వేద వేదాంగాలు, అనేక శాస్త్రాలు, పెక్కు పురాణాలు చదివిన పండితులైన, మేధావులైన వాళ్లు వారి ప్రతిభ కారణంగా ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ఎట్టి పాండిత్యం ఏమీ లేకున్నా, ఎవడు ఆత్మతత్వo కోసం తపిస్తాడో, సద్గురు బోధనలచే అంతర్ముఖుడై, ఆత్మ శోధన చేస్తారో వారు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందుతారు.
చెడు పనులు చేసేవారు, దుష్ట ప్రవర్తన గలిగే వారు, ఇంద్రియాల మీద అదుపు లేని వారు, కోర్కెలను అదుపు చేసుకోలేనివారు, మనసు ప్రశాంతత లేని వారు, అహాన్ని, ఈర్ష్య ను చంపుకోలేనివారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు.
ఆత్మసాక్షి అంటే మనస్సాక్షి అని అర్థం కాదు. శరీరం కంటే భిన్నమై శాశ్వతమైన నేననే భావన. అదే ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆత్మ జ్ఞానము అనగా మోక్షము పొందే మార్గము, పరమాత్మను తెలుసుకొనే తెలివిని పొందుతారు. దానినే ఆత్మజ్ఞానం అని అంటారు.
జీవించి ఉన్నంత కాలము నాది, నా వాళ్లు అనే స్వార్థ చింతనతో అరిషడ్ వర్గాలకు బానిసలై, గర్వాతిశయంతో మిడిచిపడేవారు ఆస్తులు అంతస్తులు, భూములు భవనాలు, సంపదలు, కీర్తి, అధికారం, కామ వాంఛల వెంట పడి జీవితం సాగిస్తున్నవారు, విద్యావంతులమని, పండితులమని, శాస్త్ర వాదోపవాదాలతో బ్రతుకుతూ, పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడేవారు, ఈ శరీరం, ఈ సంపదలు, బాంధవ్యాలు, శాశ్వతాలని భావిస్తూ, ఇవి అశాశ్వతములని తెలుసుకోలేనివారు, వారి హృదయములో ఉన్న ఆత్మ గురించి ఎప్పటికీ తెలుసుకోలేరు. వారు జనన మరణ చట్రంలో పడి మరలా మరలా పుడుతూ గిడుతూ కొట్టుకుపోతుంటారు. అలాంటి వాళ్లకు ఆత్మజ్ఞానం అనేది చాలా కష్టం. ఈ ఆత్మ శాశ్వతమని, దానిని ధ్యానించినప్పుడే, శాశ్వతత్వాన్ని, ముక్తిని పొందుతామని తెలుసుకోలేరు. మృత్యువు నుండి తప్పించుకోలేరు. ఈ విషయాలను ఉపనిషత్తులలో తెలియజేశారు.
హృదయమనే గుహలో వెలిగే ఆత్మజ్యోతిని చూడటం అందరికీ సాధ్యం కాదని, ఓంకార మంత్ర జపంతో అంతర్ముఖులై, ధ్యానముఖులై, ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి సద్గురువు ఉపదేశంతో సాధన చేసే వారికి ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఉపనిషత్తులు వెల్లడించాయి.
ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మౌనం అనేది మరొక పద్ధతి. మౌనం కూడా బ్రహ్మచర్యంతో సమానమే. మౌనం అనే సాధనాన్ని ఆలంబనగా చేసుకొని సాధకుడు ఆత్మజ్ఞానం పొందుతాడు. ధ్యాన మార్గం గుండా ఆత్మానుభూతిని పొందుతాడు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం. మాట్లాడకుండా మౌనం పాటించడం అంటే, మామూలు సంజ్ఞలతో మాట్లాడకుండా, భావాలను తెలియజేయడం కాదు. మనసులోనికి ఎలాంటి ఆలోచనలు ప్రవేశించకుండా తురీయ స్థితిలోకి మనసు కరిగిపోయి, కేవలం పరమాత్మ ధ్యానములోనే లీనమైపోవడమే అసలైన మౌనం. ఇదే ఆత్మ సాక్షాత్కార్యాన్ని కలిగించే మార్గం.
బుద్ధుడు ఆత్మ పరమాత్మను నిరాకరించాడు. వేద ప్రామాణ్యాన్ని ఖండించాడు. వర్ణ వ్యవస్థను త్రోసిపుచ్చాడు. అయితే జైన మతం జైన సాకార ఆత్మ భావనే గాక, అనేకాత్మవాదాన్ని తెలియజేసింది. మనుషులకే గాక, జంతువులకు, చివరకు రాళ్లరప్పలకు కూడా ఆత్మ ఉంటుందని జైన మతం విశ్వసిస్తుంది.
లోకాయతులు, చార్వాకులు మొదలగు నాస్తికులు ఆత్మను విశ్వసించరు. వారు ఉన్నదొకటే శరీరము, మరణించిన తర్వాత అది పూర్తిగా కాలి శరీరము మొత్తము బూడిద అయిపోతుంది. గాలిలో మట్టిలో కలిసిపోతుంది. అంతేగాని అక్కడ ఆత్మ అంటూ ఏదీ ఉండదని వారి భావన.
ఆత్మను అనేక విధాలుగా శంకరాచార్యులు వర్ణించారు. వారు ఆత్మ గురించి, ఆత్మ స్వరూపాన్ని గురించి ఈ విధంగా తెలియజేశారు.
ఉపనిషత్తులు ఆత్మను అనేక విధాలుగా వర్ణించాయి. వ్యవహారిక అనుభవంలో అంతర్గతంగా ఉన్న సత్యాన్ని అన్వేషించి తెలియచెప్పేదే ఆధ్యాత్మిక విద్య. కంటికి కనిపించే ఈ సమస్తమైన భౌతిక ప్రపంచానికి ఆధార భూతమైనది ఏమిటి? ఈ ప్రశ్నను అన్ని దర్శనాలు చర్చించాయి. కానీ శంకరుడు చెప్పిన సమాధానం మాత్రం విశేషంగా గోచరిస్తుంది. మన ఇంద్రియాలు మనలను మోసం చేయవచ్చు, మన స్మృతి జ్ఞానంలో లోపం ఉండవచ్చు. భవిష్యత్తు విషయాలు మన ఊహాగానాలు కావచ్చు. కానీ వీటన్నింటినీ మించి ఏదో ఒక అంతర్గతమైన శక్తి ఉన్నట్లు మనకు తోస్తుంది. ఆ శక్తియే, ఆత్మ, పరమాత్మ. ఆత్మ ఉనికిని ప్రత్యేకించి రుజువు చేయనక్కరలేదు. ఆత్మ స్వయం ప్రకాశం కలది. బుద్ధికి, మనసుకు ఇంద్రియాలకు ఆత్మ ఒక సంధాతగా ఉంటుంది. వాటి ద్వారా ఆత్మను తెలుసుకోలేము. తర్కం ద్వారా ఆత్మను గురించి తెలుసుకోలేము. అయితే మనకు లభించే జ్ఞానం ఆత్మ స్వరూపమే. అంటే జ్ఞానం, ఆత్మ రెండు భిన్నం కావు .. ఆ రెండు ఒకటే. జ్ఞాన స్వరూపమే ఆత్మయే జ్ఞాన స్వరూపం. ఆత్మతో సంబంధంలేని జ్ఞానం కానీ, అనుభవం కానీ ఉండవు. ఆత్మభావానికి ఆత్మయే విషయమవుతుంది. ఆత్మ స్వయంగా విదితమవుతుంది. ఆత్మను గురించి ఏ ప్రమాణం ద్వారానూ తెలుసుకోలేము. అన్ని ప్రమాణాలకు ఆత్మయే ఆధారం .అన్ని ప్రమాణాలు వాటి సుసంగత్వానికి ఆత్మను ఆశ్రయించి ఉంటాయి. ఆత్మ ఒక సాధ్య వస్తువు కాదు. అది సిద్ధ వస్తువు. అది ఎప్పుడూ ఉన్నదే. దాని గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక విద్య అవుతుంది.
శంకరుని దృష్టిలో అహం ప్రత్యయ విషయరూపమైన కర్తకు, ఆత్మ భిన్నంగా ఉంటుంది. అది సర్వసాక్షి. అది ఏకంగానూ, అద్వితీయంగానూ అన్నింటిలోనూ సమానంగా ఉంటుంది. ఆత్మ లేదని ఎవరైతే చెబుతారో వారి స్వరూపమే ఆత్మ. అందువల్ల దానిని ఎవరు లేదని చెప్పలేరు. కనుక ఎవరైనా మరణిస్తే శరీరం నశించిందని భావించాలి కానీ. ఆత్మ నశించిందని చెప్పడానికి వీలు లేదు. జనన మరణాలు ఆత్మ ఉపాధులు. అవి ఆత్మ స్వరూపాలు కావు.
జ్ఞానం ఆత్మకు ఆగంతుక ధర్మమని కొందరన్నారు. అంటే ఆత్మలో జ్ఞానం వస్తూ పోతూ ఉంటుంది. కానీ శుద్ధ జ్ఞానమే ఆత్మ స్వరూపమని శంకరులు చెప్పారు. నిద్ర మొదలైన అవస్థలలో కూడా ఆత్మ, జ్ఞాన స్వరూపమే. మాయా మోహితమైన ఈ ప్రపంచంలో ఆత్మ ఉన్నంతకాలం దాన్ని జీవుడని పిలుస్తారు. బుద్ధికి వర్తించే లక్షణాలన్నీ జీవునికి వర్తిస్తాయి. అహంకార మమకారాలు, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, మొదలైన గుణాలన్నీ జీవి సంసారంలో ఉన్నంతకాలం ఉంటాయి. అయితే అవి ఆత్మకు ఎంత మాత్రం వర్తించవు. ఆత్మ తన స్వరూపాన్ని గుర్తించినప్పుడు, జీవి ప్రపంచం ....అంతా దానికి మిథ్యగా గోచరిస్తాయి కానీ అంతవరకు అన్ని యధార్ధమే.
ఆత్మ స్వయం ప్రకాశమని, స్వయం సిద్ధమని, శుద్ధ జ్ఞాన స్వరూపమని, చావుపుట్టుకలు దానికి లేవని చెప్పాము. జీవుడు అనేకమైన కర్మలు చేస్తాడు. అందులో కొన్ని మంచి కర్మలు కావచ్చు. కొన్ని చెడు కర్మలు కావచ్చు. అవిద్యా ప్రభావం వలన కర్తృత్వం.. భోకృత్రుత్వం ఆపాదించబడ్డాయే కానీ, యదార్థ దృష్టితో చూస్తే ఆత్మకు కర్త భోక్త అనేవి అంటవు. నిత్యం మనకు కనిపించే కొన్ని సాధారణ అంశాల సహాయంతో ఈ విషయాన్ని శంకరుడు వివరించారు. ఉదాహరణకు ఒక వడ్రంగి ఉన్నాడనుకుందాం. ఆయన శ్రమించేటప్పుడు ఉలి, కత్తి, రంపం, బాడిస మొదలైన పనిముట్లతో తన పనిని నిర్వహిస్తాడు. కానీ పని అయిపోయిన వెంటనే వాటిని ప్రక్కన పెడతాడు. అంటే అతని విశ్రాంతి సమయంలో ఆ పనిముట్లకు ఆయనకు ఏమీ సంబంధం లేదు. అదే విధంగా ఆత్మ, శరీరం, బుద్ధి, అంతకరణం, మనసు ఇంద్రియాలు అనే పనిముట్లతో జాగృతావస్థ లో పనిచేస్తుంది. దాని అసలు స్వరూపంలో వీటికి ఆత్మకు ఏ విధమైన సంబంధం ఉండదు.
” భారతీయ తత్వశాస్త్ర వివేచన ” ద్వారా, సమకాలీన ప్రపంచంలో, మానవుడి నేటి జీవన సరళిలో, ” భౌతిక జీవనం – ఆత్మానుభూతి ” గురించి అరటిపండు వలిచి చేతికి అందించినట్లు, వాస్తవాన్ని సవివరంగా విపులీకరించారు, రాఘవ మాష్టారు గారు, కృతజ్ఞులం,
,
,
.
GOOD JOB THANKS FOR SHARING. WE PREACH ATMA GNANA