Menu Close
sahiti-pudota

భాస్కర శతకము

ప్రేమను గూర్చి యల్పునకుఁ | బెద్దతనంబును దొడ్డవానికిం
దామతి తుచ్ఛపుంబని నె | దంబరికింపగ యీయరాదుగా
వామకరంబుతోడఁగుడు | వంగుడిచేత నపానమార్గముం
దోమఁగవచ్చునే మిగులఁదోచని చేఁతగుగాక భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! లోకంలో నీచునకు గొప్ప పదవిని గొప్ప వానికి చిన్న పదవిని నిచ్చి పనులు చేయించుట ఆ పని ఆలోచనలేనిదిగా ఉందును. ఎట్లనగా ఆలోచన లేక ఎడమ చేతితో భుజించుటయు, కుడిచేతితో మల మూత్రములు విడుచు ప్రదేశమును శుభ్రపరచుట వంటిదే అగును.

ఫలమతి సూక్ష్మమైన నృ | పాలుఁడు మంచి గుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని క | పేక్షయొనర్తు, రదెట్లు చంద్రికా
విలసనమైనఁదామనుభ | వింపఁ జకోరము లాసజేరవే
చలువగలట్టివాఁడగుట | జందురు నెంతయుగోరి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! పాలించెడి ప్రభువు మంచి గుణములు గలిగి సమర్థుడుగా ఉన్న ఎడల లాభము ఏ కొంచెమైనను చాలునని గుణవంతులైనవారు ఆశపడుదురు. వెన్నెల యందు కాంతి తప్ప వేరు ఆకలిని తీర్చు వస్తువు ఏమియును లేకున్నను చల్లని వాడని మాత్రమే వెన్నెల పిట్టలు (చకోర పక్షులు) చంద్రుని చుట్టును చేరును.

బంధురసద్గుణాఢ్యుఁడొక | పట్టున లంపటనొందియైన దు
స్సంధిఁదలంప డన్యులకుఁ | జాలహితం బొనరించుగాక, శ్రీ
గంధపుఁజెక్కరాగిలుచుఁ | గాదె శరీరుల కుత్సవార్థమై
గంథము లాత్మఁబుట్టు దఱు | గంబడియుండుట లెల్ల భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మంచి గంధపు చెక్క తాను అరుగుచూ, కరిగిపోవుచున్ననూ, తన యందున్న పరిమళమును జనులకు వెదజల్లుచు ఇతరులకు మేలు చేయును. అట్లే సద్గుణవంతుడు తానూ కష్టాలు పొందుతూ కూడా ఇతరులకు మేలు చేయును గానీ కీడును తలపెట్టడు.

బలము దొలంగుకాలమునఁ | బ్రాభవసంపద లెంత ధన్యుఁడున్
నిలుపుకొనంగ నోపఁడది | నిశ్చయ మర్జునుఁ డీశ్వరాదులం
గెలిచినవాఁడు బోయలకు  | గీడ్పడి చూచుచుఁగృష్ణుబార్యలం
బలువుర నీయఁడే నిలువ | బట్ట సమర్థుఁడుగాక భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! శివుడు మున్నగు దేవుళ్ళను గెలిచి వారిచే బహుమానములు పొందిన అర్జునుడు శ్రీ కృష్ణుని మరణానంతరము బోయవాండ్రకు లోబడి, కృష్ణుని భార్యలను కాపాడలేక బోయలకప్పగించెను. అట్లే దైవబలము పోయిన తర్వాత ఎంతటి గొప్పవాడైనను ప్రాభవ సంపదలు నిలుపుకొనజాలడు.

బల్లిదుఁడైన సత్ప్రభువు | పాయక యుండినఁగాని రచ్చలోఁ
జిల్లరవారు నూఱుగురు | సేరిన దేజము గల్గ దెయ్యెడన్
జల్లని చందురుండెడసి | సన్నపు జుక్కలు కోటియున్న రం
జిల్లునె వెన్నెలల్ జగము | జీఁకటులన్నియుఁబాయ భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! చిన్న నక్షత్రములు కోటి ఉన్ననూ చంద్రుడు లేకున్నచో ఆకాశములోని చీకటిని పోగొట్టలేవు. అట్లే బలవంతుడగు రాజు సభ యందున్నచో ఆ సభ కీర్తివంతమగును. కానీ చిల్లర వ్యక్తులెందరున్ననూ సభ రాణించదు.

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

Posted in June 2018, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!