చిలిపి చిన్నారి జగద్గురువైన వైనం
మానవుని లోని అజ్ఞానాంధకారాన్ని ఛేదించి, ముముక్షువుని గావించి, ముక్తి మార్గాన్ని చూపించి, ఆ గమ్యాన్ని చేర్చే గురువు జగద్గురువుగా గణుతింపబడతాడు. ఆకోవకి చెందిన వారిలో ప్రప్రథముడు, మహర్షి బృందానికి గురువు ఐన ఆది గురువు, పరమేశ్వరుని మరో రూపమైన శ్రీ దక్షిణామూర్తి. తరువాత విష్ణావతారమైన శ్రీ కృష్ణభగవానుడు, కురుక్షేత్రములో అర్జునునకు చేసిన 'గీతోపదేశం' ద్వారా సర్వ మానవాళికి తమధర్మాలని, కర్తవ్య పరిపాలన యొక్క అవసరాన్ని, భవబంధాలనుంచి విముక్తిని, స్థితప్రజ్ఞతకు మార్గోపదేశాన్ని, తద్వారా జనన మరణ చక్రభ్రమణం నుంచి మోక్ష మార్గాన్నిచూపించి-సూక్ష్మంగా వేద, వేదాంగ, ఉపనిషత్తులని అందరికి సులభంగా అర్థమయ్యేటట్లు బోధించి జగద్గురువైనాడు. ఆకోవ లోనే అది శంకరులు ప్రస్థానత్రయమైన- 1. ‘శృతి ప్రస్థానం’ వేదాలు- ఉపనిషత్తులు, 2. ‘న్యాయ ప్రస్థానమైన’ బ్రహ్మసూత్రాలు (శారీరక సూత్రాలు) 3. వాటి ద్వారా వ్యక్తపరచిన తత్వ జ్ఞానంలో 'అద్వైత' భావాన్ని సిద్ధాంతముగా తేట తెల్లం చేసి, వాటిని క్రోడీకరించిన ‘స్మృతి ప్రస్థానమై’న శ్రీ కృష్ణభగవానుని ‘గీతోపదేశాని’కి భాష్యాన్ని అందించి- ఎందిరికో ముక్తిసాధనకు కారకుడై జగత్గురువైనారు. అవే ప్రస్థానత్రయ మూలాల లోని విద్వత్నాధారంగా, రామానుజులు 'విశిష్టాద్వైత' సిద్ధాంతాన్ని ఆవిర్భవించి వ్యాఖ్యానము చేస్తే, మధ్వాచార్యులు 'ద్వైత' సిద్ధాంతాన్ని రూపొందించి దాని ప్రబోధం తోనూ, నింబకాచార్యులు, 'ద్వైతాద్వైత' సిద్ధాంత వ్యాఖ్యాన వివరణ ద్వారాను, వల్లభాచార్యులు 'శుద్ధాద్వైత' సిద్ధాంత వ్యాఖ్యాన పరిశీలన ద్వారా జగత్తుకి వారి వారి ఆలోచనా తీరులతో వాదనా బలంతో జిజ్ఞాసువులకు జ్ఞాన సముపార్జనను, ఆత్మసంతృప్తిని కలిగించి వారి మోక్షప్రాప్తికి కారకులై జగద్గురువులనిపించుకున్నారు. వీరందరికి మూలాధారం వేదవిజ్ఞానమే అయినా పరిశీలనా పద్ధతులు, వివరణలు వేరై అనుయాయులైన తత్వజిజ్ఞాసువు లందరిని తమ వాదనా బలంతో ఒప్పించి, మెప్పించి వారి వారి ఔన్నత్య సాధనలో సహాయపడి వారికి మోక్షమార్గ దర్శకులై జగద్గురువులనిపించుకున్నారు.
ఇక్కడ గీతాచార్యుడైన శ్రీ కృష్ణ భగవానుని గురించి చెప్పడం కొంచం క్లిష్టమైన పని అయినా ప్రయత్నిస్తాను. దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణి నక్షత్రంలో వృషిణి రాజ్య రాజధాని అయిన మధురలో (కొందరి పరిశీలనా పత్రం ద్వారా నిరూపించబడిన క్రీ.పూ. జులై 18, 3228- అనగా 5252 సంవత్సరాల క్రితం) అర్దరాత్రి పుట్టిన అతగాడు సహజ కవి రాజు పోతన వర్ణించినట్లు- 'నల్లనివాడు, పద్మనయనంబులవాడు, సుధారసంబు పైజల్లెడువాఁడు, మౌళిపరిసర్పిత పింఛమువాఁడు, నవ్వు రాజిల్లెడివాడు,..'గా విరాజిల్లుతూ, పుట్టినప్పటినుంచి మేనమామ అయిన కంసుని క్రోధ జ్వాలలు క్రూర రాక్షసులై చిన్నవాడనైనా చూడకుండా వెంటాడుతుంటే ఎదుర్కొని పోరాడాల్సి వచ్చింది. బహుశా ఏఒక్క పసివాడు ఎదుర్కోని వింత పరిస్థితి అది. పుట్టడమే మెడమీద కత్తితో పుట్టి గంటయినా గడవకుండా పెను తుఫానులో తండ్రి తలపైన బుట్టలో చలిగాలిలో వణుకుతూ పడుకుని యమునా నదిని దాటి వ్రేపల్లె చేరుకొని, యశోద ఇంట పాలు తాగుతూ ఆమె ప్రేమ లో తడుస్తూ, గార్గ్య మహాముని చేత సహజంగా నల్లనివాడైన పిల్లవానిగా ‘కృష్ణ' అని పేరోసగగా, గోపకాంతలని వేధిస్తూ, యశోద ముద్దుమురిపాలలో పెరిగి, పూతన, బకాసుర, బండికాసుర మొదలైన రాక్షసుల బాధల నెదుర్కొని, తదుపరి కంస చాణూరుల దాడుల నెదుర్కొని పెరిగిన అతగాడు అసామాన్యుడే, దైవాంశసంభూతుడే. అతగాడు చేసెడి కొంటె అల్లరిని ఒకచో చూసి ఆనందిస్తూ మరొకచో వేధింపులకు గురౌతూన్న గోపకాంతలు వాని పై ప్రేమను దాచిపెట్టుకుని యశోదతో మాయా కోపం ప్రకటిస్తూ విన్నవించు కుంటున్న తీరుని, ఫిర్యాదు చేస్తున్న విధానాన్ని పోతనగారి మృదు మధురమైన సరళ పద్య విన్నాణములో చూడండి.
కం. ‘వల్లవగృహ నవనీతము.
లెల్లను భక్షించి వచ్చి, యెఱుఁగని భంగిం.
దల్లిఁ గదిసి చిట్టాడుచు
నల్లనఁ జను "బువ్వఁ బెట్టు మవ్వా!" యనుచున్.’
కం. వా రిల్లు చొచ్చి కడవలఁ.
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ?
సీ. కలకంఠిమావాడ గరితలమెల్లనీ.
పట్టిరాఁగలడని పాలుపెరుగు
లిండ్లలోపలనిడి యే మెల్లఁదనత్రోవఁ-
జూచుచోనెప్పుడు చొచ్చినాఁడొ?
తలుపులముద్రల తాళంబులునుబెట్టి
యున్నచందంబున నున్నవరయ;
నొకయింటిలోఁబాడు నొకయింటిలోనాడు-
నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;
కం. ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నలసురభులాన మంజులవాణీ! ’
కం. మగువా! నీ కొమరుఁడు మా
మగవా రటు పోవఁ జూచి మంతనమునకుం
దగఁ జీరి పొందు నడిగెను
జగముల మున్నిట్టి శిశువు చదువంబడెనే!
తే. నొక నోటవెక్కిరించు నొక్కొకచోమృగ
పక్షిఘోషణములు పరఁగఁజేయు
నిట్లుచేసివెనుక నెక్కడఁబోవునో
కాన రాఁడు రిత్త కడవ లుండు
నందుని ఇంట గోవుల కాపరిగా, వేణు గాన లోలునిగా, మట్టి తిన్న తన నోటిలో పెంపుడు తల్లి యశోదకు విశాల విశ్వాన్ని చూపిస్తూ, గోకులంలోని గోపకాంతలతో సరసాలాడుతూ, వారి వలువలు దాచిపెట్టి ఏడిపిస్తూ వారికి శరీరముపై గల వ్యామోహాన్ని తొలగిస్తూ, కాళింది మరుగున దాక్కొన్న కాళీయ ఫణి ఫణములపై నాట్యముచేస్తూ, గోవర్ధన గిరిని చిటికినవేలుపై నిలిపి గోగణాన్ని గోపల్లె ప్రజలని ఇంద్రుని క్రోధాగ్ని కీలల (ధారల) నుంచి రక్షిస్తూ, మిత్రుల వినోద క్రీడలతో ఆనందిస్తూ పదహారేళ్ళ వరకు గడపిన కృష్ణుడు కంస సంహరణానంతరం మాతా పితలైన దేవకీ వసుదేవులకు చెరవిముక్తి కలిగించి, విద్యాభ్యాసానికి సాందీపని ఆశ్రమంలోచేరి ఏకసంత గ్రాహిగా గురు మెప్పుతో విద్యాభ్యాసం చేసి, ఎన్నడో సముద్ర తీరాన తప్పిపోయిన గురు పుత్రుని వెదకితెచ్చి గురు దక్షణ గా సమర్పించాడు.
పిమ్మట ఆప్త బంధువులైన పాండు సుతులని, దౌపదిని, కురు రాకుమారులైన దుర్యోధనాదులు పెడుతున్న ఆగడాలు, వేధింపులలో సహజ ధీరులైన పాండవులని అవసరమైన మేరకు ఆదుకుంటూ, సలహాలిస్తూ, వారి జీవితాల్లో ప్రముఖ పాత్రని వహిస్తూ, శిశుపాల దంత వక్త్రుల మదమడంచి వారిని సంహరించాడు. పాండవుల తరఫున కౌరవులతో గఱపిన దౌత్యం చాకచక్యంగా ద్రౌపది వాంఛ మేరకు విఫలం గావించి కురుక్షేత్రంలో ధర్మ యుద్ధానికి సన్నద్ధం చేసిన శ్రీ కృష్ణుడు అత్యంత చతురుఁడె. కురుకేత్ర యుద్ధం మార్గశిర శుక్ల ఏకాదశి అనగా క్రి.పూ. 8 డిసెంబరు 3139 న ప్రారంభమై, 25 డిసెంబరు 3139 నాడు ముగిసింది. 21 డిసెంబరు 3139 మధ్యాహ్నం మూడు, ఐదు గంటల మధ్య వచ్చిన సంపూర్ణ సూర్య గ్రహణం లోనే జయద్రధ సంహారం జరిగింది.
కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలోనే మహా వీరుడు, సవ్యసాచి అయినా అర్జునుడు శత్రుసైన్యంలో తాను ఎదుర్కోబోతున్న తన ప్రియ బంధువులైన తాత, గురువులు, సోదరులని చూసి ఖిన్నుడై, జరగబోవనున్న దారుణ కాండకు ఖిన్నుడై అస్త్రసన్యాసం చేయగా కృష్ణుడు అతనికి కర్తవ్య బోధనచేసి తిరిగి ఉత్సాహాన్ని నింపి యుద్ధోన్ముఖుని చెయ్యడమే గీతోపదేశానికి ప్రధాన లక్ష్యమైనా దానిని అధిగమించి తరువాతి తరాలన్నిటికి ఆ ఉపదేశాలు మార్గదర్శకమయ్యాయి. శ్రీ కృష్ణుడు 89 వ ఏట అర్జున రధ సారధిగా బాధ్యత వహించి అర్జునునికి సకల వేదాల సారాన్ని ‘శ్రీమద్భగవద్గీత’ రూపంలో ఆవిర్భవించి, వివరించి కర్తవ్యతా నిర్వహణా అవసరాన్ని ప్రబోధించి, ప్రభావితుణ్ణి చేసి యుక్తి, ప్రయుక్తులతో ధర్మ యుద్ధ విజయానికి కారకుడైనాడు. పార్ధుని ద్వారా సకల మానవాళికి ఉద్బోధించిన భగవానుడు శ్రీకృష్ణునికి విజ్ఞులు సర్వదా కృతజ్ఞతతో జగద్గురువుగా పూజిస్తుంటారు. అవి అన్ని సందర్భాలలోనూ నేటి జీవన విధానానము లోకూడా మార్గదర్శక సూత్రాలై అనేక ఉన్నత శ్రేణి విద్యాలయాల్లో బోధనాంశమై ప్రసిద్ధిచెందింది.
'సర్వోపనిషదో గావో దొగ్ధా గోపాల నన్దనః |
పార్థో వత్సః సుదీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్||'
అన్ని ఉపనిషత్తులు పాడి గోవులైతే, గోపాలకృష్ణుడు మహత్తరమైన ‘గీతామృతా’న్ని వాటి నుండి పితికి, పార్థునికి, అతడి ద్వారా అంతవరకు పండితులకి మాత్రమే లభ్యమయ్యే వేదవిజ్ఞానాన్ని పామరులకు కూడా పంచాడు.
పరమాత్మ సగుణ రూపంగా శ్రీ కృష్ణ భగవానుని రూపంలో చేసిన కొన్నిముఖ్య వివరణలు:
'జ్ఞానయజ్ఞేన చాప్యన్నే యజంతో మాముపాసతే|
ఏకత్వేన పృథక్ట్వేన బహుధా విశ్వతో ముఖమ్||' 9-15
కొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుదురు. మరికొందరు అనంత రూపములతో విరాజిల్లెడి నావిరాట్ స్వరూపమును పృథక్భావముతో (వివిధ రూపాలతో) ఆరాధించుదురు.
'పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యు పహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః||' 9-26
వారు నిర్మల బుద్ధితో, నిష్కామ భావముతో సమర్పించిన పత్రముగాని, పుష్పముగాని, ఫలముగాని, జలమునుగాని, నేను స్వయముగా ప్రీతితో గైకొందును.
'సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ|
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్|| 15-15
సమస్త ప్రాణుల హృదయములలోను అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నానుండియే, స్మృతి, జ్ఞానసముపార్జన, సందేహ నివృత్తి కలుగుచున్నవి. వేదములు చెప్పుచున్నవి నాగురించే, వేదాంతకర్తను, వేదజ్ఞుడనుకూడా నేనే.
'క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉత్యతే||' 15-16
సకల ప్రాణులు నశ్వరములు, వాటియందుండు జీవాత్మ మాత్రం నాశరహితుడు.'న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయంభుత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హవ్యమానే శరీరే'|| 2-20
ఆత్మ ఏకాలమందును పుట్టదు, గిట్టదు. ఇది భావవికారములు లేనిది (అనగా ఉత్పత్తి, ఆస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును భావ వికారములు), నిత్యము, శాశ్వతము, పురాతనము అయి శరీరమును చంపినా ఇది చావదు. కానీ శరీరం మాత్రం నశ్వరం,
‘జాతస్య హిధ్రువో మృత్యుః ధృవం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేర్ధే న త్వం శోచితుమర్హసి’|| 2-27
పుట్టినవానికి గిట్టక తప్పదు, మరణించినవానికి పునర్జన్మయును తప్పదు. కనుక విడువవల్సిన విషయాలపై వగవ తగదు.
‘వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ‘|| 2-22
మానవుడు జీర్ణ వస్త్రాల్ని త్యజించి నూతన వస్త్రాలని ధరించినట్లు జీవాత్మ పాత శరీరాలను విడిచి నూతన శరీరాలను పొందును.
‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి ‘|| 2-47
కర్తవ్యమునాచరించుటలోనే నీ కధికారముండును కానీ ఫలమునందు లేదు. ఫలాపేక్షా రహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము.
'త్రివిధం నరకాసేద్యం ద్వారం నాశనమాత్మనః |
కామః కోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ ||'. 15-21
కామ, క్రోధ, లోభములను మూడు నరకద్వారములు నాశన కారకులై మానవుని అధోగతి పాలు చేయునవి కనుక ఈ మూడింటిని త్యజింపవలయును.
'ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే|
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే’ || 2-62
విషయచింతనచేయు పురుషునకు వాటియందు ఆసక్తి ఏర్పడి వాటిని పొందు ఇచ్ఛ పెరుగును. అవి తీరనియెడల క్రోధమేర్పడును.
'క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి’|| 2-63
అట్టి క్రోధమువలన వ్యామోహము పెరుగును, దాని ప్రభావము వల్ల స్మృతి భ్రమించును దానివల్ల బుద్ధి అనగా వివక్షతా జ్ఞానము నశించును. అదే మానవుని పతన హేతువగును.
‘విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి’|| 2-71
కోరికలనన్నిటిని త్యజించి, మమతాహంకార స్పృహ రహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును.
‘ఏషా బ్రహ్మీ స్థితిః పార్ధ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి’ || 2-72
ఓ అర్జునా, బ్రాహ్మీస్థితి అనగా ఇదియే. ఇది చేరినవాడు ఎన్నడూ మోహితుడు కాడు, అందు స్థిరముగా ఉన్నవాడు అంత్యకాలమందు బ్రహ్మానందమనుభవించును.
'అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్|| 9-22
పరమేశ్వరుడినైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింత చేయుచు నిష్కామ భావంతో సేవించువారి యోగక్షేమాలను (అప్రాప్య వస్తు ప్రాప్తిని యోగమందురు, ప్రాప్టించిన వస్తు రక్షణను క్షేమమందురు) నేనే పరిష్కరించెదను. తదనంతరం అర్జనుని కోరికపై విశ్వరూప సందర్శనమిచ్చి సకల స్థిర, చర, జీవరాసులన్నీ, తనలోనే ఉన్నట్టు, వాటన్నిటిలో తానే ఉన్నట్టు చూపి గీతార్ధాన్ని ప్రదర్శించాడు.
కృష్ణుని జీవితమంతా అనేక సవాళ్లతో కూడినదై పలు కష్టాల నెదుర్కొనేటట్లు చేసింది. అవతార మూర్తి అయినా సాధారణ మానవుని వలెనె అనేక క్లిష్ట పరిస్థితులని, అవమానాలని, ఎదుర్కొనవలసి వచ్చింది. అయినా ధర్మ మార్గాన్ని విడవకుండా, సర్వ జనులకు హితం చేకూర్చేటట్లు జీవించి ఆదర్శ ప్రాయుడయ్యాడు.
చివరికి తనని ఆరాధించే గాంధారి చేత కూడా కురుక్షేత్ర మహా యుద్దానంతరం ఆమె నూర్గురు కొడుకులను యద్ధభూమి లోవిగతజీవులుగా చూసి మాతృ గర్భ శోకాన్ని భరించలేక శాపాన్ని విధిస్తే, యదు వంశ నాశనాన్ని అందులో భాగంగా తన అవతార సమాప్తి ఒక వేటగాని బాణం రూపంలో ఎదుర్కొన వలసి వచ్చింది. అది తన 125 ఏట అనగా, 18 ఫిబ్రవరి, 3102 న జరిగింది. ధర్మనిర్వహణయే ధ్యేయంగా జీవించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఆచరణాత్మక జగద్గురువే.
‘వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం|
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్’||
-o0o-
‘చాలా బాగుంది, గుమ్మడిదలవారూ! చిన్నారి జగద్గురువైన సన్నివేశమేమో అనుకున్నాను; కానీ కృష్ణుడి మీద రాసారని చూసి సంతోషించాను.
మీకు నచ్చినందుకు సంతోషం.
చాలా బాగుంది, గుణిదల వారూ! చిన్నారి జగద్గురువైన సన్నివేశమేమో అనుకున్నాను; కానీ కృష్ణుడి మీద రాసారని చూసి సంతోషించాను