Menu Close
భారతీయ తత్వశాస్త్ర వివేచన
- రాఘవ మాష్టారు కేదారి -

నేను ఎవరు? నీవు ఎవరు? ఈ ప్రపంచం ఏమిటి? మనం ఎక్కడ నుంచి ఈ లోకానికి వచ్చాము? ఇక్కడ నుండి ఎక్కడకు పోతాము? జననానికి ముందు మనం ఉన్నామా? చనిపోయాక మనం ఏమవుతాము? ఈ చుట్టూరా ఉన్న ఈ విశ్వ రహస్యం ఏమిటి? దీనిని ఎవరైనా పనిగట్టుకుని సృష్టించారా!? లేక తానంతట తానే పుట్టిందా!? మానవునిగా పుట్టడం, పెరగడం, బ్రతకడం, పెళ్లి పిల్లలు ,డబ్బు, కోరికలు, సుఖదుఃఖాల జీవితం, వ్యాధులు, ముసలితనం, మరణించడం ఏమిటి, జనన మరణ చక్ర భ్రమణం ఇదే నా మానవ జీవితం? ఇంతకంటే మరో పరమార్థం ఏదైనా ఉన్నదా!? ఉంటే అదేమిటి? ఆ శక్తి ఏమిటి? ఆశక్తి ఇలా మనిషిని ఎందుకు పుట్టించింది? ఆ శక్తికి ఆది, అంతము ఉందా?ఎవరైనా చూశారా? ఇలా అనేక ప్రశ్నలు వందల వేల సంవత్సరాల నుండి మానవునిలో అలజడి రేపుతున్న ప్రశ్నలు? సమాధానాల కోసం పరితపిస్తున్న ప్రశ్నలు?

ఈ ప్రశ్నలే ఈ ఆలోచనలే దర్శనాలు, తత్వశాస్త్రాలు, సిద్ధాంతాలు, ధర్మ సూక్ష్మాలు, పరమాత్మ భావనలు, మొత్తంగా భారతీయ తత్వశాస్త్రము. భారతీయ దర్శన శాస్త్రము. భారతీయ ఫిలాసఫీ. భారతీయ వేదాల సారము. దీనిని ఆంగ్లంలో “ఫిలాసఫీ” అని, సంస్కృత భాషలో రకరకాలుగా పిలిచారు. కొందరు తత్వశాస్త్రమని, కొందరు తర్కశాస్త్రమని, కొందరు అన్వీక్షికి అని, మరి కొందరు మనన శాస్త్రమని, విచారణ శాస్త్రం అని, మననశీల ఆలోచన శాస్త్రమని, వేదాంతమని భావిస్తున్నారు.

బౌద్ధులు నిర్వాణ సోపానాల శాస్త్రం అని, శంకరులు సంసారహేతు నివృత్తి విద్యని, రామానుజులు బ్రహ్మసాయుజ్య విద్యని, ఆత్మ దర్శనమని, సర్వ విద్యా ప్రతిష్ట అని, విశ్వ దర్శనమని రకరకాలుగా నిర్వచించినారు.

దర్శనమంటే చూడడం అని అర్థం. అంటే వేదంలో చెప్పబడిన విషయాలను అనుభవ పూర్వకంగా నిర్ధారణ చేసుకొని వాటిని మనోదర్పణంతో చూడడమే దర్శనం అంటారు. అయితే వివిధ కాలాలలో, వివిధ దేశాలలో, వివిధ తత్వవేత్తలు, వేరువేరు రీతులలో, పై ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించారు.

అయితే పశ్చిమదేశాల తాత్వికులు, పరలోకం కంటే ఇహలోకానికి, స్వర్గం కన్నా ఇక్కడ జీవితానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. అయితే మన భారతీయ తాత్వికులు, ఇహలోకాని కంటే పరలోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విదేశీతాత్వికులు ముఖ్యంగా పదార్థం, ద్రవ్యం, కాలం, తర్కం, నీతి శాస్త్రం, భౌతికశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, రాజనీతి, ఆర్థిక, విజ్ఞాన, గణిత శాస్త్రాల ఆధారంగా వారి తత్వాలోచనలు సాగాయి (థేలీస్, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, కాంట్, హెగెల్, సార్త్రా మొదలగువారివి తత్త్వాల ఆలోచనలు)

అయితే మన భారతీయ ఋషులు (మునులు) తాత్వికులు, ఆత్మ, పరమాత్మ, సుఖాలు, సంపద, దేవతలు, యజ్ఞ యగాదులు, కర్మకాండలు, జ్ఞాన సమూపార్జన, ఇంద్రియాలు, దుఃఖాలు, మనసు, జన్మ, పునర్జన్మ, దేవతా ప్రీతి కార్యాలు, సృష్టి, విశ్వం, మోక్షం, చావు పుట్టుకల చర్చ, మరణాంతాల లోకాల వివరణ మొదలు అంశాలను సృజిస్తూ ఆలోచనలు సాగాయి.

అయితే జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలలో, ఆ ప్రశ్నలకు ఉన్న సమాధానాలను బట్టి, భారతీయ దర్శన శాస్త్రం రెండు శాఖలుగా చీలిపోయింది. అవి 1. వైదికం 2.అవైదికం లేదా 1.ఆస్తిక దర్శనాలు 2.నాస్తిక దర్శనాలు.

న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస దర్శనాలను.. షడ్ దర్శనాలు అన్నారు. ఈ తత్వశాస్త్రాలన్నీ దేవుడు ఉన్నాడని, జీవుడు దేవుని సృష్టి అని, జీవుళ్లు దేవుళ్లు ఉన్నారని విశ్వాసం. వీటిని ఆస్తిక దర్శనాలన్నారు.

చార్వాక, లోకాయత, అసురి, ఆజీవక, తీర్థంకర, జైన, బౌద్ధ దర్శనాలను నాస్తిక దర్శనాలన్నారు. వీరు దేవుడు లేడని విశ్వాసం. ఉన్నది ఈ జన్మేనని, ఈ జన్మ గురించి, ఇక్కడ సుఖదుఃఖాల గురించే ఆలోచించాలని వీరి వాదన.

వివిధ తాత్వికుల దర్శనాలను పరిశీలించినట్లయితే, ధర్మ మీమాంసల దర్శన కర్త "జైమిని" మహర్షి, మానవుడు చేసే ప్రతి పనిలో అది లౌకిక కర్మ కానివ్వండి లేదా అలౌకిక లేదా వైదిక కర్మ కానివ్వండి, అది కొన్ని ఫలితాలను ఇస్తుందని మొదటగా ఆయనే చెప్పాడు.

అలాగే సమస్త పదార్థాలు అణువుల సముదాయించేత నిర్మించబడతాయని వైశేషిక దర్శన కర్త అయిన "కణాదుడు" చెప్పాడు.

అలాగే న్యాయ దర్శన కర్త అయిన “గౌతముడు”, ప్రకృతిలో ఉన్న సమస్త పదార్థాలు 16 తత్వాలుగా ఉంటాయని చెప్పాడు.

ఈ ప్రకృతిలో సమస్త పదార్థాలు త్రిగుణాత్మకమైన సత్వ రజో తమో గుణాలతో నిండి ఉంటాయని సాంఖ్య దర్శన కర్త “కపిలమహర్షి” చెప్పినాడు.

మరి యోగ దర్శన కర్త అయిన “పతంజలి మహర్షి” ఏమి చెప్పాడో చూద్దాం. ప్రపంచంలో ఉన్న 24 తత్వాల కతీతంగా ఒక విశిష్టమైన పురుషుడు ఉంటాడు. అతనే ఈశ్వరుడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా పరమ పురుషుడైన ఆ ఈశ్వరుని తెలుసుకోవడమే యోగం యొక్క పరమ ప్రయోజనమని చెప్పాడు.

ఇక వేదాంత సూత్రకారుడైన “వ్యాసుడు” సంసార బంధ హేతు నివృత్తికి, మోక్ష ప్రాప్తికి, దర్శన శాస్త్రం దారితీస్తుందని చెప్పాడు. దీనినే శంకరాచార్యులు సమర్ధించారు.

అలాగే ఈ ప్రపంచమంతా దుఃఖమయమని, ఆ శోక సాగరం నుండి విముక్తి చెందడమే జీవిత పరమ ప్రయోజనమని గౌతమ బుద్ధుడు చెప్పాడు.

కనుక పై విషయాలను పరిశీలిస్తే భారతీయ దర్శనాలు ప్రధానంగా ఈ దిగువ నాలుగు అంశాలను చర్చించాయి. 1. భగవంతుని ఉనికి(ఉన్నాడా? లేదా?), 2. ఆత్మ ఉన్నదా? లేదా?, 3.ఆత్మకు మానవుడు చేసే కర్మకు సంబంధం ఉందా? లేదా?, 4. మోక్షం (ముక్తి ) అంటే ఏమిటి?

భగవంతుని శబ్దానికి బదులుగా, ఈశ్వర శబ్దాన్ని దర్శనాలు వాడినాయి. ఈశ్వర స్థాపన(భావన) కొన్ని సిద్ధాంతాలు ఎంత అవసరమని భావించాయో, ఈశ్వర నిరాకరణ కూడా అంతే అవసరమని కొన్ని సిద్ధాంతాలు భావించాయి.

****సశేషం****

Posted in September 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!