భాస్కర శతకము
పలుమఱు సజ్జనుండు ప్రియ | భాషలె పల్కుఁగఠోరవాక్యముల్
బలుకఁడొకానొకప్పుడవి | పల్కిన గీడును గాదు నిక్కమే;
చలువకు వచ్చి మేఘుఁడొక |జాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు వేగిరమె | శీతల నీరము గాక భాస్కరా!
తాత్పర్యము: భాస్కరా! మేఘుడు నీటి బిందువులనే వర్షించును. తీవ్ర వేసవిలో చల్లదనము కొరకు వడగండ్లను కురిపించును. కానీ అవి రాళ్ళు కావు. చల్లని నీరగును. అట్లే మంచి వాడు మంచి మాటలనే పలుకును. ఒకవేళ సందర్భానుసారముగా పరుష వాక్యములు పలికిననూ ఆ మాటలు మేలు చేయును కాని కీడు చేయవని భావము.
పాపపుఁద్రోవవాని కొక | పట్టున మేను వికాస మొందినన్
లోపల దుర్గుణంబె ప్రబ | లుంగద నమ్మగఁగూడ దాతనిన్;
బాపట కాయకున్ నునుపు | పైపయిగల్గినఁకల్గుగాక యే
రూపున దానిలోఁగల వి | రుద్ధపుఁజేదు నశించు భాస్కరా!
తాత్పర్యము: భాస్కరా! దుర్మార్గునకు ఒకవేళ శరీర సౌందర్యము లభించిననూ మనస్సులో మాత్రము చెడు గుణములు అట్లే వ్యాపించి ఉండును. వానిని నమ్మరాదు. ఎట్లనగా చేదు పుచ్చకాయ మీది భాగము నునుపుగా ఉన్ననూ దాని లోపల ఉన్న చేదు గుణము ఏ విధముగానైననూ పోదని భావము.
పూనిన భాగ్యరేఖ చెడి | పోయిన పిమ్మట నెట్టి మానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రి | యంబునఁ బల్కరు పిల్వరెచ్చటం
దానది యెట్లొకో యనినఁ | దథ్యము పుష్పము వాడి వాసనా
హీనత నొందియున్న యెడ | నెవ్వరు ముట్టదురయ్య భాస్కరా!
తాత్పర్యము: భాస్కరా! పూవు వాసన లేక ఎండిపోయి వాసనను పోగొట్టుకొనిన పిదప దానిని ఎవ్వరునూ తాకరు. అది ఎట్టిది అనగా మానవుడెంత గొప్పవాడైననూ అదృష్టరేఖ తొలగిపోయినచో వానితో ఎటువంటి మనుష్యులు అయినా కూడా ఎవరునూ మాట్లాడరు. ప్రేమతో పిలవరు అని భావము.
పూరిత సద్గుణంబుగల | పుణ్యున కించుక రూపసంపదల్
దూరములైన వానియెడ | దొడ్డగఁజూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి | యందుల మాధురి చూచికాదె ఖ
ర్జూర ఫలంబులం బ్రియము | చొప్పడ లోకులు గొంట భాస్కరా!
తాత్పర్యము: భాస్కరా! సద్గుణములున్నవారికి సౌందర్యము లేకున్ననూ బుద్ధిమంతులు వారిని గౌరవించెదరు.అది ఏ విధముగానంటే! ఖర్జూరపు పండ్లపై భాగము ముడుతలతో గొగ్గిరిగా ఉన్నను దానికి గల మాధుర్య గుణముచేత అందరూ దానిని కొందురు గదా.
ప్రల్లదనంబుచే నెఱుక | పాటొక యింతయులేక యెచ్చటన్
బల్లిదుడైన సత్ప్రభు న | బద్ధములాడిన ద్రుంగిపోదు, రె
ట్లల్ల సభాస్థలింగుమతు | లై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం
గల్లలు గృష్ణునిం బలికి | కాదె హతంబగుటెల్ల భాస్కరా!
తాత్పర్యము: భాస్కరా! ధర్మరాజు చేసిన రాజసూయ యాగములోని సభ యందు చెడు బుద్ధితో కూడి శిశుపాల దంతవక్త్రులు శ్రీ కృష్ణపరమాత్మను అనేక విధముల దూషించిరి. అందుచే శ్రీ కృష్ణుని చక్రముచేత శిశుపాలుడు మరణించెను గదా! అట్లే పొగరుపోతుదనముచే బలవంతుడగు మంచి రాజును జ్ఞానము లేక నిందించినచో నశించిపోగలడు.
వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.
మూలం: పెద్దబాలశిక్ష