మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు
భారతీయ మందిర్, సంద్రింఘాం, ఆక్లాండ్, న్యూజీలాండ్
న్యూజీలాండ్ దేశం ఆస్ట్రేలియాకు నైరుతి దిశగా పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న మరో చిన్న దేశం. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ప్రపంచం మొత్తంలో మొట్టమొదట సూర్యుడు ఉదయించేది ఈ దేశంలోనే. అక్కడ కూడా 700 సంవత్సరాల క్రితమే నాగరికత వెలసింది. అయితే 18 శతాబ్దంలో జేమ్స్ కుక్ మరియు ఇతర డచ్ అన్వేషకుల ద్వారా ఆ దేశ ఉనికిని గుర్తించడం జరిగింది. పిమ్మట 19 వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రాజ్యకాంక్ష అక్కడకు కూడా విస్తరించి నెమ్మదిగా 1840 వ సంవత్సరంలో బ్రిటిష్ వారి నియంత్రణలో అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడింది. అప్పుడే మన దేశంలో కూడా ఆంగ్లేయుల ఆధిపత్యం మొదలైనందున మన దేశం నుండి నెమ్మదిగా సాంకేతిక నిపుణులు, పనివారు కూడా నెమ్మదిగా న్యూజీలాండ్ కు వలసలు వెళ్ళడం మొదలుపెట్టారు.
అలా వలసవెళ్ళిన మన భారతీయులు అక్కడ కూడా మన సంప్రదాయాలు, సంస్కృతులు మరిచిపోకుండా సనాతన హిందూ ఆచారాలను పాటించడం మొదలుపెట్టి 20 శతాబ్దంలో నెమ్మదిగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఆక్లాండ్ లో నిర్మించిన 12 ఆలయాలలో ఒకటైన అతి పెద్ద ఆలయం, మరియు పర్యావరణ సమతుల్యం పాటిస్తూ ఉన్న ఏకైక మందిరం ‘శ్రీ భారతీయ మందిర్’ నేటి మన ఆలయసిరి.
ఈ ప్రపంచంలో మనం ఎక్కడ నివసిస్తున్ననూ మన మూలాలను మరిచిపోకుండా ఉండాలంటే, అందుకు సహాపడేది మనం ఆచరిస్తున్న మన సంప్రదాయాలు, సంస్కృతులు. అయితే మన సనాతన పద్దతులన్నీ సమిష్టిగా సంఘంతో కలిసి ఉంటాయి. మరి అవి పాటించడానికి సనాతన ధర్మాల మీద గౌరవం, నమ్మకం ఉన్న మన వారందరూ ఒక చోట చేరి ఆ విషయాలను ప్రస్తావించుకుంటూ సమిష్టిగా ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాదు భావితరాలకు కూడా మన పద్దతులను పరిచయం చేసే అవకాశం కూడా కలుగుతుంది. అందుకు వేదికలు అవుతున్నవి మన ఆలయాలు. ఇదే అంశంతో న్యూజీలాండ్ వాసులు అందరూ కలిసి నిర్మించినదే ఈ భారతీయ మందిర్.
సాధారణంగా మనకు పూర్తిగా దక్షిణ భారత సంప్రదాయం లేదా పూర్తిగా ఉత్తర భారత సంస్కృతి మనకు అన్ని ఆలయాలలో కనిపిస్తుంది. కాని ఇక్కడ అన్ని సంస్కృతులు కలిసి మనకు మనం భారతీయులం అనే భావన కలుగుతుంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి, హనుమజ్జయంతి, దీపావళి, జన్మాష్టమి ఇలా ఒకటేమిటి అన్నీ పండుగలు అందరూ కలిసి జరుపుకొనడం ఎంతో సంతోషం.
భవిష్యత్తులో వ్యర్థపదార్ధాల వలన కలిగే అనర్ధాన్ని ముఖ్యంగా ప్లాస్టిక్ పదార్థాల వలన కలిగే నష్టాన్ని గుర్తించి ఎంతో దూరదృష్టితో ఈ ఆలయాన్ని వ్యర్థరహిత ప్రదేశంగా మార్చేందుకు ఈ ఆలయ సహాయక బృందాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఇది నిజంగా ఎంతో ఆనందించ వలసిన అతి ముఖ్యమైన పరిణామం. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక గ్రంధాలయం కూడా ఉంది. ఈ ఆలయ అధ్వర్యంలో ఒక పత్రికను కూడా నడుపుతూ పలువురిలో ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తున్నారు.