Menu Close
భారతీయ తత్వశాస్త్ర వివేచన
- రాఘవ మాష్టారు కేదారి -

గత సంచిక తరువాయి »

ఆత్మ గురించి వేదాలలో ఉన్న కొన్ని వాక్యాలను చూద్దాం:

  1. ప్రజ్ఞానం బ్రహ్మ.... చైతన్య స్వరూపమే నేను. సత్య స్వరూపమే బ్రహ్మ.
  2. అహం బ్రహ్మాస్మి.... నేనే బ్రహ్మను.
  3. తత్వమసి... అది నేనే, పరమాణు రూపంలో ఉన్న జీవం నేనే.
  4. అయం ఆత్మా బ్రహ్మ... బ్రహ్మ స్వరూపమే ఆత్మ స్వరూపం.. నిర్గుణ నిరంజన నిరాకార స్వయంప్రకాశ ఆత్మే బ్రహ్మ.

ఆత్మజ్ఞానం పొందిన సత్పురుషుని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం:

ఆత్మజ్ఞానం పొందినప్పుడు దశలవారీగా మానవునికి అనుభవం వస్తుంది.

నీది ..నేను ..నీవు ..అనే స్వపర బేధభావంతో నిండి ఉన్న మనసు ఆత్మయే సర్వస్వం అనే భావనను అనుభవంలోనికి తెచ్చుకుంటాడు సాధకుడు. ఈ దశలో సాధకుడు స్వపర బేధాలను విస్మరిస్తాడు. నానాత్మకంగానూ, భిన్నత్వంగాను, అనేకాత్మకంగానూ గోచరించే ఈ సమస్తమైన వస్తు ప్రపంచాన్ని, భావ ప్రపంచంలో ఏకత్వమైన రూపంలో చూడడానికై సాధకుడు ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే అతని మనోఫలకం మీద నానాత్వ స్వరూపం సమసిపోయి, ఏకత్వ స్వరూపం ప్రతిబింబిస్తుందో అప్పుడు ఆయనకు స్వపర బేధాలు గోచరించవు. ఏకతను, ఐక్యతను, సమతను మాత్రమే చూస్తాడు. ఈ ఐక్యత, సమతా దృక్పథంలో నుంచి ఏకతను మాత్రమే చూస్తాడు. దాన్ని కూడా అధికమించిపోయి చూస్తే చూడడానికి, వినడానికి, తాకడానికి, కదలడానికి, చేయడానికి అంటూ ఏమీ లేని స్థితికి మానసికంగా సాధకుడు ఎదుగుతాడు.

ఆ దశలను ఇప్పుడు చూద్దాం:

సాధకుని మొదటి దశ. (అనేకత్వం, నానాత్వం, పశ్యతిః)
అనేకత్వాన్ని భిన్నత్వాన్ని నానాత్వాన్ని సాధకుడు చూస్తాడు
రెండవ దశ. (నానాత్వం నపస్యతి)
నానాత్వాన్ని భిన్నత్వాన్ని చూడడు.
మూడో దశ. (సమతాం పశ్యతి)
సమానత్వాన్ని సాధకుడు చూస్తాడు.
నాలుగో దశ. (సమం పశ్యతి)
అన్ని సమానమనే దృష్టి ఏర్పడి స్థిరంగా ఉంటుంది
ఐదో దశ. (ఏకం పశ్యతి)
ఒక్కటే చూస్తాడు (బ్రహ్మ దర్శనం అవుతుంది)
ఆరోదశ. (నపశ్యతి)
చూడడానికంటూ ఆయనకు ఏమీ ఉండవు (చుట్టూరా అన్ని ఉంటాయి)

వచ్చే ముగింపు సంచికలో ఆత్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

****సశేషం****

Posted in March 2025, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!