Menu Close
Page Title

3. స్వామి శివానంద - కైవల్యానికి మార్గదర్శకుడు

Swami Sivananda

"ప్రపంచమే మనకి అత్యుత్తమ గురువు. దానిలో ప్రతి ఒక్కటి పాఠ్యాంశమే. ప్రతి ఒక్క అనుభవంలోనూ ఒక గుణ పాఠం ఉంటుంది. దాన్ని తెలుసుకుని, తెలివిని పెంచుకోవాలి. ప్రతి ఒక్క ఓటమి రాబోయే గెలుపుకి ఒక మెట్టేనని భావించాలి. మనం ఎదుర్కొనే ఏ క్లిష్ట పరిస్థితి అయినా, నిరాశయినా అది మన నమ్మకానికి ఒక పరీక్షే. ప్రతి ఒక్క చేదు అనుభవం, ప్రత్యేక ఆకర్షణ మన అంతర్బలానికి పరీక్షే. అందుకే నిరాశ చెందకుండా, ఓటమిని ఒప్పుకోకుండా వాటినధిగమించి ముందుకు సాగాలి." -స్వామి శివానంద.

“నువ్వు చేస్తున్న ఏ చిన్న పనైనా సరే, దానిపై నీ మనస్సుని, హృదయాన్ని, ఆత్మని, తెలివిని, లగ్నం చేస్తూ చెయ్యి; విజయం నీదే ఔతుంది” -స్వామి శివానంద.

"ఆలోచనలకు విపరీతమైన శక్తి ఉంది. అది అన్ని లౌకిక శక్తుల కంటే ఉన్నతమైనది. అదే మన గుణగణాలని మలుస్తూ మానవ జీవితానికి ఒక అర్ధాన్ని ఆపాదిస్తూ జీవితాన్ని ఒక గమ్యానికి చేరుస్తుంది. వాటిని తప్పు దారి పట్టించొద్దు" -స్వామి శివానంద.

Swami Sivananda Bookఇరవయ్యో శతాబ్దం చాల మంది తత్వ బోధకులని, వేదాంతులని సమాజానికి ఇచ్చింది. రమణ మహర్షి, అరవిందులు, వివేకానంద, రామకృష్ణ పరమహంస, స్వామి చిన్మయానంద, స్వామి దయానంద సరస్వతి, జిడ్డు కృష్ణ మూర్తి , కంచి పరమాచార్య, పరమహంస యోగానంద, షిర్డీ సాయిబాబా, సత్యసాయిబాబా, గురు రాఘవేంద్ర, స్వామి శివానంద, చైతన్య మహాప్రభు మొదలైన వారరెందరో సమాజానికి వారి వారి విద్యానుభవాలతో అలవడిన ఆలోచనా తీరు ననుసరించి మోక్ష మార్గానికి దిశా నిర్దేశాన్ని ఇచ్చారు. వీరిలో కొంత మంది భక్తి మార్గాన్ని అనుసరిస్తే, కొంతమంది యోగసాధన ద్వారా, మరికొంత మంది తత్వ జ్ఞాన మార్గాలని అవలంబించి దార్శనికులయ్యారు. ఎవరికి వారు అందరు గొప్పవారే. అందరిలోనూ జ్ఞానజ్యోతి ఆత్మజ్యోతిని ప్రదీపింపజేసి, ఆ వెలుగులో బహు జనావళిని, వారి బోధనలవైపు, ఆలోచనలవైపు, ఆకర్షితులని చేసింది. ఆ జ్యోతిని చూస్తూ ముగ్ధులై అదే మార్గంలో పయనించడానికి ప్రయత్నించారు చాలామంది. కొంతమంది వారి మానసిక సామర్ద్యంవల్ల, తెలివితేటల వల్ల, గురువనుసరణ ద్వారా గురు తుల్యులైతే మరి కొంత మంది శిష్య పరమాణువులుగానే మిగిలిపోయారు. ఆది శంకరులు, స్వామి వివేకానంద వంటి వారు కొంతమంది గురువుకి సమానులైన శిష్యులై అశేష జనానీకానికి మార్గదర్శకులై దేశ తాత్వికుల చరిత్రలోనే వెలుగుతున్నతారలైతే, మరికొంత మంది శిష్యుల స్థాయిని పెంచుతూ వారికి మోక్ష మార్గాన్ని చూపిస్తూ గురుస్థానాన్ని విడిచి పెట్టకుండా అందులోనే  స్థిరపడ్డారు. సనాతన ధర్మానుచారి అయి, వాటి సూత్రాలనన్నిటిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని, వాటిని ఆంగ్లభాషలో పొందుపరచి ప్రపంచానికి తెలియచెప్పిన విశేష గురువు, తత్వ వేత్త, స్వామి శివానంద.

Swami Sivananda Academyశివ భక్తుడైన శ్రీ వెంగు అయ్యర్, శ్రీమతి పార్వతి అమ్మాళ్ దంపతులకు మూడవ సంతానంగా కుప్పుస్వామి సెప్టెంబర్ 8,1887 లో తిరునల్వేలి జిల్లాలో తామ్రపర్ణి నది తీరాన్న ‘పట్టమదై’ లో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి చదువు సంధ్యలలోను, ఆటపాటలలోను, అమిత ఉత్సాహాన్ని చూపించి వాటిల్లో ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకుంటూ, అందరి మెప్పు పొందుతుండేవాడు. ఆయన తంజావూరు లో వైద్య పాఠశాలలో అత్యున్నత ఉత్సాహాన్ని, తెలివిని ప్రదర్శించి గురువుల మెప్పుని పొంది వైద్యశాస్త్ర మొదటి సంవత్సరంలోనే అనుభవజ్ఞులైన వైద్యుల పక్కనే శస్త్ర చికిత్సలో తర్ఫీదు పొందాడట. చదువుకొంటూ 'అంబ్రోసియా' అనే వైద్య పత్రిక నడిపారు. వైద్య పట్టా పుచ్చుకుని, బ్రిటిష్ మలయాలో రబ్బరు తోటలలో పనిచేసే అనేక బీద కార్మికులు అనారోగ్య స్థితిలో బాధ పడుతున్నారని వార్తా పత్రికల ద్వారా తెలుసుకుని వైద్యునిగా వారికి సేవచేయడం తన కర్తవ్యం అనుకొని వారి సేవ నిమిత్తం మలయా వెళ్లారు. అక్కడ బీద ప్రజలకి ఉచితంగా వైద్యం చేస్తూ, వివిధ రోగాలని పోగొట్టి ఆయన వైద్యునిగా చాల పేరుప్రఖ్యాతులు, ఆర్ధిక బలం గడించినా, సంతృప్తి కలగలేదు. మానవ జన్మకు శారీరిక స్వస్థత కూర్చడం ఒక్కటే ఒక్కటే చాలదు, ఇంకా ఏదో చెయ్యాలి, పొందాలనే తపనతో, మలయాలోని వైద్య వృత్తిని వదలి స్వదేశానికి వచ్చేసారు. అదే తపనతో దేశమంతా తిరిగి 1924 లో ఋషికేష్ లో విశ్వానంద సరస్వతిని కలిసి, వారి బోధనలకి ముగ్ధుడై ఆయనలో తన గురువుకు కావల్సిన లక్షణాలున్నాయని గుర్తించి, వారి శిష్యరికాన్ని కోరి, ఆయన వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని ఆశించారు. శ్రీ విశ్వానంద సరస్వతి, కుప్పుస్వామి క్రమశిక్షణ, పద్ధతులని పరీక్షించి సంతోషించి, కుప్పుస్వామిని శివానంద సరస్వతిగా తీర్చిదిద్ది, వారు, శృంగేరి శంకరమఠాధీశులు విష్ణుదేవానంద సరస్వతి ఋషికేశ్ కి వచ్చినప్పుడు వారి దగ్గరికి కుప్పుస్వామిని పంపి వారిచేత సన్యాసాశ్రమాన్ని ఇప్పించారు. స్వామి శివానంద ఋషికేశ్ లోనే ఉంటూ చాలా ఏళ్లు ఆశ్రమధర్మాలని పాటిస్తూ, అవసరమైన వారికి వైద్య సహాయం చేస్తూ, 1927 లో లక్ష్మణ ఝూలా వద్ద  'ముని కి రేతి' లో ఒక పశువుల శాలని తీసుకుని క్రమంగా దాన్ని వృద్ధిచేసి ఉచిత వైద్యశాల గా మార్చి అక్కడే వైద్యశాల నడపడం ప్రారంభించారు. అది చాల కాలం సక్రమంగా నడిచి అక్కడి ప్రజలకు చాల సేవలందించింది.

సన్యాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత, అయన దేశంలోని అనేక పవిత్ర స్థలాల్ని దర్శించి అక్కడ తపస్సు చేసి మనోవికాసాన్ని ఆత్మోన్నతిని పొంది, తరువాత ‘శివానంద ఆశ్రమా’న్ని, దానిలోనే "డివైన్ లైఫ్ సొసైటీ" అనే సంస్థని 1936 లో పవిత్ర గంగా నదీ తీరాన స్థాపించారు. సనాతన ధర్మాన్ని క్షుణంగా చదివి, తెలుసుకుని, చర్చించి, అందరికి అర్ధమయ్యే తీరులో ఆంగ్లంలో విశదీకరిస్తూ వైదిక సాహిత్యాన్నిఆంగ్లం లోకి అనువదించి, వివరణలను అందించారు. ఆంగ్లంలో సనాతన ధర్మాన్ని దానిలోని చాల అంశాలని గురించి ఇంత విపులంగా వివరించిన మొదటి వ్యక్తి గా నిలిచారు. అది మన దేశానికే కాకుండా ఆంగ్లం వాడుకలోనున్న అనేక దేశాలకి హిందూ తత్వాన్ని, ఆలోచనని ఆవిధంగా తెలియచెప్పినట్టయినది. స్వామి శివానంద పతంజలి యోగసూత్రాలని విశదీకరించి, ఇతర యోగసూత్రాల తో (కర్మ, భక్తి, జ్ఞాన, రాజ యోగాలని) సమన్వయ పరచి,  క్రోడీకరించి "శివానంద యోగ" గా రూపొందించి ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. ‘శివానంద యోగ’ యొక్క ముఖ్య ప్రబోధ తత్వ మేమిటంటే - "సేవ చేస్తూ ప్రేమించు, ప్రేమని పంచు, నీ ఆలోచనలని స్వచ్ఛంగా ఉంచుకో, ధ్యానం ద్వారా సత్యాన్ని గ్రహించి దైవత్వాన్ని దర్శించు, ఆ ఆనందాన్ని అనుభవించు, సహృదయంతో ఇతరులని అర్ధంచేసుకుని, వారిపై దయా దాక్షిణ్యాలని చూపించు". 'నేనెవ్వరు?' అనేది తర్కించి, విచారించి తెలుసుకోవడం తత్వవేత్తగా, వేదాంతాధ్యాయిగా నీ ప్రధమ కర్తవ్యం. ధ్యానం దానిలో ఒక ప్రధాన అంశం. ధ్యానం, ఉద్రేకపూరిత ఆలోచనల్నుంచి విముక్తుల్నిచేసి, పరిపరి విధాలా పరిగెత్తే మనస్సుకి కళ్లెంవేసి అలోచనారహిత స్థితికి చేర్చి, మెల్లగా మనుసుని నిర్మలం చేసి బాహ్య ప్రపంచంనుంచి అంతర్గతంగా వుండే ఆనందం వైపు దృష్టిని మరలిస్తుంది. యోగం మతం కాదు, కానీ అన్ని మతాలలో దాగిఉన్న నిజాన్ని, అన్ని మతాలు బోధించేది, చర్చించేది, అఖండానందాన్ని కలిగించేది అయిన ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే గొప్ప సాధనం. యోగము ఆ భగవంతునికి దారిచూపి, ఆయన దరిచేర్చే సాధనం అంటారు స్వామి శివానంద.

Swami Vishnudevanandaస్వామి శివానంద ప్రధాన శిష్యులు స్వామి విష్ణుదేవానంద, "శివానంద యోగ' యొక్కముఖ్య వ్యాపకులు. ఐదు సూత్రాలపై పనిచేసే ఈ ‘శివానంద యోగ’ ని ఆయనే బహుళ ప్రచారంలోకి తెచ్చారు.

అవి:

  1. శరీరమే ఇహానికి పరానికి సాధనం గనుక దానిని యోగ సాధన ద్వారా సంరక్షించుకో.
  2. ప్రాణాయామం తో శరీరాన్ని మెదడుని ఉత్తేజపరిచి శరీర, మానసిక, దారుఢ్యాల్ని పెంచుకో.
  3. శరీరానికి అవసరమైనంత విశ్రాంతినియ్యి.
  4. సరైన పౌష్టిక శాకాహారాన్ని తీసుకుని శరీరాన్ని సక్రమంగా పోషించు.
  5. ధ్యానం ద్వారా మనోస్థయిర్యాన్ని పెంచుతూ వేదాంత తత్వాన్ని అలవరుచుకో.

స్వామి విష్ణుదేవానంద ఈ అయిదు సూత్రాల ఆధారంగా యోగ శిక్షణ తరగతులని పొందుపరచి చాల మందికి శిక్షణ ఇచ్చారు.

Swami Sivananda Yoga Farm

తొమ్మిది శిక్షణ కేంద్రాలద్వారా యోగా, వేదాంత శిక్షణనిస్తున్నారు. అవి భారత దేశంలో మూడు - (ఉత్తరకాశి, మదురై, తిరువనంతపురం); అమెరికాలో రెండు (గ్రాస్ వాలీ, కాలిఫోర్నియా; వూడబోర్న్, న్యూయార్క్), నాస్సయు, బహమాస్ లో; క్కుబెక్, కెనడాలో; ఫ్రాన్స్ లో మరియు ఆస్ట్రియాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇవికాకుండా 'యోగా వేద సెంటర్స్' ఉత్తర అమెరికాలో ఆరు, దక్షిణ అమెరికాలో అయిదు, లండన్ లో ఒకటి, జర్మనీ లో రెండు, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లలో ఒక్కొక్కటి, ఇటలీ, లిథునియ, స్పెయిన్ లలో ఒక్కొక్కటి, భారత దేశంలో- చెన్నై, మదురై, తిరువనంతపురాలలో ఒక్కొక్కటి, ఢిల్లీలో రెండుపనిచేస్తున్నాయి. వీటిలో బోధించే వివిధ విషయాలు- యోగా, మెడిటేషన్, సానుకూల దృక్పధం, శాకాహారం, ఉపవాసం, యోగా సూత్రాలు, భక్తి మార్గాలు, సత్సంగం-మనో వికాసానికి దాని ఉపయోగం, మొదలైనవి.

స్వామి శివానంద మూడొందలపైగా భావ పూరితమైన, ఆలోచనల రేకెత్తించే వేదాంత మూల గ్రంధాలు ఉపనిషత్తుల పైన, ఆదిభౌతిక విషయాల పైన, యోగ విషయాల పైన  వ్రాశారు. వాటిలో 'ఆలోచనా శక్తి', 'సాధన', 'ఆచరణీయ ఆయుర్వేదం', 'ఇంజినీర్లకు యోగ', 'ఆనందమే దైవం', మొదలైన గ్రంధాలే కాకుండా, కొన్ని ప్రధాన ఉపనిషత్తుల పైన, భగవద్గీత, బ్రహ్మసూత్రాల పైన వ్యాఖ్యానాలని ఆంగ్లంలో వ్రాసి, సంస్కృతం పరిచయంలేని వారికి వాటి, అర్ధాలు, నిగూఢార్థలూ వివరించారు. హిందూ సమాజంలో సామాన్యంగా పాటించే ఆచారాలు, ఆపద్ధతుల వెనక ఉండే భావాలూ వాటి గొప్పతనాన్ని విపులీకరించారు.

Swami Sivananda Ashramam

స్వామి శివానంద ఆయన జీవిత కాలంలోనూ, పిమ్మట కూడా చాల అద్భుతాలు చేశారని అనేకులు వ్రాసిన లేఖల ద్వారా, మరియు ఇతర వ్యాసంగాల నుంచి తెలియవచ్చింది. ఆయన శిష్యులకి కలలో కనబడి వారి ఆరోగ్య సమస్యలకిగాని ఆర్ధిక, సామజిక, వ్యక్తిగత సమస్యలకిగాని పరిష్కార మార్గం చూపే వారట. వారికి అవి అత్యంత క్లిష్ట పరిస్థితులలో గొప్ప మార్గదర్శిగా ఉండి ఊరట లభించేదట. వాళ్లంతా కృతజ్ఞతతో ఆయనకి ప్రణామాలు చేస్తూ లేఖల ద్వారా, వ్యాసంగాల ద్వారా తెలుపుకున్నారు.

ఒకమారు ఆయన అభిమానులందరూ కలిసి ఆయనకు ఇష్టంలేకపోయినా కనకాభిషేకం చేశారట. అది పూర్తి అయ్యాక ఆశ్రమానికి వచ్చి చీపురుకట్ట తీసుకుని ఒళ్ళంతా కొట్టుకుని దులుపుకుని దేహదండనం చేసుకున్నారట- ‘ఇదీ కనకంతో సరితూగేదే’ అనుకుంటూ.

ఆయనని కలవడానికి వచ్చే వారికి ఆయన పుస్తకాలు ఇవ్వడం పరిపాటి. ఒకసారి అలాగే ఒకరికి కొన్ని పుస్తకాలని ఇస్తే పక్కనే చూస్తున్నాయన ఆయనకి ఆంగ్లం చదవడం రాదని చెప్పారట. శివానంద విని నవ్వి ఊరుకున్నారట. రెండు నెలల తరువాత మళ్ళీ ఆరోజు పుస్తకాలు తీసుకున్నాయన వచ్చి ధన్యవాదాలు తెలుపుతూ ఆంగ్లం నేర్చుకుని అన్ని పుస్తకాలూ చదివానని చెప్పారట. అది ఆయన విజ్ఞతకు తార్కాణం.

వీరి శిష్యులలో ముఖ్యులు 'చిన్మయ మిషన్' వ్యవస్థాపకులు శ్రీ చిన్మయానంద సరస్వతి (స్వామి దయానంద సరస్వతి వీరి శిష్యులలో ఒకరు); ప్రెసిడెంట్ యోగ రీసర్చ్ ఫౌండేషన్, మియామి, అమెరికా- జ్యోతిర్మయానంద సరస్వతి; స్పిరిట్యుయల్ హెడ్ "డివైన్ లైఫ్ సొసైటీ అఫ్ సౌత్ ఆఫ్రికా"- సహజానంద సరస్వతి; ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 'ఇంటెగ్రల్ యోగ ఇన్స్టిట్యూట్స్', స్థాపకులు సచ్చిదానంద సరస్వతి. కెనడా నుంచి విష్ణు దేవానంద సరస్వతి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 'శివానంద యోగ వేదాంత కేంద్రాలకు' అధిపతులు గా పనిచేస్తున్నారు.

స్వామి శివానంద అకుంఠిత సేవాదక్షతతో చివరిదాకా పనిచేశారు. ఆయన సేవాతత్పరత చూసి హిమాలయాల్లోని చాలామంది యోగులు ఆశ్చర్య పోయేవారట. ఆయన ఆర్జించినదంతా అవసరమైన వారి సేవకోసమై వినియోగించి, తన భుక్తికై తనని గుర్తించలేని చోట భిక్షాటన చేసి దానితోనే తన కడుపు నింపుకోవడం ఒక వైద్య వృత్తిలో ఉన్నతస్థాయిని చేరి భోగభాగ్యాలు త్యజించిన నిజమైన సన్యాసి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. స్థలాభావం వల్ల ఇక్కడ ఆయన ను గురించి పూర్తిగా వివరించే వీలు పడదు. స్వామి శివానంద జీవిత చరిత్ర ఒక మహర్షి యొక్క ఆదర్శ అనుసరణీయ చరిత్ర. జనావళికి ఆయన ఆదర్శ మార్గదర్శి.

స్వామి శివానంద తన జాతకాన్ని పరీక్షించి చూసుకుని మరణ సమయాన్ని లెక్కించి, సరిగ్గా అన్ని గ్రహాలు ఉన్నత స్థితిలో ఉండగా, ఉత్తరాయణం ముగియబోయేముందు అంటే 14 జులై 1963 రాత్రి 11.45 గంటలకు మహాసమాధిని చేరారు. ఆరోజు ఉదయాన్నే జ్వరం తో ప్రారంభించిన అస్వస్థాస్థితి రాత్రి ఒక గ్లాసుడు పవిత్ర గంగాజలాన్ని సేవించిన పిమ్మట వారి ఆత్మ దేహత్యాగం చేయడం తో మహాసమాధి చేరింది. భారత దేశం ఆయన నిష్క్రమణతో ఒక గొప్ప తత్వ వేత్తని, ‘యోగా’ గురువుని, సనాతన ధర్మోద్ధారకుని కోల్పోయింది. స్వామి శివానంద పరమపదించినా ఆయన తీర్చి దిద్దిన, అశేష శిష్య గణం గురువులుగా పరిణతి చెంది, వారు స్థాపించిన శిక్షణాసంస్థలు బోధనా వేదికలై ఆయన ఆలోచనాతీరు, పాండిత్య సంస్కారాలని ప్రపంచంలో వ్యాపింపచేస్తూ, ఆయన రుణం తీర్చుకుంటున్నాయి.

'గతాన్ని గురించి అతిగా చింతించకు, అది పరాజయాలనే గుర్తుచేసి మనస్సును కలవర పరచి, దుఃఖాన్ని మనో వేదనని పెంచి, ఆలోచనా శక్తిని పరిమితం చేసి, వివేకతను క్షీణింప చేసి, మనిషిని నిర్వీర్యునిగా చేస్తుంది.' -స్వామి శివానంద

-o0o-

Posted in January 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!