ్లిన కాటేజీ ఇల్లు చిన్నదైన, ఒకరికి పెద్దదే. కిచెన్, మూడు బెడ్ రూం లు, ఉన్న ఆ ఇంటి వెనుక నుంచి చూస్తే సముద్రం, బీచ్ నేరుగా, అందంగా కనిపిస్తున్నది. నీల్ కు, రిచ్ అలాంటి ఇంట్లో ఉంటున్నాడంటే కొంత అసూయ కలిగింది.

ఇంటి బ్యాక్ యార్డ్ కు పోయే దారిలో ఉన్న లివింగ్ రూం లో కాఫీ బార్ ఉంది. పక్క షెల్ఫ్ లో రక రకాల కుకీస్ లాంటి చిరు తిండ్లు ఉన్నాయి.

రిచ్ "హెల్ప్ యువర్సెల్ఫ్," అంటూ తనకొక కాఫీ చేసుకొని,నీల్ కు దారి వదిలాడు. చాలా ఖరీదైన కాఫీ మెషీన్. నీల్ తనకొక డబుల్ ఎస్ప్రెస్సో చేసుకొని, ఒక ఓట్ మీల్ కూకీ ను మైక్రోవేవ్ లో వేడి చేసుకొని, రిచ్ వెంబడి బ్యాక్ యార్డ్ కి పోయి అక్కడున్న బీచ్ చైర్ లలో కూల బడ్డాడు.

"నన్ను నీవిక్కడ చూడడం ఆశ్చర్యంగా ఉంది కదా," తన కాఫీ చప్పరిస్తూ అన్నాడు రిచ్.

"సందేహమా? నిజంగానే ఆశ్చర్యం గా ఉంది. నీవు హోంలెస్ గా తిరిగే వాడివి. ఇంత ఖరీదైన ఇంట్లో ఎలా ఉండ గలుగుతున్నావు?"

"నీకు నికోలై తెలుసా? తెలిసి ఉండక పోవచ్చు. అతను రష్యా దేశస్తుడు. అతనిదే ఈ ఇల్లు. అతనికి ఈ ఇల్లు ఒక ఇన్వెస్ట్మెంట్. అతని మనుష్యులే నన్ను వెదికి పెట్టి, ఇక్కడుండమని అడిగారు," అన్నాడు రిచ్.

నికోలై నీల్ కు బాగానే తెలుసు. మొన్న బ్యాంక్ లో ఎ.ఎం.ఎల్ (అంటే మనీ లాండరింగ్) మీటింగ్ లో చర్చించిన కస్టమర్ లలో ఇతను కూడా ఒకడు. అతనికి ఈ దేశంలో బినామీ పేర్లలో చాలా వ్యాపార లావా దేవీలు ఉన్నాయని విన్నాడు. గ్రే ఏరియా లో పనిచేసే అతను. క్రిమినల్ అయ్యి ఉండవచ్చు కానీ ఇంత వరకు పట్టు బడలేదు కాబట్టి సంఘం లో మంచి పలుకు బడి ఉన్న మనిషే. బ్యాంక్ మీటింగ్ లో కూడా, అతని బిజినెస్ నుండి బాగా ఆదాయం రావడం వల్ల, చెప్పుకోదగ్గ ఆధారాలు బయట పెట్టనందువల్ల, చూసి, చూడనట్లు వదిలేశారు.

"నీతో నికోలై కు పని ఏమిటి?" ఆశ్చర్యంతో అడిగాడు నీల్.

"నేను అదే ప్రశ్న వేసాను. నేను ఇది వరకు తిరుగుతున్న డౌన్ టౌన్ ప్రాంతంలో నికోలై కు పని చేస్తున్న చాలా మంది డ్రగ్ డీలర్ లు పోలీసులకు పట్టు బడ్డారట. దానికి ఒక కారణం పోలీసులకు నా వద్ద నుండి దొరికిన సమాచారమే అని నికోలై కు తెలిసింది. అందుకే నన్ను అక్కడి నుండి మార్పించి, ఇక్కడికి తీసుకొచ్చాడు."

"నీవు డౌన్ టౌన్ లో ఉండగూడదు అన్న విషయం అర్ధం అయ్యింది. కానీ నిన్ను ఇక్కడ తీసుకొచ్చి, తన ప్రైమ్ ప్రాపర్టీ లో నీకు బస కల్పించడం నాకు ఇంకా తికమక గానే ఉంది," అన్నాడు నీల్.

"దానికీ కారణం ఉంది. ఈ మధ్య తన మీద నిఘా ఎక్కువైయ్యిందని నికోలై కి తెలిసింది. దానికి తగట్టు కొన్ని సంఘటనలు జరిగాయి. నన్ను ఇక్కడ బెట్టి, చుట్టూ జరుగుతున్న విషయాల మీద నాకు  ప్రశ్నలు వేసి, నా జవాబుల వల్ల వాళ్ళు చట్టానికి ఒక అడుగు ముందు ఉండవచ్చు అని వారి ఉద్దేశ్యం అని తెలిసింది. నన్ను ఇక్కడ పెట్టడం వల్ల వారికి ఒక్క దెబ్బ కు రెండు పిట్టలు కొట్టిన ఫలితం, అనుకుంటా," అన్నాడు రిచ్.

"కొన్ని రోజుల క్రితం కాప్స్ కి పని చేస్తూ, ఇప్పుడు నికోలై లాంటి క్రిమినల్ కు పని చేయడం నీకు ఇబ్బందిగా లేదు," అడిగాడు నీల్.

"అక్కడే నీవు పొరబడుతున్నావు. నేను ఎవరికీ పని చేయడం లేదు. నీకు కూడా. ఇక్కడ అక్కడ నా ఇష్టం వచ్చినట్లు గా తిరుగుతుంటాను. నాకు ఫోటోగ్రఫిక్ జ్ఞాపక శక్తి ఉంది అని ఆ కాప్స్, నికోలై మనుష్యులు, నా అనుభవాలు బాగుంటాయి అని నీ రాతల కోసం నువ్వు, నన్ను కలిసి నాకు ప్రశ్నలు వేస్తుంటారు. అడిగిన ప్రశ్నలకు నేను జవాబులు చెప్తుంటాను. కాదంటే నువ్వు కొన్ని డాలర్ బిల్స్ ఇస్తే, నికోలై ఏకంగా తన ఇల్లే ఇచ్చేశాడు. అంతకు మించి ఇంకేమి లేదు," అన్నాడు రిచ్.

"నికోలై లాంటి వారే నిన్ను ఏరి కోరి, ఇక్కడ చేర్చారు అంటే నీ జ్ఞాపక శక్తికి జోహార్లు చెప్పాల్సిందే. దయ చేసి నాతో టచ్ లో ఉండు. ఎలా ఇప్పుడు నీకు మొబైల్ ఫోన్ ఉంది. నాకు కావలసినప్పుడు ఫోన్ చేస్తాను."

నీల్ అలా కొన్ని కబుర్ల తరువాత రిచ్ దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. తను మరి నాలుగు వ్యాసాలు రాసుకో తగినంత సమాచారం సేకరించ గలిగాడు.

***

మరుసటి రోజు, నీల్ పనిచేస్తుంటే మేనేజర్ నుంచి మధ్యాహ్నం మీటింగ్ కు పిలుపు వచ్చింది. ఆ క్యాలెండర్ నోటీస్ ఆక్సెప్ట్ చేస్తూనే అది తన కాలెండర్ లో చేరిపోయింది. మీటింగ్ తన యాన్యువల్ అప్రైజల్ కోసం.

నీల్ కు టెన్షన్ గానే ఉంది. మూడు సంవత్సరాల నుండి ప్రమోషన్ ఆశిస్తున్నాడు. బోనస్ కూడా ఒక ఏవరేజ్ గా, తక్కువ ఇస్తున్నారు. ఈ సారి తాడో పేడో తెల్చేయాలి, అనుకున్నాడు నీల్.

మధ్యాహ్నం అయ్యింది, మీటింగ్ కూడా మొదలైయ్యింది. మీటింగ్ జూమ్ మీదే. మేనేజర్ న్యూయార్క్ లో ఉన్నాడు. నీల్ భయపడినట్లే మేనేజర్ తక్కువ రైజ్, బోనస్ ఇచ్చాడు. ప్రమోషన్ ప్రసక్తి తేలేదు.

"రెండు ఏళ్ళు గా ప్రమోషన్ వస్తుందనుకుంటున్నాను. బోనస్ కూడా తక్కువే ఇచ్చారు. మరో 2% ఎక్కువ బోనస్ ఇవ్వగలరా? నా ప్రమోషన్ మాటేమిటి. నా జూనియర్లను కూడా ఇప్పటికే నాకు ముందే మీరు ప్రమోట్ చేసారు," నీల్ నిరాశ, నిస్పృహ, ఆర్ధత లతో నిండిన గొంతుకతో అడిగాడు.

"నీవు మంచి పనిమంతుడివే నీల్. కానీ ఎక్కువ బోనస్ కు కానీ, ప్రమోషన్ కు కాని కావలసిన ఆ ఎక్స్ట్రా స్కిల్ సెట్ నీలో లేదు. నీవు ప్రస్తుతం నీవు చేస్తున్న పనికి సరిగ్గా సరి పోయావు. పైకి పోవాలంటే ఇంకా ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలి, నీ పని ఇంతకు మించి ఎక్సలెంట్ గా చేయాలి."

"గత సంవత్సరం కూడా ప్రమోషన్ కాలేజీ నుంచి ఫ్రెష్ గా చేరిన కుర్రాడికి ఇచ్చారు. నా దగ్గర లేనిది, ఆ కుర్రాడిలో ఏమి చూసారు?". మూడో సంవత్సరం కూడా ప్రమోషన్ రాక పోవడం, నీల్ గొంతులో కావలిసిన దానికంటే ఎక్కువగానే దైనాన్ని పులిమేసింది.

నీల్ మేనేజర్ కు నీల్ ను చూస్తే జాలి వేసింది. "నీల్ నువ్వు బాగానే పని చేస్తావు. నీ కున్న అనుభవం వల్ల మన గ్రూప్ లో జరుగుతున్న పని గురించి నీకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అన్నీ పనులు తెలిసిన నీకు ఏ ఒక్క పనిలోనూ ప్రావీణ్యత లేదు. నేను పెరిగింది మిడ్వెస్ట్ లో చిన్న పల్లెటూరు. మా ఊళ్ళో ఒకతను ఉండే వాడు. అతనికి మెషీన్ ల పై పని చేయడం చాలా ఇష్టం. కార్ కానీ, ట్రాక్టర్ కానీ, కంబైన్ కానీ, చివరకు ఇంట్లోని స్నో బ్లోవర్ లేక లాన్ మోవర్ గానీ చిటికెలో రిపేర్ చేసి ఇచ్చేసే వాడు.

ఆ పనులు చేయడం లో అతనికి సాటి ఎవ్వరూ లేదు. అతనికి మరే పనులు తెలియవు, ఒక రిపేర్ లు తప్పితే. కానీ ఆ ఒక్క నైపుణ్యం తోనే అతడు పిన్న వయస్సులోనే డబ్బు బాగా సంపాదించి జీవితంలో బాగానే స్థిర పడ్డాడు. మా చుట్టు పక్కల అన్ని ఊళ్లలో ఆయనకు లెజెండరీ పేరు ఉండేది. కాబట్టి నీకు ప్రమోషన్ కావాలంటే అలాంటి ప్రత్యేకత ఏదైన ఉండాలి. నీకుందని నాకు, కంపెనీ కి ఋజువు చేయాలి. నీకు నెక్స్ట్ లెవెల్ పొజిషన్ లో చేయాల్సిన పనులలో తగిన నేర్పు ఉండాలి…,"

నీల్ మేనేజర్ మాట్లాడుతున్న విషయాలు, నీల్ కు వినపడటం మానేశాయి. నీల్ గోడు నీల్ దే. చెప్తున్న విషయం వినే ఓపిక లేని నీల్ కనిపించాడు మేనేజర్ కు. లిజనింగ్ స్కిల్ లేని ఈ మనిషికి ఎలా మేనేజర్ ప్రమోషన్ ఇవ్వగలను అనుకున్నాడు. నీల్ ప్రమోషన్ కోసం అడుక్కోవడం కూడా నచ్చలేదు.

"నీల్ ఐ హావ్ టు గెట్ గోయింగ్. మరో ఐదు మందితో ఇలాంటి మీటింగ్లే ఉన్నాయి. తరువాత కలుద్దాం," అని చెప్పి, హడావుడిగా నీల్ మేనేజర్ వీడ్కోలు తీసుకున్నాడు.

తను ఏ విధంగా కంపెనీకి దోహద పడగలనో, అందుకోసం తన ప్రమోషన్ గురించి మరో సారి వీలవ్వుతుందేమోనని చూడమని, అది వరకే ప్రిపేర్ అయ్యిన అంశాలు కళ్ళు మూసుకుని అప్ప చెప్తున్న నీల్ కు, మేనేజర్ మీటింగ్ నుండి వెళ్లిపోయాడని ఒక రెండు నిమిషాల తరువాత గాని అర్థం కాలేదు.

********

Posted in June 2024, కథలు

6 Comments

  1. సత్యం మందపాటి

    మీ కథ చాల బాగున్నదండి. ఈ భూప్రపంచంలో బిచ్చగాడు కానివారెవరు? కథ ఆసాంతం దానికదే చదివించింది. అభినందనలు.

    • Bhaskar Pulikal

      సత్యం గారు

      మీ నుండి స్పందన రావడం నాకు చాల సంతోషం. సమయం తీసుకొని చదివి వెంటనే తెలిపినందుకు ధన్యవాదాలు. మీతో సాహిత్య విషయాల పై మాట్లాడుతుంటే సమయమే తెలియదు. మీరు ఆ సంభాషణ లలో పంచుక్కున insights కి మరో సారి ధన్యవాదాలు

  2. Uma Bharathi

    విదేశాల్లోని కార్పొరేట్ ఉద్యోగుల విషయాలని, సమస్యలని, ఏడుగేనదుకు వారు పడే కష్టాలని చక్కగా వివరించారు కధనంలో భాస్కర్ గారు.. మరో వైపు ‘రిచ్’ character ఎంతో ఆసక్తి కలిగించేలా మలచబడింది. రిచ్ జీవితం జీవన విధానం కధల్లోనే కాదు.. ఇటీవల యాదార్ధాలుగా అక్కడక్కడా విన్నావే చూసినవే .. కూడా. అయిన ఆఖరి వరకు ఆసక్తి రేకెత్తించే విధంగా ఈ అంశాన్ని ఓ రచనగా అందించిన భాస్కర్ గారికి అభినందనలు.. చాలా నచ్చింది వారి శైలి, కధ కూడా.

    • Bhaskar Pulikal

      ఉమా గారు

      చదివి సమయం తీసుకొని మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. మీలా మంచి కథలే వ్రాయడమే కాక, పలు రంగాలలో అగ్రశ్రేణి లో ఉన్న వారి నుండి రావడం, మరీ సంతోషం.

  3. Sainarayana karanam

    ఏదైనా ఒక్క దానిలో పూర్తి నైపుణ్యం సంపాదించాలి ఆ బిచ్చగాడిలా.. అర్థమయ్యేట్లు మీ స్టైల్ లో భలే చెప్పారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!