కామాన్ని కాల్చినవయ్య
కాలాన్ని గెలిచినవయ్య
ఆ కాలపు కథలో అసురత్వం చంపా
అయ్యప్పకే అయ్యవైతివయ్య
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
హరి కూడా పురుషుడంట
హరుడు పురుషుడంట
హరిహరుల ఆజ్ఞకే అయ్యప్ప పురుడోసుకున్నడంట
ఆహా...
నీ ఆటకు ఆది అంతు లేదా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కడుపులో మోసే గొడవ లేకుండా
పురిటినొప్పుల బాధ కూడా తెలియకుండా
అయ్యప్పకే జన్మనిచ్చి
ఆది అంత్యాలనే అవపోసనపట్టిన ఆదిశంకరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
బాలుడేమిటి
అడవిలోన దొరుకుడేమిటి
ఆదరించాల్సిన అమ్మ
అడవిమృగం పాలు అడుగుడేమిటి
మొలక మీసమైన రానివాడు
ముజ్జగాలు ఏడిపించే మహిసిని చంపుడేమిటి...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
సాదుజంతువైన ఎద్దుమీద తిరిగే ఆదిశంకరా...
పసిబాలుడు అయ్యప్పకు
క్రూరజంతువైన పులిమీద తిరిగే విద్యను పంబతీరాన నేర్పిస్తివా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మొదటి కొడుకుకేమో తల మార్చివేస్తివయ్య
రెండో కొడుకుకేమో ఆరు తలలు ఇస్తివయ్య
మూడో కొడుకునేమో ముచ్చటగా
పద్దెనిమిది మెట్లపైన ధర్మపట్టాతో
కట్టుబాట్ల నియమానికి అధిపతిని చేస్తివయ్య....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ద్వాదశ స్వయంభూ లింగమా...
అష్టాదశ శక్తి సారమా...
శబరిమల లింగాతీత ప్రకాశ క్షేత్రమా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
దట్టమైన అడవుల్లో
కొండకోన వాగుల్లో
చిమ్మచీకటి నీడలో
పసిబాలుడు అయ్యప్పకు ఇల్లు ఇచ్చిన ఈశ్వరా...
కొడుకుపైన నీకెంత ప్రేమో శంకరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కార్తీకమాసం అనగానే
కట్టుబాట్ల నియమాలతో
శరణం ఘోష నామంతో
శబరివైపు అడుగులువేసే భక్తులను
దగ్గరుండి అయ్యప్ప చెంతకు చేరుస్తున్నావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నియమాల మాలతో
అయ్యప్ప స్మరణతో
పులకించిపోయే భక్తుల్లో పుణ్యఫలమై
ధర్మపు దారిలో నడిపించే దైవము నీవేనా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...