Menu Close
భారతీయ తత్వశాస్త్ర వివేచన
- రాఘవ మాష్టారు కేదారి -

గత సంచిక తరువాయి..

ఇక వేదాలలో సుఖ జీవనానికి, మనోవికాసానికి, మానవ ప్రశాంత జీవన విధానానికి, సంబంధించిన అనేక విషయాలు, ఆధ్యాత్మిక ఆలోచన విధానాలు చర్చింపబడినాయి. కనుక మనము నేటి అతి భౌతికవాద దృక్పథాన్ని వదిలి, సరైన ఆధ్యాత్మికత మార్గంలో పయనించడంలో, ఎలాంటి అపోహలు ఉండరాదు అని కొందరి భావన. ఎక్కువ మంది వాదన.

ఆధ్యాత్మికత అంటే ఆధి+ఆత్మ ....ఆధ్యాత్మిక అంటే మనోవేదనకు, మనసుకు చెందిన ఆలోచనలు, మనో వ్యధ అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికత అంటే అది విశ్వజ్ఞానం. అదే నీవు నేను ఒకటే అనే భావం. అదే జీవుడు దేవుడు ఒకటని, జీవుడు దేవుడు వేరు కాదని, ఉన్నదంతా ఒకటేనని, అది నీవు అని, అదే పదార్థమని, అదే శక్తి అని, అదే దేవుడని, అదే ఇది అది అని అద్వైతం చెబుతుంది. అదే ధర్మం, అదే సత్యం, అదే దయ, అదే కరుణ అని వేదాలు ఘోషిస్తున్నాయి. మనిషి బ్రతకడమే కాదు మనిషి జీవించాలి అంటే సమాజంలో తాను బ్రతుకుతూ పదిమందిని బ్రతికించాలి. అదే జీవితమంటే. ఆ జీవితానికి కావలసిన సత్యాలను జీవన గమన సుధామయ విషయాలను ఎంత చక్కగా వివరించారో ఒకసారి చూద్దాం. ఇటువంటి విషయాలు మరి ఏ ఇతర మత గ్రంథాలలోనూ లేవని చెప్పవచ్చు. వాటిని మన వేదాలు ఎలా చెప్పాయో ఒకసారి చూద్దాం.

సత్యం వద... సత్యాన్ని చెప్పు
ధర్మం చర... ధర్మాన్ని ఆచరించు
మాతృదేవోభవ.. నీ తల్లిని దైవంగా భావించు
పితృదేవోభవ.. నీ తండ్రిని దేవుడుగా భావించు
ఆచార్యదేవోభవ.. నీ గురువుని దేవునిగా భావించు
అతిధి దేవోభవ.. ఇంటికి వచ్చిన అతిధిని దేవునిగా భావించు
శ్రద్దయా దేయం.. ఎవరికి ఏది అయినా ఇచ్చేటప్పుడు శ్రద్ధతోఇవ్వు
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మసి.. మనకు కనిపించేదంతా బ్రహ్మ స్వరూపమే
బ్రహ్మ వదిష్యామి.. బ్రహ్మము గురించి తెలుసుకుందుము గాక
అసతోమా సద్గమయ.. ఏదైతే యదార్థం కాదో, దాన్నుంచి యదార్ధమైన దానిని పొందుదుముగాక
తమసోమా జ్యోతిర్గమయ.. చీకటి నుండి వెలుగులోకి వెళుదుము గాక
మృత్యూర్మా అమృతoగమయ.. మన మరణము నుండి పునర్జన్మ అమృతత్వానికి నిర్వాణ పథానికి వెళుదుము గాక
ఆత్మనస్తు కామాయ ప్రియం భవంతి.. అసలు ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మ కోసమే ప్రీతిపాత్రమవుతుంది.
తత్వమసి.. అది నీవే, సూక్ష్మరూపంలో ఉండే జీవం నేనే.
త్వమేహమ్.. నువ్వే నేను, నేనే నువ్వు
అహం బ్రహ్మాస్మి.. నేనే బ్రహ్మము (జ్ఞానము )
ప్రజ్ఞానం బ్రహ్మ..  చైతన్య స్వరూపమే నేను
ఆయం ఆత్మ బ్రహ్మ.. బ్రహ్మ స్వరూపమే ఆత్మ స్వరూపం. (నిర్గుణ నిరంజన, నిరాకార బ్రహ్మమే ఆత్మ)
సర్వం ఖలిద్వం బ్రహ్మ.. అంతా బ్రహ్మమయమే.

అని వేదాలు ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, సృష్టి, బ్రహ్మము, మనసు, జీవితం గురించి వివరిస్తున్నాయి. కనుక  వేదాలలో ఉన్న మంచి విషయాలను జీవితానికి అన్వయించుకొని సర్వేజనః సుఖినోభవంతు, సమస్త లోకా సుఖినోభవంతు అంటూ జీవనం సాగించడమే భారతీయ తత్వ శాస్త్ర ముఖ్య ఉద్దేశం.

ఓం శాంతి శాంతి శాంతిః

****సశేషం****

Posted in December 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!