Menu Close
Page Title

8. అందరిని ఏడిపించిన ‘కరోనా’- యిక నువ్వే రోదించాలి ('రోన’)

Corona-01

శ్రీ శార్వరి సంవత్సరం (2020) లో ప్రపంచం ప్రచ్ఛన్న అస్త్రరహిత  ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కుంటోంది. 'కరోనా' లేక 'కోవిద్ 19' అనే పేరుతో ఒక అతి చిన్న ప్రోటీన్ అణువు విషపుకొవ్వు పదార్ధంతో కప్పబడి ఉండి - ఎక్కడ పడితే అక్కడ శ్లేష్మం, కళ్లె, కళ్ళల్లోని పుసులువంటి జిగురు పదార్ధాలని వెదుక్కుంటూ మానవ, జంతు శరీరాలలో ప్రవేశించి గొంతుద్వారా ఉపిరితిత్తులని ఆక్రమించి జీవ కణాలకి ప్రాణవాయువు అందకుండాచేసి క్రమంగా రక్తంలోని ఎఱ్ఱ కణాల్ని నిర్వీర్యంచేసి, శరీరంలో అన్ని ముఖ్య అవయవాలని ప్రాణ విహీనం చేసి, ఆ జీవిని నిర్జీవం చేస్తున్నది. అది జీవ పదార్ధం కాదు గనుక దాన్ని చంపడం సాధ్యం కాదు. దానంతట అదే ఉష్ణోగ్రత, వాతావరణంలోని తేమ, కాల ప్రభావాల వల్ల నశిస్తుంది. ఇది పట్టులేని పదార్ధం గనుక సబ్బు తో యిట్టే వదిలించుకోవచ్చు. ఈ వైరస్ యొక్క ఉనికి గురించి అనేక రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. చైనాలో ఒక లాబరేటరీ లో చిన్నదిగా పుట్టిందని వినికిడి; లేదు అక్కడే సహజ సిద్ధంగా జంతువుల మాంసం అమ్మే మార్కెట్ నుండి వ్యాపించిందని మరో ఉవాచ. ఏది ఏమైనా అక్కడనించి చాప కింద నీరులా తెలియకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్నివైపులకి వ్యాపించి ఆయా దేశప్రభుత్వాల, ప్రజల అజ్ఞాన నిర్లక్ష్యాలవల్ల మహమ్మారిగా మారి, భూమి పై 188 దేశాల్ని అతలాకుతలం చేస్తున్నది. నేటికి  ప్రపంచవ్యాప్తంగా అరకోటి పైగా జనం ఈ మహమ్మారి బారిన పడితే దాదాపు మూడున్నర లక్షల మంది దానికి బలైపోయారు. అమెరికాలోనే 1.7మిల్లియన్ల జనం దాని బారిన పడితే లక్ష మంది దాని ఉసురుకి ప్రాణాలు కోల్పోయారు. ఈ అంటువ్యాధి ఆయా దేశాల ప్రజల్ని గృహ బందీలని చేసి వారి సామాజిక జీవనాన్ని స్థంభింపజేసి అస్తవ్యస్తం గావించింది. ప్రపంచ దేశాల పారిశ్రామిక సంపదని, ఆర్ధికవ్యవస్థని, వ్యవసాయ ఉత్పత్తులని, అన్నిటికంటే ముఖ్యంగా మన మనుషుల మనోస్థైర్యాన్ని తాత్కాలికంగా పడగొట్టి ఒక పెద్ద శాపంగా మారింది.

Corona-02అగ్ర రాజ్యాలు, అంటే శాస్త్రీయంగా, ఆర్ధికంగా పురోభివృద్ధి సాధించిన దేశాలు దీని పంజా విస్తృతాన్ని మొదట్లో తక్కువగా అంచనా వేసినా, క్రమేణా దాని ఉధృత విజృంభణని గమనించి నాలిక కరుచుకుని, విస్తృత కఠోర నియంత్రణ చర్యలు చేపట్టారు. కుటుంబ సమేతంగా స్వగృహ నియంత్రణం, ఎక్కువగా జనాలు కలిసే చోట మనుషుల మధ్య తుమ్ములు- దగ్గుల వలన రేగే తుప్పరలు ప్రక్కవారిపై పడనంత దూరం ఉండేటట్లు చూడడం, జాతీయ అంతర్జాతీయ రైళ్లు మరియు విమాన ప్రయాణాలని నిలిపివేయడం వంటి చర్యలు కాలక్రమేణా సత్ఫలితాలని ఇవ్వడం మొదలుపెట్టి ఆయా దేశాల నాయకులని, ప్రజలని ఉపిరితీసుకునే అవకాశం కలిగించింది. దానికి విరుగుడు మందుగాని, ఈ కరోన అంటువ్యాధి ప్రబలకుండా ముందుజాగ్రత కోసం వేసే టీకాలు గాని ఇంకా కనుగొనలేదు. కనుకనే ఇప్పటికీ అన్ని దేశాలు చీకటిలో తడుములాడుతున్నాయి. కానీ వారవలంబించిన నియంత్రణ చర్యలు దాని ఉధృతానికి ఆనకట్ట వేసి క్రమేణా సడలించే అవకాశం కలిగించింది. అయినా ప్రపంచ వ్యాప్తంగా లక్షల జనం దాని బారినబడి అందులో దాదాపు ఆరు శాతం మంది ముఖ్యంగా వయసులో పెద్దవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానికి ఆహుతి అయిపోయారు. ఎన్నో కుటుంబాలు ఆప్తుల్ని కోల్పోయి విషాద సాగరంలో పడి విలపిస్తున్నాయి. Corona-03వివాహాది శుభకార్యాలను వాయిదా వేసుకునేటట్లు ఈ మహమ్మారి చేసింది. అతి దగ్గర బంధుమిత్రులు చనిపోయినా వారి చివరి దర్శనం గాని వారి అంతిమసంస్కారాలు చేసుకునేవీలు లేక, చివరికి ఆప్త బంధువులని పరామర్శించలేని దుస్థితి కలిగించింది. అన్ని దేశాల ఆర్ధిక స్థితి దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా రోజువారీ కూలిపై ఆధారపడే అభాగ్యులందరినీ తట్టుకోలేనటువంటి గట్టి దెబ్బకొట్టి భయభ్రాంతుల్ని చేసింది. తిండిగింజలు పండించుకోలేని ఎడారి దేశాలు బయట దేశాల దిగుమతులపై ఆధారపడేవి నెలల తరబడి పొడిగింపబడుతున్న 'లాకౌట్' ని నిలదొక్కుకోలేక మలమల లాడుతున్నాయి.

ఇండియాలో ప్రభుత్వం మరీ పటిష్టంగా ఈ గృహనిర్భందాన్ని అమలు చేస్తున్నా, కాయగూరలు, పళ్ళు, పాలు మొదలైన అవసర సరుకులు అన్నీ ఇళ్ళ దగ్గిరే దొరుకుతుండడంవల్ల జనాలు అంతగా ఇబ్బందులు పడటంలేదు. అన్నీ అభివృద్ధి చెందిన దేశాలలో లాగానే ఇండియాలోకూడా చాలా మంది ఇంటినించి పనిచేసే కొత్తపద్ధతికి అలవాటు పడ్డారు. ఎటొచ్చి రోజు వారి కూలిచేసుకుని బ్రతికేవారు, ఉన్న ఊళ్లు వదిలి బ్రతుకు తెరువుకి పట్నాలు చేరిన వలసకూలీలు మాత్రం గృహ నిర్బంధం వల్ల ఆదాయం పడిపోయి ఇంతకుముందు చేసిన అప్పులు తీర్చలేక, చేతిలో డబ్బులు ఆడక, చాలా ఆర్ధిక ఇబ్బందులకు గురిఅవుతున్నారు. Corona-04వలసకూలీలు స్వంతఊరికి పోయి ‘కలోగంజి’ అయినా తాగి బ్రతకవచ్చుననే నిస్పృహతో బయలుదేరితే, బస్సులు గాని, రైళ్లుగానీ లేక కాలినడకనే ప్రయాణంకడుతున్నారు. వివిధ దూర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారికి మాత్రం ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడపడానికి పూనుకుంది. ఊరి సరిహద్దులనే దాటనివ్వని తీవ్ర పరిస్థితులలో అది ఒక 'గుడ్డిలో మెల్ల' అన్నట్లు వారికి కొంచెం ఆటవిడుపు. వలసకూలీలను తమ స్వరాష్ట్రాలకు, స్వస్థానాలకు చేర్చడం అనేది ఓదార్పుతోకూడిన మానవత్వ చర్య. రోగులు, సామాన్య ప్రజలు అత్యవసర సమయాల్లో హాస్పిటళ్ళకు వెళ్లే వెసులుబాటు కూడా చేశారు. యివన్నీ కరోనా వల్ల కలిగిన బాధలు, కష్టాలు. దాని వల్ల కొన్ని శుభ పరిణామాలుకూడా చోటుచేసుకున్నాయనడంలో సందేహం లేదు.

Corona-05ముంబాయి, ఢిల్లీ, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి వాహన రద్దీ చాలా ఎక్కువ వుండే మహా నగరాలలో సాధారణంగా మనము చూసే కాలుష్య సాంద్రత వాహనాలు తిరగడం తగ్గడం వల్ల గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు పక్కనున్న ఢిల్లీ లో ఫోటో తెలుపుతుంది. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తరువాత పెరిగిన పారిశ్రామిక అభివృద్ధివల్ల, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ ల వాడకం విపరీతంగా పెరిగి భూమిని పరిరక్షించే వాతావరణ గోళపు పొరలో పడ్డ 'ఓజోన్ రంధ్రం' రోజు రోజుకి పెరుతుండడం మనం నిస్సహాయంగా చూస్తూ ఉండడం జరిగింది ఇంతకాలం. సూర్యుని యొక్క అతి నీలలోహిత కిరణాల (అల్ట్రావైయోలెట్ రేడియేషన్) వల్ల అది భూమి పై ప్రజలలో కాన్సర్ వంటి వ్యాధుల్ని ఇతర ప్రమాదకర పరిస్థితులను కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో బహుశా ప్రపంచ మొత్తంగా బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్) తగ్గడంవల్ల కావొచ్చు, అనుకోనివిధంగా ఇప్పుడు అది పూర్తిగా మూసుకుపోయి మనరక్షణ స్థాయిని పెంచింది. 'కరోనా వైరస్' పుణ్యమా అని ప్రపంచ మంతా అన్నీ చోట్ల ప్రజలలో శుభ్రత స్థాయి పెరిగింది. రోడ్లపక్కన ఉమ్ములు వెయ్యడం, బీడీ సిగరెట్టూ పీకలు విసరడం, వ్యర్ధాలను విచ్చలవిడిగా పడవేయడం తగ్గిపోయింది, ఆన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు శుభ్రతపై శ్రద్దని పెంచాయి. ఆశ్చర్యమైన విషయమేమిటంటే గంగ, యమున వంటి నదులన్నీ ఇంతకుముందు ప్రభుత్వం అనేక వేల కోట్లు ఖర్చుపెట్టి చేసిన ప్రయత్నం కంటే ఎక్కువగా శుభ్రపడిపోయాయి. లాక్ డౌన్ వల్ల జనం వారి వారి ఇళ్లకే పరిమితమై, ఈ మధ్య కాలంలో లభించని కుటుంబ సమయం పెరిగి కుటుంబ సభ్యులతో సాదరంగా మాట్లాడుకోవడానికి వారిమధ్య అవగాహన పెంచుకోవడానికి తోడ్పడింది. స్కూళ్ళు మూసివేయడం వల్ల పిల్లలకి తల్లి దండ్రులతో గడిపే సమయం పెరిగి, వారి మధ్య అవగాహన, వారి నుంచి చాలా  విషయాలు తీరుబడిగా నేర్చుకునే సమయం కూడా పెరిగి పిల్లలలో వారిపట్ల ఆదరణ గౌరావాన్ని పెంచే అవకాశం కలిగించింది. అల్లాగే పాఠాలు చెప్పడం, వాటి అవగాహన పెంచడంలో తండ్రికి యిప్పుడు సమయం దొరికింది. రోజూ ఎదుర్కునే కుటుంబ సమస్యలు తీరుబడిగా చర్చించుకునే సమయం ఇప్పుడు పుష్కలంగా లభించడం వల్ల మొదట్లో వాదులాటలు జరిగినా భార్య భర్తల మధ్య అవగాహన పెరిగింది. రోజువారీ కాల గమనం లో పరుగు పందాలు లేకపోవడంతో అందరికి నిద్రించేసమయం పెరిగి ఆరోగ్యాలు మెరుగయ్యాయి. టాక్సీలు, ఆటోలు తిరగకపోవడంతో, సినిమాలు, హోటళ్లు పబ్బులు, క్లబ్బులు మూసివేయడంతో డబ్బు ఖర్చు తగ్గి సంసారాలు డబ్బు మిగిల్చుకోగలుగుతున్నాయి. బ్యాంకులు మూసివేయడంతో వాటికి సంబంధించిన లావాదేవీలు అవి తెరిచేవరకు ఆగవలసి వచ్చినా ఏ టి ఎం లు డబ్బు సరఫరాని నిలపగలుగుతున్నాయి. స్కూళ్ళు కాలేజీలు మూసివేయడంతో లేలేత వయసులోనే ప్రేమని రుచిచూడాలని ఆత్రుత పడే యువ ప్రేమపిపాసిలకి అడ్డుతెరపడడం వారిని పునరాలోచించుకోనిస్తోంది. టీవీ లో సెంటిమెంట్ తో కొట్టి ఏడిపించి, జుగుప్స, అసూయ, క్రోధాలు, దుర్మార్గపు పధకాల ఆలోచనలను పెంచే సీరియళ్లు ఆగిపోవడంతో మానసిక ఉద్రిక్తలు తగ్గి ఇప్పుడు తిరిగి ప్రారంభమైన రామాయణం, మహాభారతం, చాణక్య వంటి సీరియళ్లు కొంతమందికి మొదట్లో అంతగా నచ్చకపోయినా వేరే మార్గంలేక చూడడం ప్రారంభించిన పెద్దలలో ఆలోచన తీరు మారడం, పిల్లలలో ఆ కథల పట్ల అవగాహన పెరిగి కుతూహలాన్ని పెంచడం లాంటి మంచి జరుగుతోంది, సామాజికంగా ఇదొక పెద్ద వరం.

Corona-06అందరు ఇళ్లకే పరిమితమవ్వడంవల్ల, వీధులన్నీ ఖాళీగా ఉండి ఇంతవరకు పశుపక్ష్యాదులను తమ ఆవాసాలనుండి తరిమివేసిన మానవజాతి రోడ్లపై కనబడకపోవడంతో ఆశ్చర్యంతో ఆనందంగా స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించాయి. పక్కనే ఉన్న ఫోటో ఆ కధ వివరిస్తుంది. దాన్ని క్రింది ఫోటో ఆదోని బళ్లారి రహదారిపై సాధారణంగా ఎప్పుడు కనబడని లేళ్ళు వందదాకా రోడ్డుని దాటుతూ కనబడ్డ దృశ్యం. అందర్నీ ఎన్నో తిప్పలు పెట్టిన 'కరోనా' ని అన్ని దేశాల ప్రజలు ధీరతతో, శాస్త్రీయంగా, క్రమశిక్షణతో అణచివేయడం ముదావహం. అది మరింత ఉధృతతో విజృంభిస్తుందని ఒక నిపుణుల సూచన. వచ్చినా దాన్ని ఇదే ధైర్య, స్థైర్యాలతో ఎదుర్కోగలము, దాన్నే ఏడిపించి రోదించేటట్లు చేయగలమని నమ్మకంతో ఇప్పటి క్రమశిక్షణ బిగువుని తగ్గించకుండా ఎదుర్కుందాము.

-o0o-

Posted in June 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!