12. ఆనందాబ్దిలో ఓలలాడించే - అద్భుత జలపాతాలు
చిన్నప్పటినుంచి నీళ్ళల్లో కేరింతలు కొడుతూ ఆటలు ఆడడం మానవ సహజం. ఏ పిల్లను గాని పిల్లవాడిని వాడిని చూసినా నీళ్ల దగ్గరికి పరుగెత్తడానికి ఉత్సాహ పడతారు. నీళ్లలో తప తపా కొడుతూ కేరింతలు కొడుతుంటే చూసేవాళ్ళకి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అది పెద్దయిన తరువాత కూడా నదులలో, చెరువులలో, చివరికి స్విమ్మింగ్ పూల్స్ లో ఆడే జలకాలాటలు మనలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తాయి. అందుకే కాబోలు అందరు వీలు దొరికితేచాలు దగ్గరలోఉన్న సముద్రతీరాలకి, పెద్ద చెరువులవైపు, నదులలోకి ఈతలాడడానికి ఉత్సాహపడతారు. వీటికంటే, జలపాతాలు, చిన్నవైనా పెద్దవైనా సంభ్రమంతో కూడిన ఆనందాన్ని పంచుతాయి. అవి మన దరిదాపులలో లేకపోయినా వెతుక్కుంటూ వెళ్లైనా చూసి అక్కడ కొలనులో ఈతలాడతారు. ఈతరానివారు ఆ నీటి తుప్పరల చల్లదనంతో వీచే పిల్లతెమ్మెరల పులకిత ఆనందాన్ని అనుభవిస్తూ మైమరచిపోతారు. ఇక్కడ జలపాతాల సంగతి ముచ్చటించుకుంటున్నాము గనుక ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ, తెలుగు రాష్ట్రాలలోను ఉన్న కొన్ని చూచి ఆనదించదగిన జలపాతాలని గురించి తెలుసుకుందాము.
'క్యాటరాక్టు' జలపాతం
ప్రపంచంలో అతి ఎక్కువ పతనం కలిగి, ఎక్కువ వెడల్పు కలిగిన జలపాతం ఇది. సాధారణంగా జరిగేటట్లు వర్షపు నీరు కొండలలో నుంచి నేలపై పడి నదిగా మారి సముద్రంలో లీనమవకుండా, నేరుగా అట్లాంటిక్ సముద్రంలోనే 11,500 అడుగుల లోతుకు దూకుతున్న అద్భుత ప్రదేశం గ్రీన్లాండ్ సమీపంలో ఆర్కిటిక్ సర్కిల్ లో ఒక ద్వీపం దగ్గర జరుగుతోంది. ఆ అద్భుత దృశ్యం పక్క ఫొటోలో చూడవచ్చు. దాని శాస్త్రీయ విశ్లేషణం పక్కనే ఉన్న మరో పాఠం లో చూడవచ్చు. ఉత్తర ధ్రువం నుంచి వచ్చే అతిచల్లని నీటికి అట్లాంటిక్ సముద్రంలోని అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటికి మధ్యన ఉన్న ఉష్ణోగ్రతల బేధం వల్ల నీటిలో చలనం పెరిగి, ప్రవాహ వేగం కూడా పెరిగి పక్కన ఉన్న బొమ్మలో చూపిన విధంగా జలపాతం జనిస్తుంది. డెన్మార్క్ సమీపంలో ఉన్నఈ ప్రదేశానికి యాత్రికులు చేరుకోవడం ప్రమాదకరమైన ప్రయత్నమే అవుతుంది.
ఏంజెల్ ఫాల్స్
దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో గల ఈ జలపాతం 3212 అడుగుల ఎత్తు నుంచి రెండు దశలలో నీరు దూకుతూ అనేక ఇంద్రధనస్సులు సృష్టిస్తూ కనిపించడం ప్రర్యాటకులకు ఒక మంచి దృశ్యానుభవం. ప్రపంచంలోనే అత్యున్నత జల పాతమైన ఇది 'కెనైనా' జాతీయ ఉద్యానవనం లో ఉంది. ఆయన్-తేపుయి కొండ శిఖరాలపై నుంచి దూకి చురున్ నదిలో కలిసి పోయి ఒర్నాకో నదిగా ప్రవహిస్తోంది. జిమ్మీ ఏంజెల్ అనే అమెరికా వైమానికుడు 1933 లో విలువైన ఖనిజం కోసం వెదుకుతూ దీనిపై తన విమానంలో ఎగిరి చరిత్రని సృష్టించినందుకు గుర్తుగా ఈ జలపాతం అతని పేర పిలవబడుతొంది.
తుగేలా జలపాతం
దక్షిణ ఆఫ్రికాలో డ్రాగన్ పర్వతాలపైనుండి ఐదు దఫాలుగా 3110 అడుగులు జాలువారే ఈ జలపాతం రెండవ పెద్ద జలపాతంగా గుర్తింపబడుతోంది. ఇది రాయల్ నాటల్ పార్క్ లో ఉంది. ఈ జలపాతం వర్షాకాలంలో ఉదృతంగా ఎగసి పడుతూ తుగేలా (జులు భాషలో దానిని తుకెలా అని పిలుస్తారట) నదిలో కలుస్తుంది.
యుసమిటి జలపాతం
ఇది ఆ వరుసలో తరువాతది కాకపోయినా 2425 అడుగుల పతనంతో ఆరోదైన ఈ జలపాతం చాలా ప్రముఖమైనదై అత్యధిక పర్యాటకులని ఆకట్టుకుంటోంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్టంలో ఉన్న ఈ జలపాతం పరిసరాల్లోని కొండలు, అధికముగా పర్వతారోహణులని ఆకర్షిస్తున్నాయి. 1200 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగిన ఈ జాతీయ ఉద్యానవనం పర్యాటకులు ఉండేందుకు హోటల్స్; వినోదాత్మక వాహనాల (RVs) తో నివసించే ఉద్యానవనాలు ఫలహారాలకి, భోజనాలకి రెస్టారెంట్స్, అందుబాటులో ఉంటాయి. కుటుంబ సమేతంగా రోజుల తరబడి అక్కడే ఉండి సెలవలు ఆనందంగా గడపవచ్చు.
కలందుల జలపాతం, అంగోలా
అనేక జలపాతాలు గల ఈ గుంపు జలపాతంలో అతిచిన్నది 344 అడుగులు, పెద్దది 1300 అడుగుల జలధార గలవి. ఇది ఆఫ్రికాలో అతి ఎక్కువ ఘనమైన నీటి ప్రవాహం గలది. దీని నీరు లూకాల నదిని చేరుతుంది. అది అంగోలా లోని అతి పెద్ద నది ఐన కువంజా నదికి ఉపనది.
విక్టోరియా ఫాల్స్, జాంబియా, జింబాబ్వే
5600 అడుగుల వెడల్పు, 360 అడుగుల జల పతనంతో 450 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తూ జాంబియా, జింబాబ్వేల పొలిమేరలలో ఉన్న ఒక మహోన్నత జలపాతం. ఏప్రిల్ నెలలో అత్యధిక జలసమృద్ధితో, నవంబర్ లో అత్యల్ప జల ప్రవాహంతో విలసిల్లే ఈ జలపాతం హోరు అధిక ప్రవాహ సమయంలో 50 కిలోమీటర్ల వరుకు వినిపిస్తే, పొగ జల్లు 40 కిలోమీటర్లు వరకు కనిపిస్తుంది.
'జోగ్' జలపాతం. కర్ణాటక, ఇండియా
శరావతి నది పై ఉత్తర కర్ణాటక, షిమోగా జిల్లా లో పడమటి కనుమల్లో ఉరుకులు పెట్టె ఈ జలపాతం వర్షా కాలంలో అంటే జులై, ఆగష్టు నెలలలో చాలా అద్భుతముగా 830 అడుగుల జలధార తో నురగలు కక్కుతూ దర్శనమిస్తుంది. అప్పుడే సందర్శకులు ఈ వింతని చూసి సంభ్రమాశ్చార్యాలలో మునగడానికి వస్తారు. దీని వెడల్పు 1550 అడుగులు, శరావతి నది లోకి దీని నీటి విడుదల సెకనుకు 5400 క్యూబిక్ అడుగులు.
దూధ్ సాగర్ జలపాతం, సోనాలిమ్, గోవా
గోవా రాష్ట్ర రాజధాని పనాజీకి 40 మైళ్ళ దూరంలో వంద అడుగుల వెడల్పుతో నాలుగు అంతస్థులలో పడమటి కనుమలలో దూకుతూ వంపులు తిరుగుతూ నాట్యం చేస్తూ సాగి మాండవి నదిలో ఐక్యమయ్యే ఈ జలాలు నురగలతో చూడడానికి పాలల్లా తెల్లగా ముచ్చటగా ఉంటాయి. ఈ దూధ్ సాగర్ జలపాత ఎత్తు 1050 అడుగులు.
కుర్తాళం జలపాతం, తమిళ్ నాడు, ఇండియా
చిత్తర్ నది పై నున్న ఈ జలపాతం చిన్నదే అయినా అక్కడున్న అడవులలో నుంచి వస్తున్న ఈ నదీ జలాలు ఆయర్వేద మూలికల సమ్మిళితమై శరీర చర్మ సంబంధ రోగాలని నయం చేస్తాయని ప్రసిద్ధి. అందువలన చాల మంది అక్కడ దొరికే మట్టిని పులుముకుని తలస్నానం చేస్తారు. ఇక్కడే శ్రీ రామునికి రావణుని తో యుద్ధానికి వెళ్లేముందు 'ఆదిత్య హృదయం' బోధించిన అగస్త్య మహర్షి నివసించి తపస్సు చేశారట.
నోహ్కలికై జలపాతం, చిరపుంజి, మేఘాలయ
చిరపుంజి అతి ఎక్కువ వర్ష పాతం గల ప్రదేశం కావడం వల్ల ఇక్కడ చాలా జలపాతాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్దదైన నోహ్కలికై జలపాతం 1115 అడుగుల ఎత్తు నుంచి చూడ ముచ్చటగా దూకుతూ పోతుంది.
తెలుగు రాష్ట్రాలలో చిన్న జలపాతాలు చాలానే ఉన్నా, అవి పిక్నిక్ యాత్రల వరకు పరిమితమై ఉన్నాయి. వాటిలో కొన్ని పక్క పటంలో చూడవచ్చు.
-o0o-