Menu Close
భారతీయ తత్వశాస్త్ర వివేచన
- రాఘవ మాష్టారు కేదారి -

గత సంచిక తరువాయి..

ఆత్మ వివేచన

ప్రతి మానవుడు తన జీవితంలో ఒక్కసారైనా ఆత్మ (soul, spirit) అనే పదాన్ని తప్పక ఉపయోగిస్తాడు, ఉచ్చరిస్తాడు. సాధారణ పరిభాషలో ఆత్మ అంటే మనిషి లోపల ఉండే మనసు, బుద్ధి ,చిత్తం, అని చెప్పవచ్చు. ప్రతి మతంలోనూ ఆత్మ గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే హిందూ మతంలో ఆత్మ అనే తాత్విక భావన చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఆత్మ అనేది, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సారాంశం. సామాన్య మానవుని భావనలో ఆత్మ అంటే మనసు, గుండె.

మనలో చాలామందికి ఆత్మ గురించి, దాని స్వభావం గురించి అర్థం తెలుసుకోవడం చాలా కష్టంగానూ సంక్లిష్టంగా ఉంటుంది. అది నారికేళ పాకం వంటిది. జగంలో చాలామంది ఆత్మ ఉందంటారు. మరి కొందరు ఆ ఆత్మే లేదంటారు. అది భౌతిక వాదుల, అభౌతిక వాదుల (ఆస్తికుల, నాస్తికుల) సంవాదం పై ఆధారపడి ఉంటుంది. కానీ ఆత్మ అనే భావన తెలుసుకుంటే ఎంతో మానసిక వికాసం, మనోధైర్యం, మనిషికి జీవితం పై రక్తి, భక్తి, ముక్తి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు.

స్థూలంగా చెప్పాలంటే శరీరాలు రెండు రకాలు 1. స్థూల శరీరం అంటే మనం చూస్తున్న, మోస్తున్న శరీరం. 2. సూక్ష్మ శరీరం అది మన లోపల అంతర్లీనంగా ఉండేది. అంటే స్థూల శరీరం నశిస్తుంది. సూక్ష్మ శరీరం నశించదు. ఆ నశించని సూక్ష్మ శరీరoలో ఉండే నాశనరహితమైన జీవుడే ఆత్మ అని చెబుతుంటారు.

ఆత్మ అనేది స్వయం అస్తిత్వ సారాన్ని సూచిస్తుంది. అనగా ఆత్మను మనుషులలో ఉండే భగవత్ స్వరూపం లేదా భగవంతుని అంశం అని చెప్పవచ్చు. ఆత్మ రెండు రకాలు 1. జీవాత్మ (అన్ని జీవులలో ఉండేది) 2. పరమాత్మ (ప్రకృతిలో, విశ్వములో నిండి ఉండేది).

ఆత్మ అనేది సంస్కృత పదం. దీనికి సారం, శ్వాస, వ్యక్తుల స్వీయతత్వం అని అర్థం. అయితే భాషాపరంగా ఆత్మకు అనేక నానార్ధాలు గలవు. అవి జీవుడు, బుద్ధి, బ్రహ్మము, మనసు, శరీరం, స్వభావము, గుండె, హృదయం, అంతరంగం, ప్రయత్నం, ధైర్యం మొదలైనవి. అదే అచ్చ తెలుగులో ఆత్మకు ఇచ్చ, ఎడద, ఎద, ఎదపట్టు, గుట్టుపట్టు, తాను, లోతాను, లోపట్టు, లోఉనికిపట్టు, ఎదరి అని చెప్పవచ్చు.

ఆత్మ అంటే వ్యక్తి యొక్క నిజమైన స్వయం లేదా స్వీయ ప్రకాశించే స్పృహ, అంతర్గత సారాంశంగా భావించవచ్చు. అయితే హిందూ మతం ప్రకారం ఆత్మ అంటే శరీరం లేదా మనసు లేదా స్పృహతో సమానం కాదు, కానీ ఆత్మ వీటన్నింటికీ మించిన అంతర్గతమైన దేవుని అంశం. స్వచ్ఛమైన దైవిక సారాంశం, మార్పులేని, శాశ్వతమైన, అంతర్లీనమైన ప్రకాశం. అది వ్యక్తిత్వం ద్వారా ప్రభావితం కాదు. అహంతో ప్రభావితం కాదు. అది చలిస్తుంది, చలించదు. అది ప్రకాశిస్తుంది, ప్రకాశించదు. ఆత్మ నాశనం కానిది. శస్త్రం ఛేదించలేనిది. అగ్ని దహించలేనిది. నీరు తడపలేనిది. వాయువు ఆర్ప లేనిది. అది నీలో ఉన్న భగవంతుని అంశం. దానికి చావు పుట్టుకలు లేవు. ఆత్మ దేని నుండి ఉత్పన్నం కాదు. కాలేదు. ఆత్మనుండి ఏది పుట్టదు. జన్మరహితమై ఎప్పటికీ శాశ్వతమైనది. ఆత్మనే అంతరాత్మ అని కూడా అనవచ్చు. దీనికి కుల మత వర్గ రూప భేదాలు ఉండవు. ఇది ఒక దివ్య శక్తి. శరీరం నశించినా ఆత్మ అలానే ఉంటుంది.

భారతీయ తత్వశాస్త్రంలో ఆత్మ అనేది ఒక కేంద్ర భావన. ఇది ఆత్మ వ్యక్తిగతoగా నేనే (జీవాత్మ) సర్వోన్నతంగా నేనే (పరమాత్మ). ద్వైత అద్వైత సిద్ధాంతాలకు పునాది ఈ ఆత్మ భావనే. శంకరుని అద్వైతం ప్రకారం ఆత్మ పరమాత్మ ఒకటే. మధ్వాచార్యుల ద్వైతం ప్రకారం ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఈ శరీరం పుట్టినప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం చనిపోయేటప్పుడు ఏదైతే మార్పు లేకుండా ఒకటిగా శరీరంలో ఉన్నదో అదే ఆత్మ. ఆత్మే నువ్వు.

మరో విధంగా చెప్పాలంటే, ఏదో ఒక నాటికి తప్పక మరణించే ఈ శరీరం నువ్వు కాదని తెలుసుకొని, ఈ శరీరం శాశ్వతం కాదని, నీ అనుభవములోనికి తెచ్చుకొని, ఈ మాయాలోక భ్రమల నుండి నువ్వు నువ్వుగా బయటకు వచ్చి, ఈ శరీరం నేను అనే భ్రమను తొలగించుకొని, ఆత్మను నేను, అనే భావన కలిగి, ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానం పొందిన వ్యక్తికి చిత్, సత్, పరమానందం కలుగుతుంది. ఇక అతనికి, అతని మనసుకు ఎలాంటి ద్వంద భావనలు ఉండవు. అంటే సుఖదుఃఖాలు, బంధాలు అనుబంధాలు, ప్రేమలు, ద్వేషాలు ఏ విషయాలు పట్టవు. ఆలోచనలు రావు. మొదట భిన్నత్వంలో ఏకత్వం, తరువాత ఏకత్వంలో భిన్నత్వం ఆస్వాదిస్తాడు. ఒకసారి అజ్ఞానాన్ని తొలగించుకొని, ఆత్మస్థితిలోనికి ప్రవేశించిన వారు ఆత్మసాక్షాత్కారం పొందుతారు. మరో విధంగా చెప్పాలంటే, ఆత్మంటే శుద్ధ చైతన్యం. అది అన్ని జీవులలో అంతర్గతంగా ఉండేది. జనన మరణాలకు లోబడి శరీరంలో ఉన్నప్పుడు దానిని జీవాత్మ అంటారు. పరమాత్మ శాశ్వతమై ప్రతి జీవాత్మ హృదయములో సాక్షిగా మరియు బయట విశ్వాన్ని నియంత్రిస్తూ ఉండే అత్యున్నత శక్తి. అదే పరమాత్మ.

నిజానికి ఆత్మ అనేది అణువు కన్నా సూక్ష్మమైనది. కాబట్టి అది తర్కానికి, వాదోపవాదాలకు అతీతమైనది కావున ఆత్మజ్ఞానాన్ని, దాని అనుభూతి సిద్ధించాలంటే, దానికి సద్గురు కటాక్షం కావాలి. అతని ద్వారా ఉపదేశ రూపంలో ప్రసాదించినప్పుడే, ఆత్మవిద్య అవగతం అవుతుంది. అది అభౌతికమైనది కనుక సద్గురు మార్గదర్శనం ద్వారా ఆధ్యాత్మిక సాధన మార్గం ద్వారా ధ్యానించి సుఖదుఃఖాలకు అతీతమైన ఆత్మానుభవ స్థితిని పొందవలెను.

భౌతిక శరీరం వేరు. శరీర హృదయమనే గుహలో జ్యోతి లాగా వెలిగే ఆత్మ వేరు, ఆత్మకు సాధనంగా పనిచేసే పరికరమే భౌతిక శరీరం. అంతేగాని శరీరమే ఆత్మ కాదు. ఈ సత్యాన్ని సద్గురువు ఉపదేశం ద్వారా విని, అర్థం చేసుకోవాలి. అలా సత్య స్వరూపాన్ని బాగా వివేచన చేసి తెలుసుకోవాలి. శరీరం నుండి విడదీసి ఆత్మను తెలుసుకోవాలి. ధర్మాధర్మాలు, కార్య కారణాలు, భూత భవిష్యత్తు కాలస్వరూపాలు మొదలగు అన్నిటికన్నా అతీతమైనది ఆత్మ తత్వం అని గ్రహించాలి.

ఆత్మ అన్ని జీవుల శరీరాలలో ఉంటుంది. నశించిపోయే వస్తువులన్నింటిలోనూ ఉంటుంది. ఆత్మ సర్వత్రా నుండి ఉన్నది. సత్యమార్గంలో బుద్ధి వికాసం కలిగి ఉన్నవారు ఈ ఆత్మతత్వం తెలుసుకొని బంధ విముక్తులవుతారు.

****సశేషం****

Posted in January 2025, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!